‘ఓం’ కారము - అనాహత నాదము! Omkaram


‘ఓం’ కారము - అనాహత నాదము!

భగవద్గీతలో ఉన్న, ఎనిమిదవ అధ్యాయం, అక్షర బ్రహ్మ యోగములోని 12 నుండి 17 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము.. పరమ గతిని పొందేటందుకు గల మార్గాన్ని, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/bN_AKU7PJtY ]

00:45 - సర్వద్వారాణి సంయంమ్య మనో హృది నిరుధ్య చ ।
మూర్ద్న్యాధాయాత్మనః ప్రాణమ్ ఆస్థితో యోగధారణామ్ ।। 12 ।।

శరీరము యొక్క అన్ని ద్వారములను నియంత్రించి, మనస్సుని హృదయ స్థానము యందే నిలిపి, ప్రాణములను మూర్ద్న్యా  అంటే తల స్థానములోకి లాగి, వ్యక్తి ఏకాగ్రతతో, యోగ ధ్యానములో స్థితుడై ఉండవలెను.

ప్రాపంచిక వస్తువిషయములు, మన మనస్సులోకి ఇంద్రియముల ద్వారా ప్రవేశిస్తాయి. మనం మొదట భౌతిక వస్తువిషయములను చూస్తాము, స్పర్శిస్తాము, వింటాము, రుచి చూస్తాము, వాసన చూస్తాము. తరువాత, మనస్సు వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నిరంతర చింతన, మమకారాన్ని సృష్టిస్తుంది. ఇది సహజంగానే మనస్సులో మరింత ఆలోచనలను కలుగచేస్తుంది. ధ్యానమును అభ్యాసము చేసే వారు, ఈ విషయాన్ని అలక్ష్యం చేస్తే, నిగ్రహింపబడని ఇంద్రియములు పుట్టించే నిరంతర ప్రాపంచిక తలపులతో, పోరాడాల్సి వస్తుంది. కాబట్టి, శరీర ద్వారాలను కావలి కాయమనే ఉపదేశాన్ని, శ్రీ కృష్ణుడిక్కడ ఇస్తున్నాడు. 'సర్వద్వారాణి సంయంమ్య' అంటే 'శరీరము లోనికి ప్రవేశానికి ఉండే అన్ని దారులను నియత్రించుట' అని. ఇది ఇంద్రియములను తమ స్వాభావిక బాహ్య ప్రవృత్తి నుండి నియంత్రించడాన్ని, సూచిస్తుంది. 'హృది నిరుధ్య' అంటే, 'మనస్సుని హృదయము యందు కట్టివేయుట' అని అర్థం. ఇది భక్తి యుక్త భావనలను మనస్సు నుండి, అక్కడ స్థితుడై ఉన్న అక్షర పరమేశ్వరుని దిశగా మరల్చమని, సూచిస్తుంది. యోగ-ధారణామ్ అంటే, 'అంతఃకరణమును భగవంతుని యందే ఏకీకృతం చేయుట' అని. ఇది, సంపూర్ణ ఏకాగ్రతతో, ఆయన మీదే ధ్యానం చేయటాన్ని సూచిస్తుంది.

02:37 - ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్మామనుస్మరన్ ।
యః ప్రయాతి త్యజన్ దేహం స యాతి పరమాం గతిమ్ ।। 13 ।।

పరమేశ్వరుడినైన నన్ను స్మరిస్తూ, ఓం కారమును జపిస్తూ, శరీరము నుండి వెళ్ళిపోయిన వాడు, పరమ గతిని పొందును.

ప్రణవము అని కూడా పిలువబడే పవిత్రమైన ఓం-కారము, శబ్ద రూపములో ఉన్న పరమేశ్వరుని యొక్క నిర్గుణ నిరాకార తత్వమును సూచిస్తుంది. కాబట్టి, భగవంతుని లాగానే నాశములేనిదిగా పరిగణించబడుతుంది. ఇక్కడ శ్రీ కృష్ణుడు, అష్టాంగ-యోగ సాధనా పద్ధతిలో ధ్యానము చేసే విధానాన్ని, చెబుతున్నాడు. మనస్సును కేంద్రీకరించటానికి, నియమనిష్ఠలనూ, బ్రహ్మచర్యమునూ పాటిస్తూ, ‘ఓం’ కారమును జపిస్తుండాలని అంటున్నాడు. వేద శాస్త్రాలు, "ఓం" కారమును "అనాహత నాదము" అని కూడా చెబుతున్నాయి. ఈ శబ్దము, సమస్త సృష్టి యందూ వ్యాపించి ఉంటుంది. దీనితో అనుసంధానం అయ్యే యోగులకు, ఇది వినపడుతుంది. వైదిక తత్వంలో, ఓం కారానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వబడింది. దీనిని 'మహా వాక్యము', అంటే వేదముల సర్వోన్నత శబ్దము, అని కూడా అంటారు. దీనినే బీజ మంత్రము అని కూడా అంటారు. ఎందుకంటే, అది తరచుగా, హ్రీం, క్లీం వంటి వాటి లాగా, వేద మంత్రాల ప్రారంభంలో జత చేయబడుతుంది. ఈ ఓంకార నాదములో, మూడు అక్షరములు ఉంటాయి: అ.... ఉ....మ. ఓం కారము యొక్క సరియైన జప పద్దతిలో, మొదట "అ" కారమును నాభి స్థానము నుండి, గొంతు-నోరు తెరచి జపిస్తారు. ఇది, గొంతు మధ్యనుండి వచ్చే "ఉ" కారములో విలీనమవుతుంది. ఈ ప్రక్రియ, "మ" కారమును పెదవులు మూసి అనటంతో, పూర్తవుతుంది. ఈ మూడు భాగాలైన అ.... ఉ....మ.. లకు ఎన్నో అర్థాలూ, మరియు వ్యాఖ్యానాలూ ఉన్నాయి. భక్తులకు "ఓం" అనేది, భగవంతుని నిరాకార తత్వానికి ఉన్న పేరు. ఈ ప్రణవ నాదము, అష్టాంగ యోగములో ఉన్న ధ్యాన విషయము. భక్తి యోగములో, భక్తులు, భగవంతుని యొక్క నామములయిన రామ, కృష్ణ, శివ మొదలైన పేర్ల మీద ధ్యానం చెయటానికి, మొగ్గు చూపుతారు. ఎందుకంటే, ఈ భగవన్నామములలో, భగవంతుని పరమానందము యొక్క మరింత తియ్యదనము ఉంటుంది. ఇది బిడ్డ, గర్భంలో ఉండటానికీ, మరియు ఒళ్లో ఉండటానికీ ఉన్న తేడా లాంటిది. ఒళ్లో ఉన్న బిడ్డ, గర్భంలో ఉన్న బిడ్డ కంటే, ఎంతో ఎక్కువ తియ్యని అనుభూతిని ఇస్తుంది. మన ధ్యానము యొక్క అంతిమ పరీక్ష, మరణ సమయమే. మృత్యువు యొక్క తీవ్ర బాధలో కూడా, అంతఃకరణమును భగవంతుని యందే నిలుపగలిగిన వారు, ఈ పరీక్షలో విజయం సాధించినట్టు. అటువంటి వ్యక్తులు, శరీరాన్ని విడిచి పెట్టిన తరువాత, అత్యున్నత లక్ష్యాన్ని పొందుతారు. ఇది చాలా క్లిష్టమైనది, మరియు దీనికి ఒక జీవిత కాలపు అభ్యాసము అవసరం.

05:39 - అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః ।
తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః ।। 14 ।।

ఓ పార్థా, అనన్య చిత్తముతో నన్నే ఎల్లప్పుడూ స్మరిస్తూ ఉండే యోగులకు, నేను సులభముగానే దొరుకుతాను. ఎందుకంటే, వారు నిరంతరం నా యందే నిమగ్నమై ఉంటారు కాబట్టి.

భగవద్గీత అంతటా, శ్రీ కృష్ణుడు చాలా సార్లు భక్తిని వక్కాణించాడు. ఇంతకు ముందు చెప్పినట్టు, నిర్గుణ నిరాకార భగవత్ తత్వముపై ధ్యాసను నిలపడం, మాధుర్య రహితమే కాక, చాలా క్లిష్టమయినది కూడా. కాబట్టి, ఇక్కడ ఒక సులువైన ప్రత్యామ్నాయమును ఇస్తున్నాడు. అదే, ఆయన యొక్క సగుణ సాకార రూపముపై ధ్యానము.. అంటే, కృష్ణుడూ, రాముడూ, శివుడూ, విష్ణువు మొదలగు వాటిపై. ఆయన దివ్య మంగళ స్వరూపము యొక్క నామములూ, రూపములూ, గుణములూ, లీలలూ, ధామములూ మరియు పరివారము, అన్నీ ఇందులో భాగమే. మనస్సు కేవలం ఆయన యందు మాత్రమే నిమగ్నమై ఉండాలి. వేరే దేని మీదా ఉండకూడదు. అనన్య భక్తి అంటే, వేరే ఏ ఇతరమైనదీ లేకుండా, మనస్సు కేవలం, ఆ దివ్య మంగళ స్వరూపము యొక్క - నామములూ, రూపములూ, గుణములూ, లీలలూ, ధామములూ మరియు పరివారములలోనే, నిమగ్నమై ఉండాలి. దీనిలో ఉన్న తర్కం, చాలా సరళమైనది. సాధన యొక్క లక్ష్యం, మనస్సుని పరిశుద్ధి చేయటమే. ఇది కేవలం మనస్సుని అత్యంత పవిత్రమైన భగవంతునికి అనుసంధానం చేయటం ద్వారానే సాధ్యము. కానీ, మనం మనన్సుని భగవత్ ధ్యానం ద్వారా శుద్ధి చేసినప్పటికీ, మరల దానిని ప్రాపంచికత్వంలో ముంచి మలిన పరిస్తే, మరిక ఎంత కాలం ప్రయత్నించినా, మనము దానిని శుద్ధి చేయలేము. చాలా మంది చేసే తప్పు సరిగ్గా ఇదే. వారు భగవంతుడిని ప్రేమిస్తారు.. కానీ, అదే సమయంలో, ప్రాపంచిక వస్తువులనూ, మనుషులను కూడా ప్రేమిస్తూ, వాటితో అనురాగం పెంచుకుంటారు. దీనితో, సాధన ద్వారా పొందిన లాభమంతా, ప్రాపంచిక మమకారాసక్తి వలన చెడిపోతుంది. బట్టని శుద్ధి చేయటానికి, దానిపై సబ్బు రాస్తూ, అదే సమయంలో దానిపై దుమ్ము వేస్తుంటే, మన శ్రమ అంతా వృధా ప్రయాసే అవుతుంది. కాబట్టి, శ్రీ కృష్ణుడు అనేదేమిటంటే, కేవలం భక్తి కాదు, ఆయన పట్ల అనన్య భక్తి మాత్రమే, మనం ఆయనను సులభంగా పొందేటట్లు చేస్తుందని, వివరిస్తున్నాడు.

08:13 - మాముపేత్య పునర్జన్మ దుఃఖాలయమశాశ్వతమ్ ।
నాప్నువంతి మహాత్మానః సంసిద్ధిమ్ పరమాం గతాః ।। 15 ।।

నన్ను పొందిన పిదప, మహాత్ములకు, ఈ దుఃఖముల నిలయము, మరియు తాత్కాలికము అయిన ఈ లోకంలో, పునర్జన్మ ఉండదు. ఎందుకంటే, వారు సర్వోత్కృష్టమైన పరిపూర్ణతను సాధించారు.

మనం భగవత్ ప్రాప్తిని పొందితే వచ్చే ఫలితం ఏమిటంటే, ఈ జనన-మరణ చక్రం నుండి విడుదల పొంది, భగవంతుని దివ్య ధామమునకు చేరుకోవడం. ఈ విధంగా వారు, తిరిగి, దుఃఖముల నిలయమైన ఈ భౌతిక ప్రపంచంలో జన్మ తీసుకోవలసిన అవసరం లేదు. పుట్టేటప్పుడు, నిస్సహాయ స్థితిలో ఏడుస్తూ, ఎంతో బాధాకరమైన స్థితిని అనుభవిస్తాము. తదుపరి పసి బిడ్డలుగా, మనకున్న అవసరాలను మనం వ్యక్త పరచలేకుండా ఉండి, ఏడుస్తాము. యుక్తవయస్సులో, శారీరిక అవసరాల కోసం తంటాలుపడాల్సి వస్తుంది. దీంతో మానసిక క్షోభను అనుభవిస్తాము. వైవాహిక జీవితంలో, దాంపత్య భాగస్వామి యొక్క విలక్షణస్వభావాలను భరించాలి. ముసలితనం చేరుకున్నప్పుడు, శారీరక దౌర్భల్యములను అనుభవించాలి. జీవితం మొత్తం - మన స్వంత శరీరమూ, మనస్సుల నుండి జనించే బాధలూ, ఇతరుల ప్రవర్తన, ప్రతికూల పరిస్థితుల నుండి జనించే కష్టాలను అనుభవించాలి. చివరికి, మనం మృత్యు కాలంలో పడే యాతనను కూడా అనుభవించాలి. ఈ మొత్తం దురవస్థ అర్థరహితమేమీ కాదు. భగవంతుని బృహత్పథకంలో, దీనికి ఒక ప్రయోజనం ఉంది. భౌతిక ప్రపంచమే మన శాశ్వత స్థానం కాదు, అన్న విషయాన్ని బోధ పరుస్తాయి. అది భగవంతునికి విముఖమై ఉన్న మనలాంటి జీవాత్మలను సంస్కరించే ప్రదేశం వంటిది. ఇక్కడ మనం దుఃఖం అనుభవించక పొతే, భగవంతునికై అభిలాషను ఎన్నటికీ పెంపొందించుకోలేము. ఉదాహరణకి, మనం నిప్పులో చెయ్యి పెడితే, రెండు పరిణామాలు జరుగుతాయి.. చర్మం కాలిపోవటం ప్రారంభమవుతుంది, మరియు నాడీ వ్యవస్థ, మంట బాధ యొక్క అనుభూతిని మెదడులో కలుగచేస్తుంది. చర్మం కాలిపోవటం మంచిదికాదు. కానీ, ఆ బాధ యొక్క అనుభూతి మంచిదే. మనం ఈ బాధను అనుభవించకపొతే, మనం చేతిని మంట నుండి వెనక్కు తీయము. దాంతో చర్మం మరింతగా కాలిపోతుంది. నొప్పి, బాధ అనేది, ఏదో తప్పు జరుగుతున్నది, దానిని సరిదిద్దాలి - అన్న దానికి సూచకం. అదే విధంగా, భౌతిక ప్రపంచంలో మనం అనుభవించే బాధ, మన అంతఃకరణ లోపభూయిష్టంగా ఉంది. మనకు భౌతిక దృక్పథం నుండి, భగవంతునితో ఏకత్వం దిశగా పురోగతి అవసరం - అన్న విషయాన్ని సూచిస్తుంది. చిట్టచివరికి, మన పరిశ్రమతో మనం దేనికైతే అర్హత సంపాదించామో, అదే మనకు లభిస్తుంది. ఎవరైతే భగవంతునికి వ్యతిరేక దిశలో ఉండిపోతారో, వారు ఈ జనన మరణ చక్రంలో పడి, తిరుగుతూనే ఉంటారు. అదే సమయంలో, ఎవరైతే భగవంతుని పట్ల అనన్య భక్తిని సాధిస్తారో, వారు ఆయన దివ్య ధామాన్ని చేరుకుంటారు.

11:25 - ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తినోఽర్జున ।
మాముపేత్య తు కౌంతేయ పునర్జన్మ న విద్యతే ।। 16 ।।

ఓ అర్జునా, బ్రహ్మలోక పర్యంతమూ, ఈ భౌతిక సృష్టి యొక్క లోకములన్నింటిలో, నీవు పునర్జన్మకు గురవుతూనే ఉంటావు. కానీ, నా ధామమునకు చేరిన పిదప, ఇక మరల పునర్జన్మ ఉండదు.

వేద శాస్త్రములు, భూలోకం కన్నా నిమ్న స్థాయిలో, ఏడు లోకాలున్నాయని వివరించాయి. అవి - తళ, అతళ, వితళ, సుతళ, తలాతళ, రసాతళ, పాతాళ లోకాలు. వీటినే నరకములు అంటారు. భూలోకంలో మొదలిడి, ఇంకా పైన కూడా మొత్తం ఏడు లోకాలున్నాయి - భూః , భువః , స్వః , మహః , జనః , తపః , సత్యః అనేవి ఇవి. ఈ పై వాటిని స్వర్గము, లేదా దేవ లోకాలు అంటారు. ఈ వివిధ రకాల అస్థిత్వ స్థాయిలనే, వేర్వేరు లోకాలు అంటాము. మన విశ్వంలో పద్నాలుగు లోకాలున్నాయి. వీటన్నింటిలో కెల్లా ఉన్నతమైనది, బ్రహ్మ దేవుని ధామము, బ్రహ్మ-లోకం అంటారు. ఈ లోకాలన్నీ, మాయ యొక్క పరిధిలోనే ఉన్నాయి. ఈ లోకాల్లో నివాసము ఉంటున్నవారు, జనన మరణ చక్రంలోనికి గురౌతూనే ఉంటారు. ఈ పద్నాలుగు లోకాలు కూడా, మాయ ఆధీనంలోనే ఉంటాయి కాబట్టి, వాటిలో నివాసం ఉండేవారు, జనన-మరణ చక్రానికి గురవుతుంటారు. కానీ, భగవత్ ప్రాప్తి పొందినవారు, ఈ మాయ యొక్క బంధము నుండి విడుదల చేయబడతారు. మృత్యు సమయంలో, ఈ భౌతిక శరీరాన్ని విడిచి పెట్టిన తరువాత, వారు భగవంతుని దివ్య ధామాన్ని చేరుకుంటారు. అక్కడ వారు దివ్య శరీరాలు పొందుతారు. సదా భగవంతుని దివ్య లీలలలో పాలుపంచుకుంటారు. ఈ విధంగా వారు, ఈ భౌతిక ప్రపంచంలో మరల జన్మించవలసిన అవసరం లేదు. కొంత మంది మహాత్ములు, మాయా నివృత్తి పొందిన తరువాత కూడా, తిరిగి వస్తారు. కానీ, వారు ఇతరులను కూడా మాయా బంధముల నుండి విముక్తి చేయటానికే వస్తారు. మానవ జాతి యొక్క కళ్యాణం కోసం, అవతరించిన మహాత్ములూ, మరియు గురువులూ, ఈ కోవకు చెందినవారే.

13:38 - సహస్రయుగపర్యంతమ్ అహర్యద్బ్రహ్మణో విదుః ।
రాత్రి యుగసహస్రాంతాం తేఽహోరాత్రవిదో జనాః ।। 17 ।।

వెయ్యి చతుర్యుగము అంటే, మహాయుగముల కాలము, బ్రహ్మ దేవునికి ఒక రోజు. అంటే, కల్పము అవుతుంది. ఆయన ఒక రాత్రి కూడా, అంతే సమయం ఉంటుంది. దీనిని అర్థం చేసుకున్న వివేకవంతులు, పగలు రాత్రి యొక్క యదార్థాన్ని అర్థం చేసుకుంటారు.

వైదిక ప్రమాణంలో, కాలం యొక్క కొలతలు కూడా విస్తారమైనవి. ఉదాహరణకి, కొన్ని పురుగులు రాత్రి పూట పుడతాయి; పెరుగుతాయి, పునరుత్పత్తి చేస్తాయి, గుడ్లు పెడతాయి, వృద్ధాప్యం చెందుతాయి. ఇదంతా ఒక్క రాత్రిలోనే జరిగిపోతాయి. పగటి పూట అవన్నీ వీధి దీపం కింద చనిపోయి పడి ఉండటం, మనం గమనించవచ్చు. ఒకవేళ ఈ పురుగులకు, మీ జీవిత కాలం మొత్తం కలిపి, మానవులకు ఒక రాత్రి మాత్రమే అని చెప్తే, వాటికి అది నమ్మ శక్యంగా ఉండదు. అదే విధంగా, వేదముల ప్రకారం, ఇంద్రుడు, వరుణుడి వంటి దేవతల ఒక పగలూ, ఒక రాత్రి, భూలోకంలో ఒక సంవత్సరం అవుతుంది. దేవతల యొక్క ఒక సంవత్సరం, అంటే 30 x 12 రోజులు, భూలోకంలో 360 సంవత్సరాలకు సమానం. దేవతల 12,000 సంవత్సరాలు, భూ లోకంలో ఒక మహాయుగం అంటే, నాలుగు యుగాల చక్రం అవుతుంది. అంటే, మొత్తం 4,320,000 సంవత్సరాలు. ఇటువంటి 1000 మహా యుగములు, బ్రహ్మ దేవుడికి ఒక పగలు. దీనినే కల్పము అంటారు. ఇది కాలాన్ని కొలవటానికి, ప్రపంచంలో ఉన్న అతి పెద్ద ప్రమాణం. బ్రహ్మ యొక్క ఒక రాత్రి కూడా, ఇంతే సమయం ఉంటుంది. బ్రహ్మ దేవుడు, 100 సంవత్సరాలు బతుకుతాడు. భూలోక లెక్క ప్రకారం, ఇది 311 ట్రిలియన్ ల, 40 బిలియన్ సంవత్సరాలు.
వైదిక శాస్త్రం ప్రకారం, కాలం యొక్క లెక్కలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
కలి యుగము : 4,32,000 సంవత్సరాలు.
ద్వాపర యుగము : 8,64,000 సంవత్సరాలు.
త్రేతా యుగము : 12,96,000 సంవత్సరాలు.
సత్య యుగము : 17,28,000 సంవత్సరాలు
ఇవన్ని కలిపి ఒక మహా యుగం, అంటే 4,320,000 సంవత్సరాలు.
వెయ్యి మహాయుగములు, బ్రహ్మ దేవుని ఒక పగలు. కల్పము అంటే, 4,32,00,00,000 సంవత్సరాలు. ఇంతే సమయం, బ్రహ్మ దేవుని రాత్రి. ఈ సమస్త విశ్వం యొక్క వ్యవధి, బ్రహ్మ దేవుడి జీవిత కాలం అయిన 100 సంవత్సరాలు: అంటే 311 ట్రిలియన్ ల, 40 బిలియన్ సంవత్సరాలు. బ్రహ్మ కూడా ఒక జీవాత్మనే, ఆ పదవిని పొంది, భగవంతుని పట్ల తన కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు. కనుక, బ్రహ్మ కూడా జనన-మరణ చక్రం లోనే ఉంటాడు. కానీ, మహోన్నతమైన పరిణితి పొంది ఉండటం వలన, ఆయన జీవిత కాలం తరువాత, జనన-మరణ చక్రం నుండి విముక్తి చేయబడి, భగవంతుని ధామాన్ని చేరుకుంటాడని, ఆయనకు హామీ ఉంది. ఒక్కోసారి, సృష్టి సమయంలో బ్రహ్మ పదవిని నిర్వహించటానికి, ఏ ఆత్మకి కూడా అర్హత లేకుంటే, భగవంతుడే బ్రహ్మ అవుతాడు.

17:00 - ఇక మన తదుపరి వీడియోలో, ఆయన యందే స్థితమై ఉన్న సర్వ ప్రాణులు, సర్వ వ్యాప్తుడైన భగవంతుడిని ఏ విధంగా తెలుసుకోవాలో శ్రీ కృష్ణుడు వివరించబోతున్నాడు..

కృష్ణం వందే జగద్గురుం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes