కర్ణుడి జన్మ రహస్యం! Story of Sahasra Kavacha

 

కర్ణుడి జన్మ రహస్యం!

మహాభారతంలో 'ధర్మం' అనే ఏకసూత్రం, అంతర్లీనంగా వుంది. దానిని పాటించే వారినీ, పాటించని వారినీ గమనించే 'విధాత' పాత్ర శక్తివంతంగా, సందర్భాన్ని బట్టి పని చేస్తుంది. 'కాలం' మరొక ఆయతనంగా, తన పని తాను చేసుకుంటూ పోతుంది. కాలానికి నిర్దిష్ఠమైన ఒక ప్రణాళిక వుంటుంది. సన్నివేశాలన్నీ, ఆ ప్రణాళిక క్రమంగా జరగడానికి వీలుగా, నడుస్తూ వుంటాయి. మనుషుల రాగద్వేషాలూ, బలహీనతలూ సన్నివేశాలను నడిపిస్తాయి. దాని పర్యవసానమే, కురుక్షేత్ర మహాసంగ్రామం. అందులో ఒక కీలక పాత్ర, సహజ కవచ కుండలాలతో జన్మించిన కర్ణుడిది. 'దానం చేయడంలో కర్ణుని మించినవాడు లేడ'ని, సాక్షాత్తూ శ్రీ కృష్ణ భాగవానుడిచే కొనియాడబడిన కర్ణుడి జన్మ, పూర్వ జన్మ వృత్తాంతం కూడా అలాంటిదే. మరి ఆ విషయాలు తెలుసుకోవాలంటే, ఈ వీడియోను పూర్తిగా చూడండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jx11mEGra5A ]

పూర్వకాలంలో ఒక రాక్షసుడు, బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సుజేసి, అభేద్యమైన వేయి కవచాలను వరంగా పొందాడు. అప్పటినుంచి, అతడికి ‘సహస్రకవచుడు’ అనే పేరు స్థిరపడిపోయింది. వరగర్వంతో ‘సహస్రకవచుడు’, సర్వలోకాలనూ నానా హింసలకూ గురిచేసి, ఆనందిస్తూండేవాడు. వాడి బాధలు తట్టుకోలేక, సకల ప్రాణికోటి శ్రీ మహావిష్ణువును శరణు కోరగా, ‘భయపడకండి.. నేను నర, నారాయణ రూపాలలో, బదరికావనంలో తపస్సు చేస్తున్నాను. వాడికి అంత్యకాలం సమీపించినప్పుడు, వాడే నా దగ్గరకు వస్తాడు. అప్పుడు నేనే వాడిని సంహరిస్తాను’ అని వారికి ధైర్యం చెప్పి పంపాడు.

హిరణ్యకశిపుని సంహరించిన తర్వాత, నరసింహస్వామి రెండురూపాలుగా విడిపోయాడు. నర రూపం ‘నరుని’ గానూ, ‘సింహ’ రూపం ‘నారాయణుని’గానూ, ‘ధర్ముని’ కుమారులుగా జన్మించారు. వారే నర, నారాయణులు. వారిరువురూ పుట్టుకతోనే పరాక్రమవంతులూ, విరాగులూ. అందుకే, వారిరువురూ ఆయుధ ధారులై, బదరికావనంలో ఏకాగ్రచిత్తులై, తపోదీక్ష వహించారు. ఏ ఆటంకం లేకుండా, వారి తపస్సు కొనసాగుతోంది. ఒకసారి ప్రహ్లాదుడు బదరికావనం సందర్శించి వెడుతూ, నర, నారాయణులనూ, వారి ప్రక్కన ఉన్న ఆయుధాలనూ గమనించి, ‘తాపసులైన వీరికి ఆయుధాలతో పనేమి? వీరెవరో కపట తాపసులైయుండవచ్చు’ అని భావించి, వారికి తపోభంగం గావించి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. వారిమధ్య భీకరయుద్ధం జరిగింది. ఎంతకాలమైనా, వారిని జయించ లేకపోవడం చూసి, ఆశ్చర్యపడి, శ్రీ మహావిష్ణువును ధ్యానించాడు. శ్రీహరి ప్రత్యక్షమై, ‘ప్రహ్లాదా, నర నారాయణులు నా అంశతో జన్మించినవారు. వారిని నీవు గెలవలేవు’ అని చెప్పాడు. ప్రహ్లాదుడు తన తప్పు తెలుసుకుని, నర, నారాయణులను క్షమించమని వేడుకుని, అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

నర, నారాయణుల తపస్సు కొనసాగుతోంది. వారి తపస్సుకు ఇంద్రుడు భయపడి, వారికి తపోభంగం చేసిరమ్మని, అప్సరసలను పంపాడు. వారు తమ రూప వయో నృత్య గానాలతో, నర, నారాయణుల తపస్సుకు భంగం కలిగించాలని, ఎంతో ప్రయత్నించారు. కానీ, ఫలితం శూన్యం. అప్పుడు నారాయణుడు వారిని దగ్గరకు పిలిచి, ‘మీ అందాలు మమ్ములను ఆకర్షించలేవు. ఇంద్ర పదవి ఆశించి, మేము ఈ తపస్సు చేయడంలేదు. అని మా మాటగా మహేంద్రునకు తెలియజెప్పండి’ అని తన తొడమీద చరిచాడు. ఆ శబ్దం నుంచి ఓ అసాధారణ, అద్భుత సౌందర్యరాశి జన్మించింది. తన ఊరువుల నుంచి పుట్టిన ఆ సుందరికి, ‘ఊర్వశి’ అని పేరు పెట్టి, ఆమెను ఆ అప్సరసలకు అప్పచెబుతూ, ‘ఈమెను మా బహుమతిగా మహేంద్రునకు ఇవ్వండి’ అని చెప్పి వారిని పంపాడు. మహేంద్రుడు తన తప్పు తెలుసుకుని, నర, నారాయణులను క్షమించమని వేడుకున్నాడు. నర, నారాయణుల తపస్సు కొనసాగుతోంది. ఆ సమయంలో, వరగర్వాంధుడైన ‘సహస్రకవచుడు’ వారిదగ్గరకు వచ్చి, వారిని యుద్ధానికి ఆహ్వానించాడు. అప్పుడు నారాయణుడు అతనితో, ‘రాక్షసేశ్వరా.. నీ సమరోత్సాహం మాకు ఆనందం కలిగించింది. కానీ, మేమిద్దరం కలిసి, నీ ఒక్కనితో యుద్ధం చెయ్యడం, ధర్మం కాదు. కనుక, మాలో ఒకడు నీతో యుద్ధం చేస్తూంటే, మరొకడు తపస్సు చేసుకుంటాడు. అతని తపస్సుకు ఎలాంటి అంతరాయం కలుగకూడదు. ఇందుకు నీకు సమ్మతమైతే, యుద్ధం చేస్తాను’ అన్నాడు.

సహస్రకవచుడు ఈ ఒప్పందానికి సమ్మతించాడు. నరుడు తపస్సు చేస్తున్నాడు. నారాయణుడు యుద్ధానికి దిగాడు. యుద్ధం భీకరంగా సాగుతోంది. అలా వేయి సంవత్సరాలు గడిచిన అనంతరం, నారాయణుడు సహస్రకవచుని వేయి కవచాలలో, ఒక కవచాన్ని భేదించగలిగాడు. అప్పటికి అలసిన నారాయణుడు, తపస్సుకు ఉపక్రమించగా, నరుడు సహస్రకవచునితో యుద్ధానికి దిగాడు. మరో వేయి సంవత్సరాలు గతించిన అనంతరం, నరుడు సహస్రకవచుని మరో కవచాన్ని భేదించాడు. ఇలా నర, నారాయణులిరువురూ కలసి, ఆ సహస్రకవచుని తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాలు భేదించారు. ఇక సహస్ర కవచునికి ఉన్నది ఒకే ఒక కవచం. అది గమనించిన సహస్రకవచునికి భయం పుట్టి, యుద్ధరంగం వదలి, పరుగు పరుగున సూర్యుని దగ్గరకు వెళ్లి, అభయమిమ్మని వేడుకున్నాడు. అప్పుడు సూర్యుడు, ‘కలకాలం నేను నీకు అభయం ఇవ్వలేను. నర, నారాయణుల అనంతరం, నీకు నా నుంచి విడుదల కలిగిస్తాను’ అన్నాడు. సహస్ర కవచుడు సమ్మతించి, సూర్యుని దగ్గర ఉండిపోయాడు.

కన్యగా ఉన్న కుంతికి, దూర్వాస మహర్షి ఇచ్చిన ‘సంతాన సాఫల్య మంత్రం'తో, ఏ దేవతను ఆవాహన చేస్తే, ఆ దేవత వచ్చి, సంతానాన్ని మాత్రమే ఇచ్చి వెళ్లిపోతారు తప్ప, మరే వరాలూ అనుగ్రహించరు.

అలా కుంతి మంత్రబలానికి కట్టుబడి వచ్చిన సూర్యుడు, ఆ సహస్రకవచునే, పసిబిడ్డగా మార్చి, కుంతి చేతికి అందించాడు. అందుకే కర్ణుడు, సహజ కవచ కుండలాలతో జన్మించాడు. ఆ కర్ణుని సంహరించడానికే, నర, నారాయణులిరువురూ, కృష్ణార్జునులుగా జన్మించి, కురుక్షేత్ర రణభూమిలో కర్ణుని సంహరించారు.

మరిన్ని మంచి వీడియోస్ తో, మళ్ళీ మీ ముందుకు వొస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదనుకుంటే, మన ఛానల్ ను సబ్స్క్రయిబ్ చేసుకోండి. అలాగే, వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చెయ్యడం మరచిపోకండి.. మీకు తెలిసిన, తెలుసుకోదలచిన విషయాలను, క్రింద కామెంట్ బాక్స్ లో, తప్పక తెలియజేయండి. Video క్రింద Description లో పొందుపరిచిన మన social media links కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes