కురుక్షేత్ర సంగ్రామంలో బలరాముడు ఎందుకు పాల్గొనలేదు?
శ్రీ మహావిష్ణువు కృష్ణ పరమాత్ముడిగా, దేవకీమాత అష్టమ గర్భాన అవతరించడానికి ముందు, ఆ తల్లి సప్తమ గర్భాన ప్రవేశించిన ఆదిశేషువు అంశ అయిన బలరాముని, యముడు తన మాయ చేత ఆకర్షించి, రోహిణీ దేవి గర్భంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఇలా గర్భ సంకర్షణముచే జన్మించడం వలన, ఈయన సంకర్షణుడయ్యాడు. బలరామ కృష్ణులిద్దరూ సాందీపుడి వద్ద శిష్యరికంజేశారు. బలవంతులకే బలవంతుడుగనుక, ఈయన బలరాముడిగా సార్ధక నామధేయుడయ్యాడు. అంతటి బల సంపన్నుడూ, సాక్ష్యాత్తూ శ్రీ కృష్ణ పరంధాముడి సోదరుడూ, భీమ, దుర్యోధనులకు గురువు అయిన బలరాముడు, కురుక్షేత్ర సంగ్రామంలో ఎందుకు పాల్గొనలేదు? అనే విషయాలు, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/XMr1YBV4Zv8 ]
సంస్కారవంతులు ఎల్లప్పుడూ హంగు, ఆర్భాటాలకు దూరంగా ఉంటారు. లోకనీతి వీరికి తెలుసు కాబట్టి, ధర్మాన్ని కాపాడాలనే అవ్యక్తమైన అలజడి, అంతరంగాల్లో అంతర్లీనంగా కొనసాగుతుంది. అలాంటి విభిన్నమైన ఆలోచనా, అందరికీ మంచే జరగాలనే సదుద్దేశం, మహాభారతంలోని బలరాముడి రూపంలో కన్పించింది. భూత, భవిష్యత్, వర్తమానాలను, చేజేతులా లిఖించుకుని బాధపడే రోజును చూడకూడదనుకునే వైవిధ్యం, బలరాముడిది. బలరాముడు... రోహిణీ వసుదేవుల తనయుడు.. కృష్ణుడికి అన్న, యాదవులకు ఆప్తుడు, భీమ దుర్యోధనులకు గురువు. మంచిని మాత్రమే కోరుకునే బలరాముడు, తప్పును నిలదీసేవాడు. ద్వాపరయుగ ధర్మాలైన దయ, తపస్సును వీడనివాడు బలరాముడు. ఆయనకు ఆగ్రహం వచ్చినా, అనుగ్రహం వచ్చినా తట్టుకోవడం కష్టమేనన్నది నానుడి. మల్లయుద్ధంలో భీమునికీ, గదా యుద్ధంలో దుర్యోధనునికీ శిక్షణ ఇచ్చి, వారికి గురువైనాడు. అందుకే, కురుక్షేత్రం చివరలో, వీరి మధ్య పోరును చూసి తట్టుకోలేకపోయాడు.
భీమదుర్యోధనులు తనకు రెండు కళ్లలాంటివారనీ, వారి శౌర్యపరాక్రమాలు, ప్రజల రక్షణకు ఉపయోగపడాలే గానీ, పరస్పర వైరానికి కాదనీ పరితపించాడు. కృష్ణుడు పాండవ పక్షాన నిలిస్తే, బలరాముడు కౌరవ పక్షపాతి. అలాగని అధర్మానికి సహకరించేవాడని కాదు. ఇరువురూ బంధువులే కదా.. ఇద్దరి క్షేమం కోరడంలోనే న్యాయముందనేవాడు. జాంబవతీ శ్రీ కృష్ణుల కొడుకు సాంబుడు హస్తినాపురానికి వెళ్లినప్పుడు, దుర్యోధనుని కూతురు లక్షణను ఇష్టపడి, ఆమెను పెళ్లి చేసుకోవాలని భావించాడు. దీంతో, ద్వారకకు ఆమెను తన రథంపై ఎక్కించుకుని బయలుదేరాడు. ఇంతలో విషయం తెలిసిన కౌరవులు, అతడిని బంధించారు. కౌరవులు బంధువులే కాబట్టి, వారితో యుద్ధం చేయడం సబబు కాదనీ, తానే వెళ్లి విషయం చర్చిస్తానని, బలరాముడు బయలుదేరాడు.
కురు యోధులు, చిన్న యువకుని బంధించడం సరికాదనీ, బంధు మర్యాద పాటించే వాడిని గనుక, సావధానంగా మాట్లాడుతున్నాననీ, దుర్యోధనునితో బలరాముడు అన్నాడు. ఆ మాటలు విన్న దుర్యోధనుడు, వారిని చేతగాని వారితో పోల్చి, అవమానించాడు. బంధుప్రీతి వారిపట్ల పనికిరాదని నిర్ణయించుకున్న బలరాముడు, మహోగ్రుడై, హస్తినాపుర నగరాన్ని తన నాగలితో సగానికి చీల్చడంతో, అల్లకల్లోలం మొదలైంది. కురు ప్రముఖులు వచ్చి క్షమాపణ కోరడంతో, బలభద్రుడు శాంతించాడు.
ఉత్తర, అభిమన్యుల వివాహ వేడుకలో, తొలిసారిగా కురుపాండవుల గురించి, తన అభిప్రాయాన్ని ప్రకటించాడు బలరాముడు. బంధుత్వంలో వచ్చే విభేదాలు, సమాజానికి అధర్మ మార్గాన్ని సూచిస్తాయనీ, కురుపాండవులు అది అర్థం కానివారు కాదనీ, కలత చెందేవాడు. యుద్ధానికి ముందు, అర్ధ రాజ్యానికి హక్కుదారులైన పాండవుల తరఫున దూతను పంపి, అర్థించడం మంచిదని సలహా ఇచ్చాడు. ఈ నెపంతో కురుపాండవుల మధ్య యుద్ధం రాకూడదనే భావన, బలరాముడిది. కానీ, యుద్ధం తప్పలేదు. ద్వేషం, కోపం, అత్యాశలే కురుక్షేత్ర యుద్ధాన్ని సృష్టించాయనీ, అది వారికే పరిమితం కాకుండా, లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెట్టబోతోందనీ భావించిన బలరాముడు, తీర్థయాత్రలకు వెళ్లిపోవాలని నిశ్చయించుకున్నాడు.
42 రోజుల తీర్థయాత్ర ముగించుకుని, కురుక్షేత్ర సంగ్రామం చివరిలో, తీవ్రమైన వ్యథతో, హస్తినకు చేరుకున్న బలరాముడికి, భీమ దుర్యోధనుల యుద్ధం కంటపడింది. భయంకరంగా, దుర్యోధనుని తొడలు చీల్చుతున్న భీముణ్ణి వారిస్తూ, అధర్మమని, తన నాగలి తీసి అతడిపైకి వస్తున్న బలరాముడ్ని చూసి, కృష్ణుడు వారించాడు. క్షత్రియ ధర్మం ప్రకారం, న్యాయమని సర్ది చెప్పడంతో, తన శిష్యులిద్దరూ పరస్పరం కలహించుకుంటుంటే చూడలేక, ద్వారకకు తరలి వెళ్లాడు. కురుక్షేత్ర యుద్ధం తరువాత, బలరాముడు అరణ్యంలో ఒక వృక్షం క్రింద కూర్చుని, ధ్యానంలో నిమగ్నమైన సమయంలో, ఆయన నోటినుండి తెల్లని సర్పం బయటకు వచ్చి, పడమటి సముద్రంలో కలిసిపోయింది. బలరాముడు ఆదిశేషువు అవతారామనడానికి, ఇదివొక నిదర్శనము.
ధర్మో రక్షతి రక్షితః
Link: https://www.youtube.com/post/Ugzo5hn_ogYikhU7SQ54AaABCQ
Post a Comment