యామునాచార్యుల దివ్య చరిత్ర! Lesser Known Facts about a Philosopher

 

యామునాచార్యుల దివ్య చరిత్ర!

వైష్ణవాన్ని బాగా ప్రాచుర్యంలోకి తెచ్చిన వారిలో మొదటివారు, శ్రీ యామునాచార్యులవారు. ఆయన సామాన్యశకం 916 లో జన్మించారు. వైష్ణవానికి ఆద్యులైన "నాదమునులు" వీరి తాతగారు. నాదమునులు అవసానకాలం సమీపించినప్పుడు, యామునుడి భవిష్యతు గురించి తెలుసుకుని, అతను దారి తప్పిన సమయాన, సన్మార్గం వైపు మరల్చమని, ఆ బాధ్యతను శ్రీరామ మిశ్రుడికి అప్పగించారు. నాద మునికి ప్రియ శిష్యుడైన శ్రీ పుండరీకాక్షుడి శిష్యుడు, ఈ శ్రీరామ మిశ్రుడు. వీర నారాయణ పురం మహారాజు గారికి, మహాభాష్య భట్టర్, రాజ గురువు. వారి దగ్గర యామునులు మీమాంస నేర్చుకునేవారు. ఆ రాజుగారి ఆస్థానంలో, అక్కిలవణ్ణన్ అనే అహంకారి అయిన విద్వాంసుడు, ఇతర విద్వాంసులను పోటీకి పిలిచి, ఓడించి, వాళ్ళ దగ్గర కప్పం వసూలు చేస్తుండేవాడు.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/tSho7h1tsq8 ]

అలా, యామునుల గురువుగారిని పోటీలో ఓడించి, కప్పం వసూలు చేసేవాడు. ఒక నాడు కప్పం కట్టించుకోవడానికి, రాజభటులు ఇంటికి వెళ్ళారు. ఆ సమయంలో గురువుగారు ఇంట్లో  లేకపోవడంతో, యామునులు విషయం తెలుసుకుని, గురువుగారికి జరిగిన అవమానానికి బాధపడి, వారికి ఎదురు తిరిగాడు. దాంతో అక్కిలవణ్ణన్, యామునులను ఆస్థానానికి పిలిపించి, రాజుగారి ముందు అవమానించాలనుకున్నాడు. ఆ విధంగానే, యామునులు రాజ సభకు వెళ్లి, పోటిలో పాల్గోన్నారు. అయితే, అదే సమయంలో మహా రాజూ, మహారాణిల మధ్య, సభలో చిన్న వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ రోజుటి సభలో, నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పిన వారికి, అర్థరాజ్యాన్ని ఇస్తానంటూ, మహారాజు ప్రకటించాడు. ఆ క్రమంలో మహారాజు, మూడు ప్రశ్నలు వేసి, అవి నిజం కావని నిరూపించమన్నాడు.

1. మీ తల్లి గొడ్రాలు కాదు!
2. మహారాజు ధర్మమార్గంలో నడిచే శక్తిమంతుడైన వాడు!
3. మహారాణి సావిత్రి లాంటి పతివ్రత!

ఇటువంటి సమాధానం చెప్పలేని తిరకాసు ప్రశ్నలు విని, అక్కిలవణ్ణన్ బిత్తరపోయాడు. తాను పుట్టాడు కనుక తల్లి గొడ్రాలు కాదు, రాజు ధర్మవర్తనుడు కాదూ, రాణి పతివ్రత కాదూ అని చెపితే, బ్రతికి బట్టకట్టడం కష్టం. అందుకే ఓటమిని అంగీకరించాడు అక్కిలవణ్ణన్. కానీ, యామునులు వాటికి సమాధానాలు చెప్పారు.

1. శాస్త్రప్రకారం, ఒకే గుడ్డు పెట్టిన కాకీ, ఒకే గెల వేసిన అరటిచెట్టూ, ఏమీలేని వాటికిందే లెక్కగట్టబడతాయి. అందుచేత, నన్ను ఒక్కణ్ణే కన్న తల్లి గొడ్రాలు కిందే లెక్క.

2. అక్కిలవణ్ణన్ లాంటి గర్విష్టీ, పొగరుమోతును తన ఆస్థానంలో ఉంచుకున్న మహారాజు, ధర్మమార్గంలో నడుస్తున్నట్టు కాదు. ఇతని గురించి తెలిసికూడా బయటకు పంపలేకపోయినందుకు, మహారాజు నిజంగా శక్తిహీనుడు.

3. శ్రుతి శాస్త్రాల ప్రకారం, వివాహతంతులో మొదట సోముడుకీ, గంధర్వుడికీ, అగ్నికీ ఇచ్చి వివాహం చేసిన తర్వాత, భర్త కాబోయేవ్యక్తితో వివాహం చేస్తారు. మహారాణి కూడా దీనికి విరుద్ధం కాదు కనుక, ఆవిడ పతివ్రత కాదు.

యామునుల సమాధానాలు విని ముచ్చటపడిన రాజ దంపతులు, అర్థరాజ్యంతో పాటు, రాజు గారి ఆఖరి సోదరినిచ్చి వివాహం జరిపించారు. యామునుడికి దివ్యాస్త్రాలకు సంబంధించిన మంత్రాలు తెలియడం వలన, రాజు అతనిని శత్రువుల మీదకు యుద్ధం చేయడానికి వెళ్లమని సూచించాడు. అయితే, మంత్రీ, పురోహితులూ, శరత్కాలంలో దండయాత్ర మంచిదని, సలహా ఇచ్చారు. అలా తగిన సమయం కోసం ఎదురుచూసిన యామునుడు, తన సైన్యంతో దండెత్తి, శత్రువులపై విజయం సాధించాడు. అలా వరుస యుద్ధాలు చేస్తూ, రాచకార్యాలలో నిమగ్నమై పోయాడు, యామునుడు. తన గురువు గారి మనవడైన యామునుడు, ఇహలోక బంధాలలో పడి, యోగ సామ్రాజ్యాన్ని మరచి, రాజ్య పాలనలో ఆసక్తి చూపించడం, శ్రీరామ మిశ్రునకు నచ్చలేదు.

అలా అని, ఇహలోక సుఖాల్లో మునిగిన యామునుడిని, ఆ సుఖాలను వదులుకోమంటే, కోరి పగ కొని తెచ్చుకోవడమే అవుతుంది. అందుకే నేర్పుగా, అతనిలో వైరాగ్యభావాన్ని పెంచాలని, పథకం వేశాడు. ముందుగా యామునుడిని కలవడానికి, ప్రయత్నించాడు. కుదరక పోవడంతో, ఈ భూమ్మీద ఆహార దోషమే, విజ్ఞానం నాశనం కావడానికి మూలకారణం అని ఆలోచించి, ముళ్లు రాని లేలేత పల్లేరు ఆకులను కోసి తెచ్చి, ఒక బ్రాహ్మణుడు కానుకగా ఇచ్చాడని చెప్పి, సేవకుల చేత యామునుడికి పంపించాడు. దానిని ఎంతో ఇష్టంగా వంట వారితో కూర వండించుకుని తిన్నాడు. అలా ప్రతి రోజూ జరిగేది. శ్రీరామ మిశ్రుడు ఆకుకూర పంపడం, ప్రతిరోజూ దానిని తినడం, యామునుడికి అలవాటుగా మారింది. ఒకనాడు ఆకు కూర పంపించే బ్రాహ్మణుడిని కలవాలనుకుని, అతనిని తీసుకురమ్మని, భటులను ఆదేశించాడు. తన పథకం ప్రకారం, యామునుడిని కలిశాడు శ్రీ రామ మిశ్రుడు.

యామునుడు ఆప్యాయంగా ఆదరించి, ‘మీరు ప్రతిరోజూ ఈ ఆకు కూరను పంపడం వెనుక ఉద్దేశ్యమేంటని’, ప్రశ్నించాడు. అందుకు శ్రీరామ మిశ్రుడు, ‘ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునే మీకు ఈ మాత్రం చేయడం నా ధర్మం’ అని బదులిచ్చాడు. దాంతో సంతోషించిన యామునుడు కానుకలను అందిచబోగా, శ్రీ రామమిశ్రుడు 'రాజా, నావంటి భక్తులకు కానుకలపై ఆశలేదు. మీకొక విషయం చెప్పాలి. మీ పెద్దలు భద్రపరిచిన నిధి ఒకటి, జంబూద్వీపంలో ఉంది. నిధులన్నీ రాజుల సొత్తే కనుక, మీకు తెలియజేస్తున్నాను. పడగలపై మణులు వెలుగొందగా, ఒక తెల్లని త్రాచుపాము దానిని చుట్టి ఉంటుంది. బలికి ఒప్పుకోదు, ప్రాణహింసకి ఆశపడదు. ఏకాగ్రదృష్టితో చూస్తేనే, అది కనిపిస్తుంది. ఆ నిధి తరగనిది.. అనంతమైనది.. మీరు ఒంటరిగా వస్తే, దానిని మీకు చూపించగలను' అంటూ, యామునుడికి ఆశచూపాడు. ఆ మాటలతో నిధిపై కోరిక కలిగిన యామునుడు, శ్రీరామ మిశ్రునితో బయలుదేరాడు. అతనితో పాటు శ్రీరంగానికి చేరుకుని, అక్కడ కావేరీ నదిలో స్నానం చేసి, శ్రీ రంగ నాధుడిని పూజించాడు.

ఆ తరువాత, నిధి ఎక్కడని శ్రీరామ మిశ్రుడిని అడుగగా, శ్రీ రంగ నాధుని పాదపద్మములు చూపించి, ఇదే ఆ తరగని నిధి అని చెప్పాడు, శ్రీరామ మిశ్రుడు. అంతటితో యామునుడు అకస్మాత్తుగా విభ్రాంతికి లోనయ్యాడు. తన పూర్వ దశను తలుచుకుని, ఇన్నాళ్లూ తను మాయలోపడి బ్రతికిన తీరుకు విరక్తి చెంది, శ్రీరామ మిశ్రుడిని, ఎవరు నీవు? అంటూ ప్రశ్నించాడు. మీ తాతగారైన నాదముని శిష్యుడికి, శిష్యుడను. అతడు భవిష్యత్తులో జరగబోయే నీ జన్మ విశేషాలను గ్రహించి, నువ్వు భోగాలలో మునిగి తేలేటప్పుడు, నిన్ను భగవంతుని దరికి చేర్చమని, మా గురువు గారికి మీ తాతగారు చెప్పగా, ఆ విషయం, ఆయన నాకు సెలవిచ్చారు. భవ బంధాలపై మోహాన్ని వదిలిన యామునుడు, శ్రీరామమిశ్రుడికి సాష్టాంగపడి నమస్కరించాడు. రాజ్యానికి తిరిగివచ్చి, తన కుమారుడికి రాజ్య బాధ్యతలను అప్పగించి, రాజనీతి వివరించి, తిరిగి శ్రీరంగానికి చేరుకుని, ఆ భగవంతుని సేవలో పరిపూర్ణుడయ్యాడు. వైష్ణవాన్ని వ్యాప్తి చేయడంలో ఖ్యాతి గడించారు, యామునాచార్యులు.

ఓం నమో భగవతే వాసుదేవాయ!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes