మనిషికి భగవంతుడి పరీక్ష! భగవంతుడే కష్టాన్ని లోకంలో ఎందుకు ఏర్పాటు చేశాడు?
'భగవద్గీత' షష్ఠోఽధ్యాయం - ఆత్మ సంయమ యోగం (28 – 33 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో ఆరవ అధ్యాయం, ఆత్మ సంయమ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, ఆత్మసంయమయోగంలోని 28 నుండి 33 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/pBbz4VFU4Qk ]
భగవంతుడు పరిపూర్ణ యోగులుగా ఎవరిని పరిగణిస్తారో వివరిస్తున్నాడు..
యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః ।
సుఖేన బ్రహ్మసంస్పర్శ మత్యంతం సుఖమశ్నుతే ।। 28 ।।
స్వీయ-నిగ్రహం కలిగిన యోగి, ఆత్మను భగవంతునితో ఏకం చేసి, భౌతిక మలినముల నుండి స్వేచ్ఛను పొందుతాడు. ఎల్లప్పుడూ పరమాత్మతో సంయోగంతో ఉండుటచేత, సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని చేరుకుంటాడు.
ఆనందము అనేదానిని, నాలుగు రకాలుగా వర్గీకరించవచ్చు:
1. తామసిక ఆనందం: ఇది మాదకద్రవ్యాలూ, మద్యమూ, ధూమపానమూ, మాంసాహారమూ, హింసా, నిద్రా మొదలైన వాటి నుండి వచ్చే ఆనందం.
2. రాజసిక ఆనందం: ఇది మనస్సూ మరియు ఐదు ఇంద్రియముల తృప్తి నుండి వచ్చే ఆనందం.
3. సాత్త్విక ఆనందం: ఇది కరుణా, ఇతరులకు సేవా, జ్ఞాన సముపార్జనా, మనోనిగ్రహము వంటి సద్గుణములు ఆచరించటంతో వచ్చే ఆనందము. జ్ఞానులు తమ మనస్సుని ఆత్మ యందే నిమగ్నం చేసినప్పుడు అనుభవించే ఆత్మ సాక్షాత్కార ఆనందం, ఈ కోవకు చెందినదే.
4. నిర్గుణ ఆనందం: ఇది భగవంతుని దివ్య ఆనందము. ఇది పరిమాణంలో, అనంతమైనది. ప్రాపంచిక, భౌతిక మాలిన్యం నుండి స్వేచ్ఛను పొంది, భగవంతునితో ఏకమైన యోగి, సంపూర్ణ ఆనందం యొక్క అత్యున్నత స్థాయిని పొందుతాడు.
సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ।
ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః ।। 29 ।।
నిజమైన యోగులు, అంతర్బుద్ధిని భగవంతుని యందే ఏకం చేసి, సర్వ భూతములనూ భగవంతుని యందు, మరియు భగవంతుడిని సర్వ భూతములయందూ దర్శిస్తారు.
ప్రతి వస్తువులోనూ, తన వేరు వేరు శక్తుల రూపంలో ఉన్నది, భగవంతుడే. ఎలాగైతే సూర్యుడు ఒకే చోట ఉండి, తన వెలుగుని అన్ని దిక్కులా ప్రసరిస్తాడో, అదే విధంగా, భగవంతుడు తన ఎన్నో శక్తుల చేత, అన్నిటియందూ నిండి, నిబిడీకృతమై, వాటిని నిలిపి నిర్వహిస్తుంటాడు. పరిపూర్ణత సాధించిన యోగులు, అంతర్గతంగా విచ్చుకున్న విజ్ఞాన ప్రకాశంలో, ప్రతిదానినీ, భగవత్ సంబంధముగా చూస్తారు.
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి ।
తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి ।। 30 ।।
ఎవరైతే నన్ను అంతటా దర్శిస్తారో, అన్నిటినీ నా యందే దర్శిస్తారో, వారు నన్ను కోల్పోరు, నేను వారిని కోల్పోను.
భగవంతుడిని వీడటం అంటే, మనస్సుని అయన నుండి దూరంగా తిరగనీయటం. ఆయనతో ఉండటం అంటే, మనస్సుని ఆయనతో ఏకం చేయటం. మనస్సుని భగవంతునితో ఏకం చేయటానికి, ఒక సులువైన మార్గం ఏమిటంటే, ప్రతి విషయాన్నీ, ఆయనతో సంబంధంగా చూడటమే. ఉదాహరణకి, మనల్ని ఎవరైనా బాధపెడితే, మనస్సు యొక్క స్వభావం ప్రకారం, వారి పట్ల అది ద్వేషం, కోపం వంటి వాటిని పెంచుకుంటుంది. కానీ, అలా అవ్వనిస్తే, మన మనస్సు దివ్య జగత్తు నుండి బయటకు రావటంతో, భగవంతునితో మన మనస్సు యొక్క భక్తి యుక్త సంయోగం, ఆగిపోతుంది. దానికి బదులుగా, ఆ వ్యక్తిలో కూర్చుని ఉన్న పరమాత్మను దర్శించగలగాలి. మన మనస్సుకు మనమే సర్దిచెప్పుకోవాలి. “భగవంతుడు నన్ను ఈ వ్యక్తి ద్వారా పరీక్షిస్తున్నాడు, ఆయన నా సహన శీలతను పెంచుకోమని ఉపదేశిస్తున్నాడు, అందుకే ఆ వ్యక్తిని నాతో కఠినంగా ప్రవర్తించమని ప్రేరేపిస్తున్నాడు. అందుకే, ఈ సంఘటన నన్ను కలచివేయకుండా చూసుకుంటాను.” ఈ విధంగా ఆలోచిస్తే, మన మనస్సుని చెడురకపు ఆలోచనలు బాధించకుండా, కాపాడుకోవచ్చు. అదే విధంగా, మిత్రునితో కానీ, లేదా బంధువుతో కానీ అనుబంధం ఏర్పడినప్పుడు, మనస్సు భగవంతుని నుండి వేరైపోతుంది. కొన్నిసార్లు మనస్సు పాత విషయాలపై చింతిస్తూ ఉంటుంది. ఇది కూడా మనస్సుని భగవత్ సన్నిధి నుండి వేరు చేస్తుంది. ఎందుకంటే, ఈ శోకము మనస్సుని భూతకాలము లోనికి తీసుకువెళ్ళటం వలన, వర్తమాన కాలంలో చేయవలసిన హరి, గురు చింతన ఆగిపోతుంది. అలా కాకుండా, ఆ సంఘటనని భగవత్ సంబంధముగా చూసినప్పుడు, ఇలా అనుకోవాలి.. “భగవంతుడు కావాలనే నా కోసం, నేను వైరాగ్యం పెంపొందిచుకోవాలని, కష్టాన్ని లోకంలో ఏర్పాటు చేశాడు. ఆయనకు నా సంక్షేమం మీద ఎంత ఆసక్తి అంటే, తన కృపచేత, నా ఆధ్యాత్మిక పురోగతి కోసం సరియైన పరిస్థితులను కల్పిస్తూ ఉంటాడు.” ఈ విధంగా ఆలోచించటం వలన, మనం భక్తి యుక్త ధ్యాసను కాపాడుకోవచ్చు.
సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః ।
సర్వథా వర్తమానోఽపి స యోగీ మయి వర్తతే ।। 31 ।।
నా యందే ఏకత్వంతో స్థితుడై ఉండి, నన్నే సర్వ భూతముల యందూ స్థితుడై ఉన్న పరమాత్మగా ఆరాధించిన యోగి, అన్ని రకాల కార్య కలాపములూ చేస్తున్నా, నా యందే నివసించును.
భగవంతుడు ఈ జగత్తులో సర్వ వ్యాపి. ఆయన ప్రతిప్రాణి హృదయములో, పరమాత్మ రూపంలో కూర్చుని ఉన్నాడు. ప్రతి ఒక్క ప్రాణి శరీరంలో, రెండు వ్యక్తిత్వాలు ఉన్నాయి - ఆత్మ మరియు పరమాత్మ. భౌతిక దృక్పథంతో ఉన్నవారు, ప్రతి వారినీ శరీరముగా చూస్తారు. జాతీ, కులం, లింగం, వయస్సు, సామాజిక స్థాయివంటి వాటి ఆధారంగా, వేరు వేరుగా చూస్తారు. ఉన్నతమైన దృక్పథం కలవారు, ప్రతి వారినీ ఆత్మగా చూస్తారు. ఉన్నతమైన యోగులు, ఇంకా పై స్థాయిలో ఉన్న దృక్పథంతో, అందరిలో పరమాత్మగా స్థితుడై ఉన్న భగవంతుడినే చూస్తారు. వారు హంస లాంటి వారు. అవి పాలు-నీరు మిశ్రమంలో, పాలనే తీసుకుని, నీటిని విడిచి పెడతాయి. అత్యునత స్థాయి యోగులను, 'పరమ హంస'లు అంటారు. వారు భగవంతుడినే దర్శిస్తారు. వారికి ఈ ప్రపంచ స్పృహ ఉండదు.
ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోఽర్జున ।
సుఖం వా యది వా దుఃఖం స యోగీ పరమో మతః ।। 32 ।।
సర్వ ప్రాణులనూ సమానముగా దర్శిస్తూ, ఇతరుల సుఖాలూ, దుఃఖాలూ, అవి తనకే అయినట్టు స్పందించేవారిని, పరిపూర్ణ యోగులుగా పరిగణిస్తాను.
మన శరీర అవయవాలన్నీ, మనవే అనుకుంటాం. వాటిలో ఏ ఒక్కటి పాడయినా విచారిస్తాము. మన అంగములలో ఏ ఒక్కదానికి హాని జరిగినా, అది మనకు హాని జరిగినట్టే అన్న దృఢ విశ్వాసం కలిగి ఉంటాము. అదే విధంగా, అన్ని ప్రాణులలో భగవంతుడిని దర్శించే వారు, ఇతరుల సుఖ-దుఃఖాలను కూడా తమవాటిగానే భావిస్తారు. కాబట్టి, అటువంటి యోగులు, ఎల్లప్పుడూ సమస్త జీవాత్మల శ్రేయోభిలాషులే. వారు జీవుల శాశ్వత సంక్షేమం కోసం, పాటు పడతారు. ఇదే పరిపూర్ణ యోగుల సమ-దర్శనము.
అర్జున ఉవాచ ।
యోఽయం యోగస్త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ।
ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితిం స్థిరామ్ ।। 33 ।।
అర్జునుడు ఇలా అంటున్నాడు: ఓ మధుసూదనా, నీవు చెప్పిన ఈ యోగ విధానము, ఈ చంచలమైన మనస్సు వలన, నాకు ఆచరింపశక్యముకానిది, మరియు అసాధ్యమైనది అనిపిస్తున్నది.
మాధవుడు చెప్పిన యోగ విధానంలో ఉన్న ఈ విషయాలు, అర్జునుడికి కష్టంగా తోస్తున్నాయి.
-- ఇంద్రియములను నిగ్రహించుము..
-- అన్ని కోరికలనూ త్యజించుము..
-- మనస్సుని భగవంతుని పైనే నిమగ్నం చేయుము..
-- ఆయననే, అచంచలమైన మనస్సుతో స్మరించుము..
-- అందరినీ సమ దృష్టితో చూడుము..
ఇవి ఆచరించలేనివని అర్జునుడు నిర్మోహమాటంగా, తన సందేహాన్ని భగవానుడితో వ్యక్తం చేస్తున్నాడు. అయితే, ఈ విషయాలు, మనస్సుని నియంత్రించకుండా, సాధ్యము కావు. మనస్సు చంచలముగా ఉంటే, ఈ యోగ విషయములన్నీ కూడా, అసాధ్యమే అవుతాయి.
ఇక మన తదుపరి వీడియోలో, అర్జునుడి ప్రశ్నకు, మనస్సును ఎలా నియత్రించాలో, శ్రీకృష్ణుడి వివరణలో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment