ఆంజనేయ స్వామికీ తమలపాకులకూ ఉన్న అనుబంధం!


ఆంజనేయ స్వామికీ తమలపాకులకూ ఉన్న అనుబంధం!

సీతమ్మ తల్లికి శోకాన్ని పోగొట్టి ఓదార్పునిచ్చిన వాడూ.. రామయ్య తండ్రికి సీతమ్మ జాడ తెలిపి, దుఃఖాన్ని దూరంచేసినవాడూ.. రామలక్ష్మణులు నీకు మిత్రులేకానీ, వాలి పంపగా వచ్చినవారు కారని, సుగ్రీవునికి శాంతిని కలుగజేసినవాడూ.. నీ అహంకారం, నీ పరదారాపేక్షే నీకు మృత్యువును తెచ్చిపెడుతుంది.. అని నిర్భయంగా రావణునికి చెప్పినవాడూ.. 'ఆంజనేయుడు'. ఆంజనేయుడు, శివాంశ సంభూతుడని శాస్త్ర వచనం. శివుని 11వ అవతారంగానూ, వైశాఖ మాస బహుళ దశమి తిథి, హనుమజ్జయంతిగానూ, పరాశర సంహిత తెలియజేస్తుంది. వాయు దేవుని అనుగ్రహంతో పుట్టినవాడుగనుక, వాయు సుతుడని పేర్గాంచాడు..

[ ఔరంగజేబుని హడలెత్తించి పరుగెత్తించిన ఆంజనేయస్వామి! = https://youtu.be/pmdh0JhWyMY ]

ఆంజనేయ స్వామిని తమలపాకులతో పూజించిన వారందరికీ, సకల శుభాలూ, ఆయురారోగ్యాలూ కలుగుతాయనడంలో ఎటువంటి సందేహమూ అఖ్ఖర్లేదు. ఆంజనేయునికి తమలపాకుల పూజ చేయడానికి, ఒక కారణం ఉంది. అదేంటంటే.. ఒకసారి సీతమ్మతల్లి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దక వచ్చిన ఆంజనేయుడు, శ్రీరాముడిని, 'స్వామీ.. ఏమిటది? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు, ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు, ఆరోగ్యానికి చాలా మంచిది.. అని చెప్పగానే, వెంటనే ఆంజనేయుడు అక్కడి నుండి వెళ్లిపోయి, కొంత సేపటికి ఒళ్లంతా తమలపాకులను కట్టుకుని, గంతులు వేసుకుంటూ ఆనందంగా వచ్చాడు. స్వామివారు ఎక్కువగా తమలపాకు తోటల్లోనూ, కదళీవనం, అంటే, అరటి తోటల్లోనూ విహరిస్తారు. ఆంజనేయస్వామి రుద్ర సంభూతుడు. తమలపాకులు శాంతినిస్తాయి. అందువలన, తమలపాకులతో పూజించడం వలన, మనకు కూడా శాంతీ, సుఖమూ లభిస్తాయి. తమలపాకులకు మరోపేరు, నాగవల్లీ దళాలు. తమలపాకులతో పూజించడంవలన, నాగదోష శాంతి కూడా జరుగుతుంది.

మరో కథ ప్రకారం.. అశోకవనంలో ఉన్న సీతమ్మవారికి, హనుమంతుడు రాములవారి సందేశము చెప్పినప్పుడు, అమ్మవారు ఆనందంతో, దగ్గరలో పువ్వులు కనిపించక, హనుమంతునికి తమలపాకుల దండ వేశారట.. అందుకే, స్వామికి తమలపాకుల దండ అంటే ప్రీతి అని చెబుతారు. అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన, అనేక ప్రయోజనాలు చేకూరుతాయి..

అరటి తోటలో హనుమంతునికి పూజ, కోటిరెట్లు ఫలితం..

శత వృద్ధ జిల్లేడు, తెల్ల జిల్లేడు వేరు చెక్కతో, హనుమంతుని ప్రతిమను చేయించి, అరటితోటలో పూజించుట వలన, సత్వరం హనుమంతుడు అనుగ్రహిస్తాడు. అరటి తోటలో హనుమంతునికి పూజ కోటి రెట్లు ఫలితాలను ఇస్తుంది. అరటి పండ్ల నివేదన, సింధూర సమర్పణ, శని, మంగళ వారములలో, తమలపాకులతో పూజ, హనుమంతుని ఆరాధనలో ముఖ్యమైనవి. హస్త, మృగశీర్షా నక్షత్రములతో కూడిన ఆది వారాలు, మారుతికి ఇష్టమైన రోజులు. భూత, ప్రేత పిశాచాది బాధలూ, రోగాలూ, కష్టాలూ తొలగడానికీ, అభీష్ట సిద్ధికీ, ఆంజనేయ ప్రదక్షిణములు శ్రేష్ఠం. స్వామి మహిమలు పరాశర సంహిత, ఉమా సంహిత, హనుమ సంహిత, తదితర గ్రంథాలు చెబుతున్నాయ. హనుమారాధన, భోగ, మోక్షములను రెండింటినీ ఇస్తుంది. రామ భజన ఎక్కడ జరుగుతున్నా, హనుమంతుడు వచ్చి కూర్చుంటాడని, భక్తుల విశ్వాసం. ఆంజనేయుని చూసి, మానవులు పట్టుదలా, కార్యదీక్షాదక్షతా, మాట నేర్పు, ఇలాంటివెన్నో తెలుసుకోవాలి..

అంజనేయ స్వామిని తమలపాకులతో పూజించటం వలన కలుగు ప్రయోజనాలు..

1. ఆంజనేయ స్వామికి లేత తమలపాకుల మాలను వేస్తే, రోగాలతో ఇబ్బందులు పడేవారికి, త్వరగా గుణం కనిపిస్తుంది..

2. ఇంట్లో మాంత్రిక దోషాలు ఉన్నవారు, ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే, మంత్ర సంబంధమైన పీడలు తొలగిపోతాయి..

3. సంసారంలో ప్రశాంతత లేని వారు, స్వామికి తమల పాకుల హారాన్ని వేయిస్తే, సంసారంలో సుఖం లభిస్తుంది..

4. కొందరు చిన్న పిల్లలు ఎంత ఆహారాన్ని తిన్నప్పటికీ, సన్నగానే ఉంటారు. చాలా నీరసంగా కనిపిస్తుంటారు. ఇలాంటి వారు, స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే, ఆరోగ్యం బాగుపడి, చక్కగా ఎదుగుతారు..

5. వ్యాపారంలో చాలా నష్టాలు వస్తుంటే, స్వామికి తమలపాకుల హారాన్ని వేయించి, తమలపాకులూ, పండ్లూ, దక్షిణ సమేతంగా దానం చేస్తే, వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది..

6. ఏ వ్యక్తి అయితే హీనంగా చుడబడుతాడో, అటువంటి వ్యక్తి, స్వామికి తమలపాకుల హారాన్ని సమర్పిస్తే, సంఘంలో గౌరవం లభిస్తుంది..

7. శనైశ్చర దృష్టి ఉన్నవారు, ఆంజనేయ స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే, శనీశ్వరుని అనుగ్రహం కలుగుతుంది..

8. వైద్య పరంగా నయంకాని వ్యాధులు ఉన్నవారు, స్వామికి తమలపాకుల హారాన్ని వేసి, ప్రసాదాన్ని స్వీకరిస్తే, అన్ని రోగాలూ నయమవుతాయి..

9. సుందర కాండ పారాయణం చేసి, స్వామికి తమలపాకుల హారాన్ని వేస్తే, అన్ని కార్యాలలో విజయం సిద్ధిస్తుంది..

10. హనుమాన్ చాలీసా చదివి స్వామిని ప్రార్ధించి తమలపాకుల హారాన్ని వేస్తే పరమాత్ముని అనుగ్రహం కలుగుతుంది..

11. వాద ప్రతి వాదాల్లో స్వామిని ప్రార్ధించి, తమలపాకుల హరాన్ని సమర్పించి, ప్రసాదం తీసుకుంటే, జయం మీదే అవుతుంది..

12. తాంబూల దానంతో గంగా దేవి సంతృప్తి పడుతుంది. పర్ణ ప్రసాదాన్ని ఆంజనేయ స్వామి పూజల్లో కూడా వాడతారు. తమలపాకులతో మాలనుచేసి ఆంజనేయ స్వామికి వేస్తారు..

Link: https://www.youtube.com/post/Ugx2b2r3v5_Oy_SiTpR4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes