మాఘ శుద్ధ చతుర్థి ప్రత్యేకత! Magha Shuddha Chathurthi


మాఘ శుద్ధ చతుర్థి ప్రత్యేకత!

నేడు వర చతుర్థి, తిల చతుర్థి, కుంద చతుర్థి, భౌమ చతుర్థి.. పవిత్ర మాసాలుగా చెప్పబడిన వాటిలో 'మాఘ మాసం' ఒకటి. ఈ మాసంలో తెల్లవారు జామున చేసే స్నానాల వలనా, సూర్యారాధన వలనా విశేషమైన ఫలితాలు లభిస్తాయనేది, మహర్షుల మాట. ఈ మాసంలో వచ్చే చవితిని, అంటే, మాఘ శుద్ధ చవితిని 'వర చతుర్థి', 'తిల చతుర్థి',  'కుంద చతుర్థి' అని పిలుస్తుంటారు.

[ అంపశయ్యపై ఉన్న భీష్ముడు ధర్మరాజుకు చెప్పిన కథ - ‘పగ’! = ఈ వీడియో చూడండి: https://youtu.be/t43ByMxiNNs ]

'వర చతుర్థి' రోజున గణపతిని పూజించడం మంచిదని, ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ విధంగా చేయడం వలన, ఆ స్వామి అనుగ్రహంతో, తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. ఇక ఈ రోజున నువ్వులు దానం చేయడం వలన, గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయి. అందువలన, దీనిని 'తిల చతుర్థి' అని కూడా అంటారు. ఇక ఈ 'కుంద చతుర్థి' రోజున, శివుడిని 'మొల్ల' పువ్వులతో పూజించడం వలన కూడా, విశేషమైన ఫలాలు లభిస్తాయని చెబుతారు.

తిల చతుర్థి రోజు నువ్వులు ఎందుకు తినాలి?

మాఘమాసంలో వచ్చే ముఖ్యమైన  రోజులలో, తిల చతుర్థికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. తిలలు అంటే నువ్వులు కదా? ఈ రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తినాలని చెపుతోంది మాఘపురాణం. నువ్వులు అనగానే, మనకి వంటల్లో వాడే పదార్థాలతో పాటు, పర్వదినాల్లో వదిలే పితృ తర్పణాలు కూడా గుర్తొస్తాయి. ఈ తిల చతుర్థి రోజు నువ్వులతో చేసిన వంటకాలు తినటమే కాదు, నువ్వుల ఉండలు చేసి పంచుతారు, నువ్వులని బ్రాహ్మణులకు దానమిస్తారు. మాఘమాసం మొదలయ్యక వచ్చే ఈ తిథినాడు, నువ్వులు తినటం వెనక ఒక శాస్త్రీయ రహస్యం కూడా దాగి ఉంది. చలి కాలం వెళ్లి, ఎండాకాలం వచ్చే ఇలాంటి సమయంలో వచ్చే ఎండలకి, ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకుంటాయి. సూర్య కిరణాలు చర్మంపై పడి, చర్మ కణాలు ప్రమాదాలకి గురవుతాయి. నువ్వులను తినటం వలన, చర్మ కణాలకు కలిగే సమస్యలను తగ్గిస్తుంది. ఇవి కిరాణాలకు బహిర్గతమైనపుడు, చర్మ కణాలకు కలిగే మరకలనూ, మచ్చలనూ, నువ్వులలో ఉండే మూలకాలు, శక్తి వంతంగా తగ్గిస్తాయి.

నువ్వులతో ఉపయోగాలు:

ఎముకల బలహీనతతో బాధపడే  వారు, చెంచాడు నువ్వుల్ని నాన బెట్టి, ఉదయాన్నే పాలలో కలిపి సేవిస్తే, ఈ రుగ్మతల నుంచి బయట పడవచ్చు. పిల్లలకిగానీ, పెద్దవారికి గానీ, రక్త హీనత తగ్గి రక్తం బాగా వృద్ధిచెందాలంటే, టీస్పూన్‌ నువ్వులు నానబెట్టి, నిత్యం మూడు నెలలపాటు తీసుకుంటే, రక్తం వృద్ధి చెందడమే కాకుండా, ఉదర సంబంధ వ్యాధుల్ని నిర్మూలిస్తుంది. నువ్వుల నూనెలో క్యాల్షియం అధికంగా ఉండటం వల్ల,  కీళ్ళ ను కాపాడుతుంది. కొబ్బరినూనె, లేదా మస్టర్డ్ వంటి ఇతర నూనెలతో పోల్చినప్పుడు, నువ్వుల నూనె చాలా తేలికగా జీర్ణం అవుతుంది. ఈ నూనె మీ పెద్ద ప్రేగు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అంతే కాదు, నువ్వుల నూనెలో ఉన్న మెగ్నీషియం, ఆస్తమా, లో బ్లడ్  ప్రెషర్ వంటి వాటిని తగ్గిస్తుంది. మధుమేహగ్రస్తుల్లో, హై బ్లడ్ ప్రెజర్ ఉన్నప్పుడు, నువ్వుల నూనె చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. నువ్వులు దంత క్షయాన్ని పోగొడుతుంది. దంత సమస్యలూ, చిగుళ్ళ సమస్యలనూ, చిగుళ్ళ నుండి రక్తం కారటాన్నీ తగ్గిస్తుంది. థ్రోట్ ఇన్ఫెక్షణ్ తొలగించి, పళ్ళకు బలాన్ని చేకూర్చుతుంది. నువ్వుల నూనెతో ఆయిల్ పుల్లింగ్ కూడా చెయ్యొచ్చు. 

ఇన్ని గుణాలు ఉన్నాయి కాబట్టే, తిల చతుర్థి అని, నువ్వులకి కూడా ఒక ప్రత్యేక రోజుని కేటాయించారు మన పెద్దవాళ్ళు..

[ గణపతిని పూజించే పాశ్చాత్య దేశాలు! = ఈ వీడియో చూడండి: https://youtu.be/PU6pP-tN6Ts ]

Link: https://www.youtube.com/post/Ugx5ItESxA4LurZZ5P14AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes