భారత దేశంలో ‘చనిపోయిన వారిని బ్రతికించే’ దేవాలయం గురించి విన్నారా! Lakhamandal Shiva Temple in Telugu


భారత దేశంలో ‘చనిపోయిన వారిని బ్రతికించే’ దేవాలయం గురించి విన్నారా!

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ।।

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/_23nNvAKCMc ​]

మృత్యుంజయ మంత్రం గురించి అందరికీ తెలిసిందే.. కానీ, దేవ భూమిగా పిలువబడే మన భారత దేశంలో, చనిపోయిన వారిని తిరిగి బతికించగలిగే దేవాలయం ఉన్నదన్నది మీకు తెలుసా? ప్రపంచంలో శాస్త్ర, సాంకేతికత ఎంతగా అభివృద్ధి చెందినా, మానవ మేదస్సుకు అర్థం కాని ఎన్నో రహస్యాలు, ఈ సువిశాలవిశ్వంలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. ఇందులో చావు పుట్టుకలు కూడా ఉన్నాయి. అందులోనూ ప్రాణం పోకడ గురించి, ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు. అదే కోణానికి చెందిన దేవాలయం, లఖమండల్‌ దేవాలయం.. ఈ దేవాలయంలో, చనిపోయిన వారు కొద్ది సేపు తిరిగి బతుకుతారంటున్నారు. అటువంటి మహిమాన్విత ఆలయానికి సంబంధించిన ఆసక్తికర విశేషాలేంటో, ఈ రోజుటి వీడియోలో తెలుసుకుందాము..

ఈ ఆలయంలో ప్రధాన దైవం పరమశివుడు. ‘లఖమండల్‌’ ఒక పురాతన దేవాలయం. దీనిని, పరమశివుడు నిత్యం నివశించే ప్రాంతంగా, స్థానికులు నమ్ముతారు. భారత దేశంలో అత్యంత శక్తివంతమైన దేవాలయాల్లో, ఈ లఖమండల్ దేవాలయం కూడా ఒకటి. ఈ దేవాలయ సందర్శనం వల్ల దురదృష్టం పోయి, అదృష్టం వరిస్తుందని చెబుతారు.

పాండవులు కాలు పెట్టిన పవిత్ర స్థలాల్లో, లఖమండల్ మందిరం కూడా ఒకటి. పాండవులు అజ్ఞాత వాసంలో ఉన్న సమయంలో, ఈ లఖమండల్ మందిరంలో కొద్ది రోజుల పాటు గడిపారని చెబుతారు. ఇక్కడి స్థానికులు చెప్పే కథను అనుసరించి, ధుర్యోధనుడు పాండవులను లక్క గ్రుహంలో నిర్బంధించి చంపాలని నిర్ణయించిన గ్రుహం, ప్రస్తుత దేవాలయ ప్రాంగణంలోనే ఉందని, భక్తుల నమ్మిక.

యమునా తటిపై, నాగర శైలిలో నిర్మితమైన ఈ ఆలయంలోని శివలింగం ఎంత ఆకర్షణీయమైనదంటే.. అత్యంత పారదర్శకత కలిగిన ఈ దేవాలయం చుట్టుపక్కల ఉన్న పచ్చదనం అంతా, ఆ లింగం పై భాగంలో మనం గమనించవచ్చు. నున్నగా మెరిసే ఈ శివలింగంపై నీరు పోస్తే, అద్దంలా, అద్భుతంగా మెరుస్తూ, నీరు పోసిన వారి ముఖ ప్రతిబింబం కూడా, లింగంపై స్పష్టంగా కనిపిస్తుంది. అభిషేకం చేసిన నీరు రుచి కూడా, తియ్యగా మారడం, ఈ లింగం యొక్క ప్రత్యేకత. ఒక్కసారి ఈ లింగాన్ని చూస్తే, ఆధ్యాత్మికత పొంగిపొర్లుతుంది. 

ఈ దేవాలయం ప్రవేశ ద్వారం వద్ద, మానవ, దానవ అనే రెండు ఎత్తైన విగ్రహాలు మనల్ని ఆకట్టుకుంటాయి. అయితే, స్థానికులు మాత్రం, ఈ రెండు విగ్రహాల్లో ఒకటి భీమసేనుడిదనీ, మరో విగ్రహం, అర్జునుడిదనీ నమ్ముతారు. మానవ, దానవ ప్రతిమలను, విష్ణువు నివశించే వైకుంఠ ద్వారపాలకులైన జయ విజయులతో పోలుస్తారని కూడా, స్థానికులు చెబుతారు.

ఎవరైనా చివరి ఘడియల్లో ఉన్నప్పుడూ, లేదా చనిపోయిన వెంటనే, వారిని ఈ రెండు విగ్రహాల ముందుకు తీసుకువస్తారు. అనంతరం, ఆ పరమశివుడు లింగ రూపంలో కొలువై వున్న శివలింగాన్ని అభిషేకించిన నీటిని తెచ్చి, ఆ చివరి ఘడియల్లో ఉన్న వారికి, లేదా చనిపోయిన వ్యక్తి నోట్లో పోస్తే, తిరిగి కొద్ది సేపు బ్రతుకుతారని, స్థానికులు బలంగా నమ్ముతారు. ఇందుకు ఎన్నో ప్రత్యక్ష ఉదాహరణలు చూపిస్తారు. లయకారుడైన ఆ పరమేశ్వరుడి లీలలు అమోఘం. ఓం నమః శివాయ!

సముద్ర మట్టానికి 1300 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ దేవాలయం.. దేవతలు నివసించే రాష్ట్రంగా పేరొందిన ఉత్తరాఖండ్ లోని, డెహ్రడూన్ జిల్లాలో, జౌన్సార్ బావర్ అనే ప్రదేశంలో ఉంది. లఖమండల్ దేవాలయం, చక్రాతా నుంచి, దాదాపు 108 కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. రోడ్దు ద్వారా ఈ దేవాలయాన్ని చేరుకోవాలనుకునేవారు, ముందుగా చక్రాతాకు వెళ్లి, అక్కడి నుంచి బస్సు, లేదా ట్యాక్సీ ద్వారా, ఈ దేవాలయాన్ని చేరుకోవచ్చు. ఇక్కడికి దగ్గరగా, డెహ్రడూన్ రైల్వే స్టేషన్ ఉంది.. దైవ సంకల్పం లేనిదే, ఇటువంటి మహిమాన్విత క్షేత్రాల దర్శనం అసాధ్యమే అయినప్పటికీ, మానవ ప్రయత్న లోపం లేకుండా, అందరూ దర్శించుకోవాలని ఆకాంక్షిస్తూ, శుభం భూయాత్..

Link: https://www.youtube.com/post/Ugw-uJpBuhXe0WLC4Dl4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes