శివుడి చెల్లెలి గురించి చాలామందికి తెలియని చరిత్ర!
హైందవ ధర్మంలో అపార శక్తికీ, అనంతమైన జ్ఞానాగ్నీకీ ప్రతీకగా, ఆ లయకారుడిని ఎల్లవేళలా, అచంచలమైన భక్తి శ్రద్ధలతో కొలుస్తాము. ఆదీ, అంతం లేనివాడిగా, సమస్త సృష్టికీ రక్షకుడిగా, ఆ మహేశ్వరుడ్ని పూజిస్తాం. అయితే, మన పురాణాలలో, ఆ పరమేశ్వరుడి గురించిన ఒక గాథ, అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అదేమిటంటే, శివ కుటుంబం యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు, ఆయన భార్య అయిన పార్వతీ దేవీ, కుమారులైన విఘ్నేశ్వరుడూ, కుమార స్వాముల గురించి అందరూ చెబుతారు. అయితే, శివుని చెల్లెలి గురించి తెలుసా? అని అడిగితే, చాలా మంది తెలియదనే జవాబే చెబుతురు. ఇక్కడ చాలా మందికి ఒక సందేహం కూడా వస్తుంది. అదేమిటంటే, శివుడు జనన మరణాలు లేని వాడు కదా, మరి ఆయనకు చెల్లెలు ఎలా ఉంటుంది? అని. ఈ సందేహానికి సమాధానంగా, మన పురాణాలలోని ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. దాని గురించి ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాం..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/jCJYZ0sonsA ]
శివపురాణం ప్రకారం, శివ పార్వతుల వివాహానంతరం, పార్వతీ దేవి కైలాసానికి వెళ్లింది. అయితే, అక్కడందరూ మగవారే ఉండడం, తనతో మాట్లాడడానికి ఒక్క ఆడతోడు కూడా లేకపోవడంతో, చాలా బాధకు గురైంది. ఆ బాధ తీరాలంటే, శివునికి ఒక చెల్లెలు ఉంటే బాగుంటుందనీ, ఆమెతో సరదాగా గడపవచ్చనీ భావించి, తన కోరికను ఒకానొక సమయంలో శివునితో చెప్పింది. దానికి శివుడు, సరస్వతి నాకు చెల్లెలితో సమానం, కావున నీవు సరస్వతీ దేవితో రోజంతా గడుపు అని చెప్పాడు. దానికి పార్వతీ దేవి, ‘స్వామీ, సరస్వతి బ్రహ్మకు భార్య కావడం చేత, ఆవిడ రోజూ, ఎన్నో పనులలో తలమునకలై ఉంటుంది. అందువల్ల, తను నాతో పూర్తి సమయం గడపలేదు. కాబట్టి, నాకొక ఆడపడుచుని సృష్టించి ఇవ్వండి. ఆమెతో నేను సరదాగా గడుపుతాను’, అని అడిగింది. పార్వతీ దేవి కోరికను మన్నించిన శివుడు, తన శక్తిని ఉపయోగించి, ఒక మహిళను, అచ్చం తన పోలికలతో సృష్టించి, ఆమెకు అసావరీ దేవి అనే పేరు పెట్టి, ఆమెను జాగ్రత్తగా చూసుకోమని పార్వతీ దేవికి చెప్పి, అక్కడి నుండి వెళ్లిపోయాడు.
అసావరి చూడడానికి కాస్త బొద్దుగా, పొడవాటి నల్లని కురులతో, శివుని వలే జంతు చర్మాన్ని ధరించి, పగిలిన పాదాలతో ఉంది. తనకు ఆడపడుచు దొరికిందనే ఆనందంతో, పార్వతీదేవి ఆమెకు స్నానం చేయించి, కొత్త దుస్తులు ఇచ్చింది. అప్పుడు అసావరి, తనకు బాగా ఆకలిగా ఉందని అడగడంతో, వెంటనే పార్వతీ దేవి, రుచికరమైన ఆహారాన్ని సిద్ధం చేసి పెట్టింది. అయితే, అసావరి ఆకలికి కైలాసంలోని ఆహారం మొత్తం హరించుకుపోయింది. అయినా, ఆమె ఆకలి తీరలేదనీ, తనకి ఇంకా ఆహారం కావాలనీ, పార్వతీ దేవిని అడుగుతూనే ఉండడంతో, ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడింది జగన్మాత. ఈ సమస్యకు పరిష్కారం, తన పతియే చెప్పగలడని, పార్వతి శివుని వద్దకు బయలుదేరగా, అసావరి పార్వతిని బంధించి, తన కాలి క్రింద పగులులో దాచేసింది.
ఈ తతంగం అంతా గమనిస్తున్న పరమేశ్వరుడు, అసావరి వద్దకు వచ్చి, పార్వతీ దేవి ఏక్కడుందని అడిగాడు. దానికి అసావరి, తనకు తెలియదని అబద్ధమాడింది. అసావరి అబద్ధమాడిందని తెలిసిన శివుడు, పార్వతి ఎక్కడుందో చెప్పమని హెచ్చరించాడు. అందుకు భయపడిన అసావరి, తన కాలిని కదిలించి, పార్వతిని విడుదల చేసింది. అతి కిరాతకంగా ప్రవర్తించిన అసావరిపై తీవ్ర కోపంతో పార్వతి, ఆమెను వెంటనే కైలాసం వదిలి వెళ్లిపోవాలని అజ్ఞాపించింది. దానికి పరమేశ్వరుడు, అసావరిని జాగ్రత్తగా చూసుకోవాలని మాట తీసుకున్నాను. మరి ఆ మాటను తప్పుతావా అని అడిగాడు.
మాట తప్పినందుకు క్షమాపణ కోరిన పార్వతీ దేవి, అసావరి దురుసు ప్రవర్తన వల్ల, ఆమెతో ఉండడం చాలా కష్టంగా ఉందనీ, ఆమె వినయ విధేయతలు కలిగి ఉంటే, తనకు ఎటువంటి ఇబ్బందీ లేదనీ, శివునితో చెప్పింది. దానికి శివుడు, ‘నీవు అసావరి దుర్మార్గాన్ని తట్టుకోలేకపోయినప్పుడు, ఇక పూర్తి మంచితనాన్ని ఎలా భరించగలవు? ఎప్పుడైనా, ఎక్కడైనా, రక్త సంబంధం లేని ఇద్దరు స్త్రీలు, ఒక్క నీడలో కలసి మెలసి ఉండలేరు’ అని పార్వతితో చెప్పి, అసావరిని మరో చోటుకు పంపించేశాడు శంకరుడు. ఈ కఠోరమైన సత్యాన్ని, సర్వజగత్తుకూ తెలియజేయడానికే, ఆ పరమేశ్వరుడు ఈ విధమైన లీలావిలాసాన్ని ప్రదర్శించాడేమో! బీహార్, భాగల్పూర్ లోని కహల్గావ్ లో, శక్తి పీఠంగా భాసిల్లుతోంది, అసావరీ దేవి ఆలయం.. ఈ ఆలయం తంత్రవిద్యా సాధనకు ప్రసిద్ధి..
సర్వం శివమయం!
Link: https://www.youtube.com/post/Ugz_VLxk2nnH895n7Il4AaABCQ
Post a Comment