కాశీ వారణాసిలోని ‘రహస్య క్షేత్రాల’ గురించి చెప్పిన వ్యాసమహర్షి!

 

కాశీ వారణాసిలోని ‘రహస్య క్షేత్రాల’ గురించి చెప్పిన వ్యాసమహర్షి!

సప్త ముక్తి పురాలలో ముఖ్య క్షేత్రం, సాక్ష్యాత్తూ ఆ పరమశివుడే సృష్టించిన నగరం, వారణాసి. అతి ప్రాచీన నగరంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా భాసిల్లుతోంది, కాశీ పట్టణం. ఆ పరమేశ్వరుడు కొలువై ఉండే వారణాసి క్షేత్రంలో, ఎన్నో వింతలు దాగి ఉన్నాయి. అడుగడుగునా ఆలయాలతో, గంగానది ఘాట్లతో, నిత్యం వేలాదిమంది భక్తులతో అలరారే వారణాసి, అనేక రహస్యాల భాండాగారం.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/dBBnaDcXt2I ​]

ఈ వారణాసి క్షేత్రం గురించీ, అందులో దాగిన మర్మాల గురించీ, అనేక పురాణాలలో ప్రస్ఫుటంగా వివరించబడి ఉంది. శ్రీ కూర్మ పురాణం ప్రకారం, వారణాసిలో తప్పక దర్శించవలసిన లింగాలేంటి? కాశీ క్షేత్రంలో వ్యాస మహర్షి దర్శించిన కొన్ని రహస్య ఆలయాలేంటి? వాటి వెనుక దాగిన గాథలూ, మాహాత్మ్యాల గురించి, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

వ్యాస మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తున్న సమయంలో, వారణాసికి వెళ్ళారు. కాశీ క్షేత్రం గురించీ, దాని వైభవం గురించీ, తన శిష్యులకు వివరించారు. అందులో భాగంగానే, వారణాసిలోని ముఖ్య క్షేత్రాలైనటువంటి ఓంకారేశ్వర, కృత్తివాసేశ్వర, కపర్ధీశ్వర, మధ్యమేశ్వర లింగాలను దర్శించి, వాటి ప్రాముఖ్యతనూ, పవిత్రతనూ బోధించాడు.

వాటిలో మొదటిది, ఓంకారేశ్వర లింగం.. వ్యాసమహర్షి తన శిష్యులతో కలిసి మొదటిగా దర్శించిన లింగం, ఓంకార లింగం. పరమ పవిత్రమైన ఓంకార లింగానికి అభిషేకం, అర్చన చేసి, ఈ లింగ మాహాత్మ్యాన్ని వివరించాడు. ఇక్కడున్న ఓంకార లింగం, మంగళకరమైన లింగం. దీనిని స్మరించడం వలన, అన్ని పాపాల నుండి విముక్తి లభిస్తుంది. మోక్షదాయకమైన ఈ లింగం, నిత్యం మునుల చేత పూజించబడుతూ ఉంటుంది. ఈశ్వర జ్ఞానమే, నిర్మలమైన ఓంకార లింగంగా, ఈ ప్రాంతంలో నెలకొంది. బ్రహ్మా, మొదలైన దేవతలకు సైతం, ఆశ్రయభూతంగా ఉంది. ఇది పంచాయతన లింగంగా ప్రసిద్ధి చెందింది. మరణదశలో ఉండే వారు, ఓంకార లింగాన్ని స్మరించినట్లయితే, తేజోరూపమైన వారి ఆత్మ, ఆనందరూపుడైన పరమాత్మలో విలీనమైపోతుంది. వారణాశిలో నెలకొన్న ఓంకార క్షేత్రంలోనే, పూర్వం దేవర్షులూ, మహర్షులూ, సిద్ధులూ, బ్రహ్మర్షులూ, రుద్రుణ్ణి పూజించి, ఉత్తమ గతులు పొందారు. మత్స్యోదరి అనే నది ఒడ్డున ఉంది, ఈ ఓంకార క్షేత్రం.

రెండవది కృత్తివాసేశ్వర లింగం.. పూర్వం ఒక రాక్షసుడు ఏనుగు రూపాన్ని ధరించి, ఆ ప్రాంతంలోనే సంచరించేవాడు. నిత్యం ఇక్కడకు శివపూజ చేసుకోవడానికి వచ్చే బ్రాహ్మణుల్ని చంపడం, ప్రారంభించాడు. అప్పుడు శివుడు బ్రాహ్మణులందర్నీ కాపాడడం కోసం ఈ లింగం నుంచి ఆవిర్భవించి, గజరూపంలో ఉన్న ఆ రాక్షసుణ్ణి తన శూలంతో, వధించాడు. తరువాత ఆ ఏనుగు చర్మాన్నే, తన వస్త్రంగా చేసుకున్నాడు. అందుకే ఆయనకు కృత్తివాసేశ్వరుడనే పేరొచ్చింది. ఇక్కడ ఎందరో మునులు సిద్ధి పొంది, సశరీరంగా పరమపదాన్ని చేరుకున్నారు. ఇతర పుణ్యస్థలాలలో, వేలకొద్దీ జన్మలు ఎత్తితే కలిగే మోక్షం, ఈ కృత్తివాస తీర్థంలో నివసించిన వారికి, ఒక్క జన్మతోనే కలుగుతుంది. ఈ స్థలం, సమస్త సిద్ధులకీ నిలయం. నిరంతరం ఈ క్షేత్రాన్ని మహాదేవుడు రక్షిస్తూ ఉంటాడు. ప్రతీ యుగంలో, ఇంద్రియ నిగ్రహం కలిగిన వేదపండితులు, శతరుద్రీయాన్ని పఠిస్తూ, కృత్తివాసేశ్వరుణ్ణి పూజిస్తారు.

మూడవది, కపర్ధీశ్వర లింగం.. వ్యాస మహర్షి, ఈ ఆలయానికి సమీపంలో ఉన్న పిశాచమోచన తీర్థంలో స్నానం చేసి, పితృదేవతలకు తర్పణాలు విడిచి, కపర్ధీశ్వరుణ్ణి పూజించి, ఆ ప్రాంత విశిష్ఠతను తెలియజేశాడు. పూర్వం ఈ లింగానికి ఒక ఆడజింక ప్రదక్షిణలు చేస్తుండగా, ఒక పులి దాన్ని తినడానికి ముందుకొచ్చింది. పులి చేతికి చిక్కిన జింక, దాని పంజాదెబ్బకి మరణించింది. ఈ ఘటనతో అక్కడకు చేరుకున్న మునులను చూసి కంగారుపడి, జింకను వదిలేసి పులి పారిపోయింది. కపర్దీశ్వర లింగం ముందు మరణించిన ఆ జింక, సూర్యుడి వంటి గొప్ప కాంతితో ప్రకాశిస్తూ, దేవతలు పూల వాన కురిపిస్తుండగా, ఆకాశ మార్గాన వెళ్ళిపోయింది. ఎంతో మహిమాన్వితమైన ఈ కపర్ధీశ్వరుని స్మరణతోనే, సకల పాపాలూ నశిస్తాయి, కామ క్రోధాది అరిషడ్వర్గాలు దూరమవుతాయి, సమస్త విఘ్నాలూ తొలగిపోతాయి. వైదిక స్తోత్రాలతో స్వామిని నిత్యం అభిషేకించి, ఏకాగ్రతతో ఆయనను ధ్యానించే వారికి, ఆరు మాసాల వ్యవధిలోనే యోగసిద్ధి తప్పక లభిస్తుంది. ఈ ఆలయానికి సమీపాన ఉన్న పిశాచమోచన తీర్థం కూడా, ఎంతో పవిత్రమైంది. దీని వెనుక ఒక మహత్తరమైన గాథ దాగి ఉంది. శంఖకర్ణుడనే ముని ఈ క్షేత్రంలోనే నివసిస్తూ, నిత్యం రుద్ర స్వరూపమైన ఓంకారాన్ని జపిస్తూ, పూలూ పళ్ళతో స్వామిని అర్చించి, నమస్కార ప్రదక్షిణలు చేసేవాడు. అలా యోగసాధన చేస్తూ నివసిస్తున్న సమయంలో, బాగా బక్కచిక్కిపోయి, ఆకలితో అలమటిస్తున్న ఒక ప్రేతం వచ్చింది. దానిని చూసి జాలితో, ‘ప్రేతమా.. నీవెవరు? ఎక్కడి నుండి వచ్చావు? ఎందుకొచ్చావు?’ అని ప్రశ్నించాడు. అప్పుడా పిశాచం దీనంగా తన వృత్తాంతాన్ని చెప్పింది. ‘మహర్షీ! పూర్వం నేను ఎన్నో సంపదలు కలిగిన బ్రాహ్మణుణ్ణి. అయితే, ధనమదంతో, ఎవరికీ ఎలాంటి దానాలూ, ధర్మాలూ చేయలేదు. అతిథుల్ని ఆదరించలేదు. ఏ ఒక్క పుణ్యకార్యాన్నీ చేయలేదు. అయితే, ఒకనాడు నేను పవిత్ర పుణ్యక్షేత్రమైన వారణాసికి వెళ్ళి, వృషభవాహనుడైన విశ్వేశ్వరుణ్ణి దర్శించి, నమస్కరించి, ఆయనను పూజించాను. తరువాత కొంతకాలానికి, నేను మరణించాను. కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన కారణంగా, నేను నరకానికి వెళ్ళలేదు. కానీ, నేను చేసిన పాపాల ఫలితంగా, పిశాచ రూపంలో ఇలా ఉండిపోయాను. దీనివల్ల ఆకలితో అలమటిస్తూ, దాహంతో బాధపడుతూ, దిక్కుతోచక తిరుగుతున్నాను. మహాత్మా, మీరే నాకు దిక్కు’ అని శరణు వేడుకున్నాడు. పిశాచం బాధ విన్న శంఖకర్ణుడికి, మనస్సు చలించిపోయింది. ‘నీవు పూర్వజన్మలో పరమేశ్వరుణ్ని స్వయంగా పూజించి, పుణ్యఫలితాన్ని పొందావు. కాబట్టే, తిరిగి ఇదే క్షేత్రానికి వచ్చావు. నీవు ప్రశాంత చిత్తంతో కపర్ధీశ్వరుణ్ణి స్మరించి, ఈ పుష్కరిణిలో స్నానం చేయి. తద్వారా, నీవు ఈ పిశాచ జన్మ నుండి విముక్తి పొందుతావు’ అని ప్రబోధించాడు, శంఖకర్ణుడు. ముని చెప్పిన విధంగానే, ఆ పిశాచం పుష్కరిణిలో స్నానం చేసి, దివ్య శరీరాన్ని పొందింది. ఆ సంఘటన  చూసి ఆనందంతో శంఖకర్ణుడు, పరమేశ్వరుడిని పలు విధాల స్తుతించాడు. తరువాత ఓంకారాన్ని ఉచ్ఛరిస్తూ, అలాగే నేలమీద పడిపోయాడు. వెంటనే, ప్రళయకాలంలోని కోటి అగ్నుల కాంతితో, ఒక తేజో లింగం అక్కడ ఆవిర్భవించింది. ప్రాణాలు కోల్పోయిన శంఖకర్ణుడి జీవాత్మ, ఆ తేజో లింగంలోకి ప్రవేశించింది. ఎంతో మహిమాన్వితమైన ఈ కపర్ధీశ్వరుడి చరిత్రను పఠించినా, విన్నా, శివానుగ్రహం తప్పక కలుగుతుందని, వ్యాస మహర్షి తన శిష్యులకు బోధించాడు.

నాల్గవది, మధ్యమేశ్వర లింగం.. వ్యాసుడు మధ్యమేశ్వరుడికి అభిషేకార్చనలు చేసి, పూజించాడు. అక్కడ ఒంటి నిండా భస్మాన్ని ధరించిన పాశుపతులు సాక్షాత్కరించారు. వారిని చూసి, ఆప్యాయంగా పలకరించాడు వ్యాసుడు. శిష్యులు వ్యాస మహర్షి గొప్పతనాన్ని, ఆ పాశుపతులకు వివరించారు. తరువాత వ్యాసుడు, మధ్యమేశ్వరుడి ప్రాశస్త్యాన్ని వివరించాడు. ఇక్కడ పరమేశ్వరుడు, రుద్రగణాలతో, పార్వతీ దేవితో, నిత్యం విహరిస్తుంటాడు. పూర్వం ఈ ప్రాంతంలోనే, శ్రీ కృష్ణుడు పాశుపత గణాలతో కలసి, సంవత్సర కాలం గడిపాడు. పాశుపత వ్రతాన్ని ఆచరించిన కృష్ణుడు, భస్మాన్ని ఒంటినిండా పూసుకుని, బ్రహ్మచర్యదీక్షతో, మధ్యమేశ్వర లింగాన్ని పూజించాడు. కృష్ణుడి ద్వారా ఎంతో మంది, పాశుపత వ్రతాన్ని ఉపదేశంగా పొంది, మధ్యమేశ్వర స్వామి దర్శనాన్ని పొందారు. గంగా నదిలో పవిత్రంగా స్నానం చేసి, మధ్యమేశ్వరుణ్ణి శ్రద్ధా భక్తులతో పూజించిన వారు, ఎంతో ధన్యులు. ఇక్కడ చేసే దానం, తపస్సు, శ్రాద్ధ కర్మా, పిండప్రదానాలు, వంశంలోని ఏడుతరాల వారిని పునీతులను చేస్తాయి. వారణాసిలో, తప్పక ఈ నాలుగు క్షేత్రాలనూ దర్శించాలని, వ్యాసుడు తన శిష్యులకు వివరించాడు.

🚩 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః ఏవం విష్ణుమయం శివః
యథాంతరం న పశ్యామి తథా మే స్వస్తిరాయుషి 🙏

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes