యుద్ధానికి ముందు పాండవుల సంతతి తలను కృష్ణుడెందుకు బలి కోరాడు?
మహాభారతం, తవ్వేకొద్దీ అనేకానేక పాత్రలు దర్శనమిస్తాయి. కొన్ని, ఆలోచనల్లో పడేస్తే, కొన్ని ఆవేదనకు గురిచేస్తాయి. కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే, కొన్ని దిగ్భ్రాంతికి లోను చేస్తాయి. దాదాపు అన్ని ఉద్వేగాల సమ్మిళిత మహా గ్రంథమే, ‘మహాభారతం’. నిజానికి మహాభారతం అంటేనే ‘శ్రీకృష్ణుడు’. తను లేనిదే, మహాభారతం లేదు. అయితే, భారతంలో కొనియాడబడిన అనేక మంది వీరులను, ఒక్క నిముషంలో సంహరించగలిగే మహావీరుడు, ‘బర్బరీకుడు’. అమ్మవారి శక్తితో, గొప్పయోధుడిగా పేరుగడించిన బర్బరీకుడు, కురుక్షేత్రంలో పాల్గోనకపోవడానికి ఒక కారణం ఉంది. అసలు బర్బరీకుడెవరు, అతని వృత్తాంతం ఏంటి? కురుక్షేత్రాన్ని నిముషంలో అంత చేయగల శక్తిని, అతను ఎలా సంపాదించాడు? శ్రీ కృష్ణుడు మారు వేషంలో వచ్చి, బర్బరీకుడిని కోరిన కోరికేమిటి – వంటి ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి, ఈ వీడియోను పూర్తిగా చూడండి..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/i8U51cgclHA ]
ఒకసారి పాండవులందరూ, శ్రీ కృష్ణుడితో సహా సభలో వుండగా, ఘటోత్కచుడు తన తండ్రి భీముడిని కలవడానికి వచ్చాడు. ఆ సమయంలో వారందరూ, ఘటోత్కచుడికి సరైన వధువు ఎవరని చర్చిస్తున్న సమయంలో, శ్రీ కృష్ణుడిని సలహా అడిగారు. ప్రాగ్ జ్యోతిష్య పురంలో ఉన్న అహిళావతి అనే యువతి, ఘటోత్కచుడికి తగిన భార్య అని, శ్రీ కృష్ణుడు సూచించాడు. అహిళా వతి, అమ్మవారి ఉపాసకురాలు. ఆమె భక్తికి మెచ్చిన ఆది శక్తి, తన దివ్య ఖడ్గాన్నీ, డాలునూ ప్రసాదించింది. శ్రీ కృష్ణుడి మాట మేరకు, ఘటోత్కచుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి నల్లని మేని, కుండలాంటి తల, చక్కని రింగురింగుల జుట్టుతో, ఒక పుత్రుడు జన్మించాడు. అతడి శోరోజాలు ఉంగరాలు ఉంగరాలుగా ఉండడం వలన, అతడికి బర్బరీకుడని నామకరణం చేశారు. ఈ బర్బరీకుడు, తన తండ్రిలా ఎంతో తెలివి, ధైర్యం, శౌర్యంగలవాడు. బర్బరీకుడు, తల్లివద్దనే సకల శాస్త్రాలనూ నేర్చుకున్నాడు. మహీసాగర సంగమంలో, గుప్తక్షేత్రం వద్ద నవదుర్గా ఉపాసన చేసి అమ్మవారిని ఆరాధించి, ఎంతో మహిమాన్వితమైన మూడు బాణాలను వరంగా పొందాడు.
ఒకనాడు పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో, అందరూ బర్బరీకుడు నివసించే వనం వద్దకు వెళ్ళడం తటస్థించింది. అక్కడున్న తటాకంలో నీటిని తీసుకురమ్మని యుధిష్టరుడు ఆదేశించగా, భీముడు నీటి కోసం ఆ తటాకంలోకి అడుగుపెట్టాడు. భీముడు తన తాత అన్న విషయం తెలియక బర్బరీకుడు ఆగ్రహించి, దేవి అభిషేకానికి ఉపయోగించే ఆ నీటిని మలినం చేసినందున శిక్ష తప్పదని, భీముణ్ణి ఎత్తి కిందకు విసిరేయబోయాడు. ఆ సమయంలో భీముడు తన తాత గారని తెలుసుకున్న బర్బరీకుడు, పెద్దలను అవమానించిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా, సముద్రంలో దూకబోయాడు. అప్పుడు అమ్మవారు అడ్డుకుని, నీ శిక్షకు పరిహారంగా ఇక్కడ శివలింగ ప్రతిష్ట చేసి, తపస్సు చెయ్యమని ఆదేశించింది. అలా బర్బరీకుడు తన తాత గారి పేరిట నాడు ప్రతిష్ఠ చేసిన లింగమే, నేటి భీమేశ్వర లింగం.
కురు పాండవుల మధ్య కురుక్షేత్ర సంగ్రామం మొదలయినప్పుడు, ఆ యుద్ధంలో బర్బరీకుడు కూడా పాలు పంచుకోవాలని అనుకున్నాడు. యుద్ధంలో పాలు పంచుకోవడానికి తన తల్లి అనుమతి తీసుకోగా, అహిళావతి, బర్బరీకుని బలమెరిగి, ఏ పక్షమైతే బలహీనంగా ఉందో, వారికి అతని సహాయాన్ని అందించమని చెప్పి పంపించింది. తనదగ్గరున్న అజేయమైన మూడుబాణాలను తీసుకుని, కురుక్షేత్రంలో అడుగుపెట్టాడు బర్బరీకుడు. కౌరువుల పక్షాన 11 అక్షౌహిణులూ, పాండవులపక్షాన, 7 అక్షౌహిణుల సైన్యం వుంది కాబట్టి, పాండవులు బలహీనులని భావించి, వారి వైపు చేరాడు. అయితే, ఒకనాడు యుద్ధ రంగంలో శ్రీ కృష్ణుడు, పాండవుల శక్తిని తెలుసుకోదలచి, ఎవరు ఎన్ని రోజులలో యుద్ధాన్ని ముగించగలరు అని ప్రశ్నించాడు. దానికి ఒక్కొక్కరూ ఒక్కో సమాధానాన్ని చెప్పారు. అయితే, వారి గుంపుకు కాస్త దూరంగా నిలబడిన బర్బరీకుడిని చూసి, అతడి శక్తిని పరీక్షించే నెపంతో శ్రీకృష్ణుడు, బ్రాహ్మణుని వేషంలో, నువ్వైతే కురుక్షేత్ర యుద్ధాన్ని ఎన్నాళ్ళలో ముగించగలవలని ప్రశ్నించాడు. తన వద్ద దివ్య త్రిశరాలున్నాయనీ, వాటి ద్వారా క్షణకాలంలో యుద్ధాన్ని ముగించగలననీ, బర్బరీకుడు సమాధానమిచ్చాడు. వాటి గొప్పదనాన్ని కూడా వివరించాడు. "నా మొదటి బాణం వేటిని శిక్షించాలో గుర్తిస్తుంది. నా రెండవ బాణం, వేటిని రక్షించాలో గుర్తిస్తుంది. నా మూడవ బాణం, శిక్షను అమలుపరుస్తుంది." అని తన వద్దనున్న త్రిశరాల గురించి, వివరించాడు.
అప్పుడు వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీ కృష్ణుడు, 'నీ మాటలు నమ్మబుద్ధిగా లేవు. నువ్వు చెప్పేదే నిజమైతే, ఈ చెట్టు మీద ఉన్న రావి ఆకుల మీద నీ తొలి బాణాన్ని ప్రయాగించు' అంటూ బర్బరీకుని రెచ్చగొట్టాడు. కృష్ణుని మాటలకు చిరునవ్వుతో, ఆ రావి చెట్టు మీద ఉన్న ఆకులన్నింటినీ గుర్తించేందుకు, తన తొలి బాణాన్ని విడిచిపెట్టాడు. ఆ బాణం, చెట్టు మీది ఆకులన్నింటి మీదా తన గుర్తును వేసి, శ్రీ కృష్ణుని కాలి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. శ్రీ కృష్ణుడు కావాలనే ఒక ఆకును త్రుంచి, తన కాలి క్రింద దాచిపెట్టాడు. తన బాణం కృష్ణుడి పాదం దగ్గర తిరగడం చూసిన బర్బరీకుడు, 'అయ్యా! మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లు ఉంది. దయచేసి మీ పాదాన్ని పక్కకు తీయండి' అని అడగగా, బర్బరీకుడి బాణం, ఆ ఆకును చీల్చి, తిరిగి అతని వద్దకు చేరుకుంది. అది చూసిన శ్రీకృష్ణుడు, బర్బరీకుడు యుద్ధంలో పాల్గోంటే ఫలితాలు తారుమారు కావడం తథ్యం అని భావించాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు, 'బర్బరీకా! నువ్వు బలహీన పక్షాన నిలబడి పోరాడాలనుకోవడం మంచిదే. కానీ, నువ్వు ఏ పక్షానికైతే నీ సహాయాన్ని అందిస్తావో... నిముషంలో ఆ పక్షం బలమైనదిగా మారిపోతుంది కదా! అలా నువ్వు, పాండవులూ, కౌరవుల పక్షాన మార్చి మార్చి యుద్ధం చేస్తుంటే, ఇక యుద్ధభూమిలో నువ్వు తప్ప ఎవ్వరూ మిగలరు' అని సత్యాన్ని విశదపరిచాడు.
శ్రీ కృష్ణుడి మాటలకు బర్బరీకుడు చిరునవ్వుతో, 'ఇంతకీ మీరెవరు స్వామీ, మీకేం కావాలి?' అని అడిగాడు. దానికి శ్రీ కృష్ణుడు, 'మహాభారత యుద్ధానికి ముందు, ఒక వీరుడి తల బలి ఇవ్వాల్సి ఉంది. నీకంటే వీరుడు మరెవ్వరూ లేరు కనుక, నీ తలనే బలిగా ఇవ్వు' అని కోరాడు. దాంతో, మారు వేషంలో వచ్చింది సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని, బర్బరీకుడికి అర్థమైపోయింది. మారు మాట్లాడకుండా, తన తలను అర్పించేందుకు సిద్ధపడ్డాడు. అయితే, తనకు కురుక్షేత్ర సంగ్రామాన్ని చూడాలని ఎంతో ఆశగా ఉందనీ, ఆ సంగ్రామాన్ని పూర్తిగా చూసే భాగ్యాన్ని తనకు కల్పించమనీ, కోరుకున్నాడు బర్బరీకుడు. ఆ విధంగానే, అతను తన శిరస్సును ఖండించుకున్న తరువాత, కురుక్షేత్రం మొత్తం కనిపించేలా, ఒక ఎత్తైన కొండపై దానిని పెట్టి, ఆ సంగ్రామాన్ని వీక్షించేలా చేశాడు, కృష్ణ భగవానుడు.
బర్బరీకుడి వద్దనున్న మూడు బాణాలూ, అధ్యాత్మిక, అధిభౌతికా, అధిదైవిక త్రివిధ తాపాలని చెబుతారు, పండితులు. వారి వారి సంచిత కర్మలు, ఎవరెవరు పోతారో గుర్తుపెట్టగా, ఆగామికర్మ, ఎవరికి ఇంకా లోకంలో నూకలున్నాయో గుర్తిస్తే, ప్రారబ్ధం, ఎవరెవరిని సంచితం గుర్తు పెట్టిందో, వారిని మట్టుపెడుతుంది. ఇది కర్మల ప్రతిరూపం అనుకుంటే, శ్రీకృష్ణుని శరణాగతి చేసినవారికి, వీటినుండి రక్షణ కలిగి, ఆ తాపాలనూ, కర్మలనూ నశింప చేసి, మనలను రక్షిస్తాడు. మహాభారత యుద్ధానికి సాక్ష్యంగా నిలిచిన బర్బరీకుడు, శాప వశాన జన్మించి, శ్రీ కృష్ణుడి వలన మరణించాడు.
ఒకనాడు భూమ్మీద అధర్మం పెరిగిపోయిందని బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరులను వేడుకోవడానికి, దేవతలందరూ వచ్చారు. వారి బాధలను తెలుసుకున్న శ్రీ మహా విష్ణువు, దుష్ట శక్తులను సంహరించడానికి, త్వరలోనే తానొక అవతారాన్ని ధరిస్తానని, వారికి మాట ఇచ్చాడు. ఇదంతా వింటున్న ఒక యక్షుడు, ఈ మాత్రం దానికి విష్ణువే మనిషిగా అవతరించడం దేనికి? నేనొక్కడిని చాలనా? అని ఒకింత పొగరుగా మాట్లాడాడు. దానికి నొచ్చుకున్న బ్రహ్మ, యక్షుడికి ఓ శాపం విధించాడు. ధర్మానికీ, అధర్మానికీ నడుమ భారీ ఘర్షణ జరగబోయే క్షణం వచ్చినప్పుడు, మొట్ట మొదట బలయ్యేది నువ్వే.. అంటూ శపించాడు. ఆ విధంగానే, బర్బరీకుడు యుద్ధ ప్రారంభంలో బలి అవ్వాల్సి వచ్చింది. కురుక్షేత్రం ముగిసిన తరువాత, శ్రీకృష్ణుడిని శరణు వేడుకుని, శాప విమోచనం పొందాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు, కలియుగంలో బర్బరీకుడు పూజలందుకుంటాడనీ, అతడిని తలుచుకున్నంత మాత్రాన, భక్తుల కష్టాలన్నీ కడతేరిపోతాయనీ వరమిచ్చాడు. ప్రస్తుతం మన రాజస్థాన్, నేపాల్ లలో ఖాటుశ్యామ్ జీ పేరిటా, గుజరాత్లో బలియాదేవ్ పేరిటా, బర్బరీకుడిని కొలుస్తున్నారు భక్తులు. ఉత్తరాదిలో బర్బరీకుడిని ఆరాధించేవారి సంఖ్య, అసాధారణం. శ్రీకృష్ణుడి మెప్పును పొందిన ఖాటు శ్యాంకు, తమ కోరికలను తీర్చడం ఓ లెక్కేమీ కాదన్నది, భక్తుల నమ్మకం. మూడు బాణాలతో ముల్లోకాలనూ జయించగల ఆయనకు, తమ కష్టాలను కడతేర్చడం, చిటికెలో పని అన్నది, ఆయనను నమ్ముకున్నవారి విశ్వాసం.
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment