విష్ణుమాయ – కలహప్రియుడు నారదుడి గత జన్మల రహస్యం! Narada Muni


విష్ణుమాయ – కలహప్రియుడు నారదుడి గత జన్మల రహస్యం!

అహో దేవర్షిర్ధన్యోఽయం యత్కీర్తిం శార్‌ఙ్గధన్వనః ।

గాయన్మాద్యన్నిదం తన్త్ర్యా రమయత్యాతురం జగత్ ॥

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/YJ6MQDbYjoM ​]

దేవర్షి అయిన నారదుడు ఎంతోధన్యుడు. ఎందుకంటే, ఆయన నిత్యం వీణ మ్రోగిస్తూ, హరిగుణగానము చేస్తూ, పారవశ్యము నొందుతూ, ఈ జగత్తునంతటినీ ఆనందింపజేస్తూ ఉంటాడు. త్రిలోక సంచారి అయిన నారద మహర్షి, బ్రహ్మ మానస పుత్రుడూ, నారాయణుడికి పరమ భక్తుడు. ఆయన వాక్చాతుర్యం అమోఘం. ఎన్నో సద్గుణాలు కలిగిన నారదుడు, కలహప్రియుడిగానే అందరికీ సుపరిచితం. బ్రహ్మ కంఠం నుండి సృష్టించబడిన నారదుడి వృత్తాంతం ఏంటి? నారదుడిని బ్రహ్మ ఎందుకు శపించాడు? బ్రహ్మచారిగా హరి నామ స్మరణ చేస్తూ తిరిగే నారదుడు, స్త్రీ రూపంలోకి మారడానికి కారణమేంటి? స్త్రీ రూపంలో ఉన్న నారదుడికి పుట్టిన పిల్లలు ఎవరు? అనేటటువంటి ఆసక్తికర అంశాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము.

ఆ శ్రీమన్నారాయణుడి అజ్ఞతో, సకల సృష్టినీ ప్రారంభించాడు బ్రహ్మదేవుడు. ఆయన వెనుక భాగం నుండి, అధర్ముడూ, ఎడమ భాగం నుండి అలక్ష్మీ, నాభి నుండి దేవశిల్పి అయిన విశ్వకర్మ, ఆ తరువాత అష్టవసువులూ ఉదయించారు. బ్రహ్మ మనస్సు నుండి, సనక, సనందన, సనాతన, సనత్కుమారులనబడే నలుగురు పుత్రులూ, ముఖం నుండి స్వాయంభువమనువు, అతని భార్య శతరూప కూడా జన్మించగా, వారితో బ్రహ్మ, 'మీరందరూ సృష్టి కార్యాన్ని చేయండి' అని ఆదేశించాడు. పరమభాగవతులై, సంసార జీవతం మీద విరక్తి చెందిన బ్రహ్మ మానస పుత్రులు, సృష్టి కార్యాన్ని తిరస్కరించి, తపస్సు చేసుకోవడానికి వెళ్లి పోయారు. ఆ తరువాత బ్రహ్మ మరల, మహర్షులను సృష్టించాడు. వారే, పులస్త్యుడూ, పులహుడూ, అత్రీ, క్రతూ, ఆరణీ, అంగీరసా, భృగూ, దక్షుడూ, కర్దా, పంచశిఖుడూ, వోఢూ, నారదా, మరీచీ, అపాంతరా, వశిష్ఠా, హంసా, యతి. 

సృష్టి కార్యం కోసం అవిర్భవింపబడిన వీరిలో, నారదుడు బ్రహ్మ మాటను ధిక్కరించాడు. ‘మాకు పూర్వం జన్మించిన వారు, సృష్టి కార్యం నిర్వహించకుండా తపస్సులో నిమగ్నమయ్యారు. వారిని వదిలి, మమ్మల్ని ఎందుకు సంసారకూపంలోకి తోస్తున్నారు? మాకు కూడా సంసారం చేసి, సృష్టి కార్యాన్ని కొనసాగించాలన్న ఇచ్ఛ లేదు. తపోవృత్తిని ఆశ్రయించి జీవించడమే మా కోరిక’.. అంటూ, బ్రహ్మకు ఎదురు నిలిచాడు. నారదుడి ధిక్కార ధోరణిని తట్టుకోలేని బ్రహ్మ, 'నేటి నుండీ నీలో జ్ఞానం నశిస్తుంది. నీవు గంధర్వుడిగా జన్మించి, స్త్రీ లోలుడివైపోతావు. మరోక జన్మలో దాసి కుమారుడిగా జన్మించి, విష్ణు భక్తులకు సేవ చేయడం ద్వారా పుణ్యాన్ని సంపాదించి, తరువాతి కల్పంలో, నా కుమారుడిగా జన్మిస్తావు' అంటూ బ్రహ్మ శపించాడు. ఆ విధంగానే, నారదుడు ఉపబర్హణుడనే గంధర్వుడిగా జన్మించి, చిత్రరథుడి కుమార్తెలైన యాభైమంది గంధర్వకన్యలను వివాహం చేసుకున్నాడు. 

వివిధ రకాల శృంగారభోగాలనుభవించి, గంధర్వుల్లో గొప్ప విలాస పురుషుడిగా ప్రసిద్ధి చెందాడు. అలా లక్ష దివ్యయుగాల కాలం గడిచిన తరువాత ఒకనాడు, రంభ నాట్యం చేస్తుండగా, ఆమె సౌందర్యానికి ఉపబర్హణుడి రేత: పతనమయ్యింది. దాంతో, బ్రహ్మ శాప ప్రభావం చేత, నారదుడు కళావతి అనే ఒక శూద్ర స్త్రీకి జన్మించాడు. ఆమె వేదవేత్తలైన బ్రాహ్మణుల ఇంట పని చేస్తూ, పొట్ట నింపుకునేది. నారదుడు చిన్ననాటి నుండీ తల్లితో కలిసి, ఆమె పనిచేసే ఇంటికి వెళ్లి, చేతనైన సహాయం చేసేవాడు. ఆ బ్రాహ్మణిడి ఇంటికి, చాతుర్మాస్య వ్రతం ఆచరించడానికి వచ్చిన కొంతమంది మునులు, శ్రీకృష్ణుని కథలు చదువుతూ, హరి లీలలు వర్ణిస్తూ, హరి నామ సంకీర్తనం చేస్తూ ఉంటే, వాటిని వింటూ ఆనందించేవాడు. అలా వారు చేసే సద్గోష్టిని వింటూ, శ్రీ హరిపై అచంచలమైన భక్తి ఏర్పడింది. ఆ మునులు వ్రతం ముగించుకుని వెళ్తూ, హరిభక్తిలో మునిగి ఉండే నారదునికి, వైష్ణవతత్త్వాన్ని ఉపదేశించారు. 

‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే నామాన్ని నిరంతరం ధ్యానిస్తూ, ఆ భగవత్సాక్షాత్కారం పొందాడు. తరువాత కొంతకాలానికి, తల్లి కళావతి పాము కాటుతో మరణించింది. ఉన్న ఒక్క బంధం తెగిపోవడంతో, ఇల్లు విడిచి అరణ్యాలకు వెళ్లి, పరమాత్మ దివ్య రూపాన్ని భావిస్తూ, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేశాడు. దాంతో శ్రీహరి ఆనందపరవశుడై, 'నీకు శాప విముక్తి కలిగి, రాబోయే నూతన కల్పంలో, బ్రహ్మ కుమారుడిగా జన్మించి, నాతోనే ఉంటూ, నా సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నాను' అని వరమిచ్చాడు. ఆ విధంగానే, బ్రహ్మ మానస పుత్రుడిగా జన్మించి, బ్రహ్మచర్య వ్రతంతో, హరి నామ సంకీర్తనం చేస్తూ, ఆయన సేవలో నిమగ్నమయ్యాడు. అయితే, ఒకనాడు ఇంద్రుని సమక్షంలో, దేవతలందరూ సమావేశమై, లోక కళ్యాణం గురించీ, అందుకు అండగా ఉన్న త్రిమూర్తుల గురించీ, వారికి సహకారం అందిస్తున్న  దేవతల గురించీ, చర్చ సాగిస్తున్నారు. అప్పుడు ఇంద్రుడు, లోక కళ్యాణం, ప్రజల సుఖ శాంతుల కోసం, కొన్ని సార్లు విష్ణువు చేసే మాయలను అర్థం చేసుకోవడం, ఎవరికీ సాధ్యం కాదనీ, అదే విష్ణు మాయ అనీ పేర్కొన్నాడు.

ఆ సమయంలో అక్కడకు వచ్చిన నారదుడు, నిత్యం విష్ణు నామాన్ని పారాయణం చేసే తాను, విష్ణు మాయకు అతీతుడనని గొప్పలు ప్రారంభించాడు. అంతేకాకుండా, ఆ విష్ణు మాయ వెనుక ఉన్న మర్మాలన్నీ తనకు ముందుగానే తెలుస్తాయని, గర్వం ప్రదర్శించాడు. తరువాత కొంత కాలానికి, విష్ణుమూర్తి నారదుడిని రథంలో ఎక్కించుకుని, ఒక వనానికి చేరుకున్నాడు. సంధ్యావందనం చేయాల్సిన సమయం కావడంతో, నారదుడు ఆ సరస్సులోకి దిగాడు. విష్ణు మాయ చేత నారదుడు, స్త్రీ రూపాన్ని ధరించాడు. తానెవరన్న విషయాన్ని మరచి, యవ్వన సోయగాలు కలిగిన యువతిగా, వనమంతా తిరిగాడు. అదే సమయంలో అక్కడకు వచ్చిన రాజు నికుంఠుడు, స్త్రీ రూపంలో ఉన్న నారదుడి అందానికి ముగ్దుడైపోయి, తనను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. అలా స్త్రీ రూపంలో ఉన్న నారదుడు, 60 మంది పిల్లలను కన్నాడు. కొన్ని రోజుల తర్వాత, భర్త నికుంఠుడూ, 60 మంది సంతానం, శత్రువుల చేతిలో మరణించారు. 

రాజ్యం శత్రువుల హస్తగతం కావడంతో, నారదుడు అంత:పురం నుండి తప్పించుకుని, అడవిలోకి పారిపోయాడు. అలా అడవుల్లో తిరుగుతూ, తాను ఎక్కడైతే స్త్రీగా మారాడో, అదే ప్రాంతానికి చేరుకున్నాడు. అప్పటికే నీరసంతో ఉన్న నారదుడు, ఆకలి తీర్చుకోవడం కోసం, చెట్టునుండి ఒక మామిడి పండును కోసుకున్నాడు. దానిని తినబోతుండగా, మారు వేషంలో అక్కడకు చేరుకున్న శ్రీమన్నారయణుడు, ‘నీవు అశౌచంలో ఉన్నావు. ఈ సరస్సులో స్నానమాచరించిన తరువాత, ఆ పండును తిను’ అని సలహా ఇచ్చాడు. దాంతో, స్త్రీ రూపంలో ఉన్న నారదుడు, మామిడి పండును పట్టుకున్న చేతిని పైకి ఉంచి, నీటిలో మునిగాడు. నారదుడు తన స్త్రీ రూపాన్ని వదిలి, యథారూపానికి వచ్చాడు. కానీ, పండును పట్టుకున్న చేయి మాత్రం, గాజులతో, స్త్రీ చేయిగానే ఉండిపోయింది. తన రూపానికి కారణమేంటో తెలియని నారదుడితో, జరిగిన కథ మొత్తాన్ని వివరించాడు విష్ణు మూర్తి. సర్వం తనకే ఎరుక అనే అహంభావంతో ఉన్న నారదుడికి, కనువిప్పు కలిగింది. తరువాత పూర్తిగా ఆ సరస్సులో మునిగి, తన పూర్తి రూపాన్ని పొందాడు నారదుడు. 

విష్ణు మాయ ప్రభావం చేత స్త్రీగా మారిన నారదునితో సంసారం చేసిన నికుంఠుడు, కాల పురుషుడు. నారదుడికీ, కాల పురుషునికీ జన్మించిన సంతానం, ప్రభవ మొదలుకొని, అక్షయ వరకూ, 60 సంవత్సరాల పేర్లతో కాలచక్రభ్రమణంలో నిలిచి ఉండేలా, విష్ణు మూర్తి వరమిచ్చాడు. అయితే, నారదుడి చేతిలో గల వీణ 'మహతి' గురించి, కొన్ని గాథలున్నాయి. స్త్రీ రూపంలో ఉన్న నారదుడు సరస్సులో మునిగేటప్పుడు, చేతిలో ఉన్న మామిడి పండే వీణగా మారిందని కొంతమంది అభిప్రాయం. నారదుడికి వాయుదేవుడు అనుగ్రహించిన వీణ, మహతి అని మరికొంత మంది నమ్మకం. నారదుడు స్త్రీగా మారి తన బ్రహ్మచర్యాన్ని కొల్పోయినందుకు, కొన్ని వందల సంవత్సరాలు తపస్సునాచరించి, ఆ సరస్సు సమీపంలోనే, పాతాళ భావనారాయణ స్వామిని ప్రతిష్టించాడు. ఈ ఆలయం, కాకినాడ, సర్పవరంలో కొలువుదీరింది. ఆనాటి నారదుడి స్త్రీ రూపానికి సాక్ష్యంగా నిలిచిన ఈ ఆలయం, అక్కడున్న కొలనూ అద్భుతమనే చెప్పాలి. నిత్యం హరి నామ సంకీర్తనం చేస్తూ, ఆయన సేవలో నిమగ్నమైన నారదుడు, అతీతుడనడంలో అతిశయోక్తి లేదు.

Link: https://www.youtube.com/post/Ugwj_3nuHOAVYuTpeTN4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes