తొలి ఏకాదశి శుభాకాంక్షలు..

 


ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. ఈ ఏకాదశిని పద్మఏకాదశిగా కూడా పిలుస్తారు. ఈ యోగ నిద్ర అనేది భూమి పై రాత్రి సమయాలు పెరుగుతాయి అన్నదానికి సూచన.తద్వారా ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయి. భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఈ ఏకాదశి మహత్యం వివరించాడని ఉంది. దానిని ఉత్థాన ఏకాదశి అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే "ఏకాదశి" అంటారు.ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు- మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes