రమణ మహర్షి జయంతి!
ప్రతి సంవత్సరం డిసెంబర్ 30 వస్తుందంటే చాలు ఆధ్యాత్మిక ప్రియులకు శ్రీ రమణ మహర్షి జయంతి ఇట్టే గుర్తుకువస్తుంది. ఒకసారి గతంలోకి తొంగి చూస్తే డిసెంబరు 30, 1879 వ సంవత్సరంలో తమిళనాడు రాష్ట్రం తిరుచ్చుళి లో ఒక హిందూ బ్రాహ్మణ కుటుంబంలో రమణ మహర్షి జన్మించారు. ఇతనికి తల్లి తండ్రులు పెట్టిన పేరు వెంకట్రామన్ అయ్యర్. ఇతనిని భక్తులు భగవాన్ అని కూడా సంభోదిస్తారు. 16 సంవత్సరాల వయస్సులో మోక్షజ్ఞానం పొంది తిరువణ్ణామలైలోని అరుణాచల పర్వతాలపై స్థిరపడ్డారు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిననూ మోక్షజ్ఞానం పొందిన తరువాత తనను "అతియాశ్రమి"గా ప్రకటించుకున్నారు.
రమణ మహర్షి బాల్యం:
పూర్వాశ్రమంలో రమణ మహర్షి అందరు పిల్లల లాగే సాధారణంగా ఉండేవారు. అపారమైన దేహదారుఢ్యం కలిగి ఉండేవారు. బాల్యంలో చదువు మీద ఆసక్తి లేదు. రమణులు చిన్నతనంలో బాగా నిద్ర పోయేవారు. ఎలాంటి నిద్ర అంటే ఇతను నిద్రపోయినప్పుడు తోటి పిల్లలు ఇతన్ని నడిపించి దూరంగా తీసుకువెళ్ళి బాదినా తెలిసేదికాదు. రమణ మహర్షి తండ్రి చనిపోవడం వల్ల చిన్నాన్న సుబ్బయ్యర్ రమణ అన్నయ్య నాగస్వామిని, రమణను మధురై తీసుకుని వెళ్ళిపోయాడు. రామస్వామి అయ్యర్ అనే అతను అరుణాచలం వెళ్ళివస్తుండగా రమణులు పలకరించి ఎక్కడ నుంచి వస్తున్నారు అని అడిగారు. అతను అరుణాచలం నుంచి వస్తున్నాను అని చెప్పగా, ఆమాట విన్న తరువాత అతనిలో ఏదో తెలియని గొప్ప అనుభూతి కలిగింది. అప్పటి నుంచి అల్లరిచేయడం, రుచుల కోసం ప్రాకులాడటం మానేశారు. తన గమ్యం తిరువణ్ణామలై(అరుణాచలం) అని తెలుసుకున్నారు. తన కోసం వెతకవద్దని తన తండ్రి(పరమేశ్వరుడు)ని వెతుక్కుంటూ వెళ్తున్నానని ఓ ఉత్తరం వ్రాసి అన్నయ్య నాగస్వామి పుస్తకంలో ఉంచి మధురై నుంచి అంచెలంచెలుగా ప్రయాణం చేసి అరుణాచలేశ్వరుని చెంతకు రమణ మహర్షి చేరుకున్నారు.
వారి వంశంలో ఒకరు సన్యాసి అవుతారనే శాపం నిజమైంది. ఇంటి నుంచి వెళ్లిపోయిన రమణ మహర్షి గురించి ఎంత వెతికినా ఆ కుటుంబ సభ్యులకు ఆచూకీ తెలియలేదు. కొంత కాలం తర్వాత బాబాయి సుబ్బయ్యరు మృతిచెందారు. ఆ క్రతువు నిర్వహణ సమయంలో అరుణాచలంలో రమణులు ఉన్నారనే సమాచారం తెలియడంతో వెనక్కి తీసుకువచ్చేందుకు తల్లి అళగమ్మాళ్, అన్న నాగస్వామి, మరో బాబాయి నెల్లియప్పయ్యరులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాలగమనంలో తల్లి అళగమ్మాళ్, తమ్ముడు నాగసుందరం (నిరంజనానందస్వామి), చెల్లి అలమేలు రమణ మహర్షి వద్దకే చేరుకున్నారు. 1922లో తల్లి అళగమ్మాళ్ మృతిచెందిన తర్వాత 1949 నాటికి ఆమె పేరిట మాతృభూతేశ్వర దేవాలయం నిర్మించారు. ఇప్పటికీ నిత్యపూజలు జరగటం విశేషం. మహర్షి కుటుంబ సభ్యుల జీవితాలు ధన్యమయ్యాయి. 1950 జనవరి 1న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన రమణ మహర్షి భక్తుల, శిష్యుల దర్శన మంటపానికి వెళ్ళలేదు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ 14 ఏప్రిల్ 1950 సంవత్సరం రాత్రి 8.47 గంటలకు రమణ మహర్షి తుదిశ్వాస విడిచారు. అరుణాచలేశ్వరుని స్తుతిస్తూ మహర్షి వ్రాసిన "అరుణాచల శివ ! అరుణాచల శివ ! అరుణాచల శివ !" అనే స్తోత్రాన్ని భక్తులు పాడటం పూర్తయ్యాక మహర్షి చివరి శ్వాస నిలిచిపోయింది.
రమణ మహర్షి బోధనలు:
రమణ మహర్షి బోధనలలో ప్రధానమైంది "మౌనం" లేదా "మౌనముద్ర". ఇతను చాలా తక్కువగా మాట్లాడేవారు.తన మౌనంతో సందేశం పొందలేని వారికి మాత్రమే మాటల ద్వారా మార్గం చూపేవారు. వీరి బోధనలలో ఆత్మజ్ఞానం ప్రధానాంశం. ఎవరైనా ఉపదేశించమని కోరితే, "స్వీయ శోధన" ఉత్తమమని, ఇది సూటి మార్గమని తద్వారా మోక్షం సులభ సాధ్యమని స్పష్టం చేసేవారు. వీరి అనుభవం అద్వైతం, జ్ఞానయోగాలతో ముడిపడి ఉన్నప్పటికీ ఎదుటి వారి మనస్థితిని బట్టి వారికి భక్తి మార్గాలని బోధించేవారు.
స్వీయ - శోధన ద్వారా మాత్రమే "జ్ఞాన మార్గం". వీరి బోధనలలో హిందూమత సిద్ధాంతాల ప్రకారం ఉపనిషత్తులు, అద్వైత వేదాంతంలనే కాకుండా, అనేక మత సారాంశాల మార్గాలను తన బోధనలలో బోధించేవారు. ఏ స్థితిలో ఐతే ప్రశాంతమైన మనసు నిలకడగా ఉన్న అనుభూతిని కలిగి ఉంటుందో అదే సమాధి. ఆ నిలకడగా ప్రశాంతంగా ఉన్న మనసే దేవుడి నిజరూపాన్ని దర్శించగల్గుతుంది. అదే సహజమైన సమాధి. ఇక్కడ బాహ్యప్రపంచంలో పని చేస్తున్నా కూడా మనసు నిలకడగా, ప్రశాంతంగా ఉంటుంది. అంతరాంతరాలలో నిన్ను ఏదో సత్యం కదిలిస్తున్నట్టు అనిపిస్తుంది. నీకు ఏ బాధ, కోరిక, ఆవేదన ఉండవు. ఏది నీది కాదని తెలుసుకుంటావో ఎవరైతే ఈ సమస్తాన్ని తానై నడిపిస్తున్నారో ఆ సత్యాన్ని తెలుసుకున్న నువ్వు వారితో ఎప్పుడూ అంతర్లీనమయ్యే ఉంటావు. ఈ సమాధి మాత్రమే శాశ్వతమైన ప్రశాంతం. ఈ సమాధి స్థితిలో అంత్య దశలో పరమానందాన్ని పొందుతావు. భక్తిలో పరమానందం ముందుగా వస్తుంది. ఇది అశ్రుధారలాగా, రోమాలు నిక్కబొడుచుకుని, గొంతు తడబడుతూ బయటకు ప్రజ్వలిస్తుంది. అహం నశించాక, ఈ సమాధి స్థితి చేరుకున్నాక ముందు చెప్పిన లక్షణాలు అవే నశిస్తాయి. వారు సజీవంగా లేనప్పటికీ మహర్షి బోధనలు భక్తులకు సరైన మార్గం చూపటం విశేషం. అరుణాచలం అంటే చటుక్కున గుర్తుకు వచ్చేది ఆత్మసాక్షాత్కారం పొందిన, అందరికీ సులువైన మార్గం చూపిన రమణ మహర్షి ఆశ్రమం.
[ రమణ మహర్షి ప్రియశిష్యులు కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని! = ఈ వీడియో చూడండి: https://youtu.be/tzr-chRsu2g ]
[ అరుణాచలం గురించి ఆశ్చర్యకర నిజాలు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/PRr5MjGOg_g ]
Link: https://www.youtube.com/post/Ugxl5OEEGabwPDQv2vB4AaABCQ
Post a Comment