మగవారు మనశ్శాంతిని కోల్పోయే 5 కారణాలు! - చాణక్య నీతి
భారతదేశ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే అపరమేధావీ, అమిత జ్ఞానీ, చాణక్యుడు. ఆయన రచనలలో, ఏ కాలానికైనా సరిపోయే జ్ఞానం ఇమిడి ఉంది. ఒక మనిషి ఏ విధంగా జీవించాలి? ఎలా ఉంటే సమాజం గౌరవిస్తుంది? మన చుట్టూ ఉన్న వారితో ఎలా మెలగాలి? మోసగాళ్ళతో ఎలా ప్రవర్తించాలి? స్త్రీ ఎలా ఉండాలి? పురుషుడికి ఎలాంటి భార్య కావాలి? ఉత్తమ భర్తగా ఎలా జీవించాలి? లాంటి ఎన్నెన్నో విషయాలపై, సమగ్ర సారాన్ని మనకు అందించిన మహోన్నత వ్యక్తి, చాణక్యుడు. ఇతరుల ప్రవర్తన, మన అంతర్గత శాంతిని నాశనం చేయనివ్వకూడదు. కానీ, ఒక వ్యక్తి తనంతట తానుగా ప్రశాంతతను కొల్పోవడానికి, కొన్ని కారణాలుంటాయి. చాణక్య నీతిలో చెప్పినట్లుగా, ఒక మగవాడు మనశ్శాంతిని కోల్పోయి, నిరాశలో మునిగిపోవడానికి గల ముఖ్య కారణాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/cS01yyt2bB4 ]
1. అందని దాని గురించి ఆరాటం
ఒక మనిషి తనకు దక్కని దాని గురించి ఆలోచించేటప్పుడు, అతని వద్ద ఉన్న వాటిని అనుభవించలేడు. తన అవసరాలూ, కోరికల మధ్య తేడాను గుర్తించలేడు. ఏదో సాధించాలని ఆరాటపడుతూ ఉండే వ్యక్తి, తాను అప్పటి వరకూ సాధించిన, సంపాదించిన వాటితో సంతృప్తి పొందడు. తాను కోరుకున్నది దక్కకపోతే, ప్రశాంతతను కొల్పోతాడు. నిరాశలోకి జారిపోతాడు.
2. క్రిందిస్థాయి ఉద్యోగం
మనం ఒకరి క్రింద పనిచేస్తున్నా, ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. యజమానిపై అసూయ, కోపాల వంటి లక్షణాలను పెంచుకోకూడదు. కొన్ని కొన్ని సందర్భాలలో, యజమాని కోపగించుకున్నా సర్దుకుపోవాలి. అంతేకానీ, ‘అతను నాకన్నా తక్కువ వ్యక్తి, అతని కులం కన్నా నా కులం ఎక్కువ, అతని కన్నా నాకే తెలివితేటలు ఎక్కువ’ అనే భావనలున్న వ్యక్తి, సంతోషంగా ఉండలేడు. ఎందుకంటే, మన కన్నా తక్కువవారు, మనలను అజమాయిషీ చేయడం, ఎప్పటికీ, ఎవ్వరికీ నచ్చని విషయమే. అందుకే, అటువంటి భావనలను మనస్సులోకి అడుగుపెట్టనీయకూడదు.
3. అనారోగ్యకరమైన ఆహారం
ఏది పడితే అది తింటున్నాడంటే, అతనికి ఆరోగ్యం పట్ల శ్రద్ధ లేనట్లే. అది ప్రమాదకరం, ప్రాణాపాయం. ఆడవారి కన్నా మగవారే, అరోగ్యం పట్ల అనాసక్తి కలిగి ఉంటారు. అనారోగ్యకరమైన ఆహారాన్ని తినడం వలన, వెంటనే కాకపోయినే, కొన్ని రోజుల తరువాతయినా, ఆరోగ్యం చెడిపోతుంది. అనారోగ్యాల వలన, మనిషి ఆనందానికి దూరమవుతాడు.
4. భార్య
భార్య ఎప్పుడూ, అన్య మనస్కంగా, కోపంగా ఉంటే, ఆ ఇంట్లో ప్రశాంతత ఉండదు. లౌకికపరమైన కోరికలు ఎక్కువగా కలిగిన స్త్రీ, ఎప్పుడూ ఆనందంగా ఉండలేదు, తన భర్తను ఆనందంగా ఉండనివ్వదు. తన అవసరాలను తీర్చనప్పుడు, భర్తపై కోపగించుకుని, అతని మనశ్శాంతిని నాశనం చేస్తుంది.
5. సంతానం
ఒక తండ్రి, కుమారుడి వలన, సమాజంలో తగిన గుర్తింపు పొందుతాడు. అన్ని విధాలా విధేయుడై, చక్కని నడవడిక కలిగి, చదువులో రాణించి, మంచి ఉద్యోగంలో స్థిరపడిన కుమారుడి వలన, తండ్రి ఉప్పొంగిపోతాడు. కానీ, కుమారుడు మాట వినక, చెడు వ్యసనాలకు బానిసై, తనను గౌరవించనప్పుడు, ఆ తండ్రి జీవితంలో నిరాశ చోటుచేసుకుంటుంది. అదేవిధంగా, కూతురు సంపన్న స్థితిలో, పిల్లా పాపలతో సంతోషంగా, కళకళలాడుతుంటే, తండ్రి తరించిపోతాడు. అదే, కుమార్తె జీవితం అస్తవ్యస్తంగా, ఆమెను వితంతువుగా చూడాల్సి వస్తే, ఆ తండ్రి మనోవేదన వర్ణనాతీతం. అలాంటి పరిస్థితులలో తన కూతురు ఉంటే, ఆ తండ్రికి మనశ్శాంతి కొరవడుతుంది.
ఈ అయిదు కారణాల వలనా, మగవారికి ప్రశాంతత లోపిస్తుంది. చాణక్యుడు చెప్పిన ఈ విషయాలు, నిజంగానే మనిషిని కృంగదీస్తాయనడంలో, ఎటువంటి సందేహం లేదు.
Post a Comment