యద్భావం తద్భవతి!


యద్భావం తద్భవతి!

ఇది ప్రసిద్ధ చైనా కవి 'సటంగ్ పో' జీవితంలో జరిగిన యదార్థ ఘటన.

ఆయన జీవిత కాలం, సామాన్య శకం 1036 నుండి 1100 మధ్యకాలం. ఆయన రాజాస్థానంలో, సాహిత్య విభాగానికి అధిపతి..

[ అహం! = ఈ వీడియో చూడండి: https://youtu.be/nhLpOnRzktw ]

ఒకసారి ఆయన దిన చర్యలలో భాగంగా, బుద్ధుని ఆలయానికి వెళ్ళాడు..

అక్కడొక సన్యాసి కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. తాను కూడా వెళ్ళి అతని పక్కన కూర్చుని, ధ్యానం చేశాడు..

ధ్యానానంతరం ఆ సన్యాసిని, 'నేను ధ్యానం చేసేటప్పుడు ఎలా కనిపించాను?' అని అడిగాడు..

'బుధ్దినిలా కనిపించారు' అని చెప్పి, 'మరి నేనెలా కనిపించాను?' అని అడిగాడు సన్యాసి..

'పెంట కుప్పలా కనిపించారు' అన్నాడు సటంగ్ పో, అతిశయంగా..

ఆ మాటలకి సన్యాసి చిరునవ్వు నవ్వాడు..

ఊహించని ఆ పరిణామానికి విస్తుపోయిన కవి, 'మీకు కోపం రాలేదా?' అని అడిగాడు..

'కోపమెందుకు? మన మనసు ఎలా వుంటే, ఎదుటివారు అలా కనిపిస్తారు.. 

నా మనసు నిండా బుద్ధుడు నిండి వున్నాడు కాబట్టి, నువ్వు నాకు బుధ్దినిలా కనిపించావు..

నీ మనసు నిండా పెంట వుంది కాబట్టి, నీకు నేను పెంటకుప్పలా కనిపించాను' అని వివరించాడు సన్యాసి..

దానితో సటంగ్ పో ముఖం చిన్నబోయింది..

ఈ సంఘటన ద్వారా మనం గమనించాల్సిన ధర్మం, నీతి ఏమిటంటే..

'యద్భావం తద్భవతి' అని వేదంలో చెప్పినదానికి ఇది చక్కని, సరియైన ఉదాహరణగా చెప్పుకోవచ్చు..

మన మనస్సు దేనితోనైతే నిండి ఉంటుందో.. అది భయంతోగానీ, అసూయతోగానీ, ధైర్యంతోగానీ, ఆధ్యాత్మిక వైరాగ్యంతోగానీ కావచ్చు.. దానితోనే మన చూపూ, మన ఆలోచనలూ, మన చేతలూ ఆధారపడి ఉంటాయని అర్ధం..

ఒకరిపై ఒకరు అసూయతో, ద్వేషంతో, మనం మన జీవితాన్నే పూర్తిగా వ్యర్థం చేసుకుంటున్నాము. అందుకు మనం ఎదుటివారికంటే ముందు, మన మనస్సును తెలుసుకుని, ఆ మనస్సు దేనితో నిండి ఉందో కనుక్కుని సరిదిద్దుకున్నప్పుడు, మన జీవితం సార్ధకతమవుతుంది.. అందుకు మన పురాణాల్లో, 'సర్వం ఆ పరమేశ్వరుడి శక్తి నిండి వుంది.. నీలో కూడా ఆ శక్తే ఉన్నది.. నీవు ఆ శక్తినే చూడాలి.. అంతేకానీ, ఆ శక్తిని నీలోనూ, బయటి ప్రపంచంలోనూ, వేరు వేరుగా చూడకూడదు..' అనే ఉద్దేశ్యంతో, సనాతనంగా ఒక ప్రణాళికతో, బాల్యం నుండీ ధర్మ బోధనలు, గురు ముఖంగా నేర్పింపబడేవి.. అందువల్ల, పూర్వ కాలంలోని ప్రజలు ధర్మబద్ధంగా జీవించారు.

మరి ఇప్పుడున్న కాలంలో అలాంటి ధర్మ బోధనలు ఏవి? ఎక్కడ బోధించ బడుతున్నాయి? ధర్మం అనే పదం ఒకటి ఉందనే సంగతి కూడా ఇప్పటి కొంతమంది పిల్లలకి తెలియదు. ఈ పోటీ యుగంలో ఇవి అవసరం లేదనీ, పోటీతత్వమే ఊపిరిగా సాగుతున్న బోధనలు మారాలి.. అంత వరకూ, భావి తరాలను దృష్టిలో ఉంచుకుని, కనీస భాద్యతగా, తల్లిదండ్రులే ఈ ధర్మ బోధనలు తమ పిల్లలకు అందే విధంగా చూడాలి.. ధర్మో రక్షతి రక్షితః

Link: https://www.youtube.com/post/UgziTuNnE0-7dzKudJt4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes