నిశ్చల 'భక్తి'!
కావ్య కంఠ గణపతి ముని ఒకసారి అరుణాచలం వెళ్లారు. వారితోపాటు వారి తమ్ముడు కూడా వచ్చాడు. ఆయనకు జఠరాగ్ని ఎక్కువ. ఆ పిల్లాడు అన్నయ్యా ఆకలేస్తోంది అంటున్నాడు. ఆ రోజున ఏకాదశి తిధి. అందుకని ఆయన తన దగ్గర ఉన్న డబ్బులతో, ఒక డజను అరటిపళ్ళు కొన్నారు. వాడు అవన్నీ తినేశాడు. తినేసి ఒక గంట గడిచేసరికి, మళ్ళీ అతడు అన్నయ్యా ఆకలేస్తోంది అన్నాడు. అపుడు గణపతి ముని బ్రాహ్మణుల ఇంటి ముందుకు వెళ్లి, 'భవతీ బిక్షామ్ దేహీ' అంటూ, ఎవరైనా అన్నం పెడితే తమ్ముడికి పెడదామని యాచన చేస్తున్నారు. ఆ రోజు ఏకాదశి. ఎవ్వరూ అన్నం పెట్టలేదు. వీడు ఏడుపు. అపుడు ఆయన ఒక శ్లోకం చదివారు.
[ స్వర్ణ సిద్ధ యోగి కావ్యకంఠ గణపతి ముని! = ఈ వీడియో చూడండి: https://youtu.be/tzr-chRsu2g ]
[ అరుణాచలం గురించి ఆశ్చర్యకర నిజాలు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/PRr5MjGOg_g ]
బ్రాహ్మణ గృహంలో, ఎవరైనా అకస్మాత్తుగా వస్తే పెట్టడాడనికి, కొద్దిగా అన్నం ఉండేటట్లుగా వండాలి. 'ఆఖరికి కలియుగంలో వీళ్ళ అన్న పాత్రలలో అన్నం కూడా లేదన్నమాట.. ఒక్కడు కూడా అన్నం పెట్టలేదు' అని ఆయన అనుకున్నారు.
ఆయన ఒక ఇంటి ముందు నుంచి వేడుతున్నారు. ఆ ఇంటి అరుగు మీద ఒక వృద్ధ బ్రాహ్మణుడు పడుకుని ఉన్నాడు. ఆయన గభాలున లేచి, కావ్య కంఠ గణపతి మునిని పట్టుకుని అన్నాడు. 'నీవు బాగా దొరికావు. నా భార్య కు ఒక నియమం ఉంది. అందరూ ఏకాదశి వ్రతం చేసి, మరునాడు ఉదయం పారణ చేస్తే, నా భార్య ఏకాదశి నాడు రాత్రి భోజనం చేస్తుంది. కానీ, భోజనం చేసేముందు ఆవిడకు ఒక నియమం ఉంది. ఆవిడ ఎవరైనా ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టుకుని తింటుంది. ఇవ్వాళ తిరువణ్ణామలైలో యాత్రికులు కూడా ఎవ్వరూ దొరకలేదు. నువ్వు ఆకలని తిరుగుతున్నావు. మా ఇంట్లోకిరా..' అని తీసుకు వెళ్ళాడు.
ఆ ఇంట్లోని ఇల్లాలు, 'స్నానం చేసి రండి. భోజనం వడ్డిస్తాను' అంది. కావ్యకంఠ గణపతి మునీ, ఆయన తమ్ముడూ గబగబా వెళ్లి స్నానం చేసి, తడిబట్టలతో వచ్చారు. ఆవిడ మడి బట్టను ఇచ్చింది. అవి కట్టుకుని భోజనానికి కూర్చున్నారు. ఆవిడ షడ్రసోపేతమైన భోజనం పెట్టింది. భోజనం ఐన తరువాత, ఆవిడ చందనం ఇచ్చింది. ఇంటికి ఎవరైనా పెద్దలు వస్తే, భోజనం అయ్యాక చందనం పెట్టాలి. వారు అది చేతులకి రాసుకుని లేవాలి. అది ఇంటి యజమానే తీస్తే, దాని వలన ఎంతో గొప్ప శ్రేయస్సును పొందుతారు. వాళ్ళు చందనం రాసుకున్నాక, ఆవిడ తాంబూలం ఇచ్చింది.
వీళ్ళు కడుపునిండా తినేశారేమో, కళ్ళు మూతలు పడి పోతున్నాయి. 'అమ్మా , ఇంక ఎక్కడికీ తిరగలేం.. ఈ రాత్రికి మీ అరుగు మీద పడుకుంటామమ్మా..' అన్నారు. ఆవిడ సరేనని, తలుపులు వేసేసింది. వీళ్ళిద్దరూ పడుకుని నిద్రపోయారు. గాఢ నిద్ర పట్టేసింది. వీరు నిద్రించిన ఇల్లు, అరుణాచలంలో, అయ్యంకుంట్ల వీధిలో ఉంది. మరునాడు సూర్యోదయం అయ్యేసమయానికి వారికి మెలకువ వచ్చింది. ఇద్దరూ నిద్ర లేచారు. 'అమ్మయ్య.. రాత్రి ఈ తల్లి కదా మనకి అన్నం పెట్టింది' అనుకుని, అరుగు మీద నుండి లేచి చూశారు. అది వినాయకుడి గుడి. అక్కడ ఇల్లు లేదు. వాళ్ళు తెల్లబోయి, 'రాత్రి మనం షడ్రసోపేతమైన భోజనాలు తిన్నాము. ఇక్కడ రత్నకింకిణులు ఘల్లు ఘల్లు మంటుంటే, ఎవరో ఒక తల్లి మనకి అన్నం పెట్టింది. ఆ తల్లి ఇల్లు ఏది?' అని చూశారు. 'కలకానీ కన్నామా?' అనుకున్నారు. పక్కకి చూస్తే, రాత్రి ఆవిడ ఇచ్చిన తాంబూలాలు, ద్రవ్యంతో కూడా ఆ ప్రక్కనే ఉన్నాయి..
ఇప్పుడు చెప్పండి.. ఎవడు ఆర్తితో ప్రార్థన చేసి, ఎవడు ఆర్తితో పూజ చేస్తున్నాడో.. వాడు నోరు తెరచి అడగవలసిన అవసరం లేకుండా, వాడి అవసరాలు తీర్చడానికి, భగవంతుడు వాడి వెనుక తిరుగుతూ ఉంటాడు. వాడికి ఈశ్వరుని అనుగ్రహం, ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. దానికి ప్రకటనలు అక్కర్లేదు. కాబట్టి, అంత స్వచ్ఛమైన భక్తితో, అమ్మవారి పట్ల కృతజ్ఞతతో బ్రతికేవాడు ఎవడున్నాడో, వాడిని అమ్మయే కాపాడుతూ ఉంటుంది..
|| సర్వం శివమయం ||
Link: https://www.youtube.com/post/UgwHweRnFHZtlWx0_Mp4AaABCQ
Post a Comment