అహంకార పట్టులో ఆత్మ తననుతాను ఈ శరీరమే అనుకుంటుంది!
'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (25 - 29 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 25 నుండి 29 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/0C40lsw2pec ]
జ్ఞానులు కూడా తమ కర్మలను ఎందుకు ఆచరించాలో, శ్రీ కృష్ణుడు ఇలా వివరిస్తున్నాడు..
సక్తాః కర్మణ్యవిద్వాంసో యథా కుర్వంతి భారత ।
కుర్యాద్విద్వాంస్తథాసక్తః చికీర్షుర్లోకసంగ్రహమ్ ।। 25 ।।
ఓ భరత వంశీయుడా, అజ్ఞానులు కర్మ ఫలముల యందు ఆసక్తితో తమ విధులను నిర్వర్తించినట్లుగా, జ్ఞానులు కూడా లోకహితం కోసం, జనులకు సరియైన మార్గదర్శకం చేయటం కోసం, తమ కర్మలను ఆచరించాలి.
శారీరక దృక్పథంలోనే ఉండి, ప్రాపంచిక సుఖాల పట్ల ఆసక్తి కలిగి, వైదిక కర్మకాండల పట్ల పూర్తి విశ్వాసము కలిగి ఉన్న వారు, అజ్ఞానులూ, అవివేకులూ అనబడుతారు. ఎందుకంటే, వారికి పుస్తక జ్ఞానం ఉన్నా, వారు భగవత్ ప్రాప్తియే అంతిమ లక్ష్యం అని అర్థం చేసుకోరు. అలాంటి అమాయకులు, బద్ధకమూ, శంకా లేకుండా, తమ కర్తవ్యమును జాగ్రత్తగా, శాస్త్రోక్తముగా నిర్వర్తిస్తారు. వైదిక ధర్మాలనూ, కర్మ కాండలనూ చేయటం వలన, వారు కోరుకున్న భౌతిక ప్రతిఫలం లభిస్తుందని, వారికి పూర్తి విశ్వాసం ఉంటుంది. ఇంద్రియ విషయముల పట్ల వైరాగ్యం కలుగనంత వరకూ, భగవత్ విషయంలో శ్రద్ధ ఏర్పడనంత వరకూ, కర్మలను ఆచరిస్తూనే ఉండాలి. ఎలాగైతే అజ్ఞానులు విశ్వాసంతో కర్మలు చేస్తుంటారో, అలాగే జ్ఞానులు తమ పనులను శ్రద్ధతో, భౌతిక ప్రతిఫలాల కోసం కాకుండా, సమాజానికి ఆదర్శం చూపటానికి చేయాలి. అంతేకాక, ప్రస్తుతం అర్జునుడు చేయవలసినది, ధర్మ యుద్ధం. కాబట్టి, సమాజ శ్రేయస్సు కోసం, అర్జునుడు క్షత్రియ వీరునిగా, తన కర్తవ్యాన్ని నిర్వహించాలి.
న బుద్ధిభేదం జనయేదజ్ఞానాం కర్మసంగినామ్ ।
జోషయేత్ సర్వకర్మాణి విద్వాన్ యుక్తః సమాచరన్ ।। 26 ।।
కర్మలను ఆచరించకుండా ప్రేరేపించటం ద్వారా, ఫలాసక్తితో కర్మలను చేసే అజ్ఞానుల బుద్ధిని, జ్ఞానులు భ్రమకు గురిచేయరాదు. అంతేకాక, జ్ఞానోదయ స్థితిలో తమ విధులను నిర్వర్తిస్తూ, అజ్ఞానులకు కూడా విహిత కర్మలను చేయటానికి, స్ఫూర్తినివ్వాలి.
గొప్ప వ్యక్తులు, మరింత ఎక్కువ బాధ్యత కలిగి ఉంటారు. ఎందుకంటే, సాధారణ ప్రజలు వారిని అనుసరిస్తారు. కాబట్టి, అజ్ఞానులను మరింత పతనానికి గురి చేసే ఎలాంటి మాటలనూ, చేతలనూ, జ్ఞానులు చేయరాదని, శ్రీ కృష్ణుడు సూచిస్తున్నాడు. జ్ఞానులు అజ్ఞానులకి అర్థం కాని ఉన్నత స్థాయి ఉపదేశం చెబుతూ, వారి విధులను విడిచి పెట్టమని, ఎన్నటికీ చెప్పరాదు. సాధారణంగా, ప్రాపంచిక దృక్పథంలో ఉన్న ప్రజలు, కేవలం రెండు పద్ధతులనే పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ఫలాసక్తితో కష్టపడి పనిచేయడం, లేదా అన్ని పనులూ శ్రమతో కూడినవీ, కష్టతరమైనవీ, ఇంకా పాపిష్టివీ అంటూ, వాటన్నింటినీ విడిచి పెట్టాడానికి చూస్తారు. ఈ రెండు పద్ధతులలో, తప్పించుకునే పద్ధతి కన్నా, ఫలాసక్తితో పని చేయటమే ఏంతో మేలైనది. కాబట్టి, వైదిక జ్ఞానంతో ఉన్న ఆధ్యాత్మిక వివేకవంతులు, అజ్ఞానులకు కూడా, తమ విధులను చక్కగా, శ్రద్ధతో నిర్వర్తించేలా, స్ఫూర్తినివ్వాలి. అమాయకుల మనస్సులు వ్యాకులపడి కలతచెందితే, వారికి పని చేయటం మీద విశ్వాసం పోయే ప్రమాదం ఉండవచ్చు. ఒక ప్రక్క పనులు ఆపి, మరోప్రక్క జ్ఞానం వృద్ధి చెందక, అజ్ఞానులు రెంటికీ చెడిపోతారు.
ప్రకృతేః క్రియమాణాని గుణైః కర్మాణి సర్వశః ।
అహంకారవిమూఢాత్మా కర్తాఽహమితి మన్యతే ।। 27 ।।
అన్ని కార్యములు కూడా, ప్రకృతి త్రిగుణముల చేతనే చేయబడతాయి. కానీ, అజ్ఞానంలో జీవాత్మ, తను ఈ శరీరమే అన్న భ్రమతో, తనే కర్తను అని అనుకుంటుంది.
ప్రపంచంలో సహజసిద్ధంగా జరిగే పరిణామాలు, మనం నిర్దేశించినవి కావనీ, అవి ప్రకృతిచే చేయబడినవనీ, మనం గుర్తించాలి. ప్రకృతి నుండి తయారయిన ఈ శరీరం, ప్రకృతిలో భాగమే. కావున, ప్రకృతి శక్తియే అన్ని పనులకూ కర్త. ప్రబలమైన అహంకార పట్టులో, ఆత్మ తనను తాను ఈ శరీరమే అనుకుంటుంది. అందుకే, కర్తృత్వ భావన మాయలో ఉండిపోతుంది. స్థిరమైన జీవాత్మ, కదిలే ప్రకృతియే తాననుకుంటుంది. అందుకే, చేసే క్రియలకు తానే కర్త అనుకుంటుంది. ఆత్మ ఈ అహంకారాన్ని వదిలి, భగవంతునికి శరణాగతి చేసిన మరుక్షణం, తను కర్తను కానని తెలుసుకుంటుంది. అయితే, జీవాత్మ తానే స్వయంగా కర్మలను చేయకపోయినా, అది ఇంద్రియమనోబుద్ధులు చేసే క్రియలను, మార్గదర్శకం చేస్తుంది. మనస్సు, శరీర వ్యవస్థ చేసే పనులకు, జీవాత్మయే బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే, ఇంద్రియములూ, మనస్సూ, బుద్ధీ, ఆత్మ ద్వారా వచ్చే ప్రేరణతో, పని చేస్తాయి.
తత్త్వవిత్తు మహాబాహో గుణకర్మవిభాగయోః ।
గుణా గుణేషు వర్తంత ఇతి మత్వా న సజ్జతే ।। 28 ।।
ఓ మహా బాహువులున్న అర్జునా.. జ్ఞానులు జీవాత్మను, గుణములూ, కర్మల నుండి వేరుగా చూస్తారు. ఇంద్రియములూ, మనస్సు రూపంలో ఉన్న గుణములూ, ఇంద్రియ గ్రాహ్య విషయ వస్తు రూపంలో కదులుతున్నవని తెలుసుకుని, వాటి యందు ఆసక్తులు కారు.
అహంకారంచే భ్రమకు లోనై, తమను తాము శరీరమే అనుకునేవారు, తామే కర్తలమనుకుంటారు. అహంకారాన్ని నిర్మూలించిన వారు, శారీరక దృక్పథం నుండి స్వేచ్ఛను పొంది, తమ ఆధ్యాత్మిక విలక్షణతను, భౌతిక శరీరం కంటే వేరుగా చూస్తారు. కాబట్టి, వారు ప్రాపంచిక క్రియలకు, తామే కర్తలమని మభ్యపడరు. బదులుగా, ప్రతి కార్యకలాపం, మూడు గుణముల కదలిక వలననే జరుగుతున్నదని తలుస్తారు. ఇటువంటి భగవత్ ప్రాప్తి నొందిన మహాత్ములు, భగవంతుడే అన్నీ చేస్తున్నాడనుకుంటే, సామాన్య ప్రజలు, తామే చేస్తున్నామనుకుంటారు.
ప్రకృతేర్గుణ సమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు ।
తానకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్న విచాలయేత్ ।। 29 ।।
గుణముల ప్రవృత్తిచే భ్రమకు లోనయిన వారు, వారి కర్మ ఫలముల యందు ఆసక్తులవుతారు. కానీ, ఈ సత్యములను అర్థం చేసుకున్న జ్ఞానులు, ఇది తెలియని అజ్ఞానులను, కలవరపరచరాదు.
మరి జీవాత్మ అనేది, గుణములూ, వాటి ప్రవృత్తి కంటే భిన్నమైనది. ప్రకృతి గుణములచే భ్రమకు లోనయి, వారే కర్తలమని అనుకుంటారు. ప్రకృతి యొక్క త్రి-గుణములచే పూర్తిగా సమ్మోహితులై, వారు ఇంద్రియ, శారీరక, మానసిక ఆనందం కోసమే పని చేస్తువుంటారు. వారు కర్మలను ఒక కర్తవ్యంగా, ఫలాపేక్ష లేకుండా చేయలేరు. కానీ జ్ఞానులు, అంతగా విషయ జ్ఞానం లేని వారి మనస్సులను, కలవరపెట్టకూడదు. అంటే, జ్ఞానులు తమ అభిప్రాయాలను అజ్ఞానులపై రుద్దకూడదు. "నీవు ఆత్మవి, శరీరం కాదు కాబట్టి, కర్మ అర్థరహితమైనది. దానిని విడిచిపెట్టు" అని చెప్పకూడదు. వారు అజ్ఞానులకు తమ విహిత కర్మలను చేస్తుండమని ఉపదేశిస్తూ, నెమ్మదిగా మమకారాసక్తి, అతీత స్థితిని చేరుకోవటానికి సహకరించాలి. ఆధ్యాత్మిక విషయ జ్ఞానం ఉన్న వారికీ, అదిలేని వారికీ ఉన్న తేడాని వివరించిన తరువాత, శ్రీ కృష్ణుడు అజ్ఞానుల మనస్సును కలవరపరచరాదనే గంభీరమైన హెచ్చరిక చేస్తున్నాడు.
ఇక మన తదుపరి వీడియోలో, కర్మల నుండి ముక్తులవ్వాలంటే ఏం చేయాలో, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment