ప్రతిదానినీ ఈశ్వరానుగ్రహంలా స్వీకరించువారు ఎన్నటికీ శోకింపరు! Bhagavad Gita


ప్రతిదానినీ ఈశ్వరానుగ్రహంలా స్వీకరించువారు ఎన్నటికీ శోకింపరు!

'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (11 - 15 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో సాంఖ్య యోగంలోని 11 నుండి 15 శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/MJ6zZp8jatg ]

అర్జునుడిలోని నైరాశ్యాన్ని తరిమికొట్టడానికి, కృష్ణ భగవానుడు ఇలా అంటున్నాడు..

శ్రీ భగవానువాచ ।

అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే ।

గతాసూనగతాసూంశ్చ నానుశోచంతి పండితాః ।। 11 ।।

భగవంతుడైన శ్రీ కృష్ణుడు ఇలా పలికాడు: నీవు ప్రాజ్ఞతతో కూడిన మాటలు మాట్లాడుతున్నావు కానీ, శోకింపకూడని దాని కోసం శోకిస్తున్నావు. చనిపోయిన వారి గురించి గానీ, బ్రతికున్న వారి గురించి గానీ, వివేకవంతులు శోకింపరు.

అర్జునుడిలో నిండిన నైరాశ్యాన్ని తరిమి కొట్టి, తనను స్థిమిత పరచడానికి, శ్రీ కృష్ణుడు మాట్లాడడం ప్రారంభించాడు. ఈ శ్లోకంతో మొదలిడి, శ్రీ కృష్ణుడు తన ప్రసంగమును ఒక మహోత్కృష్టమైన ప్రారంభ ప్రతిపాదనతో ఆరంభిస్తున్నాడు. అర్జునుడు, తనకు మాత్రం సరి అనిపించే కారణాల వలన శోకిస్తున్నాడు. దానిని కృష్ణుడు సమర్థించలేదు. అతని వాదనలోని లోపాలను ఎత్తిచూపుతున్నాడు. బంధువులను సంహరించడంలో, అర్జునుడు అనుకునే దుఃఖం నిజానికి ఒక భ్రమ, మిథ్య మాత్రమే.. అది వివేకుడికి ఉండాల్సిన లక్షణం కాదు. శోకానికి అతీతంగా ఉన్న జ్ఞాని, కేవలం భీష్మ పితామహుడు. అతను జనన-మరణ రహస్యాలను లోతుగా తెలుసుకుని, ద్వంద భావాలకు అతీతంగా ఎదిగిన ఋషి. ‘భగవంతునికి శరణాగతి చేసిన వారు, ఫలితాల చేత ప్రభావితం కాకుండా, అన్ని సందర్భాలలో, తమ విధిని నిర్వర్తిస్తూ పోతుంటారు’, అని భీష్ముడు మనకు తెలియజేస్తున్నాడు. ప్రతిదానినీ, ఈశ్వరానుగ్రహంలా స్వీకరించువారు, ఎన్నటికీ శోకింపరు.

న త్వేవాహం జాతు నాసం న త్వం నేమే జనాధిపాః ।

న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరమ్ ।। 12 ।।

నేను కానీ, నీవు కానీ, ఈ రాజులందరూ కానీ లేని సమయము లేదు; ఇక ముందు కూడా, మనము ఉండకుండా ఉండము.

వైదిక సంప్రదాయంలో ఎప్పుడు దివ్య జ్ఞానం బోధించబడినా, సాధారణంగా, అది ఆత్మ జ్ఞానంతోనే మొదలవుతుంది. 'నేను' అని మనము అనుకునేది, నిజానికి ఆత్మ అనీ, ఈ భౌతిక శరీరము కాదనీ, ఇది భగవంతునిలా సనాతనమైనదనీ, శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు. 'శ్వేతాశ్వతర' ఉపనిషత్తులో, ఈ విధంగా పేర్కొనబడింది. సృష్టి అనేది, మూడింటి కలయికతో ఉంది. అది భగవంతుడూ, ఆత్మ, మాయ. ఈ మూడూ శాశ్వతమైనవి, నిత్యమైనవి. మనం ఆత్మ నిత్యమని నమ్మగలిగితే, ఈ భౌతిక శరీర మరణం తరువాత, జీవితం ఉంటుందని, సతర్కముగా నమ్మినట్లే.

దేహినోఽస్మిన్ యథా దేహే కౌమారం యౌవనం జరా ।

తథా దేహాంతరప్రాప్తిః ధీరస్తత్ర న ముహ్యతి ।। 13 ।।

ఏ విధంగానయితే దేహంలో ఉన్న జీవాత్మ వరుసగా, బాల్యమూ, యౌవనమూ, ముసలితనముల గుండా సాగిపోతుందో, అదేవిధంగా, మరణ సమయంలో, జీవాత్మ, మరియొక దేహము లోనికి ప్రవేశిస్తుంది. వివేకవంతులు ఈ విషయమున ఆందోళన పడరు.

ఒక జన్మ నుండి ఇంకొక జన్మకు, ఆత్మ ఒక శరీరం నుంచి, మరొక శరీరంలోకి ప్రవేశిస్తుందని, శ్రీ కృష్ణుడు తెలియజేస్తున్నాడు. ఒక జన్మ లోనే మనం బాల్యం, యౌవనం, యుక్తవయస్సూ, వృద్ధాప్య దశలలో శరీరాలు మారుస్తూ ఉంటాం. వాస్తవానికి ఆధునిక శాస్త్రం ప్రకారం, శరీరంలోని జీవ కణాలు, నిరంతరంగా పునరుత్పత్తి చెందుతుంటాయి. పాత కణాలు మృతినొందుతూ, వాటి స్థానంలో కొత్త కణాలు చేరుతుంటాయి. నిరంతరం శరీరం మారిపోతున్నా, ఇది ‘నేను’ అనే విషయం, మనకు స్పష్టంగా తెలుస్తుంది. ‘నేను’ అంటే, కేవలం భౌతిక శరీరం కాదు.. మన లోపల నివసించి ఉన్న ఈశ్వర-సంబంధియైన జీవాత్మ. ఒక జీవితకాలంలో, శరీరం నిరంతరంగా మారుతూ ఉండటం వలన, ఆత్మ చాలా శరీరాలు మారినట్లే, మరణం తరువాత ఇంకొక శరీరాన్ని స్వీకరిస్తుందన్న విషయం పట్ల, అర్జునుడిలో ఆసక్తిని పెంపొందిస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. 'మరణం' అనేది, జీవాత్మ, తన యొక్క పనిచేయని పాత శరీరాన్ని త్యజించడం మాత్రమే.. ‘పుట్టుక’ అనేది, జీవాత్మ కొత్త శరీరాన్ని, ఇంకోచోట తీసుకోవటమే.. ఇదే పునర్జన్మ సిద్ధాంతం.

మాత్రాస్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణసుఖదుఃఖదాః ।

ఆగమాపాయినోనిత్యాః తాంస్తితిక్షస్వ భారత ।। 14 ।।

ఓ కుంతీ పుత్రా.. ఇంద్రియాలూ, విషయముల సంయోగము వలన, అనిత్యమైన సుఖ-దుఃఖాలు కలిగినట్లనిపిస్తుంది. ఇవి అనిత్యములు; ఇవి వేసవీ, చలికాలములలా వచ్చిపోతుంటాయి. ఓ భరత వంశీయుడా.. కలత చెందకుండా, వీటిని సహించడం నేర్చుకో.

మానవ శరీరానికి, దృష్టీ, వాసనా, రుచీ, స్పర్శా, మరియు వినికిడి అనే ఐదు ఇంద్రియ అనుభవములున్నాయి. ఇవి, వాటి యొక్క విషయముల సంపర్కం చేత, ఆనందం మరియు బాధల అనుభూతిని కలిగిస్తాయి. ఈ అనుభవాలు ఏవీ కూడా, శాశ్వతమైనవి కావు. మారే ఋతువులలాగా, అవి వచ్చిపోతుంటాయి. చల్లని నీరు వేసవిలో ఆనందం కలుగచేసినప్పటికీ, అదే నీరు శీతాకాలంలో, ఇబ్బంది కలిగిస్తుంది. ఈ విధంగా, ఇంద్రియముల ద్వారా అనుభవించిన ఆనందం, మరియు బాధ యొక్క అనుభూతులు, కేవలం తాత్కాలికమే. వీటివల్ల ప్రభావితమయితే, ఒక లోలకంలా ఊగిసలాడాల్సి వస్తుంది. వ్యక్తి, సుఖ-దుఃఖాలు రెండింటికీ చెదిరిపోకుండా, తట్టుకోవడానికి సాధన చేయాలి. ముందుగా కోరికలను మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. అదే, అన్ని దుఃఖాలకూ మూల కారణం.

యం హి న వ్యథయంత్యేతే పురుషం పురుషర్షభ ।

సమదుఃఖసుఖం ధీరం సోఽమృతత్వాయ కల్పతే ।। 15 ।।

ఓ అర్జునా.. పురుష శ్రేష్ఠుడా.. సుఖదుఃఖములచే ప్రభావితం కాకుండా, రెండిటిలోనూ చలించకుండా, నిశ్చలముగా ఉన్నవాడు, మోక్షానికి అర్హుడవుతాడు.

అర్జునుడిని జ్ఞాన వివక్ష ద్వారా, ఈ ద్వందములకు అతీతంగా ఉండమని ప్రోత్సహిస్తున్నాడు, కృష్ణ పరమాత్ముడు. మనం ముందుగా రెండు ప్రశ్నలకు సమాధానాలను తెలుసుకొవాలి..

మొదటి ప్రశ్న: మనం ఎందుకు ఆనందం కోసం ఆకాంక్షిస్తాము?

భగవంతుడు ఒక అనంతమైన ఆనంద సముద్రం. మనం జీవాత్మలం, అతని అణు-అంశలం. మనం అనంతమైన ఆనంద సాగరానికి చెందిన చిన్న భాగాలం. ఎలాగైతే ఒక బిడ్డ తన తల్లి వైపు ఆకర్షితమవుతుందో, ప్రతి భాగమూ, సహజంగా, దాని పూర్ణభాగం వైపు లాగబడుతుంది. అదేవిధంగా, మనం ఆనంద సముద్రం యొక్క అణు-అంశలమవటం వలన, ఆ ఆనందము వైపు ఆకర్షితులమవుతాము. కాబట్టి, ఈ ప్రపంచంలో మనం చేసే ప్రతి పనీ, ఆనందం కోసమే. ఆనందం దేనిలో ఉంది, ఏ రూపంలో ఉంది? అన్న విషయంలో, వేర్వేరు అభిప్రాయాలు ఉండవచ్చు కానీ, అన్ని ప్రాణులూ, దాన్ని తప్ప వేరే వాటిని కోరుకోవు.

రెండవ ప్రశ్న: ఎందుకు భౌతిక ఆనందం మనకు తృప్తినివ్వదు?

ఆత్మ అనేది పరమాత్మ యొక్క అణు అంశ కాబట్టి, అది భగవంతుని మాదిరిగానే దివ్యమైనది. కావున, ఆత్మ కోరుకునే ఆనందం కూడా, దివ్యమైన ఆనందమే. భగవంతుని ఆనందం, సత్-చిత్-ఆనందం.. అంటే, నిత్యమైన-చైతన్యవంతమైన-ఆనందం. కానీ, ఇంద్రియముల ద్వారా మనం అనుభవించే ఆనందం, ఆ భగవంతుని ఆనందానికి విరుద్ధంగా ఉంటుంది. ఈ శారీరక ఆనందం, తాత్కాలికమైనది, పరిమితమైనది, జడమైనది. అందుకే, శరీరం ద్వారా అనుభవించే భౌతికమైన ఆనందం, మనలో ఉన్న దివ్యమైన జీవాత్మను సంతృప్తి పరచదు. ప్రతీ ఒక్కరూ, భౌతిక ఆనందానుభూతిని నియంత్రించుకునే సాధన చేయాలి. ఈ శరీరంలో ఉండే భౌతిక బాధలనూ, దుఃఖాన్నీ సహించాలి. అదే విషయాన్ని అర్జునుడికి తెలియజేస్తున్నాడు, కృష్ణ భగవానుడు.

మన తదుపరి వీడియోలో, భౌతిక శరీరం గురించీ, జీవాత్మ గురించీ, కృష్ణ భగవానుడి బోధన ఏ విధంగా సాగిందో, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgzJtD9T-vs3nJ4A82N4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes