పౌండ్రక వాసుదేవుడి వధ! Paundraka Vasudeva


పౌండ్రక వాసుదేవుడి వధ!

శ్రీ కృష్ణుడి లీలలనూ, మాయలనూ వర్ణించడం ఎవరికి సాధ్యం? వసుదేవుడి కుమారుడు కాబట్టి, కృష్ణ భగవానుడిని వాసుదేవుడని కూడా పిలుస్తారు. మరి ఈ పౌండ్రక వాసుదేవుడెవరు? అతని గురించీ, అతని మూర్ఖత్వం గురించీ మనలో చాలా మందికి తెలియదు. తన వెర్రితనంతో కృష్ణుడిని ఎదురించి, ఆయన చేత సంహరించబడ్డాడు. వాసుదేవుడికీ, పౌండ్రక వాసుదేవుడికీ సంబంధం ఏంటి? పౌండ్రకుడు కృష్ణుడిని ఎందుకు హెచ్చరించాడు? కాశీరాజు కుమారుడు, మహాజ్వాలను కృష్ణుడి పైకి ఎందుకు పంపాడు - అనేటటువంటి ఆసక్తికర విషయాలను ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/nwFrCuWSY2A ]

శ్రీ భాగవత పురాణంలోని ఈ గాధ, మనందరికీ ఒక సత్యాన్ని బోధిస్తుంది. అదేమిటో తెలుసుకుందాము. కరూ దేశానికి రాజు, పౌండ్రక వాసుదేవుడు. అతడు మూర్ఖుడు మాత్రమే కాకుండా, దురహంకారి కూడా. తనకు వాసుదేవుడనే పేరుండడం వలన, తానే నిజమైన వాసుదేవుడననీ, సాక్షాత్తూ శ్రీ మహా విష్ణువుననీ విర్రవీగేవాడు. ద్వారకలో ఉన్న శ్రీ కృష్ణుడు, తన పేరును పెట్టుకుని మోసం చేస్తున్నాడనీ, వాసుదేవుడిగా అందరిలో చలామణీ అవుతున్నాడనే భ్రమలో జీవించేవాడు. పౌండ్రక వాసుదేవుడు మాత్రమే కాక, అతడి చుట్టూ ఉండే అనుచరగణం కూడా వెర్రివారే. రాజు ఏం చెబితే, అదే నిజమని భావించి, అతనే నిజమైన వాసుదేవుడని నమ్మేవారు. వీరందరూ కలసి, పౌండ్రకుడి భ్రమను నిజమని, రాజ్యమంతా ప్రచారం చేశారు. నిత్యం అతడిని శ్రీ మహావిష్ణువుగా అలంకరించి, పొగడ్తలతో ముంచేసేవారు, అనుచరులు.

క్రమంగా అతడి పిచ్చి ముదిరి, తలకెక్కింది. తనకు తప్ప, వాసుదేవుడనే పేరు ఇంకెవ్వరికీ ఉండకూడదని భావించాడు. అనుకున్నదే తడవుగా, వెంటనే తన దూత ద్వారా, ద్వారకలోని శ్రీ కృష్ణుడికి సందేశం పంపించాడు. శ్రీ కృష్ణుడి దగ్గరకు వెళ్ళిన పౌండ్రకుడి దూత, 'ఓయీ కృష్ణా! యాదవా! ఈ భూమండలాన్ని రక్షించడానికి వాసుదేవుడనైన నేను అవతరించాను. నీవు నా పేరునీ, నా చిహ్నాలనీ ఉపయోగించి సంచరిస్తున్నావని తెలిసింది. ఇది నీకు తగదు. ఇకపై నీవు నా వాసుదేవ నామాన్ని వినియోగించకుండా, నన్ను శరణువేడుకో. లేదా నాతో యుద్ధానికి తలపడు. నిన్ను సరాసరి యమలోకానికి పంపిస్తాను.' అని తాను తీసుకువచ్చిన సందేశాన్ని చదివి వినిపించాడు. ఈ వార్త విన్న సభలోని వారందరూ, ఎవడీ పిచ్చివాడు! అంటూ నవ్వుకున్నారు. ఇలాంటి మూర్ఖులున్నారా? అని ఆశ్చర్యపోయారు. శ్రీ కృష్ణుడు చిరునవ్వుతో పౌండ్రకుడి దూతనుద్దేశించి, 'నీవు వెళ్ళి నీ వాసుదేవుడికి చెప్పు, ఏ ఆయుధాలను నన్ను విసర్జించమన్నాడో, అవే ఆయుధాలతో, పౌండ్రక వాసుదేవుడినీ, అతడి అనుచరులనూ, సమూలంగా సంహరిస్తాను. యుద్ధానికి సిద్ధం కమ్మను.' అని తిరుగు వర్తమానం పంపాడు.

చెప్పినట్లుగానే శ్రీ కృష్ణుడు, పౌండ్రకుడి రాజ్యం మీదకు దండెత్తాడు. పౌండ్రకుడు ఎంతో ఉత్సాహంతో, రెండు అక్షౌహిణుల సైన్యంతో, శ్రీ కృష్ణుణ్ణి ఎదుర్కొన్నాడు. అతడికి అసరాగా, అతడి మిత్రుడైన కాశీరాజు, మూడు అక్షౌహిణీల సైన్యాన్ని వెంటబెట్టుకొచ్చాడు. యుద్ధరంగంలోకి వచ్చిన పౌండ్రకుడు, అచ్చం శ్రీ కృష్ణుడిలా వేణువునీ, ఫించాన్నీ, పీతాంబరాలనూ, కిరీట కుండలాలనూ ధరించి ఎదురయ్యాడు. వేషగాడిలా కనిపించిన పౌండ్రకుడిని చూసి, శ్రీ కృష్ణుడు ఫక్కున నవ్వాడు. దాంతో ఆగ్రహించిన పౌండ్రకుడు, తన దగ్గరున్న ఆయుధాలన్నింటినీ శ్రీ కృష్ణుడిపై ప్రయోగించాడు. ఆ శ్యామసుందరుడు వాటిని తునాతునకలు చేసి, తన చక్రయుధాన్ని ప్రయోగించి, పౌండ్రక వాసుదేవుడి తలను నరికివేశాడు. ఒక ప్రక్క పౌండ్రకుడు మరణించినా, యుద్ధం ఆపకుండా పోరాడుతున్న కాశీరాజు తలను కూడా ఖండించి, బాణంతో ఆ తల కాశీరాజు కోటలో పడేలా చేశాడు. అలా యుద్ధంలో పౌండ్రకుడిపై విజయం సాధించిన శ్రీ కృష్ణుడు, ద్వారకకు వెళ్ళిపోయాడు.

కాశీరాజు మరణానికి కారణం శ్రీ కృష్ణుడని తెలుసుకున్న అతని కుమారుడు సుదక్షిణుడు, ఆవేశంతో రగిలిపోయాడు. కృష్ణుడిపై పగ తీర్చుకోవాలని తలచి, శివుడి గురించి ఘోర తపస్సు చేశాడు. తన కఠోర దీక్షకు శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమనగా, కృష్ణుణ్ణి సంహరించే శక్తిని ప్రసాదించమని వేడుకున్నాడు. శివుడందుకు నిరాకరించి, అభిచార హోమం చేసి, తద్వారా తన కోరికను నెరవేర్చుకునే ప్రయత్నం చేయమని సలహా ఇచ్చాడు. ఆ విధంగానే, సుదక్షణుడు ఎంతో నిష్ఠగా, ఆ అభిచార హోమాన్ని నిర్వహించాడు. ఆ యాగం పూర్తయిన తరువాత, హోమగుండం నుంచి కృత్య అనే మహాశక్తి ఆవిర్భవించింది. సుదక్షిణుడు ఆ శక్తిని, ద్వారకా నగరంలో ఉన్న శ్రీ కృష్ణుడి మీదకు ప్రయోగించాడు. మహోజ్వలగా, ఎత్తైన జ్వాలలను విరజిమ్ముతూ, కృత్యాశక్తి, ద్వారకానగరంలోకి ప్రవేశించింది. నగరాన్ని దహించడం మొదలుపెట్టింది. దాని ధాటికి తట్టుకోలేని ద్వారక ప్రజలు, కృష్ణుణ్ణి శరణు వేడుకున్నారు. దాంతో, ఆయన కృత్య మీద తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. అది కృత్యను అడ్డుకుని, దానిని ప్రయోగించిన సుదక్షిణుణ్ణీ, అతడి నగరాన్నీ దహించి, తిరిగి కృష్ణుడి చెంతకు చేరింది.

మంచికో చెడుకో, నిరంతరం శ్రీ కృష్ణుడి పేరునే తలుస్తూ, ఆయన అలంకారాన్నే ధరిస్తూ, కృష్ణ నామస్మరణతోనే తన జీవితాన్ని గడిపిన పౌండ్రక వాసుదేవుడు, అంత్యకాలంలో ఆ భగవానుడి చేతిలో దుర్మరణం పొందినా, శ్రీ కృష్ణ సాయుజ్యాన్ని పొందాడు. ఈ గాధ ద్వారా ప్రతివొక్కరూ తెలుసుకోవలసిన సత్యం, నిత్య దైవనామ స్మరణ ప్రాముఖ్యత.

కృష్ణం వందే జగద్గురుమ్!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes