'నేను' వదిలి రా.. నేను కనబడతాను..!
మనిషికి జయాపజయాలతో సంబంధం లేకుండా, మొదలుపెట్టిన పనిని పూర్తిచెయ్యాలన్నది, ఆర్యోక్తి. ఆశావహ దృక్పథాన్ని పెంపొందించే సూత్రమది. జీవిత గమనంలో, మనిషి ఎన్నో కార్యాలను తలపెడతాడు. పనులన్నీ సఫలం కావాలని ఆశించకపోయినా, కొన్ని విజయాలనైనా రుచి చూడాలన్న కోరిక, ప్రతి మనిషికీ ఉంటుంది. ఏకాగ్రత, స్థిరచిత్తం, పనులను సఫలం చేస్తాయి. ఆధ్యాత్మికత, ఆ రెండింటినీ, మనిషి వశం చేస్తుంది. ఆ వివరాలు తెలుసుకోవడానికి, ఈ రోజుటి మన వీడియోను పూర్తిగా చూసి, మీ అభిప్రాయాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/0YFcLtZ565o ]
ప్రతి వ్యక్తికీ, ఒక్కొక్కసారి కార్యం పూర్తయినట్లే అనిపిస్తుంది. విజయం మన ముంగిట నిలిచినట్లే తోస్తుంది. అంతలోనే, అపజయం ఎదురవుతుంది. పరాజయానికి, సమర్థతాలేమి కన్నా, సరైన ప్రణాళిక లేకపోవడమే, ఎక్కువ కారణమవుతుంది. అర్జునుడు పక్షి కనుగుడ్డుకు గురిపెట్టినప్పుడూ, మత్స్యయంత్రం ఛేదనకు పూనుకున్నప్పుడూ, అతడి విజయానికి కారణమయ్యింది, ప్రతిభ మాత్రమే కాదు.. రెప్పపాటు నిడివి సైతం తేడాలేకుండా, బాణాన్ని వెయ్యాలన్న సమయానుకూలమైన నిర్ణయం.
మనస్సు పరిపరి విధాలైన ఆలోచనల్ని చేస్తుంది. ఏ ఒక్క ఆలోచనా, కడవరకూ సాగదు. ఉద్రేకపూరిత భావనలు, మనస్సును అల్లకల్లోలం చేస్తాయి. అస్థిరమైన మనస్సు, కార్యసాధనకు ఆటంకమవుతుంది. మనస్సును వశం చేసుకున్నవాడు, విశ్వవిజేత అవుతాడని, బుద్ధుడి మాట. విశ్వామిత్రుడు మనోస్థిరత్వాన్ని సాధించలేకపోయాడు. మేనకాధీనుడై, చిరకాలం దీనుడిగా మిగిలిపోయాడు. ఊర్వశిని త్యజించిన అర్జునుడు, మనస్సుపై విజయం సాధించాడు. విజయుడిగా స్థిరపడ్డాడు. కార్య సఫలతకు కృషి చేసే సాధకుడు, మనో నిబ్బరాన్ని అలవరచుకోవాలి. సమయానుకూలంగా మనస్సును అధీనంలోకి తెచ్చుకోవడం కోసం, ధ్యాన సాధన చేయాలి.
అహంకారం, అవరోధాలకు కారణమవుతుంది. లక్ష్యసాధనకోసం పురోగమించే వ్యక్తి, అహంకార రహితుడు కావాలి. అధికారం, అహంకారం, మమకారం, మత్తు కన్నా ప్రమాదకరమైనవి. ‘నేను వదిలి రా, నేను కనబడతాను’ అంటాడు, భగవంతుడు భక్తుడితో.. తీవ్రమైన ఆటంకాల వరద ముంచెత్తుతున్నప్పుడు, మహావృక్షంలా, అహంకరించినవాడు, కూకటి వేళ్లతో సహా కూలిపోతాడు. సమయానుకూలంగా, గడ్డిపోచల మాదిరిగా తలదించుకు నిలచిన వ్యక్తి, ఆపదల నుంచి గట్టెక్కుతాడు. కఠినమైన టెంకాయను గుడిలో పగలగొట్టడం, అహంకార నిర్మూలన చేయమన్న భక్తుడి వేడికోలుకు, ప్రతీక..
మనిషి తన జీవిత కాలంలో, గొప్ప కార్యాలెన్నో తలపెడతాడు. విజయం వరించినా, లేకపోయినా, పరాజయం మాత్రం, కచ్చితంగా నిర్ధారితమై ఉంటుంది. ఓటములకు లోనై, అలసట చెందిన మనిషి, అంతర్గతంగా మనస్సు చెప్పే మాటలను ఆలకించాలి. పరాజయాలకు కారణాలను విశ్లేషించుకోవాలి. సమయానుకూలమైన నిర్ణయాలను, స్వాగతించాలి. నరికిన మోడు నుంచి, చిగురించిన పచ్చని మొక్కలా, తనను తాను మలుచుకోవాలి.
సాధకుడి విజయాలకు పరమార్థం, వ్యక్తిగత ప్రగతి మాత్రమే కాదు. సమాజ పురోగతి సైతం, అందులో అంతర్లీనమై ఉంటుంది. సమాజ సహకారం, తోడ్పాటూ లేనిదే, ఏ వ్యక్తీ ఉన్నతుడిగా ఎదగలేడు. లక్ష్య సాధన చేసిన వ్యక్తి, విజయ శిఖరాలను అందుకున్న తరుణంలో, విశాల దృక్పథాన్ని ప్రదర్శించాలి. పంచభూతాలూ, విశ్వమంతా ఆవరించిన ప్రకృతీ నేర్పే విలువైన పాఠం, మనిషిని విశాలదృక్పథుడిగా మార్చడమే..
ఇందుకు సరైన ఉదాహరణ, ‘భూమి అట్టడుగు పొరల్లో పడి ఉన్న నన్ను, ఇంత ఎత్తుకు పెంచిన రైతుకు ఏమివ్వగలను? సమయానుకూలతను బట్టి, ధాన్యరూపంలో నన్ను నేను అర్పించుకోవడం తప్ప..’ అనుకుని, పంటసిరి మురిసిపోతుంది!
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment