ఆత్మ సమర్పణ..!
'భగవద్గీత' చతుర్థోధ్యాయం - జ్ఞాన కర్మ సన్న్యాస యోగం (25 – 30 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో నాలుగవ అధ్యాయం, జ్ఞాన కర్మ సన్న్యాస యోగం. ఈ రోజుటి మన వీడియోలో, జ్ఞాన కర్మ సన్న్యాస యోగంలోని 25 నుండి 30 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/fbmO2fBQxpI ]
శ్రీ కృష్ణుడు వివరించిన వివిధ రకాల యజ్ఞాల వివరణ..
దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే ।
బ్రహ్మాగ్నావపరే యజ్ఞం యజ్ఞేనైవోపజుహ్వతి ।। 25 ।।
కొంతమంది యోగులు, భౌతికమైన వస్తువులు సమర్పిస్తూ, దేవతలను పూజిస్తారు. మరికొంతమంది, పరమ సత్యమనే అగ్నిలో తమ ఆత్మనే సమర్పిస్తూ, సంపూర్ణంగా ఆరాధిస్తారు.
యజ్ఞ ప్రక్రియ అనేది, భగవత్ దృక్పథంలో, భగవంతునికి నివేదనగా చేయాలి. కానీ, కొంతమంది యజ్ఞాన్ని భిన్నమైన దృక్పథాలతో చేస్తుంటారు. జ్ఞానం లేనివారు, భౌతిక ప్రయోజనాల కోసం, దేవతలకు నివేదన సమర్పిస్తుంటారు.
యజ్ఞం యొక్క నిగూఢమైన అర్థం తెలిసిన కొంతమంది, వారినే భగవంతునికి సమర్పించుకుంటారు. దీనినే ఆత్మ-సమర్పణ, లేదా ఆత్మాహుతి, లేదా తమ ఆత్మను భగవదర్పితం చేయటం, అంటారు.
శ్రోత్రాదీనీంద్రియాణ్యన్యే సంయమాగ్నిషు జుహ్వతి ।
శబ్దాదీన్విషయానన్య ఇంద్రియాగ్నిషు జుహ్వతి ।। 26 ।।
మరికొందరు, శ్రవణ మరియు ఇతర ఇంద్రియములను, ఇంద్రియనిగ్రహణ అనే యజ్ఞాగ్నిలో సమర్పిస్తారు. మరికొందరు, శబ్దాది ఇతర ఇంద్రియ విషయములను, ఇంద్రియాగ్నిలో ఆహుతిగా సమర్పిస్తారు.
అగ్ని అనేది తనలో సమర్పించబడిన వస్తువుల స్వభావాన్ని మార్చివేస్తుంది. బాహ్యమైన వైదిక కర్మకాండ యజ్ఞంలో, భౌతికంగా తనకు సమర్పించబడిన వాటిని, అగ్ని భక్షించివేస్తుంది. అంతర్గత ఆధ్యాత్మిక సాధనలో, అగ్ని అనేది, సంకేతాత్మకమైనది. ఆత్మ- నిగ్రహం అనే అగ్ని, ఇంద్రియ వాంఛలను దహించివేస్తుంది. ఆధ్యాత్మిక ఉన్నతి కోసం, రెండు పూర్తి విరుద్ధమైన మార్గాలున్నాయి. మొదటిది, ఇంద్రియములను తిరస్కరించటం. ఈ పద్ధతిని, హఠ యోగ అభ్యాసంలో అనుసరిస్తారు. ఈ రకమైన యజ్ఞంలో, అత్యంత ఆవశ్యకమైన శరీర పోషణకి తప్ప, మిగతా అన్ని ఇంద్రియముల క్రియలనూ, ఆపివేస్తారు. సంకల్ప బలంతో మనస్సుని పూర్తిగా ఇంద్రియముల నుండి వెనక్కి మరల్చి , అంతర్ముఖంగా ఉంచుతారు. దీనికి వ్యతిరేకమైనది, భక్తి యోగాభ్యాసం. ఈ రెండవ రకమైన యజ్ఞంలో, ఇంద్రియములను, ప్రతి పరమాణువులో కనిపించే ఆ సృష్టికర్త యొక్క అద్భుతమైన కీర్తిని ఆరాధించటానికి, వాడతారు.
సర్వాణీంద్రియకర్మాణి ప్రాణకర్మాణి చాపరే ।
ఆత్మసంయమయోగాగ్నౌ జుహ్వతి జ్ఞానదీపితే ।। 27 ।।
కొందరు, జ్ఞానముచే ప్రేరణ నొంది, తమ ఇంద్రియ క్రియాకలాపములన్నింటినీ, మరియు తమ ప్రాణ శక్తిని కూడా, నిగ్రహించిన మనస్సు యొక్క అగ్నిలో, సమర్పిస్తారు.
హఠ యోగులు, ఇంద్రియములను సంకల్ప శక్తితో బలవంతంగా నిగ్రహిస్తే, జ్ఞానయోగులు, ఇదే లక్ష్యాన్ని జ్ఞానంతో కూడిన వివేకవంతమైన విచక్షణ అభ్యాసం ద్వారా, సాధిస్తారు. ఈ ప్రపంచం యొక్క మిథ్యా స్వభావం, ఈ శరీరమూ, మనస్సూ, బుద్ధీ, అహంకారం కన్నా వేరైన అస్థిత్వమని, తీవ్రమైన ధ్యానంలో నిమగ్నమయి ఉంటారు. ఇంద్రియములు, బాహ్య ప్రపంచం నుండి ఉపసంహరించబడతాయి. మనస్సు, ఆత్మ యందు ధ్యానంలోనే, నిమగ్నం చేయబడుతుంది. ఆత్మ మరియు పరమాత్మ, అబేధమనే ప్రతిపాదనలో, ఆత్మ-జ్ఞానం యందే స్థితులై ఉండటమే, వారి లక్ష్యం. జ్ఞాన యోగ మార్గం చాలా కష్టమైనది. దీనికి చాలా నిష్ఠ, మరియు సుశిక్షితమైన బుద్ధి అవసరం.
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే ।
స్వాధ్యాయజ్ఞానయజ్ఞాశ్చ యతయః సంశితవ్రతాః ।। 28 ।।
కొందరు తమ సంపదని యజ్ఞంలా సమర్పిస్తారు. మరికొందరు, కఠినమైన నిష్ఠలను యజ్ఞంలా సమర్పిస్తారు. కొందరు ఎనిమిదంచెల యోగాభ్యాసాన్ని ఆచరిస్తారు. మరికొందరు, కఠినమైన నిష్ఠలను ఆచరిస్తూ, వేద శాస్త్రాలని చదువుతూ, జ్ఞానాన్ని పెంచుకోవటమే యజ్ఞంలా చేస్తారు.
మనుష్యులు తమ తమ స్వభావాలలో, ప్రేరణలో, క్రియాకలాపాలలో, వృత్తిలో, ఆశయాలలో మరియు సంస్కారాలలో, వేరువేరుగా ఉంటారు. యజ్ఞములనేవి, కొన్ని వందల రకాలుగా ఉంటాయి. అవి భగవంతునికి అర్పించినప్పుడు, అంతఃకరణ శుద్ధికీ, ఆత్మోద్ధరణకీ ఉపయోగపడతాయి.
ద్రవ్య యజ్ఞం: కొందరు ధనం సంపాదించి, దానిని ధర్మ కార్యాల కోసం దానం చేయటం వైపు, మొగ్గు చూపుతారు. వారు అత్యంత క్లిష్టమైన వ్యాపార లావాదేవీలలో నిమగ్నమై ఉన్నా, తాము సంపాదించే ధనంతో, భగవత్ సేవ చేయాలనే అంతర్గత దృఢ సంకల్పంతో ఉంటారు.
యోగ యజ్ఞం: భారత తత్త్వశాస్త్రములో, యోగ దర్శనమనేది, ఆరు తత్వ సిద్ధాంతాలలో ఒకటి. ఆధ్యాత్మిక పురోగతి కోసం, శరీర ప్రక్రియలతో మొదలుపెట్టి, మనస్సుని జయించటం వరకూ, 'అష్టాంగ యోగము' అనే ఎనిమిది అంచెల యోగ మార్గం వివరించబడింది. కొంతమంది ఈ మార్గానికి ఆకర్షితులై, దీనిని ఒక యజ్ఞం లాగా ఆచరిస్తారు.
జ్ఞాన యజ్ఞం: కొంతమంది మనుష్యులు, జ్ఞాన సముపార్జన వైపు మొగ్గు చూపుతారు. వేద శాస్త్ర అధ్యయనం చేస్తూ, జ్ఞానాన్నీ మరియు భగవంతునిపై ప్రేమనీ పెంపొందించుకుంటారు.
అపానే జుహ్వతి ప్రాణం ప్రాణేఽపానం తథాపరే ।
ప్రాణాపానగతీ రుధ్వా ప్రాణాయామపరాయణాః ।। 29 ।।
అపరే నియతేహారాః ప్రాణాన్ ప్రాణేషు జుహ్వతి ।
సర్వేఽప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షపిత కల్మషాః ।। 30 ।।
మరికొందరు, లోనికి వచ్చే శ్వాస యందు, బయటకు వెళ్ళే శ్వాసను యజ్ఞముగా సమర్పిస్తారు. వేరొకరు, బయటకు వెళ్ళే శ్వాస యందు, లోనికి వెళ్ళే శ్వాసను సమర్పిస్తారు. కొందరు ప్రాణ శక్తి నియంత్రణలో నిమగ్నమై, ప్రాణాయామాన్ని నిష్ఠతో అభ్యాసం చేస్తూ, లోనికివచ్చే, బయటకు వెళ్ళే శ్వాసల నియంత్రణ చేస్తుంటారు. మరికొందరు, ఆహారాన్ని తగ్గించి, శ్వాసను ప్రాణ శక్తిలో యజ్ఞంగా సమర్పిస్తారు. ఇటువంటి యజ్ఞం తెలిసినవారంతా, ఇటువంటి పరిక్రియల ద్వారా, తమ తమ మలినముల నుండి శుద్ధి చేయబడతారు.
కొందరు ప్రాణాయామ అభ్యాసం వైపు ఆకర్షితులవుతారు. ప్రాణాయామం అంటే, "శ్వాస యొక్క నియంత్రణ" అని చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో, పూరకము అంటే, శ్వాసను ఊపిరితిత్తుల లోనికి తీసుకునే ప్రక్రియ, రేచకము అంటే, ఊపిరితిత్తులను ఖాళీ చేసే ప్రక్రియ, అంతర కుంభకము అంటే, గాలి పీల్చుకున్న తరువాత ఊపిరి బిగబట్టడం. ఈ సమయంలో, లోనికి వెళ్ళే శ్వాసలో బయటకు వచ్చే శ్వాస, తాత్కాలికంగా నిరోధించబడుతుంది.
బాహ్య కుంభకము -- ఊపిరి విడిచి పెట్టిన తరువాత ఊపిరితిత్తులను ఖాళీగా ఉంచటం. ఈ సమయంలో, బయటకు వెళ్ళే శ్వాసలో, లోనికి వచ్చే శ్వాస తాత్కాలికంగా నిరోధించబడుతుంది.
ఈ రెండు కుంభకములూ క్లిష్టమైన ప్రక్రియలు కాబట్టి, బాగా తెలిసిన గురువుల పర్యవేక్షణలోనే, వీటిని అభ్యాసం చేయాలి. ప్రాణాయామం వైపు మొగ్గు చూపే యోగులు, ఇంద్రియములను నియంత్రించటానికీ, మనస్సుని కేంద్రీకరించటానికీ, ఈ యొక్క శ్వాస నియంత్రణ ప్రక్రియను ఉపయోగిస్తారు. ఆ తరువాత వారి యొక్క నియంత్రించబడిన మనస్సుని, యజ్ఞ పూర్వకంగా భగవంతునికి సమర్పిస్తారు.
ఇక మన తదుపరి వీడియోలో, భౌతిక బంధనాల చిక్కుముడిని ఖండించే జ్ఞానం గురించి, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment