తిరుప్పావై గోదాదేవి 3వ పాశురం!


తిరుప్పావై గోదాదేవి 30 పాశురాలలో..

మూడవ రోజు అనగా 18.12.2020 శుక్రవారము..

3వ రోజు - భగవంతుని మూడవ స్థానం విభావం (అవతారములు)..

ఆండాళ్ తిరువడిగలే శరణం

పాశురము:

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్

తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు

ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ

పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప

తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి

వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్

నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్

విభవం (అవతారములు)

ఈ రోజు ఆండాళ్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మనకోసం ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహముగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.

"ఓంగి" పెరిగెను "ఉలగళంద" కొలిచెను "ఉత్తమన్ పేర్ పాడి" పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. అయన నామంకు ఒంగి ఉంటాడు. ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాపరాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్తకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌదర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కల్గిన వామన మూర్తిని అమ్మ ఊహించింది.

ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా భలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరగాడు! ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు. పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇది మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు. మూడో కాలు భలి తలపై పెట్టాడు, బలిఅహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలం భలికి ఇచ్చినాడు. మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది, రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది, ఈరోజు ఆయన మనల్ని ఉద్దరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది.

వ్రత ఫలితములు

ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఆండాళ్ తల్లి ఈవ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పినరోజు. పెద్దలు మనల్ని అశిర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు. మనషికి మంచి భవనాలు ఉంటే సుఖమా! లేక యంత్రాలు,వాహనాలు ఉంటే సుఖమా! లేక సమాజంలోని వ్యక్తులందరికి అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే సుఖమా! మనిషికి ఉండటానికి నీడ అవసరం - అది ప్రశాంతంగా ఉండాలి, తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి, త్రాగటానికి జలం అవసరం - అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్త కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దొంగలూ ఉండకూడదు, రోగాలు ఉండకూడదు.

మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట-అదృష్ట రెండూ ప్రయోజనాలను కల్గించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే అది అదృష్ట ఫలం, దృష్ట ఫలంగా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయిస్సు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు. మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాదిదేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమత్మకోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కరలేకుండా తరించే వీలయ్యే ఉత్తమస్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు. అక్కడికి వెల్లేముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది.

ఈ వ్రత గొప్పతనం అలాంటిది, ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది,ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది, ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది, ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి. సఖల దేవతలు శ్రీకృష్ణపరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా! ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా! ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా!.

ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేషం గుర్తుచేసుకుందాం. అజ్ఞాతవాసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి ధుర్యోధనుడు తన గూడాచారులను పంపాడు, వారికి ఎక్కడ కనబడలేదు. ఇంత పరాక్రమమైన వాల్లు దాగి ఉండటం చాల వింతయే కదా! దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లాకాదయా, వారు ఒక్కొక్కరూ నారాయణ మహామంత్రం ఉపాసన చేసిన మహనీయులు, కనక వారు ఉన్నదగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల భాద ఉండదు, ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు. అప్పుడు వారికి విరాట్ నగరం సిరిసంపదలతో కనబడింది, అందుకే ఉత్తరగోగ్రహణం చేసారు. తరువాత కథ మనకు తెలుసు, ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనం నారాయణ మహామంత్ర గొప్పతనం గమనించాలి.

"నాంగళ్" ఏం కోరిక లేని "నం పావైక్కు" లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది "చ్చాత్తి నీర్ ఆడినాల్" వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు, వ్రతం చేసినట్లే. మన కోరేది శ్రీకృష్ణ పాద సేవయే కదా! మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది, ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా, వేరుకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే.

"తీంగిన్ఱి నాడేల్లామ్" బాధలు వుండవు " తింగళ్ ముమ్మారి పెయ్దు" నెలకు మూడు సార్లు వర్షాలు కురుస్తాయి-పంటలు బాగాపండుతాయి. "ఓంగు పెఱుం జెన్నెల్" కలువ తామరలు ఏపుగా పెరిగుతాయి "ఊడు కయల్ ఉగళ" ఆ నీటిలో భలమైన చేపలు తిరుగుతింటాయి. "పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప" అందమైన పుష్పాలు పూస్తాయి, వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. "తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్" పశువులు ఇచ్చేపాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది. "నీంగాద శెల్వం నిఱైంద్" కావల్సిన ధనం, సంపదలు చేకూరుతాయి.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామివారి ప్రవచనం..

Link: https://www.youtube.com/post/UgwKUzUeqJG0bsusp4l4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes