సర్వశ్రేష్ఠ 'వాగ్భూషణం'!
మాట ఎలా ఉండాలి? మనిషి మాట్లాడే తీరును బట్టి అతని వ్యక్తిత్వం అవగతమవుతుంది, మాట్లాడే మాటను బట్టి అతని సంస్కారం అర్థమవుతుంది. మాటల్లో ఎంత మహత్తు ఉందంటే మనిషి మాట్లాడే విధానం, పద్ధతి వలన, ఉపయోగించే పదాల వలన మిత్రులు ఏర్పడతారు. బంధువర్గం ఏర్పడుతుంది, శత్రువులు కూడా మిత్రులవుతారు. వైరివర్గం బంధుగణం అవుతుంది, అలాగే మిత్రులు శత్రువులవుతారు, బంధువులు విరోధులవుతారు. అంచేత వాక్కు మనిషికి భూషణం కావాలంటే భాషణం లోనే ఉంది అంతా. అయితే ఈ భాషణం ఎలా ఉండాలీ అంటే మితం గానూ, ప్రియం గానూ, మృదువు గానూ, సత్యమైనది గానూ ఉండాలి.
[ ‘మహాభారతం’ మానవాళికి అందించే నర్మగర్భ రహస్యాలు! ఈ వీడియో చూడండి: https://youtu.be/bDCCIC1IwDk ]
నిండైన నది నిశ్శబ్దంగా ప్రవహిస్తుంది. పిల్లకాలువలుగా చీలి, గులకరాళ్ల మీద ప్రవహిస్తున్నప్పుడు గలగలమంటూ శబ్దాలు చేస్తుంది. నీళ్లతో నిండుగా ఉన్నప్పుడు కుండ తొణికిసలాడదు. ఇలాంటి ఉపమానాలు మనిషికి ఎన్ని చెప్పినా, మాట్లాడాలనుకున్నది అతడెప్పుడూ మాట్లాడటం మానడు. భావ వ్యక్తీకరణకోసం, భగవంతుడు మనకిచ్చిన మహత్తరమైన శక్తి 'మాట'. సృష్టిలో మరే జీవిలోనూ అది కనబడదు. మనసులోంచి వచ్చేదానిలా ఆ మాట ఉండాలి. మంచి అభిప్రాయం అనిపించాలి. అందరినీ ఆలోచింపజేయాలి. ప్రయోజనం కలిగించగలదై ఉండాలి.
గీతలో భగవంతుడు మనిషికి ఆహ్లాదకరంగా మాట్లాడటం నేర్చుకొమ్మని చెప్పాడు. రెచ్చగొట్టి, ప్రేలాపనలుగా అనిపించే మాటలు వద్దన్నాడు. అటువంటి మాటలు వినిపించిన తక్షణమే స్పందించ వద్దన్నాడు. మాటలు ఎప్పుడూ, సత్యాన్ని ప్రతిబింబించేవీ, ప్రియమైనవీ, ఎదుటి వ్యక్తి హితాన్ని కోరేవిలా ఉండాలన్నాడు. ఆ విధంగా మాట్లాడగలవాడిని, ‘వాక్ తపస్వి’ అన్నాడు. 'మృదుభాషణం' మనుషులందరిలో కనిపించాల్సిన లక్షణంగా, శాస్త్రాలన్నీ గుర్తించాయి. మనిషి తనను తాను సమర్థించుకునేందుకు మాట్లాడుతున్నానని, ఎవరికీ అనిపించనీయ కూడదు. అదే ఉద్దేశమైతే, అతడు మాట్లాడకుండా ఉండటమే మంచిది. కొన్ని మాటలు వింటున్నప్పుడు మధురమైనవిగా, సందేశమేదో అందజేస్తున్నవిగా అనిపించినా, అందులో అంతర్లీనంగా విషం, వ్యర్థాల వంటివి దాగి ఉండవచ్చు. అనుభవంతోకానీ, అర్థంకాని విషయమది. ఆ విధంగా మాట్లాడే మనుషుల్ని, నీతిచంద్రిక కర్త చిన్నయసూరి పయోముఖ విషకుంభాలన్నాడు.
ఆచితూచి మాట్లాడటం, అందరికీ చేతకాని అభ్యాసం. మాట నేర్పు ఉన్నవారినే, మహారాజులు రాయబారులుగా, మహామంత్రులుగా నియమించుకునేవారు. రామాయణంలో హనుమంతుడూ, భారతంలో విదురుడూ, సంజయుడూ, కృష్ణరాయల అమాత్యుడు తిమ్మరుసూ, అటువంటి మాటకారులే.. మంచి ముత్యాలనిపించే మాటలెప్పుడూ, మెరుస్తూనే ఉంటాయి. అవి పండితులకైనా పామరులకైనా, శాశ్వతంగా వినపడతాయి. వ్యక్తులు, వ్యవస్థలను విమర్శించడమొక్కటే లక్ష్యం కాకుండా, ఛలోక్తులతో, నర్మగర్భంగా, లోకజ్ఞానాన్ని ప్రస్ఫుటించే పొడుపు కథలు, ఉపమానాలతో మాట్లాడిన మాటలు, ఆత్మవిమర్శకు అవకాశమివ్వటమే కాక, కాలపరీక్షకు సైతం నిలబడతాయి. శబ్దాడంబరంతో పాండిత్యాన్ని ప్రదర్శించాలనుకుంటే, పొరపాటే అవుతుంది. వాగ్ధాటితో నిజాన్ని వక్రీకరించేవారు, వక్తలనిపించుకోలేరు. నిజాన్ని క్రమ బద్ధీకరించేందుకు చెప్పేవైనప్పుడు, మాటలు వ్యక్తిత్వానికి వన్నెతెస్తాయి. భర్తృహరి ‘వాగ్భూషణమే సుభూషణం’ అని నిర్ద్వంద్వంగా చెప్పాడు.
మాట్లాడవలసి వచ్చినప్పుడు మాట్లాడకపోవటమూ మహాపరాధమే. ధృతరాష్ట్రుడు అవసరమైనప్పుడు నోరు మెదపకుండా ఉండటం, మహాభారత యుద్ధానికి ముఖ్యకారణమని విశ్లేషకుల అభిప్రాయం. వాక్ స్వాతంత్య్రంతో మనిషికి వచ్చే స్వతంత్రం ప్రత్యేకమైనదైనా, నిజాన్ని నిర్భయంగా చెప్పడానికే అది ఉన్నదని మనుషులు గ్రహించాలి. 'మాటకు' మంత్రానికుండే ప్రభావం ఉంటుంది. అది వరమిచ్చేదిలా ఉండాలి కానీ, శాపమిచ్చేలా ఉండకూడదు. మనుషులను కలపాలి కానీ, విడదీయకూడదు. ఆ గ్రహింపు ఉంటే, మనుషులంతా మంత్రద్రష్టలవుతారు!
'మిత భాషణం'.. మితంగా, అవసరమైనంత వరకే మాట్లాడడం.. దీని వలన ఆత్మస్తుతికీ, పర నిందకూ అవకాశం ఉండదు. వాదోప వాదాలకూ, ఘర్షణలకూ తావుండదు. అనవసరమైన సంభాషణలు లేనప్పుడు కాలమూ వ్యర్థమవదు.
'ప్రియ భాషణం'.. ఎదుటి వారికి ప్రియం కలిగించేలా మాట్లాడడం.. దీని వలన మైత్రి, సఖ్యత, ప్రేమ, అభిమానం, గౌరవం ఏర్పడతాయి..
'మృదు భాషణం'.. మృదువుగా మాట్లాడడం, ఒక విధంగా కటువుగా మాట్లాడకపోవడం.. కొంత మంది మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఇంకా మాట్లాడితే బాగుండును, అనిపిస్తుంది. కొంత మంది మాట్లాడితే, వినబుద్ధి వేయదు. మాట్లాడడం ఆపేస్తే బాగుండును, అనిపిస్తుంది.. ఇంకా చెప్పాలంటే, ఆపకపోతే తిట్టాలనో, కొట్టాలనో అనిపిస్తుంది. అదే 'కటు భాషణం'.
'సత్య భాషణం'.. ఎప్పుడూ నిజాన్నే మాట్లాడడం. ఇది ఒక వ్రతం లాంటిది. గొప్ప ధర్మం. శ్రేయస్కరం కూడా. కానీ, ఒక్కొక్కప్పుడు సత్యం కూడా కఠోరంగా ఉంటుంది. అందుకే, 'నిజం నిప్పు లాంటిది' అంటారు. దాన్ని దాచలేము కూడా. నిజం చెపితే నిష్ఠూరం కూడా కలుగుతుంది. అవతలి వారి మనసు గాయపడవచ్చు. వారు బాధపడవచ్చు. అలాంటి సందర్భాలలో, వారికది ప్రియభాషణం కాకపోవచ్చు. అంచేత 'సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ నబ్రూయాత్ సత్యమప్రియం'. సత్యాన్నే పలకాలి. ప్రియంగా పలకాలి. అప్రియమైన సత్యాన్ని పలకకుండా ఉండడమే మంచిది. అంటే, నిజం చెపితే ఎవరికైనా ఏదైనా కీడు జరుగుతుందనుకున్నప్పుడు, ఆ నిజం చెప్పవలసిన అవసరం లేనప్పుడు, చెప్పకుండా ఉండడమే మంచిది. అలాగే, ఒక అసత్యం చెబితే ఎవరికయినా ఏదయినా మేలు జరుగుతుందన్నప్పుడు, అసత్యమాడినా పరవాలేదు. అదే ధర్మరాజు 'అశ్వత్థామ హతః (కుంజరః)' అని ఆడిన అసత్యం. అలాంటి సందర్భాలలో, సమయాలలో, సత్యం చెప్పకపోవడమే కాకుండా, అసత్యమాడినా దోషం అంటదనేది, శుక్రనీతి. కానీ, అది ఎల్లవేళలా పనికి రాదు.
'స్మితవక్త్రో మితభాషీ, అపూర్వభాషీచ రాఘవః' అని శ్రీరామచంద్రుని అష్టోత్తర శతనామావళిలో కీర్తించడం జరిగింది. అంటే, శ్రీరామచంద్రుడు ఎల్లప్పుడూ చిరునవ్వుతో మాట్లాడే వాడునూ, మితంగా భాషించేవాడునూ, అపూర్వంగా, అంటే, ఇంతకు ముందెన్నడూ, ఎవరూ ఎరుగని విధంగా, మహోన్నతంగా భాషించేవాడునూ.. అని కొనియాడడం జరిగింది. అందుకే అవతార పురుషుడై, మానవులందరికీ మాటల్లోనూ, చేతల్లోనూ ఆదర్శప్రాయమైన మార్గాన్ని అవలంబించి చూపాడు.
అయితే ఈ వాక్కును నిగ్రహించుకోవడం ఎలా? మనం మన మనసును నిగ్రహించుకుంటే, వాక్కును నిగ్రహించుకోగలుగుతాము. మనసు నిర్మలంగా, శుద్ధిగా ఉంటే, వాక్కు కూడా నిర్మలంగా ఉంటుంది. వాక్శుద్ధి కలుగుతుంది. అటువంటి వాక్శుద్ధి కలవారు అన్నది జరిగి తీరుతుంది, అదే పూర్వం ఋషీశ్వరులూ, మునీశ్వరులూ ఇచ్చిన శాపాలకూ, వరాలకూ ఉదాహరణ. వాక్శుద్ధి కలవారు చేసే కర్మలు కూడా, శుద్దిగానే ఉంటాయి. ఇలా మనస్సూ, వాక్కూ, కర్మా, ఈ మూడూ శుద్ధిగా ఉండడాన్నే, త్రికరణ శుద్ది అంటారు..
Link: https://www.youtube.com/post/Ugw2sVsyG9pyZm2-Z494AaABCQ
Post a Comment