దివ్య 'త్రి' గుణాలు!
దివ్యమైన త్రిగుణాలుగా చెప్పబడే 'యజ్ఞం, దానం, తపస్సు (ధ్యానం)' అనే ఈ మూడూ, ఆధ్యాత్మిక సాధనలో ప్రతి మనిషికీ అత్యవసరం. వీటిని ఎట్టి పరిస్థితులలోనూ వదలకూడదని, వేద విజ్ఞులు చెబుతారు.
[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]
‘యజ్ఞం’ గృహప్రవేశం, ఇతరేతర శుభకార్యాలవంటి వివిధ సందర్భాలలో చేస్తారు. ‘యజ్ఞం’ ఇచ్చే ఫలం అనంతమైంది. యజ్ఞాల ద్వారా ఎన్నో కార్యాలు విజయవంతమవుతాయని, వేదాలు ఘోషిస్తున్నాయి. అజ్ఞానంతో కొందరు, యజ్ఞ కర్మలను దోషం వలె వదిలివేయడమే మంచిదని అనుకుంటారు. ఇది చాలా తప్పు. నిష్కామ కర్మలను ఆచరించే మనః స్థితి ఎలాగూ లేదు. కామ్య కర్మలు, ఉత్తర జన్మలకు కారణమవుతాయి. కనుక, అసలు కర్మలు మానేస్తే పోలా? అని కొందరికి అనిపిస్తుంది. ఇది ఆచరణాత్మకం కాదని, ధర్మశాస్త్రాలు చెబతున్నాయి.
‘యజ్ఞ దాన తపః కర్మ న త్యాజ్యమితి చాపరే’ (భగవద్గీత 18:3) అని సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుడే బోధించాడు. యజ్ఞం చేయడమంటే, కేవలం అగ్నిని హోమ గుండంలోకి ఆహ్వానించి, నెయ్యి పోయడం మాత్రమే కాదు. నిస్వార్థంగా, పరోపకార సహితంగా, భగవదర్పితంగా చేయవలసిన ప్రతి కర్మా, యజ్ఞంగానే పిలువబడుతుంది. భారతీయ సనాతన ధర్మంలో, యజ్ఞానికి ఇంతటి ఉత్తమోత్తమమైన స్థానం ఉంది.
‘దానగుణం’ కూడా, అత్యంత విశిష్టమైనది. ఒకరు మరొకరికి ఇష్టపూర్వకంగా, ప్రేమతో దేనినైనా సమర్పించుకోవడం. అయితే, అర్హమైన వస్తువు, అర్హమైన సమయంలో, అర్హమైన వ్యక్తి నుంచి, అర్హమైన వ్యక్తికి అందడం ముఖ్యం. సంపద ఒక్క చోటే ఉండకుండా, కలిగిన వారి నుంచి, లేనివారికి అందడమే, ఇందులోని లౌకిక ప్రయోజనం. ఫలితంగా, దానం చేసే వ్యక్తికి హృదయ వైశాల్యం, ఉదారత పెరుగుతాయి. మనసు శాంతితో, పరిశుద్ధమవుతుంది. ఆత్మ జ్ఞాన సముపార్జనకూ, మార్గం సుగమమవుతుంది. మనం విదేశాలకు వెళ్లినప్పుడు, ఇక్కడి కరెన్సీ అక్కడ చెల్లదు కదా? కనుక, ఆ దేశపు కరెన్సీ క్రిందికి మార్చుకుని వెళ్తాము. అలాగే, ఈ జన్మలో కూడబెట్టిన ధనం, ధాన్యం, పసిడి వంటి సంపదలు ఏవీ, వచ్చే జన్మకు పనికిరావు. మనం దేనినైతే దానం చేస్తామో, ఆ పుణ్య ఫలం మాత్రమే, వచ్చే జన్మలోకి బదిలీ అవుతుంది. అందుకే, ఈ జన్మలో మనకు భగవంతుడిచ్చిన దానిలోంచి కొంతైనా దాన ధర్మాల ద్వారా, బీద సాదల రూపంలోని భగవంతునికి, తిరిగి సమర్పించుకోవాలి. లేకపోతే, మన పిల్లలూ, దాయాదులూ వాటిని పంచుకుంటారు. ఇంకా అవసరమైతే, వాటి కోసం తగవులూ పడతారు. ఉత్తమమైన దాన గుణాన్ని మన పెద్దలు, పర్వదినాలూ, ఉత్సవాలూ, తీర్థాల పేరిట, మనకు అలవాటు చేశారు. అయినా, చాలామంది ఆస్తిపాస్తులు కలిగి ఉండికూడా, వాటిలోంచి ఇసుమంతైనా, లేనివారి కోసం వదులుకోవడానికి సిద్ధం కారు. ఇదే పెద్ద అపరాధం.
మూడవ దివ్య గుణమైన ‘తపస్సు’ (ధ్యానం) అంటే, ప్రాచీన కాలంలో ఋషులు చేసినటువంటిది కాదు. ఏవో శీర్షాసనాలు వేస్తూ, తిండి తిప్పలు లేకుండా మాడి చావమనీ కాదు. భగవంతుని కోసం మనస్ఫూర్తిగా తపించడం. మనమందరం, అనునిత్యం తపిస్తూనే ఉంటాం. కానీ, ఏవేవో లౌకిక కోర్కెల సాధన కోసం.. భగవంతుని కోసమే, త్రికరణ శుద్ధిగా తపిస్తే, అలాంటి భక్తులకు తాను తప్పక దొరుకుతాడు. లక్ష్య శుద్ధితో ఇలా ‘తపస్సు’ (ధ్యానం) చేస్తే, భగవంతుడు తప్పక మన వశమవుతాడు. భారతీయులే కాదు..
మానవునిగా పుట్టిన ప్రతివారూ, ఈ మూడు దివ్య గుణాలైన 'యజ్ఞం, దానం, తపస్సు'లను ఆచరించవలసిందే. స్వచ్ఛ హృదయంతో వీటిని ఆచరణలో పెడితే, ఏకాగ్రత అలవడుతుంది. మనసు కుదుటపడి, కోరికలు నశ్వరమవుతాయి. జీవితంలో ధర్మబద్ధమైన విజయం లభిస్తుంది. అంతేగాక, మనసు యోగానుకూలమై, ఆధ్యాత్మిక సాధనలో ఒక మెట్టు ఎదిగినవారమవుతాము.
ధర్మో రక్షతి రక్షితః!
Post a Comment