'నేను' అంటే ఎవరు? శరీరమా? లేక ఆత్మా? Who am I?


'నేను' అంటే ఎవరు? శరీరమా? లేక ఆత్మా?

'నేను' అనే పదాన్ని కూడా ఉచ్చరించే స్థితిలో లేదు నేటి సమాజం. అంతగా మనుష్యులందరూ, వారి వారి పనులతో, మరియు సమస్యలతో సతమతమవుతూ ముందుకు వెళుతున్నారు. అలాంటిది, వారు నేనెవరు? శరీరమా లేక ఆత్మా? అని తెలుసుకునేంత సమయం ఎక్కడుంటుంది? కానీ, వారికి ఎన్ని పనులున్నా మరియు ఎన్ని సమస్యలున్నా, మనసు మాత్రం తన పని తానూ చేసుకుంటూ పోతుంది. అది ప్రతి రోజూ గుర్తు చేస్తూ ఉంటుంది. దానిని మనం లెక్క చేయం. ఎందుకంటే.. అది మనకు గుర్తు చేసిన విషయాన్ని తెలుసుకోవాలంటే ఏం చేయాలో, ఎలా ముందుకు అడుగు వేయాలో, మనకు తెలియదుగనుక. పోనీలే ఎప్పుడైనా మనం తెలుసుకోవాలని ఎవరినైనా అడుగుదామంటే, వారికీ తెలియదు. పోనీలే అని వారి వారి మత గ్రంధాలు చెదివి తెలుసుకుందామనుకుంటే, అది పూర్తిగా అర్ధం కాదు. అప్పుడు ఎలా తెలుసుకోవాలో తెలియక, మళ్లీ మన పనులలో మనం తలమునకలై, దానిని వదిలేస్తుంటాం.

[ జీవితమే ఒక పరీక్ష! = ఈ వీడియో చూడండి: https://youtu.be/GaDOxcDxuLo ]

నీవెవరు? అన్న విషయాన్నీ మరియు దేవుడు ఎవరన్న జ్ఞానాన్నీ తెలుపడానికి, ఈ భూమి మీదకు వచ్చిన పరమాత్మ స్వరూపులయిన వీరబ్రహ్మేంద్ర స్వామి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా వంటి వారు బోధనలు చేసినపుడు, వారిని దేవుడు అని అంటాము.. కానీ, వారు బోధించిన జ్ఞానాన్ని మాత్రం అంతగా పట్టించుకోము. పైగా, అప్పుడు కూడా మనం మన అల్పమైన కోరికలను కోరుకుని, వారిని కూడా ఇబ్బంది పెడతాము. వారు మన దౌర్భాగ్య పరిస్థితిని చూసి, వీళ్ళకు నచ్చచేప్పేదెలా? అని మదనపడ్డారు. ఇదే విషయాన్ని సాయిబాబా స్వయంగా తన భక్తులతో ఇలా చెప్పారు.. నా దగ్గర చాలా జ్ఞాన సంపద ఉన్నది.. నేను మీకందరికీ బంగారు వస్త్రాలు ఇద్దామని అనుకుంటే, మీరు మాత్రం, నా దగ్గరికి వచ్చి, చినిగిపొయిన పాత వస్త్రాలను అడుగుతున్నారు.. మరీ అల్పమైన కోరికలను కోరితే, నేనేం చేసేది? అని అయన భక్తులతో చెప్పి, ఎంతగానో మదనపడ్డారట..

కానీ, ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.. నేనెవరు? పోనీ కాసేపు నేను శరీరం అని అనుకుందాం.. నేను శరీరం అని అనుకుంటే, మనకు మొదటగా వచ్చే జ్ఞాపకం, మన పేరు. అది ఏదైనా కావచ్చు.. సరే, మనం శరీరం అనుకుంటే, ఇలానే శాశ్వతంగా శరీరంతోనే ఉంటామా? అంటే, లేదు.. అని మొదటగా మన మనస్సు, మనకు జవాబు చెప్పేస్తుంది. అప్పుడు మనకు, అవును మరి నిజమే కదా? మన పూర్వీకులు ఎవరూ ఇప్పుడు లేరు.. వారంతా చనిపోయారు కదా? అంతేగాక, ఈ శరీరం శాశ్వతంగా ఉండాలని ఎన్నో తపస్సులు చేసి, మరియు ఎన్నో వరాలు పొందిన రాక్షషులు కూడా, చివరకు నాశనమయ్యారు.. అంటే, శరీరాన్ని విడిచారు కదా? అని మనకు గుర్తు వస్తుంది. అయితే 'నేను' ఈ శరీరం కాదు.. మరి నేనెవరు? అనేది ఇక్కడ మనకు తేలాల్సిన విషయం!

ఈ శరీరం నువ్వు కాదు అనే విషయాన్ని తెలుపడానికే, శ్రీ షిరిడి సాయిబాబా వారు, తన భక్తులకు ఒకసారి ఈ విధంగా చేసి చూపారు. అదేంటంటే, బాబా ఒకసారి తన భక్తులతో, ‘నేను ఈ శరీరాన్ని వదలి వెళ్లి, మూడు రోజుల తరువాత తిరిగి వస్తాను’ అని చెప్పారు. రెండు రోజుల తరువాత, భక్తులు ఏంచేయాలో పాలుపోక సతమతమవుతూ వుండగా, ఆ ఊరి పెద్ద, వేరే పట్టణం నుండి వైద్యుణ్ణి పిలుచుకుని వచ్చి, శవానికి పరీక్ష చేయించాడు. అప్పుడా వైద్యుడు, 'ఈయన చనిపోయాడు, బ్రతికే అవకాశం లేదు' అని చెప్పాడు. అపుడా ఊరి పెద్ద, దహన సంస్కారాలు చేయండని చెప్పాడు. కానీ, ఊరి వారందరి బలవంతం కారణంగా, మూడు రోజుల తరువాత బాబా వస్తానని చెప్పారు.. కాబట్టి మూడు రోజులు వేచి చూద్దామన్నారు. అందరూ ఎదురు చూస్తుండగా, మూడు రోజుల తరువాత బాబా మరల తన శరీరం లోకి వచ్చారు. చూశారుగా.. సాయిబాబా ఎంత గొప్ప ప్రయోగం చేశారో. దేనికి ఇదంతా చేయవలసి వచ్చిందంటే.. ఈ శరీరాలు మీరు కాదు! అని నిరూపించడానికే, ఆ మహానుభావులు ఆ విధంగా, ప్రత్యక్షంగా చేసి చూపించారు..

మరి నేను ఈ శరీరం కాదన్నప్పుడు, నేను వేరే ఏదైనా ఉండి ఉండాలి.. “దేన్నయితే మనస్సు గ్రహించలేకపోయినా, దేని చేత మనస్సు సర్వస్వం గ్రహిస్తున్నదో.. దేన్నయితే కళ్ళు చూడలేకపోయినా, దేనిచేత కళ్ళు చూడగలుగుతున్నాయో.. దేన్నయితే చెవులు వినలేకపోయినా, దేనిచేత చెవులు వినేశక్తిని పొందగాలుగుతున్నాయో.. దేన్నయితే ముక్కు వాసన చూడలేకపోయినా, దేని చేత ముక్కు వాసన చూడగలుగుతుందో.. అదే ఆత్మ స్వరూపం” అని కేనోపనిషత్తులో సవివరంగా తెలియపరిచారు. అంటే, మన శరీరం, మనస్సు మరియు బుద్ధి, అన్నీ ఒక ఆత్మ శక్తి ద్వారానే పనిచేస్తున్నాయి. ఆ శక్తి మాత్రమే శాశ్వతం.. అదియే నీవు.. ఆ శక్తి ఎప్పుడైతే శరీరాన్ని వదలి వెళుతుందో, అపుడు ఆ శరీరం నిర్జీవమవుతుంది.. అప్పుడు శరీరంలోనివి ఏవీ పనిచేయవు..

మానవుని శరీరంలో ఆత్మ రాజయితే, మనస్సు మంత్రి, లేక సైన్యాధిపతి అయి నడుస్తూ ఉన్నాడు.. ఆత్మ రాజయినప్పటికీ, సాక్షిమాత్రంగా సంచరిస్తూ ఉండడం వలన, మంత్రే (మనస్సు) స్వతంత్రించి నడుస్తూ, అహంకారంతో ప్రవర్తించడం జరుగుతోంది. మనస్సనే మంత్రి, రాజును మించిపోయి నడుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే మనిషి ఆత్మే 'నేను' అనే జ్ఞానాన్ని తెలుసుకుని, అంటే, రాజే 'నేను' అని తన రాజ్యాన్ని పాలించాలని పూనుకుని, పనిచేసుకుంటూ వెళతాడో, అప్పుడు మనస్సనే మంత్రి ఏమీ చెయ్యలేడు. జ్ఞానమార్గంలో ఇంద్రియాలను అంతర్ముఖం చెయ్యటం వలన, మనస్సు ఆత్మలో లయించ వలసి వస్తుంది. అప్పుడు ఆత్మే రాజై, శాంతి సౌఖ్యాలను అందిస్తుంది. ఎప్పుడైతే జ్ఞానాన్ని గ్రహించి, 'నేనే ఆత్మను' (రాజును) అని తెలుసుకుంటూ ముందుకు వేళతామో, అప్పుడు మనసు (మంత్రి) అందుకు సహకరిస్తుంది.. 

[ జీవితం అంటే..! = ఈ వీడియో చూడండి: https://youtu.be/L6oFrjCLTJM ]

[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]

[ ఏది దారి? = ఈ వీడియో చూడండి: https://youtu.be/3k6gzpMZ2kw ]

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes