సత్యాన్వేషణ!
జీవితంలో ప్రతిఒక్కరూ నిజాన్నీ, నిజాయతీనీ ఇష్టపడతారు. కానీ, అది ఇతరుల్లో మాత్రమే చూడాలనుకుంటారు. తమకు మాత్రం వర్తించదనుకుంటారు కొందరు. ‘సత్యమేవ జయతే’ అనే సూత్రం పాటిస్తున్నామంటూ, అబద్ధం తప్ప, పొరపాటున కూడా నిజం చెప్పరు చాలామంది. అపనమ్మకానికి పునాది అబద్ధమే. అబద్ధాలు చెప్పడం కూడా అపరాధమే. ఆధ్యాత్మిక దృష్టిలో, అసత్యం మహా పాపం. ఎందుకంటే, అసత్యానికీ, మోసానికీ పెద్ద తేడా లేదు. మోసానికి పెట్టుబడి అబద్ధాలే.. సత్యహరిశ్చంద్రుడు సత్యదీక్ష కోసం ఎన్నో కష్టాలు పడ్డాడు కానీ, అబద్ధం మాత్రం ఆడలేదు.. ప్రస్తుత కాలంలో, కొందరు ఒక్క నిజం కూడా చెప్పరు. దొంగ సాక్ష్యాలన్నీ అబద్ధాల పునాదుల మీద కట్టినవే..
[ ఉడుపీ శ్రీ కృష్ణ విగ్రహ రహస్యం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/451l4ymbZFs ]
ఆధ్యాత్మిక రంగంలో ‘సత్యాన్వేషణకు’ ఎంతో ప్రాధాన్యం ఉంది. ఏది సత్యమో, అది నిత్యం అంటారు వేదాంతులు. భగవంతుడే సత్యస్వరూపుడంటారు. ‘సత్యమేవ జయతే’ అంటాయి ఉపనిషత్తులు. అంటే, దైవ సంకల్పానికి విజయం నిశ్చయం! వాక్కులతో ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఆత్మకు అసలు నిజం తెలుసు. మనో వేగం కన్నా, దైవజ్ఞాన వేగమే చాలా ఎక్కువంటారు. జరిగినవీ, జరుగుతున్నవీ మాత్రమే మనిషికి తెలుసు. జరగబోయేదీ భగవంతుడికి తెలుసు. దీనినే త్రికాల జ్ఞానం అంటారు. మహర్షులు త్రికాల వేదులు. అందుకే, వారు దైవ సమానులు. భగవంతుడితో మహర్షులూ, దేవర్షులూ పూజలందుకుంటారని, పురాణ ఇతిహాసాల్లో చదువుతుంటాం. లోక కల్యాణం తప్ప, వారికి ఇతర స్వార్థాలు ఉండవు. వసిష్ఠ, కశ్యప, నారద మునీంద్రులు ఈ కోవకు చెందినవారు.
ఈ ‘సత్యం’ అనే ఇరుసు మీదనే, లోకాలు పరిభ్రమిస్తున్నాయి. సుదర్శనమే లోక చక్రం. స్థితి కారకుడైన విష్ణువు, సుదర్శన చక్రంతోనే లోక కంటకులను సంహరిస్తుంటాడు. ఆగ్రహంలోనూ నిగ్రహం చూపగలవారే మహర్షులు. విశ్వామిత్రుడు ఆగ్రహంతో, తన నూరుగురు కుమారులను అంతం చేసినా, వసిష్ఠుడు విశేషమైన నిగ్రహం చూపాడు. అందుకే ఆయన బ్రహ్మర్షి కాగలిగాడు. ప్రకాశవంతంగా సూర్యుడు వెలిగే వేళ మబ్బు కప్పినంతమాత్రాన, సూర్యుడు లేడనగలమా? మనం మాయ ప్రభావంలో ఉన్నామని గ్రహించగలిగితే, మనం చూసేది సత్యం కాదని తెలుస్తుంది. ‘ఏది సత్యం’ అనే ప్రశ్నతో శోధన చేస్తే, మన కృషి తీవ్రతను బట్టి సమాధానం దొరుకుతుంది.
మానిషిలోని మమకారమే, ఆధ్యాత్మిక ప్రయాణానికి అడ్డుగోడ. అభిమన్యుడి మరణంతో కృంగిపోతున్న అర్జునుడికి, సత్యబోధ చేశాడు శ్రీ కృష్ణుడు. చంద్రుడి కుమారుడిగా అభిమన్యుణ్ని చెబుతారు. మరణానంతరం అభిమన్యుడితో అర్జునుడు సంభాషించే ఘట్టాన్ని కృష్ణుడు కల్పించినప్పుడు, ‘నీవెవరో నాకు తెలియదన్నా’డంటారు. అర్జునుడి భ్రమ తొలగిపోవడం, అక్కడ ప్రధానాంశం. కేవలం పరమాత్మ ఒక్కడే సత్యం, నిత్యం. అందుకే గీతాకృష్ణుడు ‘అన్ని ఆలోచనలూ పక్కనబెట్టి, నన్ను ఆశ్రయించు. నిన్ను నేను రక్షిస్తాను’ అన్నాడు. దేని నుంచి రక్షణ? 'అసాధ్యమైన అష్టవిధ మాయల ప్రభావం నుంచి' అని మనం గ్రహించాలి.. గీతాబోధ, అర్జునుడి కొరకే అనుకోవడం అపోహ. మనందరికీ సంబంధించినదని గ్రహిస్తే, గీత ప్రయోజనం సిద్ధించి, పరమాత్మ అనుగ్రహం లభిస్తుంది.. లోకా సమస్తా సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/UgyMtZz8gb5ioAQvsLF4AaABCQ
Post a Comment