మనిషిలోని కామము గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు! Bhagavad Gita

 

మనిషిలోని కామము గురించి చెప్పిన శ్రీ కృష్ణుడు!

'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (35 - 39 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 35 నుండి 39 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/Lx_inSfGdwQ ]

స్వధర్మ నిర్వహణ గురించి, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..

శ్రేయాన్ స్వధర్మో విగుణః పరధర్మాత్ స్వనుష్ఠితాత్ ।
స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః ।। 35 ।।

ఇతరుల ధర్మాన్ని చక్కగా చేయటం కన్నా, లోపాలతో కూడి ఉన్నా సరే, తన సహజ ధర్మాన్ని నిర్వర్తించటమే, అత్యుత్తమం. నిజానికి, స్వధర్మాన్ని నిర్వర్తించటంలో మరణించినా మంచిదే, కానీ ఇతరుల మార్గాన్ని అనుసరించటం, ప్రమాదకరమైనది.

జీవాత్మ యొక్క ధర్మం, భగవంతుణ్ణి ప్రేమించడమే. అదే, మన అస్థిత్వానికి ఉన్న మూల సూత్రం. మన వ్యక్తిగత ధర్మం, మనకున్న ప్రస్తుత జీవనంలోని సందర్భం, పరిస్థితీ, పరిపక్వతా, మరియు వృత్తిని బట్టి ఉంటుంది. జీవన శైలి మారినప్పుడూ, ఆధ్యాత్మికంగా పురోగమించినప్పుడూ, ధర్మం అనేది మారుతుంది. అందుకే, తన వృత్తి ధర్మాన్ని చేయమని, అర్జునుడికి బోధిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. మన సహజ స్వభావం ద్వారా జనించిన విధులను, మానసిక స్థైర్యముతో, చాలా సునాయాసంగా చేయవచ్చు. కానీ, ఇతరుల విధులు చూడడానికి ఆకర్షణీయంగా అనిపించినా, అది ప్రమాదకరమైనది. వారి ధర్మం, మన స్వభావంతో పొసగకపోతే, అది మన ఇంద్రియమనోబుద్ధులలో ఘర్షణకు దారితీస్తుంది. అంతేకాకుండా, మన అంత:కరణానికి హాని కలిగించి, ఆధ్యాత్మిక పురోగతికి అడ్డంకి అవుతుంది. అసహజమైన పరుల ధర్మములు చేయడం కన్నా, స్వంత ధర్మములు నిష్ఠగా చేయడంలో, మరణించినా ఉత్తమమే అన్న సందేశాన్నిస్తున్నాడు, భగవానుడు.

అర్జున ఉవాచ ।
అథ కేన ప్రయుక్తోఽయం పాపం చరతి పూరుషః ।
అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః ।। 36 ।।

అర్జునుడు ఈ విధంగా ప్రశ్నిస్తున్నాడు. ఓ వృష్ణి వంశీయుడైన శ్రీ కృష్ణా, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా, బలవంతంగా, ఏదోశక్తి చేయించినట్టు, పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడుతున్నాడు?

అర్జునుడు శ్రీ కృష్ణుడిని, మానవ సంఘర్షణను సూచించే ఒక వాస్తవిక సందేహాన్ని అడిగాడు. పాపపు పనులు చేసేటప్పుడు, మనందరికీ, ఇది తప్పు అనే భావననో, లేదా పశ్చాత్తాపాన్నో కలిగించే ఒక మనఃసాక్షి ఉంటుంది. భగవంతుడు సర్వ సుగుణములకూ నిలయమన్న నిజం మీద, మనఃసాక్షి స్థితమై ఉంటుంది. ఆయన అంశ అయినటువంటి మనకు, సుగుణములకూ, మంచితనానికీ ఆకర్షితమయ్యే సహజ స్వభావం ఉంటుంది. జీవాత్మకు సహజ స్వభావంగా ఉన్న మంచితనము, మనఃసాక్షికి స్వరాన్నిస్తుంది. కాబట్టి, దొంగతనం చేయటం, మోసం చేయటం, దూషించటం, లాక్కోవటం, హత్య చేయటం, హింసించటం మరియు అవినీతి వంటివి, తప్పు అని తెలియజేస్తుంది. సహజ జ్ఞానం ద్వారా ఇవి పాపిష్టి పనులని మనకు తెలిసినా, ఎదో ఒక బలీయమైన శక్తి ప్రేరేపించినట్టుగా, మనం ఈ పనులు చేస్తుంటాము. ఆ బలీయమైన శక్తి ఏమిటో, అర్జునుడు తెలుసుకోవాలనుకుంటున్నాడు. అందుకే, దానికి సమాధానం చెప్పమని, శ్రీ కృష్ణుడిని అడుగుతున్నాడు.

శ్రీ భగవానువాచ ।
కామ ఏష క్రోధ ఏష రజోగుణసముధ్భవః ।
మహాశనో మహాపాప్మా విధ్ధ్యేనమిహ వైరిణమ్ ।। 37 ।।

భగవానుడు ఇలా సమాధానమిస్తున్నాడు: రజో గుణము నుండి ఉత్పన్నమయ్యే కామము, అంటే కోరికలూ, వాంఛలే, తదుపరి క్రోధముగా పరిణామం చెందుతాయి. దీనిని, లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టి దానిగా తెలుసుకొనుము.

వేదములలో, కామము అన్న పదాన్ని, కేవలం లైంగిక వాంఛల కోసమే కాక, మనం ఈ శరీరమే అన్న దృక్పథంలో ఉన్న అన్ని భౌతిక కోరికలనూ ఉద్దేశించి, వాడబడుతుంది. ఈ విధంగా, కామము ఎన్నో రకాలుగా బహిర్గతమవుతుంది. డబ్బుల కోసం యావా, వస్తువుల కోసం ఆశా, కీర్తి-ప్రతిష్ఠలపై కోరికా, అధికారం కోసం తపనా మొదలగునవి.. ప్రతి యొక్క ప్రాణికీ, స్వ-సహజంగా ఉండే భగవంతుని యందు ప్రేమ వక్రదారిలో పరావర్తనమైనప్పుడు, అది కామంగా మారుతుంది. ఎప్పుడైతే జీవాత్మ, ఈ శరీరమనే భౌతిక శక్తితో అనుసంధానం అవుతుందో, ఆత్మ యొక్క భగవంతునిపై ప్రేమ, రజో గుణ సాంగత్యం కారణంగా, 'కామము' గా మారుతుంది. దివ్య ప్రేమ అనేది, భగవంతుని యొక్క అత్యున్నత శక్తి. కాబట్టి, భౌతిక ప్రపంచంలో దాని యొక్క వక్రమైన పరివర్తన, అంటే, కామము కూడా ప్రాపంచిక కార్యాలలో అత్యంత శక్తివంతమైనది.

ప్రాపంచిక వస్తువులు తృప్తినీ, ఆనందాన్నీ ఇస్తాయని నమ్మించి, రజో గుణము, ఆత్మను ప్రలోభానికి గురిచేస్తుంది. దాంతో వాటిని పొందటానికి మనిషి, ఆశ పడతాడు. కామమూ, లోభమూ మరియు క్రోధమూ అనబడే ఈ మూడింటి ప్రభావంచేత, మనిషి పాపాలు చేస్తాడు. అందుకే శ్రీ కృష్ణుడు, కామమే అన్ని అరిష్టాలకూ మూల కారణం అని అంటున్నాడు.

ధూమేనావ్రియతే వహ్నిః యథాదర్శో మలేన చ ।
యథోల్బేనావృతో గర్భస్తథా తేనేదమావృతమ్ ।। 38 ।।

నిప్పు పొగచే కప్పబడినట్టుగా, దుమ్ముచే అద్దం మసకబారినట్టుగా, గర్భాయశముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడినట్టుగా,  ఒక వ్యక్తి యొక్క జ్ఞానము, కామముచే కమ్మివేయబడుతుంది.

ఏది మంచో ఏది చెడో తెలుసుకోగల జ్ఞానాన్నే, విచక్షణ అంటారు. ఈ విచక్షణ, మన బుద్ధిలో ఉంటుంది. కానీ, కామమనేది ఎంత బలమైన శత్రువంటే, అది బుద్ధి యొక్క విచక్షణా శక్తిని కప్పివేస్తుంది. శ్రీ కృష్ణుడు ఈ విషయాన్ని వివరించటానికి, మూడు స్థాయిలలో ఉదాహరణలను చూపిస్తున్నాడు. వెలుగు నిచ్చే అగ్ని, పొగచే కప్పివేయబడుతుంది. ఈ పాక్షికమైన కప్పివేత, సాత్విక కోరికల వలన జనించే, పలుచని మబ్బు లాంటిది. ఒక అద్దం, సహజంగానే ప్రతిఫలింపచేస్తుంది. కానీ దుమ్ముచే మాసిపోతుంది. ఈ యొక్క అపారదర్శకత అనేది, బుద్ధిపై రజోగుణ కోరికలు కలుగచేసే ముసుగు వంటిది, మరియు, గర్భము యందు భ్రూణము వలె పూర్తిగా దాచి ఉంచబడుతుంది. ఈ యొక్క పూర్తి కప్పివేత అనేది, తామసిక కోరికలు, విచక్షణా శక్తిని నశింపచేయటం వలన కలిగే పరిణామం వంటిది. ఈ ప్రకారంగా, మన కోరికల స్థాయిని బట్టి, మనం విన్న, చదివిన, ఆధ్యాత్మిక జ్ఞానం, మరుగున పడిపోతుంది.

ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణా ।
కామరూపేణ కౌంతేయ దుష్పూరేణానలేన చ ।। 39 ।।

ఓ కుంతీ పుత్రుడా, అత్యంత వివేకవంతుల జ్ఞానం కూడా, కోరికల రూపంలో ఉన్న శత్రువుచే, కప్పివేయబడుతుంది. ఇది ఎప్పటికీ తృప్తిపరచలేనిది, అగ్నిలాగా మండుతూనే ఉంటుంది.

ఈ శ్లోకంలో కామము అంటే, "కోరిక". దుష్పూరేణ అంటే, "తనివితీరనివి", అనల అంటే, "ఎన్నటికీ చల్లారనిది", అనే పదాలున్నాయి. ఇవి ఎంతో ప్రభావితమైనవి. కోరిక అనేది జ్ఞానుల విచక్షణా శక్తిని వశపరుచుకుని, దానిని తీర్చటానికి ఆశచూపుతుంది. కానీ, ఆ మంటని ఆర్పడానికి ఎంత ప్రయత్నిస్తే, అది అంత ఉధృతితో మండుతుంది. కోరిక అనేది, ఆర్పలేని అగ్నిలాగా మండుతూనే ఉంటుంది. అది ఎప్పటికీ, ఎవ్వరికీ, సుఖాన్నివ్వలేదు. దానిని ‘దుఃఖానికి మూల హేతువు’ అని తెలుసుకుని త్యజించేవారు, వివేకవంతులు. కానీ, ఈ జ్ఞాన రహస్యాన్ని అర్థం చేసుకోలేనివారు, రజోగుణ కారణమైన కోరికలను తీర్చుకోవటానికే, ప్రయత్నిస్తుంటారు. ప్రాపంచిక విషయాల కోసం, వృధా ప్రయాసతో, తమ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటారు.

ఇక మన తదుపరి వీడియోలో, దు:ఖహేతువైన కామమును ఎలా నిర్మూలించాలో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes