విక్రమార్క సింహాసనం - బేతాళ కథల అసలు చరిత్ర!
పట్టుదలకు మారుపేరు విక్రమార్కుడు. బుద్ధి కుశలతలకూ, అమోఘమైన తెలివితేటలకూ చరిత్రకెక్కిన వీరుడు, విక్రమాదిత్యుడు. అందరికీ సుపరిచితమైన విక్రమార్క - బేతాళ కథలు కల్పితాలా? అసలు మన పురాణాలలో ఈ విక్రమాదిత్యుడి గురించి ఏం వివరించబడి ఉంది? విక్రమాదిత్యుడు, అన్ని వరాలను పొందడానికీ, ఎన్నో విజయాలు చేజిక్కించుకోవడానికీ గల కారణం, అతని గత జన్మ సుకృతమా? మన ఇతిహాసాలలో వివరించబడిన విక్రమార్కుడి సింహాసనం విశిష్ఠతలేంటి? దానిని ఎవరిచ్చారు? ఆయన మరణం తరువాత ఆ దివ్య సింహసనం ఏమైపోయింది - అనేటటువంటి ఆసక్తికర విషయాల గురించి, భవిష్య పురాణంలో వివరించబడిన కథను తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/WQR82kdltXo ]
ద్వాపర యుగాంతం, కలియుగ ప్రారభంలో రాజ్యపాలన చేస్తున్న మహారాజు ప్రమరుడు. ఆతని తరువాత వరుసగా, మహామదుడూ, దేవాపీ, దేవదూతా, గంధర్వసేనా, శంఖుడు. దేవేంద్రుడు భూలోకానికి వీరమతి అనే అప్సరసను పంపగా, ఆమెను శంఖుడు వివాహం చేసుకున్నాడు. వీరికొక పుత్రుడు జన్మించాడు. ఆ బాలుడు జన్మించగానే, అన్నీ శుభ శుకనాలే కనిపించాయి. దేవతలు పూల వాన కురిపించారు. దాంతో, శంఖుడు తన కుమారుడికి గంధర్వసేనుడనే పేరుపెట్టాడు. ఆ కాలంలో శివదృష్టి అనే విప్రుడు, ఘోరమైన తపస్సుతో, పరమేశ్వరుడి అనుగ్రహం పొంది, శివస్వరూపుడయ్యాడు. అయితే, గంధర్వ సేనుడి పాలనలో రాజ్యం, శకుల హస్తగతమైంది. వారు దుష్టులు. ప్రజలను అనేక విధాలుగా హింసించేవారు. వారి చేతి నుండి రాజ్యాన్ని తిరిగి కాపాడుకోవడం కోసం, ఆనాడు శివానుగ్రహం పొందిన శివదృష్టి, గంధర్వసేనుడికి కుమారుడిగా జన్మించాడు. అతడే విక్రమాదిత్యుడు. అతడికి చిన్నతనం నుండీ, తెలివితేటలు మెండుగా ఉండేవి. విక్రమాదిత్యుడు, అయిదు సంవత్సరాల వయస్సులోనే, తపస్సు కోసం అడవులకు వెళ్లిపోయాడు. అలా 12 సంవత్సరాల పాటు ఘోరమైన తపస్సునాచరించాడు. శివుడు ప్రత్యక్షమై, అనేక మంత్రజాల వస్తువులను అనుగ్రహించాడు. వాటితోపాటు, భూగర్భంలో ఉన్న అంబావతి అనే నగరంలోని దివ్య సింహాసనాన్ని బయటకు తెప్పించి, విక్రమాదిత్యుని శక్తి సామార్థ్యాలు తెలుసుకునేందుకు, ఒక పరీక్ష పెట్టాడు.
ఈ సింహాసనానికి 32 మెట్లున్నాయి. ఆ మెట్ల మీద వరుసగా, 32 సాలభంజికలున్నాయి. ఈ సింహాసనం అధిరోహించాలంటే, ఒక్కో సాలభంజిక ఒక్కో చిక్కు ప్రశ్నను వేస్తుంది. వాటికి సమాధానం చెబితేనే, ఆ సింహాసనాన్ని అధిరోహించగలవు.. అని సూచించాడు శివుడు. ఆ విధంగానే, 32 సాలభంజికలూ అడిగిన ప్రశ్నలకు తగిన సమాధానలను చెప్పి, ఆ సింహాసనాన్ని తన కైవసం చేసుకున్నాడు, విక్రమాదిత్యుడు. తపస్సు ముగించుకుని, శకులతో యుద్ధం చేసి, తిరిగి రాజ్యాధికారాన్ని చేపట్టాడు. విక్రమాదిత్యుడు ఉజ్జయినిని రాజధానిగా చేసుకుని పాలిస్తూ, అక్కడి మహాకాళుణ్ణి ఎంతో భక్తితో సేవించేవాడు. విక్రమాదిత్యుడు ఒక అద్భుతమైన ధర్మసభని నిర్మించాడు. ఆ సభామండపంలో, రకరకాల మణి మణిక్యాలతో పొదిగిన స్తంభాలను అమర్చాడు. మహాద్భుతంగా, అచ్చెరువొందే శిల్పకళాచాతుర్యంతో విలసిల్లే ఆ సభలో, శివుడు ప్రసాదించిన సింహాసనాన్ని ప్రతిష్ఠింపచేశాడు. ఆ సింహాసనాన్ని అధిష్ఠించడానికి మునుపే, వేదధర్మాలూ, స్మృతి ధర్మాలనూ ఆకళింపు చేసుకున్నాడు. అయితే, ఎంతో మహిమాన్వితమైన దివ్య సింహాసనాన్ని అధిరోహించబోయే ముందు, విక్రమాదిత్యుడిని మరొకసారి పరీక్షించాలని, పార్వతీ దేవి, వైతాళుడిని పంపించింది. ఆ వైతాళుడు, ఒక పండితుడి రూపంలో సభకు విచ్చేయగా, విక్రమాదిత్యుడు ఆయనను సాదరంగా స్వాగతించి, సత్కరించి, అసీనుడిని చేశాడు.
అప్పుడు వైతాళుడు, విక్రమార్కుడి కుశాగ్రబుద్ధిని పరీక్షించాలని, ‘మహారాజా, మీకు కొన్ని కథలను చెబుతాను. వాటిని విని, మీరు సరైన సమాధానం చెప్పాలి’ అని కోరాడు. అందుకు రాజు విక్రమార్కుడు సరే అనడంతో, వైతాళుడు ఒక అయిదు కథలను వివరించగా, వాటికి సరైన సమాధానాలను చెప్పాడు. దాంతో అతనిని జయిూభవ! విజయిూభవ! అని ఆశీర్వదించి, దగ్గరుండి సింహాసనాన్ని అధిరోహింపజేశాడు. ఆనాటి నుండీ, ఆ సింహాసనం మీద కూర్చునే, రాజ్యపాలన చేసేవాడు. అందుకే, అది విక్రమార్క సింహాసనంగా ప్రఖ్యాతి గడించింది. విక్రమార్కుడు తన సొదరుడు భట్టితో కలిసి, రాజ్యాన్ని జనరంజకంగా పాలిస్తుండేవాడు. పార్వతీ దేవి పంపిన వైతాళుడు, ఆ సింహాసనాన్నీ, దాని మీద కూర్చునే విక్రమాదిత్య మహారాజునీ, నిరంతరం రక్షించే పనిలో నిమగ్నమై ఉన్నాడు. విక్రమాదిత్యుడు పాలించిన కాలంలో, ఎంతో దేదీప్యమానంగా వెలుగొందిన ఆ సింహాసనం, ఆయన తదనంతరం, తిరిగి భూగర్భంలో కలిసిపోయింది. అయితే, విక్రమార్కుడి కథలో ముఖ్య పాత్ర పోషించే వ్యక్తి బేతాళుడు. మనం ఇప్పటి వరకు తెలుసుకున్న కథ, మన పురాణంలో వివరించబడి ఉన్నది.
కానీ, కొన్ని గాథల ప్రకారం, అడవులకు వెళ్లి తపస్సు చేసి, ఐశ్వర్యం సంపాదించే క్రమంలో ఒక భిక్షువు, బేతాళుడి గురించి వివరించి, తన పూజ కోసం అతనిని తీసుకురమ్మని విక్రమార్కునికి చెప్పాడు. చెట్టుపై కూర్చుని ఉన్న భూతాల రాజైన బేతాళుడిని భుజాన వేసుకుని నడుస్తుండగా, అతడు ప్రశ్నలు అడగడం, దానికి విక్రమార్కుడు సమాధానాలు చెప్పడం, నోరు మెదిపి సమాధానం చెప్పగానే, బేతాళుడు అతని భుజంపైనుండి మాయమై, తిరిగి చెట్టెక్కిపోతుండేవాడు. అయినా, పట్టువదలక, భిక్షువుకిచ్చిన మాట కోసం, బేతాళుడిని ప్రసన్నం చేసుకున్నాడు. అయితే, భిక్షువు క్షుద్రుడనే విషయం తెలుసుకుని, అతనిని సంహరించి, బేతాళుడి నుండి అనేక వరాలను పొందాడు. ఇదే మనందరికీ తెలిసిన కథ. ఇదే ప్రస్తుతం మనుగడలో ఉన్న విక్రమార్క-బేతాళ కథ. కానీ, మన పురాణాలలో వివరించబడిన దానికీ, దీనికీ చాలా తేడా ఉంటుంది. పార్వతీ దేవి పంపిన వ్యక్తి, వైతాళుడుగా చెప్పబడే బేతాళుడు. రాజుకు అయిదు కథలను చెప్పి ప్రశ్నలడగగా, స్మశానంలో భూతాల రాజైన బేతాళుడు, విక్రమార్కుడికి 25 కథలను వివరించినట్లుగా తెలుస్తోంది. వీటిలో మన పురాణంలో చెప్పబడిన వైతాళుడి అయిదు కథలనూ, 32 సాలభంజికలు వేసిన చిక్కు ప్రశ్నలనూ, విక్రమార్కుడి సమాధానాలనూ, మన తదుపరి వీడియోలలో తెలుసుకుందాము.
Post a Comment