'బ్రహ్మ ముహూర్తం' అద్భుత వరం! Brahma Muhurta: Everything You Need to Know!


'బ్రహ్మ ముహూర్తం' అద్భుత వరం!

పూర్వం, కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు, మన ప్రస్తుత కాలమానం ప్రకారం, 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా, 2 ఘడియల కాలం అని అర్థం. అంటే, 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని, అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రానికి, ఇలాంటి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే, ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిదానినే, ‘బ్రహ్మముహూర్తం’ అంటారు. అంటే, రోజు మొత్తంలో, 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత, బ్రహ్మ. కాబట్టి, దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది.

[ సప్త చక్రాల వెనుక వున్న 'అద్భుత సైన్స్'! - ఈ వీడియోలు చూడండి = https://bit.ly/3iML2vp ]

నిజానికి తెల్లవారుఝామును, 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని, అనగా, 48 నిమిషముల ముందు కాలాన్ని, ఆసురీ ముహూర్తం అనీ, ఆసురీ ముహుర్తానికి ముందు, 48 నిమిషముల ముందు కాలాన్ని, బ్రహ్మముహూర్తం అనీ అంటారు. ప్రతిరోజూ బ్రహ్మముహుర్తంలో లేచి, భగవంతుని ధ్యానించి, పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా, అనేక మంది, నూతన గృహ ప్రవేశానికి, ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే, మానవుని మేథాశక్తికి, భగవంతుని శక్తి తోడవుతుంది.

పురాణగాథ!

బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై, పురాణ గాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకూ, వినతకూ జన్మించిన వాడు, అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఈ అనూరుడే సూర్యునికి రథసారథి. ఒకానొక సమయంలో, అనూరుడు జన్మించే ముందు, తల్లి వినత, పుత్రుడిని చూసుకోవాలనే కుతూహలంతో, అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతణ్ణి సూర్యునికి సారథిగా నియమించి, 'భూలోకంలో నీవు మొదటగా కనిపించిన కాలమునే, బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలూ, గ్రహలుగానీ, చెడు చేయలేవు' అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే, బ్రహ్మముహూర్త కాలం, అన్ని శుభ కార్యాలకూ ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్త కాలమున చదివే చదువూ, చేసే శుభకార్యాలూ, దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.

ఏం చేయాలి?

ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకూ ఉండే సమయం, బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికీ, విద్యార్ధులకూ, ధ్యానం, జపతపాదులు చేయువారికీ, చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనస్సు ప్రశాంతంగా ఉండి, స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనస్సు స్వచ్ఛంగా, తెల్లకాగితంలా, దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా, ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలూ, ఇష్టాయిష్టాలూ లేని సమయం.

ఈ సమయంలో మన మనస్సు ఎలా కావాలంటే అలా, ఎటు కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే, ఆ సమయంలో యోగులూ, పరమహంసలూ, సన్యాసులూ, ఋషులూ, హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ, వారి వారి తపః శక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన, ఆ సమయంలో చేసే ధ్యానం, మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే, చాలామంది ఆ సమయంలో, నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ, ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలూ, ధ్యానాలూ, సాధనలూ లేకపోయినా, కనీసం మేలుకుని ఉండమంటారు, మన పెద్దవాళ్లు.

చల్లని నీటితో తలస్నానం, చాలా మంచిది. దీంతో మెదడూ, కళ్లూ, చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలూ, కీర్తనలూ, స్తోత్రాలూ సాధన చేయటం చాలా మంచిది. బరహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకూ, యోగాకూ, ప్రాణాయామానికీ ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి, అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు, 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన, మనస్సు త్వరగా, భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.

బరహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన, సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులూ, యోగులూ, ఈ సమయంలో, బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో, వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే, ధ్యానం బాగా కుదురుతుంది. ముందు మనం, మన అంతర్యామిలోని ఆత్మలో లీనమై, తద్వారా పరమాత్మను చేరుకుంటాము.

Link: https://www.youtube.com/post/UgxZBxrQhGzG4fArjcx4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes