యమధర్మరాజుకు మాండవ్యుడిచ్చిన శాపం - విదురుడి గత జన్మ రహస్యం!
ధృతరాష్ట్ర, పాండవులకు సోదరుడిగా, అజాత శత్రువుగా పేరుగడించిన వీరుడు, విదురుడు. మహాభారతం, మంచి చెడుల గురించి వివరిస్తుంది. మంచి మనిషిగా, మానవత్వంతో, మంచి చెడుల విచక్షణ కలిగి ఎలా జీవించాలో, విదురుడు తెలయజేశాడు. అన్యాయం సహించని నైజం, విదురుడి సొంతం. మహా నీతిమంతుడిగా, అందరిచేత కొనియాడబడిన విదురుడు, ధృతరాష్ట్రుడికీ, కౌరవులకూ అనేక హితోక్తులు వివరించాడు. అవన్నీ విదుర నీతిగా ప్రసిద్ధి చెందాయి. ధృతరాష్ట్రుడు రాజుగా, విదురుడు మంత్రిగా, కౌరవ రాజ్యాన్ని సుభిక్షంగా పాలించారు. కానీ, దుర్యోధనుడి అహంకారం వలన, కౌరవ వంశం నాశనమయ్యింది.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ArOVU1TxUwI ]
ఈ విషయాన్ని దుర్యోధనుడు జన్మించినప్పుడు, అతని జాతకం చూసి ధృతరాష్ట్రుడిని హెచ్చరించాడు విదురుడు. కానీ ధృతరాష్రుడు, తన కొడుకు మీదున్న ప్రేమను వదులుకోలేకపోయాడు. విదురుడు ఎల్లప్పుడూ, న్యాయం పక్షానే నిలబడాలని ఆశించేవాడు. లక్క గృహం నుండి పాండవులు ప్రాణాలతో బయటపడడానికి కారణం, విదురుడే. అయితే, మన భారతంలో ఎంతో గొప్ప వ్యక్తిత్వమున్న వీరుడిగా పేరుగడించిన విదురుడు, ఒక దాసీకి కుమారుడిగా జన్మించడానికి కారణమేంటి? అసలు విదురుడు ఎవరు? ఎవరి శాపవశాన భూలోకంలో జన్మించాల్సి వచ్చింది? యమధర్మరాజుకీ, విదురుడికీ సంబంధమేమిటి - అనేటటు వంటి ఉత్సుకతను కలిగించే విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
శంతనుడి ద్వారా సత్యవతికి కలిగిన కుమారులు, చిత్రాంగదుడూ, విచిత్రవీర్యుడు. చిత్రాంగదుడు, ఒక గంధర్వరాజుతో జరిగిన యుద్ధంలో మరణించాడు. తరువాత రాజైన విచిత్రవీర్యునికి, కాశీరాజు కుమార్తెలైన అంబిక, అంబాలికలతో వివాహం జరిపించాడు భీష్ముడు. కానీ, విచిత్రవీర్యుడు కూడా అనారోగ్యంతో, వివాహమైన కొంతకాలానికే మరణించాడు. దాంతో, సత్యవతి చింతించి భీష్ముడితో, పెళ్లిచేసుకుని రాజ్యానికి వారసులనివ్వమని అడిగింది. కానీ, గతంలో తానిచ్చిన మాటకు కట్టుబడి, పెళ్ళి చేసుకోవడం కుదరదని చెప్పాడు, భీష్ముడు. గతంలో క్షత్రియ లోకాన్ని పరశురాముడు నాశనం చేసినప్పుడు, వారి భార్యలు ఉత్తములైన బ్రాహ్మణుల ద్వారా సంతానాన్ని పొందారు. అలానే సత్యవతి కూడా, తాను కన్యగా ఉన్నప్పుడు జన్మించిన వ్యాసుడిని పిలిపించి, తన కోడళ్లకు సంతానాన్ని కలిగించమని వేడుకుంది.
మహా తపస్వి అయిన వ్యాసుడు, తన కళ్ళ ద్వారా, అంబిక, అంబాలికలకు సంతానాన్ని ప్రసాదించాడు. అయితే అంబిక, నల్లగా, పొడుగ్గా, జడలతో, వికృతంగా కనిపించిన వ్యాసుడిని చూసి, భయంతో కళ్లు మూసుకుంది. అందుచేత, ఆమెకు పుట్టుగుడ్డివాడైన ధృతరాష్ట్రుడు జన్మించాడు. ఇక అంబాలిక, వ్యాసుడి అవతారాన్ని చూసి తెల్లబోయింది. అందుకే, పాలిపోయిన వర్ణం కలిగిన పాండు రాజు జన్మించాడు. వారసులను చూసి బాధపడిన సత్యవతి, మరొక సారి పెద్దకోడలైన అంబాలికను వ్యాసుడి దగ్గరకు వెళ్లమని, కోరింది. అది ఇష్టంలేని అంబాలిక, తన దాసీని, తనలా ముస్తాబుచేసి పంపింది. ఆ దాసీ, వ్యాసుడిని చూసి భయపడకుండా, అతనిని ఆరాధించింది. అలా ఆమెకు బుద్ధిశాలి అయిన విదురుడు జన్మించాడు. అయితే, విదురుడు దాసీకి జన్మించడానికి ఒక కారణం ఉంది. విదురుడి గత జన్మకు సంబంధించిన ఒక గాధ, భారతంలోని ఆదిపర్వంలో వివరించబడింది.
పూర్వం మాండవ్యుడనే ఒక మహాఋషి, ఊరి వెలుపల ఒక ఆశ్రమం కట్టుకుని, ప్రశాంతంగా తపస్సు చేసుకుంటూ జీవించేవాడు. ఒకరోజు, కొందరు దొంగలు రాజుగారి ధనాన్ని దొంగిలించి, సైనికులు వెంటపడగా, పరుగెత్తుకుంటూ అటుగా వెళ్లారు. అక్కడున్న మాండవ్యుడి ఆశ్రమం చూసి, అందులో దాక్కున్నారు. సైనికులు వచ్చి మాండవ్య మునితో, “అయ్యా, ఇటుగా ఎవరన్నా దొంగలు వచ్చారా” అని అడిగారు. మౌన వ్రతంలో ఉన్న మాండవ్యుడు, వారి ప్రశ్నకు జవాబు చెప్పలేదు. దాంతో సైనికులు ఆశ్రమంలోకి ప్రవేశించి, లోపల దాక్కున్న దొంగలను పట్టుకున్నారు. మాండవ్య మహా మునికి కూడా దొంగలతో సంబంధం ఉందని అనుమానించి, దొంగలతో సహా, మాండవ్య మహామునిని బంధించి, రాజుగారి ముందు నిలబెట్టారు. రాజుగారు, దొంగలకు మరణశిక్ష విధించాడు. అలాగే, సహాయం చేసినట్టు అనుమానిస్తున్న మాండవ్యుడిని, ఇనుప శూలం మీద కూర్చోబెట్టమని, శిక్షను విధించాడు. కానీ, మాండవ్యుడు భయపడకుండా, రాజుగారికి ఎదురుచెప్పకుండా, ఆ శిక్షను భరిస్తూ, తన తపస్సును కొనసాగించాడు.
ఒకరోజు రాత్రి, కొంతమంది మహాఋషులు, పక్షుల రూపంలో వచ్చి మాండవ్యుని చూసి, “ఓ మహర్షీ, మహానుభావుడవైన నీకు, ఈ శిక్ష వేసిన వారెవరు?” అని అడిగారు. దానికి మాండవ్యుడు నవ్వి, “నా పూర్వ జన్మ పాప ఫలాన్ని అనుభవిస్తున్నాను. నా ఈ పరిస్థితికి మరొకరిని నిందిచాల్సిన పనిలేదు” అని అన్నాడు. అయితే, ఈ విషయం అక్కడ కాపలా ఉన్న భటులు విని, రాజుకు చెప్పారు. వెంటనే మహారాజు కారాగారానికి వెళ్లి, మాండవ్యుని కిందికి దించమని ఆజ్ఞాపించాడు. కానీ, ఆ శూలం అతని శరీరం నుండి వెలుపలికి రాలేదు. దాంతో, చేసేదేమీలేక, భటుల చేత దానిని నరికించాడు. అయినా, శూలంలో కొంతభాగం శరీరంలో మిగిలిపోయినందున, మాండవ్య మహామునికి, “అణి మాండవ్యుడు” అనే పేరు నిలిచిపోయింది.
తరువాత మాండవ్యుడు యమపురికి వెళ్లి, “యమధర్మ రాజా, మహారాజు నాకు అంతటి శిక్ష వెయ్యాడానికి, నేనేమి తప్పు చేసాను?” అని ప్రశ్నించాడు. అప్పుడు యమదర్మరాజు, “మహామునీ, నువ్వు నీ చిన్నతనంలో, తూనీగలను పట్టుకుని, చిన్న చిన్న మేకులకు గుచ్చి, ఆనందించావు. అందుకని, ఆ ఫలం ఇప్పుడు అనుభవించావు” అని గతంలో ముని చేసిన తప్పిదాన్ని, గుర్తుచేశాడు. యముడి సమాధానానికి కోపగించుకుని, “యమ ధర్మ రాజా, పిల్లలు 14 ఏళ్లు వచ్చేవరకు, బాలురు అని పిలవబడతారు. ఆ వయస్సులో, ఏదీ తెలిసి చెయ్యరు. కాబట్టి, ఈ రోజు మొదలు, 14 ఏళ్ల లోపు పిల్లలు, ఏమి చేసినా అది తప్పు కాదు, పెద్ద పాపం కాదు.
కానీ, 14 ఏళ్ల లోపు పిల్లలకు ఏవరన్నా అపకారం చేస్తే, అది పెద్ద తప్పు అవుతుంది” అని శాసనం చేశాడు. “కానీ, యమధర్మ రాజా, నేను బాల్యంలో చేసిన చిన్నపాటి తప్పుకు, నాకు ఇంత పెద్ద శిక్షను విధించావు. కాబట్టి, నువ్వు శూద్ర యోని యందు జన్మించు. ధర్మానుగుణంగా నడిచే నీవు, ధర్మ-అధర్మాలకు ప్రత్యక్షసాక్షిగా మారతావు. అధర్ముల పక్షాన నిలబడి, నీలో నీవు సతమవుతూ జీవిస్తావు” అని శపించాడు. ఆ విధంగా యమధర్మ రాజు, వ్యాసుడి వలన, అంబాలిక దాసీ గర్భం నుండి విదురుడుగా జన్మించాడు. ఇక మాండవ్యుడు చెప్పిన 14 సంవత్సరాల లోపు పిల్లలకు శిక్ష విధింపబడదనే శాసనం నేటికీ అమలవుతూ ఉండడం, మన సనాతన ధర్మ గొప్పదనానికి మచ్చుతునక.
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment