పంచాయతన దేవతలు, పూజా విధానం!
ఆదిత్యం అంబికామ్ విష్ణుం గణనాథం మహేశ్వరం I
పంచదేవాన్ స్మరేన్నిత్యం పూజయేత్ పాపనాశనం II
[ ఆది శంకరాచార్యుల అసలు చరిత్ర! = ఈ వీడియో చూడండి: https://youtu.be/srTCWknBC7Q ]
ఆదిత్యం – సూర్యుడు,
అంబికా – అమ్మవారు,
విష్ణుం – మహావిష్ణువు,
గణనాథం – గణపతి,
మహేశ్వరం – ఈశ్వరుడు, ఈ ఐదుగురినీ పంచాయతన దేవతలని అంటారు. హిందూ ధర్మశాస్త్రాలు వీరిని ప్రధాన దేవతలుగా పేర్కొన్నాయి.
‘ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్' అన్నారు. సూర్యుడు ప్రత్యక్ష దైవం. కర్మ సాక్షి. యావత్ సృష్టికీ శక్తిని ప్రసాదించగల మహా తేజస్వి, ఓజస్వి. ఆయనను ఆరాధించడం ద్వారా, ధృఢ ఆయురా రోగ్యాలను పొందుతారు.
‘సాహిశ్రీరమృతాసతాం – అమ్మ వారిని మహా లక్ష్మీ, మహా కాళీ, మహా సరస్వతీ రూపమైన లలితాంబికగా ఆరాధించాలి. అమ్మవారి ఆరాధన వలన అఖండమైన వాక్ శుద్ధి, సంపద, భాగ్యం, త్రికాల దర్శనం, దివ్యదృష్టి వంటి అతీంద్రియ శక్తులు సంప్రాప్తిస్తాయి. వీటన్నింటి కన్నా, అంతఃకరణ శుద్ధి కలిగి, మానసిక పరిణతి పొందుతారు.
‘మోక్షమిచ్చేత్ జనార్ధనాత్’ – మొక్షాన్నిచ్చే వాడు మహావిష్ణువు. విష్ణువు యొక్క దశావతారాలలో ప్రధానమైనది, శ్రీకృష్ణావతారం. ‘కృష్ణస్తు భగవాన్ స్వయం’ అని అంటారు. ఆయన ఆవిర్భావం, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం. శిష్టులను రక్షించడం అంటే, కేవలం దుష్టుల నుండి కాపాడడమే కాక, పతనమయ్యే మార్గంనుండి వారిని రక్షించి, మోక్షమార్గాన్ని ఉపదేశించే భగవద్గీతా శాస్త్రాన్ని, మానవ జాతికి ప్రసాదించాడు.
‘ఆదౌపూజ్యో గణాధిప’ - ఏ కార్యమును ప్రారంభించినా, మొదటగా పూజించబడేది గణపతే.. మహా గణపతి యొక్క ఆరాధన ప్రధానంగా, యోగసాధనకు ఉపకరిస్తుంది. దీనివలన సాధనలో ప్రతిబంధకములు తొలగడమే కాకుండా, ఐహిక, ఆముష్మిక వాంఛలు కూడా నెరవేరుతాయి.
‘ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్’ - ఈశ్వరానుగ్రహం వలన ఆయుష్షు వృద్ధి పొంది, సకలైశ్వర్యాలూ సంప్రాప్తమౌతాయి. రుద్రాభిషేకాలూ, రుద్రజపం మొదలగు వాటి వల్ల, సకల దోష నివారణ కలిగి, గ్రహ బాధలు తొలగి, స్వాంతన, ఐశ్వర్యసిద్ధి, అంతఃకరణ శుద్ధి కలుగుతాయి.
కావున, నిత్యం ఈ దేవతలనారాధించే వారికి, సకల శుభములూ చేకూరుతాయని, ధర్మశాస్త్రాల యొక్క ప్రతిజ్ఞానువచనం.
అయితే, మనకు వంశపారంపర్యంగా, సంప్రదాయ సిద్ధంగా సంప్రాప్తమైన దైవం ఎవరైతే, వారిని ప్రధానంగా మధ్యలో పెట్టి, మిగిలిన నలుగురు దేవతలనూ నాలుగు దిశలలో స్థాపించి, ఆరాధించాలి. అంటే, మన ఇంటి ఇలవేల్పు విష్ణువైతే, విష్ణువుని మధ్యనుంచాలి. ఈశ్వరుడైతే ఆయనను మధ్యలో వుంచాలి..
సర్వేజనాః సుఖినోభవంతు!
[ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/Hn7wy7POWgw ]
Post a Comment