తమిళనాడులో గల నవ గ్రహ దేవాలయాలూ, వాటి విశిష్ఠత! Temples of 9 Planets


తమిళనాడులో గల నవ గ్రహ దేవాలయాలూ, వాటి విశిష్ఠత!

జ్యోతిష్య సంప్రదాయంలోనూ, హిందువుల దైనందిన జీవిత ఆచారాలలోనూ, నవగ్రహాలకు ఎంతో ప్రాముఖ్యతుంది. మనుష్యుల స్థితి గతులూ, భవిష్యత్తూ, వ్యవహారాలపై, వీటి ప్రభావం తప్పక ఉంటుందనేది హిందువుల అభిప్రాయం. మన పురాణాల ప్రకారం, ఈ గ్రహాలకు అధిపతులు కూడా ఉన్నారు. సూర్యుడికి అధిపతి అగ్నీ, చంద్రుడికి అధిపతి వరుణుడూ, కుజుడికి అధిపతి కుమారస్వామీ, బుధుడికి అధిపతి విష్ణువూ, గురువుకు అధిపతి ఇంద్రుడూ, శుక్రుడికి అధిపతి శచీదేవీ, శనికి అధిపతి బ్రహ్మా. అదేవిధంగా, సూర్యుడు కారానికీ, చంద్రుడు లవణానికీ, కుజుడు చేదుకూ, బుధుడు షడ్రుచులకూ, గురువు తీపికీ, శుక్రుడు పులుపూ, వగరు రుచులకు అధిపతులు. సూర్యుడు ఆయనానికీ, చంద్రుడు క్షణానికీ, కుజుడు ఋతువుకూ, బుధుడు మాసానికీ, గురువు పక్షానికీ, శుక్రుడు సంవత్సరాలకూ అధిపతులు. మన ఇతిహాసాలలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్న నవ గ్రహాలను పూజించడం, హోమాలూ, వ్రతాలూ నిర్వహించడం అనేది, మన ఆచారాలలో ఒక భాగం. చాలా ఆలయాలలో, ముఖ్యంగా శివాలయాలలో, నవగ్రహాలకు మందిరాలుంటాయి. అంతేకాదు, ఈ గ్రహాలకు సంబంధించిన కొన్ని ప్రత్యేక ఆలయాలున్నాయి. సాధారణంగా, గ్రహ పీడలకూ, గ్రహాల చెడు ప్రభావం నుండి విముక్తి పొందడానికీ, నవ గ్రహాలను పూజిస్తుంటారు. అటువంటి నవ గ్రహ దేవాలయాల్లో ప్రసిద్ధి గాంచినవి, తమిళనాడులో గల కుంభకోణం క్షేత్రానికి, అతి సమీపంలో ఉన్నాయి. ఈ నవ గ్రహ ఆలయాలకు సంబంధించిన వివరాలూ, వాటి విశేషాలూ ఈ రోజు తెలుసుకుందాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి : https://youtu.be/mmVwSud_FQk ]

1. సూర్య గ్రహం, Suryanar Kovil: 

కుంభకోణానికి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో, ఈ సూర్య దేవుని ఆలయం ఉంది.  దీనిని 11 వ శతాబ్దంలో, కుళోత్తుంగ చోళుడు నిర్మింపజేశాడు. ఈ విశ్వానికి ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడు, మానవులకు ఆరోగ్యాన్నీ, సౌభాగ్యాన్నీ ప్రసాదిస్తాడని భక్తుల విశ్వాసం. ప్రతీ ఏడాది, మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా, ఇక్కడ సూర్యుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. పంటలు చేతికందే సంక్రాంతి పండుగ నాడు, ఈ దేవాలయంలో ఉత్సవాలను జరిపి, సూర్య భగవానుడికి కృతజ్ఞతలు తెలియజేస్తారు. 

2. చంద్ర గ్రహం, Thingaloor: 

కుంభకోణంలోని తిరువైయార్‌కు 5 కిలో మీటర్ల దూరంలో గల Thingaloor అనే గ్రామంలో, ఈ చంద్ర దేవాలయం ఉంది. ఈ ఆలయాన్ని ఏ కాలంలో నిర్మించారో, స్పష్టమైన ఆధారాలు లేవు. కానీ, కొంతమంది వివరణ ప్రకారం, ఏడవ శతాబ్దంలో, ఈ ఆలయం నిర్మించబడినట్లు అంచనా. తింగల్ అంటే తమిళంలో, చంద్రుడు అని అర్థం. చంద్రుని దేవాలయం ఈ ఊరిలో ఉన్న కారణంగా, దీనికి Thingaloor అనే పేరొచ్చింది. ఈ దేవాలయాన్ని సందర్శిస్తే, సుఖ జీవితం, దీర్ఘాయువు కలుగుతుందని, భక్తుల నమ్మకం. చంద్రుడు మానసిక ప్రశాంతతను కలుగుజేసి, ఒత్తిడినీ, దు:ఖాన్నీ తగ్గిస్తాడు. ఈ ఆలయంలో, తమిళ క్యాలెండర్ ప్రకారం, సెప్టెంబర్–అక్టోబర్ మాసాలలో వచ్చే పురుట్టాసి, మార్చి – ఏప్రిల్ లలో వచ్చే ఫల్గుని నక్షత్ర సమయాల్లో, చంద్ర కాంతి, ఇక్కడి ఆలయంలోని శివలింగంపై ప్రసరించటం, అత్యద్భుతమైన అంశం. 

3. శని గ్రహం, Thirunallar: 

Karaikal లో గల Thirunallar అనబడే చిన్న గ్రామంలో, శనీశ్వరునికి సంబంధించిన ప్రముఖ దేవాలయం ఉంది. ఈ ఆలయం, శని దేవునికి అంకితమైన ఏకైక ఆలయంగా, అక్కడి స్థానికుల అభిప్రాయం. మనిషి జీవితంపై శని ప్రభావం అనేది, తప్పక ఉంటుంది. ఏలిననాటి శనిప్రభావం ప్రారంభమైతే, ఏడున్నర సంవత్సరాల దాకా వదిలిపెట్టదని ప్రతీతి. అలాంటి వారు, ఈ ఆలయంలోని స్వామికి తైలాభిషేకం చేయడం, అక్కడ నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా, శని ప్రభావాన్ని చాలావరకు తగ్గించుకోవచ్చు. ఈ ఆలయ ప్రాతంలోనే, నల మహారాజును, శని, పట్టుకుని పీడించడం మొదలు పెట్టాడని, అక్కడి వారి కథనం. అంతేకాదు, నలుడు ఇక్కడ శనేశ్వరునికి పూజలు చేసిన దానికి గుర్తుగా ఉన్న నలతీర్థం, అత్యంత మహిమను సంతరించుకుంది. ఇందులో స్నానం చేస్తే, ఎటువంటి పాపాలైనా పటాపంచలైపోతాయని, భక్తుల నమ్మకం. ఇంతటి ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికీ, గ్రహానుగ్రహం పొందడానికీ, నిత్యం లక్షాలాది మంది భక్తులు వస్తుంటారు.

4. శుక్ర గ్రహం, తిరువాదుతురై: 

సూర్య దేవాలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో, వీనస్ గా పిలువబడే శుక్రునికి దేవాలయం ఉంది. దీనిని శివస్థలం అంటారు. ఈ ఆలయాన్ని మధురై మీనాక్షి దేవస్థానం వారు, నిర్వహిస్తుంటారు. ఆలయం కొలువుదీరిన తిరువాదుతురై ప్రాంతాన్ని, పలాశ వనం, బ్రహ్మ పురీ, అగ్నిస్థలమనే పేర్లతో కూడా పిలుస్తారు. ఈ ఆలయ ప్రాంతంలోనే, బ్రహ్మ దేవుడు, శివ పార్వతుల వివాహాన్ని దర్శించాడని ప్రతీతి. ఇక్కడున్న శుక్రదేవుణ్ణి దర్శించుకున్నట్లయితే, దంపతుల మధ్య గొడవులు ఏర్పడకుండా, అన్యోన్యత పెరుగుతుందట. భార్యల ఆరోగ్యం కోసం, భర్తలు పూజలు జరిపించే ప్రత్యేక ఆలయంగా, దీనికి పేరుంది.

5. గురు గ్రహం, ఆలంగుడి:

కుంభకోణానికి 18 కిలో మీటర్ల దూరంలో ఉన్న అలంగుడి ప్రాంతంలో, ఈ గురు ఆలయం ఉంది. సామాన్య శకం 1131 లో, విక్రమచోళ చక్రవర్తి, ఈ దేవాలయాన్ని నిర్మిచారు. ఇక్కడ కొలువైన శివుణ్ణి, అరన్యేశ్వర స్వామి అంటారు. స్వయంభు లింగమైన దీనిని, ఆబాత్స గయేశ్వర అని కూడా అంటారు.  ఇక్కడ దక్షిణా మూర్తీ, ఉమాదేవి అమ్మవారూ, కొలువై పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంలో ఉన్న అమృత పుష్కరిణిలోనే, అమ్మవారు పునర్జీవనం పొందిందనీ, ఇక్కడే శివునిలో ఐక్యమైందనీ, భక్తుల కధనం. గురుడు వివిధ రాశుల్లోకి ప్రవేశించే సందర్భాల్లో,  ఈ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు చేరుకుని, పూజలు చేస్తారు. 

6. బుధ గ్రహం, Thiruvangad

కుజ దేవాలయానికి పది కిలో మీటర్ల దూరంలో గల Thiruvangad లో, ఈ ఆలయం ఉంది. వాల్మీకి రామాయణంలో, ఈ ఆలయానికి సంబంధించిన ప్రస్తావన ఉంది. 3000 ఏళ్ల నాటి ఈ పురాతన ఆలయంలో, స్వామి స్వేతారన్యేశ్వరుడూ, అమ్మవారు విద్యాంబికా దేవీ, కొలువుదీరి ఉన్నారు. ఈ ఆలయంలో ఉన్న బుధుడు, ప్రతిభనూ, మేధస్సునూ, తెలివితేటలనూ, పరిపుష్టం చేస్తాడని ప్రతీతి.

7. రాహు గ్రహం, Tirunaageswaram: 

కుంభకోణానికి అయిదు కిలోమీటర్ల దూరంలోని Tirunageswaram గ్రామంలో, అతి పెద్ద రాహు గ్రహ దేవాలయం ఉంది. ఇక్కడున్న స్వామి వారు, నాగనాథ స్వామీ, అమ్మవారు, గిరి గుజాంబికా దేవి. ఈ ప్రాంతంలోనే, ఆదిశేషుడూ, దక్షుడూ, కారకోటుడూ, శివుడిని పూజించారు. చాలామంది రాహుదోషం తొలగించుకోవడానికి, ఈ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయంలో ప్రధాన పూజ, రాహువుకే జరుగుతుంది.

8. కేతు గ్రహం, KEEZHAPERUMPALLAM 

Poompuhar ప్రాంతానికి రెండు కిలో మీటర్ల దూరంలో, ఈ ఆలయం ఉంది. భారత దేశంలో, అత్యంత ప్రాచీనమైన శైవక్షేత్రం ఇది. ఇక్కడ కేతువుతో పాటు, మిగతా నవగ్రహాలకు కూడా పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో, రాహు కేతువులు జంట సర్పాకారంలో ఉంటారు. వీరికి పూజ చేస్తే, గ్రహచారం బాగుంటుందని భక్తుల విశ్వాసం.

9. అంగారక గ్రహం, Vaitheeswaran Koil

తిరువైయార్ కు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ కుజ దేవాలయం, Vaitheeswaran Koil గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడున్న స్వామిని తమిళులు, సెవ్వయ్ అని కూడా పిలుస్తారు. ఈయన శక్తికీ, సామర్థ్యానికీ, విజయానికీ, ధైర్యానికీ సంకేతం. ఈ ఆలయ ప్రాంతంలోనే, జటాయువూ, గరుత్మంతుడూ, సూర్యుడూ, అంగారకుడిని పూజించారని, స్థల పురాణం. వివాహం ఆలస్యమయ్యే వారు, ఈ అంగారక క్షేత్రాన్ని దర్శిస్తే, వెంటనే పెళ్ళి జరుగుతుందని, భక్తుల అపార విశ్వాసం. ఈ ఆలయానికి వచ్చిన భక్తులు, ముందుగా, అక్కడున్న సిద్ధామృత కుండంలో స్నానం చేసి, ఆ తరువాత స్వామిని దర్శించుకుంటారు. ఈ కుండంలోని ఔషధ జలం, చర్మ సంబంధమైన వ్యాధులను పోగొడుతుంది. ఈ ఆలయం, నాడీ జ్యోతిషంలో అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది, ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది.

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes