కురుక్షేత్ర యుద్ధం ధర్మబద్ధంగానే జరిగిందా? అన్న భీష్ముడి సందేహానికి కృష్ణుడి సమాధానం! Lord Krishna About Dharma


కురుక్షేత్ర యుద్ధం ధర్మబద్ధంగానే జరిగిందా? అన్న భీష్ముడి సందేహానికి కృష్ణుడి సమాధానం!

కురుక్షేత్ర రణభూమిలో పోరాడిన ఎంతో గొప్ప యోధులలో, కల్మషం లేని మహాపురుషుడు భీష్ముడు. గంగాదేవి, శంతనుల పుత్రుడైన భీష్ముడు, సత్యవర్తనుడు. అరి వీర పరాక్రమవంతుడు. భారత యుద్ధం ప్రారంభించిన పది రోజుల వరకూ భీష్ముడు యుద్ధం చేసి, పితృదేవతా నక్షత్రమైన అశ్వినీ నక్షత్రం రోజున నేలకూలాడు. తాను కోరుకున్న సమయంలో మరణించే వరం ఉండటం చేత, ఉత్తరాయణం వచ్చే వరకూ వేచి ఉన్నాడు. ఆ సమయంలో, ధర్మరాజుకు అనేక విషయాలను బోధించాడు. రాజనీతి గురించి అనేక ఉపమానాలను వివరించాడు. వాటిలో కొన్ని కథలను ఇదివరకూ మనము వీడియోలు చేశాము. చూడని వారి కోసం ఆ links, క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరుస్తాను. అయితే, ఈ రోజుటి మన వీడియోలో, భీష్ముడు తన మరణానికి ముందు, శ్రీ కృష్ణుడిని అడిగిన ప్రశ్నలేంటి? భీష్ముడు మరణించే ముందు ఏం జరిగింది - అనేటటువంటి ఆసక్తికర విషయాలను తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/QFl3PLQjEBc ]

మహాభారత యుద్ధం సమాప్తమయ్యింది. యుద్ధభూమిలో యోధుల విగత శరీరాలూ, విరిగిన అస్త్రాలూ, కవచాలూ, రథాలూ, విడిపడిన రథచక్రాలతో, ఆ ప్రాంతమంతా నిశ్శబ్దం ఆవహించి ఉంది. భీష్ముడి నిర్యాణం సమీపించగా, శ్రీ కృష్ణుడు అక్కడకు చేరుకున్నాడు. ఆయన రాక కోసమే ఎదురుచూస్తున్న భీష్ముడు, భగవానుడిని చూడగానే, ఎంతో సంతోషించాడు. భీష్ముడి ఎదురుచూపులో కారణముంది. తన మదిలో మెదులుతున్న ప్రశ్నలకు సరైన సమాధానాలను శ్రీ కృష్ణుడిని అడగడానికి వేచిచూస్తున్నాడు. ముందుగా పాండవుల మంచి చెడ్డల గురించి సంభాషించాడు. తదుపరి తనకు కలిగిన సందేహాలను నివృత్తి చేయమని, భగవానుడిని వేడుకున్నాడు. ‘నీవు సర్వ లోకాలకూ ప్రభువైన ఆ నారాయణుడవని నాకు తెలుసు కృష్ణా.. కానీ, నేను తెలుసుకోవలసిన విషయం ఒకటి ఉంది. విశ్వమంతా, మహాభారత యుద్ధాన్ని అర్జునుడూ, భీముడూ గెలిపించారని అనుకుంటున్నారు. కానీ, నాకు తెలుసు కృష్ణా.. ఇది కేవలం నీ ఒక్కడి విజయం. నీ వల్లనే పాండవులు విజయాన్ని పొందారు. పాండవులు నిమిత్తమాత్రులు మాత్రమే.. మొత్తం చేసింది నువ్వే.. ధర్మ ప్రభువుగా, గతంలో శ్రీరాముడిగా అవతరించి, లోకంలో పూజ్యనీయుడవయ్యావు. మరి మహాభారత యుద్ధంలో జరిగినదంతా ధర్మమేనంటావా? ధర్మజ్ఞులయిన పాండవులు, ద్రోణాచార్యుడిని వంచించి, దుర్యోధనుడిని తొడలపై కొట్టి, దుశ్శాసనుణ్ణి వక్షస్థలం చీల్చి, సైంధవుణ్ణి మోసం చేసి, కర్ణుడు నిరాయుధుడిగా ఉన్నప్పుడు తనపై బాణాలు వేసి, ఇలా చంపడం, ఇదంతా ధర్మంగానే జరిగిందా? నీవు తీసుకున్న నిర్ణయాలు, రాబోయే తరాల వారికి అనుసరణీయమేనా? దయచేసి సెలవివ్వండి భగవాన్..’ అని వేడుకున్నాడు..

అందుకు శ్రీ కృష్ణుడు చిరు మందహాసంతో, ‘మన ధర్మాన్ని ఇతిహాసాల నుండి నేర్చుకొవడం జరుగుతుంది. కానీ, మన నిర్ణయాలు మాత్రం, వర్తమానానికి తగ్గట్లు తీసుకోవాలి. ప్రతీ యుగంలో, వాళ్లకు తగ్గట్లుగా, వాళ్ళ నాయకుడిని ఎన్నుకోవడం జరుగుతుంది. రాముడు త్రేతాయుగంలో నాయకుడిగా ఉన్నాడు. ఇప్పుడిది ద్వాపరయుగం. మా ఇద్దరి నిర్ణయం ఒకే లాగా ఉండదు. రాముడున్న యుగానికీ, కృష్ణుడున్న యుగానికీ, చాలా తేడా ఉంది పితామహా. రాముడున్న కాలంలో, రావణుడి లాంటి శివభక్తుడు ఉండేవాడు. రావణుడు రాక్షసుడే అయినప్పటికీ, ఆయన దగ్గర విభీషణుడూ, కుంభకర్ణుడి లాంటి సత్పురుషులు కూడా ఉండేవారు. వాలి లాంటి చెడ్డ వాడికి కూడా, అంగదుడి లాంటి మంచి పుత్రులు జన్మించారు. ఆ యుగంలో చెడ్డవారూ, రాక్షసులు కూడా, ధర్మాన్ని కాపాడే వారు. అందుకే రాముడు, తను ధర్మాన్ని తప్పకుండా ఉండగలిగాడు. ఇక నా యుగంలో, కంసుడూ, జరాసంధుడూ, దుర్యోధనుడూ, దుశ్శాసనుడూ, శకునీ, జయద్రధుడి లాంటి పాపులున్నారు. వారు ధర్మాన్ని లెక్కచేయకుండా, ఎన్నో పాపాలు చేశారు. పాపం ఏనాటికైనా అంతమవుతుంది.. దానిని ఎవరూ తప్పించలేరు. అది ఏ రూపంలో నైనా అంతం కావలసిందే. భవిష్యత్తు ఇంతకన్నా ఘోరంగా ఉంటుంది. కలియుగంలో, కృష్ణుడి కన్నా ఇంకా కఠినంగా ఉండాలి. క్రూరులూ, దుష్టులూ, అనైతిక శక్తులూ, ధర్మాన్ని నాశనం చేయడానికి ముందుంటారు. అలా జరిగితే, నైతికత అంతం అవుతుంది. మన ధర్మాన్ని కాపాడుకోవడమే, ఏ యుగంలోనైనా మనకి ముఖ్యం. అదే, అన్ని తరాలూ నేర్చుకోవలసింది. అంతా భగవంతుడిపై భారం వేసి కూర్చోవడం, మూర్ఖత్వం. భగవంతుడు తనకు తానుగా, స్వయంగా ఏమీ చేయడు. మనుషులే చేయాలి. నేను భగవంతుడినే అయినా, యుద్ధంలో నేను పాల్గొనలేదు. ఏ ఒక్కరినీ నా ఆయుధంతో, నేనుగా సంహరించలేదు. అంతా పాండవులే చేశారు. నేను వారి పక్షాన నిలబడ్డాను. అదే ప్రకృతి యొక్క ధర్మం. నేను ఇదే విషయాన్ని, అర్జునుడికి యుద్ధం మొదటి రోజునే చెప్పాను. ఇదే పరమ సత్యం. ధర్మో రక్షతి రక్షితః’ అని భీష్ముడికి హితబోధ చేశాడు కృష్ణ భగవానుడు. ఈ మాటలు విన్న భీష్ముడి మదిలో ఉన్న సందేహాలన్నీ తొలగిపోయి, ప్రశాంత చిత్తుడై నిద్రించాడు.

మరునాడు ఉదయం, కృష్ణుడూ, పాండవులూ, గాంధారీ, ధృతరాష్ట్రుడూ, కుంతీ దేవీ, విదురుడూ, సంజయుడూ, యుయుత్సుడూ, ధౌమ్యుడూ మొదలగువారందరూ, నూతన వస్త్రాలూ, చందనం, అగరు వంటి సుగంధ ద్రవ్యాలను తీసుకుని, భీష్ముడి వద్దకు వెళ్లారు. ధర్మరాజు భీష్ముడితో, 'పితామహా! నేను ధర్మతనయుడిని వచ్చాను. ఉత్తరాయణం వచ్చింది. మీకు కావలసిన సామగ్రిని సిద్ధం చేశాను. మీ దగ్గరకు అందరూ వచ్చారు. కళ్లు తెరవండి.' అని ప్రార్థించాడు. భీష్ముడు మెల్లగా కళ్లు తెరిచి,  ధృతరాష్ట్రుడికీ, పాండవులకీ ప్రేమ పూర్వక మాటలు చెప్పి, 'నా మరణం ఆసన్నమయ్యింది.. దయ చూపించు కృష్ణా' అని ఆయనను వేడుకున్నాడు. అప్పుడు కృష్ణుడు తన మాయతో, కేవలం భీష్ముడికి మాత్రమే, శంఖ చక్ర గదా పద్మాలతో, శ్రీ మహా విష్ణువుగా సాక్షాత్కరించాడు. ఆయన రూపాన్ని చూస్తూ పరవశించి, ఆయనను స్తుతించాడు భీష్ముడు. ఇక అందరి దగ్గరా సెలవు తీసుకుని, కళ్లు మూసుకుని, మౌనం వహించాడు. యోగధారణతో, జీవాత్మను పరమాత్మతో అనుసంధానం చేసి, ఒక్కో అవయవం నుండీ ప్రాణాలను వెనక్కు తీసుకున్నాడు. ఆ సంఘటనను చూస్తూ, అక్కడి వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ సమయంలోనే, భీష్ముడి జీవాత్మ, మూర్ధమును చీల్చుకుంటూ, ఒక ఉల్కవలె ప్రకాశిస్తూ, ఆకాశంలోకి కొంతవరకూ వెళ్లి, మాయమైపోయింది. ఆ విధంగా, భీష్ముడు స్వర్గానికి చేరుకున్నాడు.

భీష్ముడి అంతిమ సంస్కారాలు ఘనంగా నిర్వహించారు. తన కుమారుడి మరణానికి, గంగా దేవి ఎంతో రోదించింది. వీరుడూ, అరి వీర పరాక్రమవంతుడూ అయిన భీష్ముడు, శిఖండి చేతిలో మరణించడాన్ని, గంగా దేవి జీర్ణించుకోలేకపోయింది. ఆమెను వేదవ్యాసుడు ఓదార్చాడు. భీష్ముడు తిరుగులేని వీరుడు. అతనిని శిఖండి ఓడించలేదు. నీ కుమారుడే, తన శరీరంలో బాణములు నాటించుకుని, శరతల్పగతుడై, తనకు తానుగా మరణాన్ని ఆహ్వానించి, స్వర్గస్థుడయ్యాడు. భీష్ముడి గురించి నీవు చింతించడం తగదు తల్లీ, అని హితోక్తులతో, ఆమెను శాంతింపజేశాడు. అక్కడ వేదోక్త కార్యక్రమాలు పూర్తయ్యాక, అందరూ సెలవు తీసుకుని, కురుక్షేత్రాన్ని విడిచివెళ్లారు. భారతంలో, కృష్ణ భగవానుడి నిజ రూపాన్ని దర్శించుకుని, తన శాప విముక్తిని పొంది, తిరిగి బ్రహ్మ కుమారుడు వసువుగా మారాడు భీష్ముడు.

కృష్ణం వందే జగద్గురుం! ‘ధర్మో రక్షతి రక్షితః’

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes