వైశాఖ బహుళ అమావాస్య 'శనైశ్చర జయంతి' సందర్భంగా.. Lord Shani Dev's Birthday


ఈ రోజు '10/06/2021' గురువారం, వైశాఖ బహుళ అమావాస్య 'శనైశ్చర జయంతి' సందర్భంగా..

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమగ్రజం ౹

ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం ౹౹

అని శనీశ్వరుడిని ప్రార్థించడం ఆచారం..

[ అద్భుతమైన శనీశ్వరుడి చరిత్ర! = https://youtu.be/qXPHHrAPYf8 ]

[ శనీశ్వరుడికి భార్య ద్వారా కలిగిన శాప రహస్యం! = https://youtu.be/-gTD309WjDs ]

శనిభగవానుని ప్రీతికై, శివార్చన.. గ్రహశాంతి కోసం దానం, జపం మొదలైనవి చెయ్యడం వల్ల, శనిదేవుని అనుగ్రహంతో, జాతకం లోనున్న శని గ్రహ సంబంధిత దోషాలు ఉపశమిస్తాయి..

నవగ్రహాలలో అత్యంత ప్రభావశాలి శనిదేవుడు. నీలాకాశంలో నీలాంజన సమాభాసుడై, నీలిహర్మ్యంలో నీలమణులతో ఉన్న దివ్యాలయంలో ఆయన కొలువుదీరి ఉంటాడు. ఎన్నో ఉపగ్రహాలతో, కాంతివలయంలో తేజోమయునిగా దర్శనమిస్తాడు. గ్రహరాజు అయిన సూర్యదేవునికి, ఛాయాదేవికి సావర్ణి మనువు తరువాత జన్మించిన వాడు శనిదేవుడు. మెల్లనైన నడక గలవాడు కాబట్టి, శనీశ్వరుడు, మందుడని పేర్లు వచ్చాయి. ఆయన యమధర్మరాజుకు, యమునకు సోదరుడు. శని భార్య జ్యేష్టాదేవి. శనివారంతో కలిసి ఉన్న త్రయోదశి తిథిని, శని త్రయోదశిగా వ్యవహరిస్తారు. ఏటా రెండు మూడు శని త్రయోదశి తిథులు వస్తాయి. 'శని జయంతి' శని త్రయోదశి తిథిలతో పాటు, మాఘ బహుళ చతుర్దశి, మార్గశిర శుద్ధ అష్టమి, శ్రావణ మాసంలో వచ్చే రెండవ శనివారము కూడా, శని ఆరాధనకు శ్రేష్టమైనవి.

వైశాఖ బహుళ అమావాస్య రోజున శనీశ్వరునికి నువ్వులనూనెను వెలిగిస్తే, కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. శనిదేవుడు జీవుల కర్మఫల ప్రదాత. మనం చేసిన పుణ్య, పాప కార్యాలకు ఫలితాన్ని ఇచ్చేది, శనీశ్వరుడే. శివుడు శనికి వక్రదృష్టి, ఇతర శక్తులనిచ్చి, కర్మ ఫలదాతను చేశాడు. వాటి సాయంతో ఆయన క్రమ శిక్షణ, మంచి లక్షణాలను కాపాడుతూ, చెడునీ, చెడ్డవాళ్లనూ, వారు చేసే కర్మలను అనుసరించి, శిక్షించడం చేస్తాడు. ఇంకా, మంచి పనులు చేసేవాళ్లకు, శుభాలూ, ఉన్నత స్థితినీ కల్పించడం చేస్తాడు. శని యొక్క వక్రదృష్టి నుండి తప్పించుకోవాలంటే, చెడ్డపనులను చేయకుండా ఉండాలి. మంచి పనులే చేయాలి. అందుకే, శనీశ్వర జయంతి రోజున, నలుపు రంగు దుస్తులను సమర్పించుకోవాలి. శంఖు పూలతో ఆయనను అర్చించాలి. తైలాభీషేకం చేయించాలి. దశరథ కృత శని స్తోత్రం భక్తితో పఠించే వారికి, ఈతి బాధలుండవు.

శనిని పాపగ్రహంగా భావిస్తారు. చాలామంది శని పేరు వింటేనే అరిష్టం అనీ, ఆయన విగ్రహాన్ని తాకడం కూడా దోషమనీ భావిస్తారు. వాస్తవానికి శనిదేవుడు న్యాయాధికారి. ఎవరినీ అకారణంగా బాధించాడు. మానవుల పాప కర్మలను అనుసరించి, వ్యక్తులను ప్రేరేపించి, వారితో ఆయా కర్మల ఫలితాలను అనుభవించేలా చేస్తాడు. దాన ధర్మాలతో, సత్యం, అహింసలను ఆచరిస్తూ, పవిత్రంగా జీవించే వారికి, ఎటువంటి ఆపదా వాటిల్లకుండా కాపాడతాడు. సకల శుభాలనూ, ఐశ్వర్యాన్నీ, అదృష్టాన్నీ కలుగజేసేది శనిదేవుడే. లౌకిక, భౌతిక సుఖాల పట్లా, సంపదల పట్లా వైరాగ్యం కలిగించి, భగవంతుని స్మరించమని, గురువై బోధిస్తాడు. భయంతో కాకుండా, భక్తితో ఆయనను వేడుకుంటే, సకల శూభాలూ కలుగుతాయి. శని వివిధ వృత్తి ఉద్యోగాల్లో, వ్యాపారాలలో, స్థిరత్వాన్నీ, వృద్ధినీ కలుగజేస్తాడు.

శనీశ్వరుని జయంతి నాడు ఆయన స్తోత్రాలను పఠించడంతో పాటు..

నమో శనైశ్చరా పాహిమాం!

నమో మందగమనా పాహిమాం!

నమో సూర్యపుత్రా పాహిమాం!

నమో ఛాయాసుతా పాహిమాం!

నమో జేష్ఠ పత్నీ సమేత పాహిమాం!

నమో యమ ప్రత్యధిదేవా పాహిమాం!

నమో గృధవాహాయ పాహిమాం! 

అనే శనీశ్వరుడిని సప్తనామావళిని పఠించడం వల్ల, ఆయన అనుగ్రహం కలుగుతుంది.. ఈయనను ఆరాధించడం వల్ల జీవితంలో వచ్చే అడ్డంకులూ, సమస్యలూ తొలగిపోతాయి. అంతేకాకుండా, శని దేవుడి ఆశీర్వాదం వల్ల, అనుకున్న కోరికలు తీరుతాయి.

ఓం శనైశ్చరాయ నమః!

Link: https://www.youtube.com/post/UgzJEOvZHMly_qRf0bp4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes