పాపములు అంటకుండా, మనస్సూ ఇంద్రియముల నియంత్రణ.. శ్రీ కృష్ణుడు!
'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (19 – 24 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 19 నుండి 24 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/t0kxt0sga2k ]
పాపములు అంటకుండా, మనస్సునూ, ఇంద్రియములనూ ఎలా నియంత్రణలో ఉంచుకోవాలో శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..
యస్య సర్వే సమారంభాః కామసంకల్పవర్జితాః ।
జ్ఞానాగ్నిదగ్ధకర్మాణం తమాహుః పండితం బుధాః ।। 19 ।।
ఎవరి యొక్క సమస్త కర్మలూ, భౌతిక సుఖాల వాంఛలకు అతీతంగా ఉంటాయో, మరియు ఎవరైతే తమ సమస్త కర్మల ప్రతిక్రియలను జ్ఞానాగ్నిలో భస్మం చేస్తారో, అట్టివారు జ్ఞానోదయమైన మునులచే, పండితులనబడతారు.
జీవాత్మ అనేది, ఆనంద సముద్రమయిన భగవంతుని యొక్క అణు-అంశ కాబట్టి, సహజంగానే తనుకూడా, ఆనందం కోసం అన్వేషిస్తుంటుంది. కానీ, భౌతిక శక్తితో ఆవరింపబడిన జీవాత్మ, తనను తాను ఈ భౌతిక శరీరమే అనుకుంటుంది. ఈ అజ్ఞానంలో, భౌతిక జగత్తు నుండి ఆనందం పొందటానికి, కర్మలు చేస్తుంటుంది. ఈ వ్యవహారములు, మనో ఇంద్రియ సుఖాల కోసం చేసేవి కాబట్టి, జీవాత్మను కర్మ బంధములలో పెనవేస్తాయి.
కానీ, జీవాత్మ దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉన్నప్పుడు, తాను కోరుకునే ఆనందం, ఇంద్రియ వస్తు-విషయముల ద్వారా లభించదనీ, ప్రేమ పూర్వక భగవత్ సేవ ద్వారా దొరుకుతుందనీ, తెలుసుకుంటుంది. అప్పుడు తన ప్రతి కార్యమునూ, భగవత్ ప్రీతి కోసమే చేస్తుంది. "నీవు ఏం చేసినా, ఏం తిన్నా, యజ్ఞ హోమంలో ఏమి సమర్పించినా, ఏది బహుమతిగా ప్రసాదించినా, ఏ వ్రతాలు చేసినా, దానిని భగవంతునికి అర్పితముగా చేయాలి. జ్ఞానోదయం కలిగిన జీవాత్మ, భౌతిక సుఖాల కోసం ప్రాకులాడకుండా, స్వార్థంతో కూడిన పనులను త్యజించి, అన్ని కర్మలనూ భగవంతుడికే అంకితం చేస్తుంది. ఆ విధంగా చేసిన పనులు, ఎలాంటి కర్మ బంధనాలనూ కలుగచేయవు. ఆ కర్మలు, ఆధ్యాత్మిక జ్ఞానాగ్నిలో కాలి, భస్మమై పోతాయి.
త్యక్త్వా కర్మఫలాసంగం నిత్యతృప్తో నిరాశ్రయః ।
కర్మణ్యభిప్రవృత్తోఽపి నైవ కించిత్ కరోతి సః ।। 20 ।।
ఇటువంటి జనులు, తమ కర్మ ఫలములపై గల మమకారాన్ని త్యజించిన పిదప, ఎల్లప్పుడూ తృప్తితో ఉంటారు. ఇతర బాహ్య వస్తు-విషయములపై ఆధార పడరు. అటువంటి వారు, కర్మలలో నిమగ్నమయి ఉన్నా, వారు ఏమీ చేయనట్టే.
బాహ్యంగా కనిపించే విషయాలను బట్టి, కర్మలను నిర్ణయించలేము. మనస్సు యొక్క స్థితి, దానిని కర్మా లేక ఆకర్మా అని నిర్ణయిస్తుంది. జ్ఞానుల యొక్క మనస్సు ఎప్పుడూ, భగవత్ ధ్యాసలోనే నిమగ్నమై ఉంటుంది. భగవంతుడిపై సంపూర్ణ భక్తి గల వారు, బాహ్య మైన వాటిపై ఆధారపడరు. ఈ మానసిక స్థితిలో వారు చేసే పనులన్నీ, అకర్మగా పరిగణించబడతాయి.
నిరాశీర్యతచిత్తాత్మా త్యక్తసర్వపరిగ్రహః ।
శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషమ్ ।। 21 ।।
ఆశారహితుడై ఉండి, నాది అన్న భావన లేకుండా, మనస్సు, ఇంద్రియములు పూర్తి నియంత్రణలో ఉంచుకున్నవారు, శరీరంతో కర్మలు చేస్తూనే ఉన్నా, అటువంటి వారికి ఏ పాపమూ అంటదు.
భగవత్ స్పృహలో ఉండి పనులు చేసే సాధువులు, అన్ని పాపాల నుండీ విముక్తి చేయబడతారు. ఎందుకంటే, వారి మనస్సు మమకార రహితంగా, మరియు 'ఇది నాది' అన్న భావన లేకుండా ఉంటుంది, మరియు వారి యొక్క ప్రతి చర్యా, భగవత్ ప్రీతి కోసమే అన్న దివ్య ప్రేరణతో ఉంటుంది. అటువంటి వారికి, మనస్సు యొక్క ఉద్దేశము అనేది ప్రధానం కానీ, కర్మ కాదు.
యదృచ్ఛాలాభసంతుష్టో ద్వంద్వాతీతో విమత్సరః ।
సమః సిద్ధావసిద్ధౌ చ కృత్వాపి న నిబద్ధ్యతే ।। 22 ।।
అప్రయత్నముగా లభించిన దానితో సంతృప్తి చెంది, అసూయారహితులై, వారు జీవన ద్వందములకు, అంటే, సుఖ-దుఃఖాలూ, లాభ-నష్టాలూ వంటి వాటికి అతీతులై ఉంటారు. అన్ని రకాల పనులూ చేస్తూనే ఉన్నా, గెలుపు ఓటములలో సమత్వ బుద్ధితో ఉండి, వారు తమ కర్మలచే బంధింపబడరు.
ఒకే నాణేనికి రెండు ప్రక్కలు ఉన్నట్టు, భగవంతుడు కూడా ఈ ప్రపంచాన్ని ద్వంద్వములతో సృష్టించాడు. పగలు, రాత్రి; తీపి-చేదు; వేడి-చల్లదనం; వాన-కరవు మొదలగునవి. గులాబీ మొక్కకు అందమైన పువ్వూ, వికృతమైన ముల్లుంటుంది. జీవితం కూడా అలానే, తన వంతు ద్వంద్వములను తెస్తుంది - సుఖము, దుఃఖమూ; గెలుపు, ఓటమీ; కీర్తి, అపకీర్తి వంటివి. ఈ ద్వంద్వములకు అతీతంగా ఎదిగి, అన్ని పరిస్థితులనూ సమానంగా స్వీకరిస్తూ, సమస్థితిలో జీవించాలి. ఫలితాలపై ఆశ లేకుండా, మన కర్తవ్యాన్ని చేస్తూ పోతూ, మన కర్మ ఫలాలపై అనాసక్తి పెంచుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది.
గతసంగస్య ముక్తస్య జ్ఞానవస్థిత చేతసః ।
యజ్ఞా యాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే ।। 23 ।।
అటువంటి వారు, ప్రాపంచిక అనుబంధాల నుండి విముక్తి చేయబడతారు, మరియు వారి బుద్ధి, దివ్య ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థితమై ఉంటుంది. వారు చేసే ప్రతి పనీ, భగవత్ అర్పితంగా ఉంటుంది. కాబట్టి, వారు అన్ని రకాల కర్మల ప్రతిచర్య నుండీ, విముక్తి చేయబడతారు.
సమస్త కర్మలనూ భగవత్ అర్పితము చేయడమంటే, ఆత్మశ్వతమైన భగవంతుని దాసునిగా తెలుసుకోవడం. నిజానికి జీవాత్మ స్వ-స్వభావంగా భగవంతుని దాసుడు. ఈ జ్ఞానంలో స్థితులై ఉన్నవారు, తమ సమస్త కర్మలనూ ఆయనకు అర్పితముగా చేస్తారు. అలా వారి పనుల వలన జనించే పాప ప్రతిక్రియల నుండి, విముక్తి చేయబడతారు.
బ్రహ్మార్పణం బ్రహ్మహవిర్బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ ।
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మసమాధినా ।। 24 ।।
సంపూర్ణ భగవత్ ధ్యాసలోనే ఉన్న వారికి, హోమ ద్రవ్యము బ్రహ్మమే, దానిని యజ్ఞంలో సమర్పించడానికి ఉపయోగించే స్రువము వంటివి బ్రహ్మమే, యజ్ఞ కర్మ బ్రహ్మమే, యజ్ఞాగ్ని కూడా బ్రహ్మమే. ప్రతిదానిని కూడా ఆవిధంగా భగవంతునిగా చూసే వారు, భగవంతుడిని సునాయాసంగా పొందుతారు.
నిజానికి ఈ ప్రపంచపు వస్తువులన్నీ, భగవంతుని మాయ అనే భౌతిక శక్తి ద్వారా తయారుచేయబడ్డాయి. వెలుగు అనేది అగ్ని యొక్క శక్తి. కానీ రెండూ వేర్వేరు. అగ్నికి బాహ్యంగా ఉండేవి వెలుగు. దీనిని అగ్నిలో భాగమే అనికూడా అనుకోవచ్చు. అలాగే, శక్తి అనేది, శక్తివంతుని కన్నా వేరైనది. కానీ, అది ఆయనలో భాగమే. శ్రీ కృష్ణుడు శక్తిమానుడు, ఆత్మ అతని శక్తి. ఆత్మ అనేది భగవంతుని నుండి వేరైనది కాదు. కానీ, భగవంతుని కన్నా బేధమే. కాబట్టి, భగవంతుని యందే మనస్సు నిమగ్నమైనవారు, ఈ జగత్తునంతా భగవంతునితో ఒక్కటిగా, ఆయనకన్నా అబేధమైనదిగా చూస్తారు.
ఇక మన తదుపరి వీడియోలో, శ్రీ కృష్ణుడు వివరించిన వివిధ రకాల యజ్ఞాల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment