మానవాళికి నీతినీ, రీతినీ ప్రబోధిస్తున్న శతకం!
ఈ ప్రపంచం అంతా అపార కారుణ్యం తోనే బ్రతుకుతోంది. కారుణ్యం లోనే వర్ధిల్లుతోంది. కారుణ్యం తోనే, పరమావధిని చేరుకుంటోంది. ఇది సత్యం. కారుణ్యమే లేకుంటే, ఈ జగత్తు సృష్టికీ, స్థితికీ, లయకీ అర్థమే ఉండదు. కారుణ్యం దైవగుణం. కరుణామయులై, కోరిన వరాలు అందిస్తూ కాపాడతారనే, దేవతలను మానవులు కొలుస్తున్నారు. ఆపదలు వచ్చినప్పుడు, వారే ఆదుకుంటారనే నమ్మకం, మనిషిని బ్రతికిస్తోంది.
[ సాక్ష్యాత్ పరమేశ్వరుడే రాముడికి బోధించిన గీత! = ఈ వీడియో చూడండి: https://youtu.be/B1YsHv-KmO0 ]
త్రేతాయుగంలో భూమిపై అవతరించి ధర్మాన్ని కాపాడిన శ్రీరాముడు, మానవాళికి ఆదర్శ పురుషుడైనాడు. భద్రగిరిగా, భద్రాచలంగా ప్రసిద్ధి చెందిన దివ్యధామాన్ని నిర్మించిన వాడు, ప్రముఖ రామ భక్తుడు కంచెర్ల గోపన్న. ఇతడికే రామదాసు అనే పేరు కూడా ఉంది. రాముడిపై అకుంఠిత భక్తితాత్పర్యంతో కంచెర్ల గోపన్న రాసిన స్తుతి, ‘దాశరథి శతకం’. ఈ శతకానికి అతడు ‘దాశరథీ! కరుణాపయోనిధీ!’ అనే మకుటాన్ని నిర్దేశించాడు.
ఈ శతకంలోని పద్యాలన్నీ రత్నాలే. వాటి కాంతి వందల ఏళ్లయినా, ఏమాత్రం తరిగి పోకుండా, వెలుగులు చిమ్ముతూ, మానవాళికి నీతినీ, రీతినీ ప్రబోధిస్తున్నాయి. రామన్నను, గోపన్న అనేక విశేషణాలతో కీర్తించాడు. అతడి భావనలో రాముడు..
రంగద రాతి భంగుడు - ప్రకృష్ట శత్రువులను సైతం ఓడించేవాడు..
ఖగరాజ తురంగుడు - పక్షిరాజైన గరుత్మంతుని వాహనంగా చేసుకొన్న విష్ణువు..
విపత్ప రంపరోత్తుంగ తమః పతంగుడు - ఎన్ని ఆపదల చీకట్లనైనా చీల్చివేయగల సూర్యుడు..
పరితోషిత రంగుడు - రంగనాథుణ్ని సంతోషంలో ఓలలాడించినవాడు..
దయాంత రంగుడు - దయగల మనసు గలవాడు..
సత్సంగుడు - సజ్జనులతో కూడినవాడు..
ధరాత్మజాహృదయ సారసభృంగుడు - భూసుత అయిన సీతాదేవి హృదయ పద్మంలో తిరిగే తుమ్మెద వాడు..
శుభాంగుడు - మంగళ ప్రదమైన శరీరంగలవాడు..
ఇలాంటి దశరథాత్మజుని అనేక విధాలుగా కీర్తించాడు గోపన్న. ప్రాణుల ఆర్తిని, తన ఆర్తిగా భావించి, గోపన్న రాముడికి ఇలా విన్నవించాడు..
‘రామా'.. 'శరీరంలోని అయిదు ఇంద్రియాలు ప్రలోభపెట్టి, ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. వాటి నుంచి రక్షించు..
ఏనుగు శరీరచాపల్యంతో, శరీరాన్ని కృశింపజేసుకుంటోంది..
చేప ఎరను తినడానికి యత్నించి, జిహ్వేంద్రియం వల్ల ఇతరులకు దొరికిపోతున్నది..
పాములు మధుర సంగీతానికి మోహపడి, శ్రవణేంద్రియం కారణంగా చిక్కిపోతున్నాయి..
జింకలు కన్నులతో ఆకర్షణకు లోనై, ప్రాణాలు అర్పిస్తున్నాయి..
పూలవాసనలతో తుమ్మెదలు నశిస్తున్నాయి..
..ఇలా పంచేంద్రియాలూ ప్రాణులను వశంచేసుకొని బలిచేస్తున్నాయి. వీటి నుంచి ప్రాణులను కాపాడు'.
'రామా'.. 'తల్లిదండ్రులూ, భార్య, సంతానం, చుట్టాలూ, అందరూ నిమిత్తమాత్రులే.. ప్రాణి పుట్టే సమయంలో ఒంటరి గానే భూమిపైకి వస్తుంది. చివరికి మరణించే సమయంలో కూడా, ఒంటరి గానే వెళ్లిపోతుంది. లోకంలో కనబడేదంతా మాయే. ఈ కపటపు మాయ నుంచి నన్ను కాపాడు'..
ఇలా ఎన్నో నీతులకు ఆలవాలం, 'దాశరథి శతకం'. మనిషి తానెందుకు పుట్టాడో వివేచించుకోవాలి. బతికినంతకాలం, ఏయే పనులు చేయాలో నిర్ణయించుకోవాలి. జీవన సంధ్యాకాలాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో, ప్రణాళికను సమకూర్చుకోవాలి. భగవంతుడు ప్రసాదించిన ఆయుష్యాన్ని, సంపూర్ణ ఫలంగా అనుభవించాలే కానీ, వ్యర్థం చేసుకోకూడదు. ఇదే ఈ దాశరథి శతకంలో ప్రతిబింబించే పరమార్థం..
Link: https://www.youtube.com/post/Ugw2uCNznSU8PfAxiLd4AaABCQ
Post a Comment