శ్రీకాళహస్తీశ్వరా.. మూడు మూగజీవాల ముందు జన్మల వృత్తాంతం! Srikalahasti


శ్రీకాళహస్తీశ్వరా.. మూడు మూగజీవాల ముందు జన్మల వృత్తాంతం!

శ్రీకాళహస్తి క్షేత్రం పేరు వినగానే, అందరికీ వెంటనే గుర్తుకువచ్చే వివరణ, శ్రీ–కాళ–హస్తిల ద్వారా ఆ క్షేత్రానికి ఆ పేరొచ్చిందని. శ్రీకాళహస్తీశ్వరుణ్ణి నిష్టతో పూజించిన మూడు మూగజీవాల సమ్మేళనంతో, శ్రీ–కాళ–హస్తి పేరు వచ్చిందని, ప్రచారంలో ఉన్న కథలను బట్టి తెలుస్తుంది. కానీ, ఆ మూడు మూగజీవాల పేరుమీద ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం వెలసింది అంటే, అవి గత జన్మలలో చేసుకున్న పుణ్యం ఏమిటి? అసలు వాటి కథ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకోవడానికి, ఈ వీడియోను చివరిదాకా చూడండి..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jowSOoSQksI ]

'శ్రీ' అంటే సాలీడు.. పూర్వం ఊర్థ్వనాధుడనే దివ్యలోక శిల్పి ఏదో తప్పిదం చేయగా, అతనిని భూలోకంలో సాలీడుగా జన్మించమని, బ్రహ్మ శపించాడు. దాంతో ఊర్థ్వనాధుడు సాలీడుగా జన్మించి, దక్షిణకైలాసం అంటే, ప్రస్తుత కాళహస్తి ప్రాంతంలోని మారేడువనంలో గూడు కట్టుకుని జీవిస్తూ, అక్కడ వెలసిన శివలింగాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తూ, శివలింగం చుట్టూ శరీర దారాలతో, ప్రాకారాలను నిర్మించేవాడు. అతడి భక్తిని పరీక్షించదలచిన పరమశివుడు ఒకరోజు, ఆ దారాల ప్రాకారాలని అఖండదీపంతో దహింపజేశాడు. దానిని చూసి చలించిపోయిన సాలీడు, శివుని పై భక్తితో ఆ దీపాన్నే మింగబోతూ, తనను తాను ఆత్మార్పణ చేసుకోబోయింది. దీంతో ముగ్ధుడైన పరమేశ్వరుడు, సాలీడుని కటాక్షించాడు. ఏం వరం కావాలో కోరుకోమనగా, దక్షిణకైలాస పురానికి ముందు 'శ్రీ' అనే అక్షరం ఉండేలా వరం పొంది, సాలీడు రూపంలో ఉన్న ఊర్థ్వనాథుడు, శివైక్యం చెందాడు.

'కాళ' అంటే సర్పము.. ఈ కాళం, పూర్వజన్మలో బ్రాహ్మణుడు. ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి, వేదవిద్యలను అభ్యసించి, హిమాలయ పర్వత గుహల్లో నివసిస్తుండే వాడు. అయితే, రత్నాలచే శివుని పూజించిన వారు, సర్వపాపాల నుంచీ విముక్తిని పొందుతారని ఒక గంధర్వుడు చెప్పడంతో, తక్షణమే శరీరం వదలి, నాగుపాముగా జన్మించి, దక్షిణ కైలాసానికి చేరి, అక్కడున్న వాయులింగాన్ని ప్రాతః కాలంలో, మణులతో పూజించడం ప్రారంభించాడు.

'హస్తి' అంటే ఏనుగు.. ఈ హస్తి కూడా పూర్వజన్మలో, మలయ పర్వత ప్రాంతంలో, శోత్రీయ కుటుంబంలో జన్మించినవాడు. వేదాలను అభ్యసించే సమయాన, వ్యాధి పీడితుడు కావడంతో, శివరాత్రి పర్వదినాన ఉపవాస దీక్షను ఆచరించి, జాగరణ చేసిన భక్తుడు. ఇతడు కొంతకాలానికి మరణించి, ఏనుగుగా జన్మించి, దక్షిణ కైలాసానికి చేరి, శివలింగానికి తొండంతో తెచ్చిన నీటితో అభిషేకించి, కమల పుష్పాలతో పూజించడం మొదలు పెట్టాడు.

సర్పం శివ లింగంపై అభిషేకించిన మణులను, మధ్యాహ్న సమయంలో ఏనుగు తొలగించి, నీటితో అభిషేకించి, కమలార్చన చేసేది. మరునాడు ప్రాతః కాలంలో పూజకు వచ్చిన సర్పం, పువ్వులను తొలగించి, మణులతో అభిషేకించేది. అయితే, ఎవరో పూజా భంగం చేస్తున్నారని భావించిన సర్పం, ఒక నాడు శివలింగానికి వెనుక భాగాన దాక్కుని గమనిస్తుండగా, ఏనుగు వచ్చి మణులను తొలగించడం చూసింది. వెంటనే కోపంతో, అది ఏనుగు తొండంలోకి ప్రవేశించింది. బాధను భరించలేక, హస్తి తన తొండాన్ని మోదుకుంది. దాంతో, రెండూ శివైక్యం చెందాయి. వీరి భక్తికి మెచ్చిన శివుడు, వారిరువురినీ వరం కోరుకోమనగా, వాయులింగంతో పాటు, తామూ ప్రసిద్ధి చెందాలని, కోరుకున్నాయి. అప్పటి నుంచీ, సాలీడు పేరున శ్రీ, సర్పం పేరున కాళ, ఏనుగు పేరున హస్తి కలిసి, ‘శ్రీ–కాళ–హస్తి’ పేరిట, శైవ క్షేత్రం వెలసింది.

ఇక శ్రీకాళహస్తిలో తొలిపూజను అందుకునే భక్త కన్నప్ప వృత్తాంతమిది.. పూర్వం కణ్ణడనే కోయవాడు, దివ్య కైలాస శిఖరారణ్యంలో తిరుగుతూ, వాయులింగాన్ని ప్రతిరోజూ బిల్వదళాలతో పూజించి, జంతువులను వేటాడి తెచ్చిన మాంసాన్ని, నైవేద్యంగా సమర్పించేవాడు. ఒకరోజు అతడి భక్తికి పరీక్ష పెట్టిన పరమశివుడు, కణ్ణడు పుక్కిట జలంతో అభిషేకిస్తున్న సమయంలో, శివలింగం కంటి నుంచి నీరు కారేవిధంగా చేశాడు. శివుని కంట నీరు కారడం గమనించిన కణ్ణడు, తన తప్పిదం వల్లే అలా జరిగిందని భావించి, తన కన్నును అమ్ములపొదిలోని బాణంతో తీసి, శివుని కన్నుగా అమర్చాడు. దీంతో ఆ కంటినుండి నీరు కారడం ఆగిపోయి, మరో కంటినుంచి కారడం ఆరంభం కావడంతో, తన రెండవ కంటిని కూడా బాణంతో తీయబోతుండగా, కణ్ణడి పరమ భక్తికి పరవశించిపోయిన శివుడు ప్రత్యక్షమై, కణ్ణడిని కన్నప్పగా పేర్కొని, మోక్షాన్ని ప్రసాదించాడు. అంతేకాదు, ఆ భక్త కన్నప్పను దర్శించినా, ఆ పరమ భక్తుడి చరిత్రను విన్నా, పఠించినా, సర్వపాపాలూ తొలగి, అంత్యకాలంలో కైలాసప్రాప్తి పొందుతారని పలికి, పరమశివుడు అంతర్థానమయ్యాడు. ఆనాటి నుంచీ, పరమశివుని తొలి భక్తుడైన భక్త కన్నప్పకు, స్వామివారి కన్నా ముందే తొలిపూజ చేయడం, ఆచారంగా వస్తోంది. ప్రతియేటా స్వామివారి బ్రహ్మోత్సవాల సమయంలోనూ, భక్త కన్నప్ప కొండపై తొలుత ధ్వజారోహణం చేసిన తర్వాత, మరుసటి రోజు స్వామివారి ధ్వజారోహణం చేసి, బ్రహ్మోత్సవాలను ప్రారంభిస్తారు.

ఓం నమః శివాయ!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes