'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (12 - 19 శ్లోకాలు)!


'భగవద్గీత' ప్రథమోధ్యాయం - అర్జున విషాదయోగం (12 - 19 శ్లోకాలు)!

భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో మొదటి అధ్యాయం, అర్జున విషాద యోగం. ఈ రోజుటి మన వీడియోలో అర్జున విషాద యోగం లోని 12 నుండి 19 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/G-s2rBQkEbI ​]

రణరంగంలో ఇరు పక్షాలూ శంఖారావాలను పూరించడం, యుద్ధ ప్రారంభం గురించి, సంజయుడు ధృతరాష్ట్రుడితో జరిపిన సంభాషణ ఇలా కొనసాగుతోంది..

తస్య సంజనయన్ హర్షం కురువృద్ధః పితామహః ।

సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ।। 12 ।।

దురోధ్యనుడికి ఆనందం కలుగజేసే విధంగా, కురువృద్ధ పితామహుడూ, ప్రతాపశాలీ అయిన భీష్ముడు, సింహంలా గర్జించి, పెద్ద శబ్దంతో శంఖాన్ని పూరించాడు.

యుద్ధ నియమాల ప్రకారం, యుద్ధ ప్రారంభానికి సంకేతంగా, శంఖాన్ని పూరించారు. భీష్మ పితామహుడు, తన మనుమడు దుర్యోధనుడి హృదయంలో ఉన్న భయాన్ని అర్థం చేసుకున్నాడు. సహజంగా అతని మీద వున్న వాత్సల్యంతో, అతన్ని సంతోషపరచటానికి, పెద్ద శబ్దంతో తన శంఖాన్ని పూరించాడు. తద్వారా, తన  ధర్మాన్ని నిర్వర్తిస్తూ, ఎంతటి బాధనైనా సహిస్తూ, పూర్తి స్థాయిలో యుద్ధం చేయటానికి ఏ మాత్రం సంకోచించనని, దుర్యోధనుడికి తెలియజేశాడు.

తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః ।

సహసైవాభ్యహన్యన్త స శబ్దస్తుములోఽభవత్ ।। 13 ।।

ఆ తరువాత శంఖములూ, భేరీలూ, డోళ్ళూ, ఢంకాలు, తప్పెటలూ, కొమ్ము వాద్యాలు  ఒక్కసారిగా మ్రోగాయి. ఆ శబ్దాలు అతి భయంకరంగా, పాండవులకు భీతి కలిగించాయి.

శంఖం పూరించిన భీష్ముడి ఉత్సాహానికి తోడుగా, కౌరవసైన్యం, వివిధ వాయిద్య పరికరాలతో, మూకుమ్మడిగా, దిక్కులు పిక్కటిల్లేలా ఒక్కసారిగా వాయించారు. అకస్మాత్తుగా మ్రోగిన రణభేరి శబ్దాలకు పాండవులు ఉలిక్కిపడ్డారు.

తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యన్దనే స్థితౌ ।

మాధవః పాణ్డవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ।। 14 ।।

ఆ తరువాత, పాండవ సైన్యం మధ్యలో నుండి, తెల్లని గుఱ్ఱాలతో సమకూర్చబడిన ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న అర్జునుడూ, రధసారథి అయిన మాధవుడూ, తమ దివ్య శంఖాలను పూరించారు.

కౌరవ సైన్యం చేసిన శబ్దాలు సద్దుమణిగాక, తప్పక చేస్తున్న ఈ యుద్ధం కోసం, తాము కూడా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడానికి, మెదటగా పాండవ సైన్యం తరుపున శ్రీ కృష్ణుడూ, అర్జునుడూ, శంఖాలను పూరించారు. ప్రతిపక్షం వైపు నుంచి వచ్చిన శబ్దాలతో, భయకంపితులైన పాండవులలో ఉత్సాహం కలిగించడానికి, శ్రీ కృష్ణ భగవానుడు, శక్తివంతమైన తన శంఖాన్ని పూరించాడు.

పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః ।

పౌణ్ర్డం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ।। 15 ।।

హృషీకేశుడు, అంటే, మనస్సు, ఇంద్రియాలకు అధిపతి అయిన శ్రీ కృష్ణుడు, 'పాంచజన్యం' అని పిలువబడే శంఖాన్ని పూరించాడు. అర్జునుడు, దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించే వాడు, భయంకరమైన పనులను చేసేటటువంటి బలవంతుడైన భీముడు, 'పౌండ్రం' అనబడే బ్రహ్మాండమైన మహా శంఖాన్ని పూరించాడు.

అనన్తవిజయం రాజా కున్తీపుత్రో యుధిష్ఠిరః ।

నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ।। 16 ।।

కాశ్యశ్చ పరమేష్వాసః శిఖణ్డీ చ మహారథః ।

ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ।। 17 ।।

ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే ।

సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ।। 18 ।।

మహారాజా! యుధిష్ఠిరుడు అనంతవిజయాన్నీ, నకుల సహదేవులు, సుఘోషా మణిపుష్పకములనూ పూరించారు. గొప్ప ధనస్సు గల కాశీ రాజూ, మహారథుడైన శిఖండీ, ధృష్టద్యుమ్నుడూ, విరాటుడూ, అజేయుడైన సాత్యకీ, ద్రుపదుడూ, ద్రౌపది కుమారులూ, అధిక భుజబలము కలిగిన అభిమన్యుడూ, వీరందరూ కలిసి, ఒక్కసారిగా తమ తమ శంఖాలను పూరించారు.

సంజయుడు ధృతరాష్ట్రుడిని, 'పృథివీపతే'.. భూగోళాన్ని పరిపాలించేవాడా అని సంబోధించాడు. సంజయుడు అలా పిలవడం వెనుక, ఒక నిగూఢార్థం దాగి ఉంది. ఒక దేశాన్ని కాపాడటం గానీ, వినాశకరమైన యుద్ధం లోకి నెట్టి వేయటం గానీ, కేవలం రాజు చేతిలోనే వుంటుంది. ఇరు పక్షాలూ రణభేరి మ్రోగించి, యుద్ధానికి సమాయత్తమయ్యారు. ఓ మహారాజా ధృతరాష్ట్రా, ప్రస్తుత పరిస్థితులలో మీరొక్కరే, ఈ యుద్ధాన్ని ఆపగలరు.. ఏమి నిర్ణయించబోతున్నారు?" అని సంజయుడు తనకున్న చివరి అవకాశం గురించి తెలియజేశాడు.

స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ ।

నభశ్చ పృథివీం చైవ తుములో ప్యనునాదయన్ ।। 19 ।।

పాండవులు మ్రోగించిన భీకరమైన శబ్దానికి, భూమ్యాకాశములు ప్రతిధ్వనించాయి. అది ధృతరాష్ట్రుడి తనయుల హృదయాలను బ్రద్దలు చేసంది.

పాండవ సైన్యం పూరించిన శంఖ నాద శబ్దానికి, కౌరవుల గుండెలు బ్రద్దలయ్యాయి. కౌరవులు తమ శంఖాలను పూరించినప్పుడు పాండవులు భయపడినా, వారు భగవంతుడిని ఆశ్రయించి ఉండటం వలన, ధైర్యంగా ఉన్నారు. వారి శబ్దాలకు ప్రతిగా, మరింత గట్టిగా శంఖాలను పూరించి, వారి బలాన్ని శత్రువులకు తెలియజేశారు. కేవలం తమ స్వీయ బలం మీదనే ఆధారపడ్డ కౌరవులు, మనఃసాక్షిలో నేరం చేస్తున్నామన్న వేదన వల్ల, ఓటమి భయానికి లోనయ్యారు.

మన తదుపరి వీడియోలో, కురుక్షేత్ర సంగ్రామంలో సమరానికి సిద్ధమయిన అర్జునుడూ, శ్రీ కృష్ణుడి సంభాషణ గురించి తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/Ugyn67dSKdAovsL4mNl4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes