ఏది పూజ? వేర్వేరు అస్థిత్వాలను పూజించటం ద్వారా వచ్చే పరిణామాలూ గమ్యములూ ఏమిటి? Bhagavadgita

 

ఏది పూజ? వేర్వేరు అస్థిత్వాలను పూజించటం ద్వారా వచ్చే పరిణామాలూ గమ్యములూ ఏమిటి?

'భగవద్గీత' నవమోధ్యాయం – రాజవిద్యా రాజగుహ్య యోగం (24 – 29 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 7 నుండి 12 వరకూ ఉన్న అధ్యాయాలను భక్తి షట్కము అంటారు. దీనిలో తొమ్మిదవ అధ్యాయం, రాజవిద్యా రాజగుహ్య యోగము. ఈ రోజుటి మన వీడియోలో, రాజవిద్యా రాజగుహ్య యోగములోని 24 నుండి 29 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/EysiFJDCqPo ]

భగవంతుడిని ప్రేమతో ఆరాధించే భక్తుల గురించి, శ్రీ కృష్ణుడిలా వివరిస్తున్నాడు..

00:48 - అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।
న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే ।। 24 ।।

సమస్త యజ్ఞములకూ భోక్తనూ, ఏకైక స్వామినీ నేనే. కానీ, నా ఈ యొక్క పరమేశ్వర తత్త్వమును తెలుసుకొనని వారు, తిరిగి పుట్టవలసినదే.

శ్రీ కృష్ణుడు ఇప్పుడు దేవతల ఆరాధన చేయటంలో ఉన్న లోపాన్ని, ఇక్కడ వివరిస్తున్నాడు. పరమేశ్వరుడైన భగవంతుడిచ్చిన శక్తి వలన, వారికి భౌతిక వరాలను ఇచ్చే సామర్ధ్యం ఉంటుంది. కానీ, వారు తమ భక్తులను జనన-మరణ చక్రం నుండి విముక్తి చేయలేరు. వారు తమ దగ్గర ఉన్నవి మాత్రమే, వేరే వారికి ఇవ్వగలరు. దేవతలు కూడా సంసార చక్రము నుండి విముక్తి కానప్పుడు, వారు తమ భక్తులను ఎలా విముక్తి చేయ గలరు? అదే సమయంలో, ఏవరికైతే సరైన జ్ఞానం ఉందో, వారు తమ సంపూర్ణ భక్తిని భగవంతుని చరణారవిందాల యందే సమర్పిస్తారు, మరియు వారి భక్తి పరిపక్వత చెందినప్పుడు, వారు మర్త్యలోకాన్ని దాటి, దివ్య ధామానికి చేరుకుంటారు.

01:53 - యాంతి దేవవ్రతా దేవాన్ పితౄన్ యాంతి పితృవ్రతాః ।
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోఽపి మామ్ ।। 25 ।।

దేవతలను పూజించే వారు, దేవతల యందు జన్మిస్తారు, పితృదేవతలను ఆరాధించేవారు, పితృదేవతల దగ్గరకి వెళ్తారు. భూతప్రేతములను అర్చించువారు, అలాంటి వాటిలో పుడతారు, మరియు నా భక్తులు నన్నే చేరుకుంటారు.

ఎలాగైతే ఒక గొట్టం లోని నీరు, ఆ గొట్టం అనుసంధానం చేయబడిన ట్యాంక్ స్థాయి వరకే పైకి వస్తాయో, భక్తులు తాము దేనిని పూజిస్తారో, దాని స్థాయి వరకే ఉన్నతిని సాధించగలరు. ఈ శ్లోకంలో, వేరువేరు అస్థిత్వాలను పూజించటం ద్వారా వచ్చే పరిణామాలనూ, వివిధ రకములైన గమ్యములనూ తెలియచేస్తున్నాడు. అత్యున్నత ఆధ్యాత్మిక పురోగతిని సాధించటం కోసం, మనం ఆ పరమాత్మనే ఆరాధించాలని తెలుసుకోవటం కోసం, ఈ జ్ఞానాన్ని చెప్తున్నాడు. ఇంద్రుడూ, సూర్యుడూ, కుబేరుడూ, అగ్నీ వంటి వారిని ఆరాధించేవారు, స్వర్గాది లోకాలకు వెళతారు. ఆ తర్వాత వారి యొక్క పుణ్య ఫలములు తరిగిపోయిన తరువాత, వారు స్వర్గము నుండి పంపించి వేయబడతారు. పితృలు అంటే పూర్వీకులు. వారి పట్ల కృతజ్ఞతా భావన ఉండటం మంచిదే. కానీ, వారి సంక్షేమం కోసం అతి చింతన నష్టదాయకమైనది. పితృ దేవతలను పూజించేవారు, మరణించిన పిదప, తమ పూర్వీకుల లోకాలకు వెళతారు. తామస గుణ ప్రధానంగా ఉన్నవారు, భూతప్రేతములను పూజిస్తారు. ఈ వామ-మార్గ తాంత్రికులు, భూతప్రేతములను ఆవాహనచేస్తారు. ఇటువంటి పనులలో పాల్గొనే వారు, వారి తదుపరి జన్మలో, భూతప్రేతములలో జన్మిస్తారు. అయితే, సర్వోన్నత భక్తులు ఎవరంటే, తమ మనస్సులను పరమేశ్వరుడైన భగవంతుని యందే నిమగ్నం చేసినవారు. భగవంతుని ఆరాధనకై దృఢ సంకల్పము చేసి, మరియు ఆయన భక్తి యందే నిశ్చలబుద్ధితో ఉన్నటువంటి ధన్యులైన జీవులు, తదుపరి జన్మలో, ఆయన దివ్య ధామానికి చేరుకుంటారు.

03:58 - పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి ।
తదహం భక్త్యుపహృతమ్ అశ్నామి ప్రయతాత్మనః ।। 26 ।।

నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకుగానీ, ఒక పువ్వు గానీ, ఒక పండు గానీ, లేదా నీరైనా సమర్పించినా, ఆ స్వచ్ఛమైన మనస్సుగల నా భక్తునిచే ప్రేమతో ఇవ్వబడిన దానిని, నేను సంతోషంగా స్వీకరిస్తాను.

దేవతల, మరియు పితృదేవతల ఆరాధనలో, వారిని ప్రసన్నం చేయటానికి నిష్ఠగా ఆచరించవలసిన ఎన్నో నియమాలు ఉన్నాయి. కానీ, భగవంతుడు తనకు ప్రేమ నిండిన హృదయంతో సమర్పించబడిన దేనినైనా స్వీకరిస్తాడు. మీ దగ్గర కేవలం ఒక పండు ఉంటే, అది సమర్పించండి. భగవంతుడు సంతోషిస్తాడు. ఒకవేళ పండు లేకపోతే ఒక పువ్వును సమర్పించండి. అది పుష్పించే కాలం కాకపొతే, భగవంతునికి కేవలం ఒక ఆకును సమర్పించండి. ప్రేమతో ఇచ్చినప్పుడు, అది కూడా సరిపోతుంది. ఒకవేళ ఆకులు కూడా దొరకకపోతే, అంతటా లభ్యమయ్యే నీటిని సమర్పించండి. కానీ, మనం దేనిని సమర్పించినా, భక్తితో, ప్రేమతో సమర్పించాలి. ఆరాధించే వారి భక్తి మాత్రమే, భగవంతుడిని ప్రసన్నం చేస్తుంది. ఆ సమర్పించబడిన వస్తువు యొక్క విలువ కాదు.  మహాభారత యుద్ధం ముందు, శ్రీ కృష్ణుడు, కౌరవులూ, పాండవుల మధ్య సంధి కుదిర్చే ప్రయంత్నంలో హస్తినాపురం వెళ్లినప్పుడు, దుర్యోధనుడు గర్వంతో, యాభై-ఆరు విభిన్న వంటకాలతో విందు ఏర్పాటు చేశాడు. కానీ, శ్రీ కృష్ణుడు ఈ ఆతిథ్యాన్ని తిరస్కరించి, ఒక సామాన్యమైన విదురని అనే మహిళ కుటీరానికి వెళ్ళాడు. ఆమె ఎప్పటినుండో తన ఇష్టదైవాన్ని సేవించుకునే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. కృష్ణుడు ఇంటికి రావటంతో, విదురని చాలా సంతోషపడింది. ఆమె దగ్గర ఇవ్వటానికి కేవలం అరటి పండ్లే ఉన్నాయి. కానీ, ప్రేమభావనలో, ఆమె బుద్ధి ఎంతగా అయోమయం అయిపోయిందంటే, ఆమె పండు పడేసి, తొక్కలు ఆయనకు తినిపించిన సంగతి కూడా తెలియలేదు. అయినప్పటికీ, ఆమె భక్తిని చూసిన శ్రీ కృష్ణుడు, ప్రపంచంలో అదే అత్యంత రుచికరమైనదన్నట్టు, పరమానందంతో ఆ తొక్కలనే తిన్నాడు. భగవంతునికి సమర్పించబడిన వస్తువు యొక్క భౌతిక విలువ ఆయనకు అవసరం లేదు. అన్నింటికన్నా ఎక్కువగా, ఎంత ప్రేమగా ఇచ్చాము? అనేదే అయనకు ముఖ్యం.

06:25 - యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ ।
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ।। 27 ।।

ఓ కుంతీ పుత్రుడా, నీవు ఏ పని చేసినా, నీవు ఏది తిన్నా, నీవు యజ్ఞములో అగ్నికి ఏది సమర్పించినా, నీవు ఏది బహుమతిగా దానం ఇచ్చినా, మరియు ఏ నిష్ఠలను ఆచరించినా, వాటిని నాకు సమర్పించినట్టుగా చెయుము.

మనం ఎటువంటి సామాజిక భాధ్యతలను నిర్వహిస్తున్నా, ఏ శాఖాహార ఆహారాన్ని భుజిస్తున్నా, ఏ మత్తుపదార్ధ రహిత పానీయాలను త్రాగుతున్నా, ఏ వైదిక కర్మలను ఆచరిస్తున్నా, ఏ వ్రతాలూ, నిష్ఠలూ ఆచరిస్తున్నా, అవన్నీ కూడా, మానసికంగా పరమేశ్వరుడైన భగవంతునికే అర్పించాలి. తరచుగా జనులు భక్తిని దైనందిన జీవితం కంటే వేరుగా చూస్తారు, మరియు భక్తి అంటే పూజ చేసేటప్పుడూ, ఆలయాలకు వెళ్ళేటప్పుడు మాత్రమే కనబరుస్తుంటారు. నిజానికి భక్తి అంటే, మీరు చేసే ప్రతి పనినీ, భగవంతునికి అర్పితం చేయటమే, మరియు ఆయనను ఎప్పుడైనా మర్చిపోతే, తీవ్రమైన విరహ వ్యాకులత చెందటమే. పనులను ఆయనకు అంకితం చేసి, మరియు మానసికంగా వాటిని భగవంతునికే ఇచ్చి వేస్తే, దానినే అర్పణం అంటారు. భౌతికమైన ప్రాపంచిక పనులను ఇటువంటి దృక్పథం, దివ్యమైన భగవత్ సేవగా, సంపూర్ణముగా మార్చివేస్తుంది. శరీరంతో కానీ, మాటలతో కానీ, మనస్సుతో కానీ, ఇంద్రియములతో కానీ, లేదా బుద్ధితో కానీ, తన వ్యక్తిగత స్వభావం అనుగుణంగా చేసే వాటన్నింటినీ, శ్రీమన్నారాయణుడికే అర్పించాలి. భగవంతునికి సమర్పించడం అంటే, మనం పని చేస్తూ ఉన్నప్పుడే, ఇదంతా భగవంతుని ప్రీతి కోసమే చేస్తున్నామన్న అంతర్గత భావనతో చేయాలి.

08:16 - శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః ।
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ।। 28 ।।

అన్ని పనులనూ నాకే అర్పితం చేయటం ద్వారా, నీవు శుభ-అశుభ ఫలితముల బంధనముల నుండి విముక్తి చేయబడతావు. సన్యాసముచే నీ మనస్సు నా యందే లగ్నమై, నీవు విముక్తి చేయబడతావు, మరియు నన్ను చేరుకుంటావు.

అగ్ని పొగచే కప్పివేసి ఉన్నట్టు, ప్రతి ఒక్క పని కూడా, లోపాలతో కూడి ఉంటుంది. మనం భూమిపై నడుస్తున్నప్పుడు, తెలియకుండానే ఎన్నో వేల అతిచిన్న ప్రాణులను చంపేస్తాము. మన వృత్తికి సంబంధించిన విధి నిర్వహణలో, ఎంత జాగ్రత్తగా ఉన్నా, వాతావరణానికి హాని చేయటమో, లేక వేరే వారి మనస్సును బాధపెట్టడమో జరుగుతుంది. కేవలం, ఒక కప్పు పెరుగు తిన్నా, వాటిలో నివసించే జీవరాశులను నాశనం చేసిన పాపం తగులుతుంది. కొన్ని మతాల్లో, ఈ యొక్క అసంకల్పిత హింసని తగ్గించటానికి, నోటికి ఒక గుడ్డ అడ్డం పెట్టుకుంటారు. ఇది కూడా మన శ్వాస వలన కలిగే జీవరాశుల వినాశనాన్ని, పూర్తిగా నిలువరించలేదు. మన స్వార్ధ ప్రయోజనం తీరటం కోసం మనం పనులు చేసినప్పుడు, తెలిసినా, తెలియకపోయినా, మన పాపాలకు మనం దోషులమే. కర్మ సిద్ధాంతం ప్రకారం, మనం వాటి యొక్క ఫలితములు అనుభవించవలసినదే. మంచి పనులు కూడా బంధన కారకమే.. ఎందుకంటే, అవి ఆత్మని స్వర్గ లోకాలకు వెళ్లి, అ ఫలములను భోగించేటట్టు చేస్తాయి. ఈ విధంగా, మంచి మరియు చెడు కర్మలు కూడా, ఈ జనన-మరణ చక్రంలో ఉండిపోయేటట్టే చేస్తాయి. కానీ, ఈ శ్లోకంలో శ్రీ కృష్ణుడు, సమస్త కర్మ ఫలితములనూ నశింపచేయటానికి, ఒక సరళమైన పరిష్కారం చూపిస్తున్నాడు. ఆయన 'సన్యాస యోగము' అన్న పదం వాడుతున్నాడు. అంటే, స్వార్థమును త్యజించమంటున్నాడు. ఆయన అనేదేమిటంటే, మనం ఎప్పుడైతే మన పనులను భగవత్ ప్రీతి కోసం సమర్పిస్తామో, మనం మంచీ మరియు చెడూ.. ఈ రెండింటి కర్మ ఫల సంకెళ్ల నుండి విముక్తి పొందుతాము.

10:25 - సమోఽహం సర్వభూతేషు న మే ద్వేష్యోఽస్తి న ప్రియః ।
యే భజంతి తు మాం భక్త్యామయి తే తేషు చాప్యహమ్ ।। 29 ।।

నేను సర్వ ప్రాణుల యందూ సమత్వ బుద్ధితో ఉంటాను. నేను ఎవరి పట్లా, పక్షపాతంతో కానీ, లేదా విరోధ భావంతో కానీ ఉండను. కానీ, ప్రేమతో నన్ను ఆరాధించే భక్తులు, నా యందే నివసిస్తారు, మరియు నేను వారి యందు నివసిస్తాను.

దేవుడనేవాడు ఉంటే, ఆయన సంపూర్ణ దోషరహిత న్యాయమూర్తిగా ఉంటాడని, మనందరమూ అంతర్లీనంగా నమ్ముతాము. వాన నీరు భూమిపై సమానంగా పడుతుంది. అయినా, వ్యవసాయ క్షేత్రాలలో పడే బిందువు, ధాన్యంగా మారుతుంది; ఎడారి ముళ్లపొదపై పడే బిందువు, ముల్లుగా మారుతుంది; మురుగు గుంటలో పడే బిందువు, మురుగు నీరు అవుతుంది; మరియు ఆల్చిప్పలో పడే బొట్టు, ముత్యంగా మారుతుంది. వానకి ఎలాంటి పక్షపాతం లేదు. అది నేలపై తన కృపని సమానంగానే చూపుతుంది. వాటి ఫలితాలలో ఈ యొక్క తేడాకి, వాన బిందువుల భాద్యత కాదు. వాటిని అందుకునే వాటి స్వభావాల్లో తేడాయే, కారణం. అదే విధంగా, భగవంతుడు ఇక్కడ అనేదేమిటంటే, ఆయన సమస్త ప్రాణుల యందూ సమానమైన కృపను చూపిస్తున్నాడు. అయినా, ఆయనను ప్రేమించని వారు, వారి మనస్సులకు సరియైన పాత్రత లేకపోవటంచేత, ఆయన కృప యొక్క ప్రయోజానాలను అందుకోలేకపోతున్నారు.

11:55 - ఇక మన తదుపరి వీడియోలో, మనస్సులు అపవిత్రంగా ఉన్న వారు ఏమి చేయవచ్చు.. అనేటటువంటి విషయాన్ని, శ్రీ కృష్ణుడు వివరించబోతున్నాడు..

కృష్ణం వందే జగద్గురుం!

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes