'న్యాయ దర్శన' ప్రకారం, పూర్వ జన్మ స్మృతులు మనకు ఎప్పటివరకూ ఉంటాయి? Bhagavad Gita


'న్యాయ దర్శన' ప్రకారం, పూర్వ జన్మ స్మృతులు మనకు ఎప్పటివరకూ ఉంటాయి?

'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (21 - 25 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో సాంఖ్య యోగంలోని 21 నుండి 25 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/FulEMVXM79A ]

కృష్ణుడు ఆత్మ స్వభావాన్ని, కుంతీపుత్రుడికి ఈ విధంగా వివరిస్తున్నాడు..

వేదావినాశినం నిత్యం య ఏనమజమవ్యయమ్ ।

కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతి కమ్ ।। 21 ।।

ఓ పార్థ! ఆత్మ నాశనం చేయబడదు. అది నిత్యమైనదీ, జనన-మరణములు లేనిదీ అని తెలిసినవాడు, ఎవరినైనా ఎట్లా చంపగలడు? ఏ విధంగా చంపడానికి కారణమవ్వగలడు?

ఆధ్యాత్మికంగా ఎదిగిన జీవాత్మ, జీవితంలోని కర్మలను చేసేది "మనమే" అన్న అహంకారాన్ని అణచి వేస్తుంది. ఆ స్థితిలో, మనలో ఉన్న జీవాత్మ ఏమీ చెయ్యదు అని తెలుస్తుంది. అలాంటి ఉన్నత స్థాయికి ఎదిగిన జీవులు, అన్ని పనులూ చేస్తూనే వున్నా, వాటి వల్ల కళంకితులు కారు. అటువంటి ఉన్నతమైన జ్ఞానోదయ స్థితికి తనను తాను ఉద్ధరించుకుని, తనను తాను అకర్త గా భావించుకుని, అహంకార రహితముగా, బాధ్యతను విస్మరించక, తన విధిని నిర్వర్తించమని, అర్జునుడికి శ్రీ కృష్ణుడు ఉపదేశిస్తున్నాడు.

వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోఽపరాణి ।

తథా శరీరాణి విహాయ జీర్ణా న్యన్యాని సంయాతి నవాని దేహీ ।। 22 ।।

ఎలాగైతే మానవుడు, జీర్ణమైపోయిన పాత బట్టలను త్యజించి, కొత్త బట్టలను ధరించునో, అదే విధముగా జీవాత్మ, మరణ సమయములో, పాత శరీరమును వీడి, కొత్త శరీరమును స్వీకరించును.

ఆత్మ స్వభావాన్ని వివరిస్తూ, శ్రీ కృష్ణుడు పునర్జన్మ సిద్దాంతాన్ని, రోజూ మనం చేసే పనుల ద్వారా పునరుద్ఘాటిస్తున్నాడు. మనం వేసుకునే బట్టలు చిరిగిపోయి, పనికిరాకుండా పోయినప్పుడు, మనం వాటిని వదిలివేసి, కొత్త వాటిని ధరిస్తాము. ఈ ప్రక్రియ లో మనం మారిపోము. అదే విధముగా, ఒక దేహమును వదిలి, మరోచోట ఇంకొక దేహములో పుట్టే ప్రక్రియలో, ఆత్మ కూడా మార్పునకు లోను కాదు. మీరొక చిన్న శిశువుని గమనిస్తే, ఏ పత్యేకమైన కారణం లేకుండానే, ఒక్కోసారి ఆనందంగా ఉంటుంది, ఒక్కోసారి విషాదంగా ఉంటుంది, ఒక్కోసారి భయపడుతూ ఉంటుంది. 'న్యాయ దర్శన' ప్రకారం, ఆ శిశువు తన పూర్వ జన్మను గుర్తు చేసుకుంటోంది కాబట్టి, ఈ భావోద్వేగాలను అనుభవిస్తోంది. కానీ, అ శిశువు పెరిగే కొద్దీ, ప్రస్తుత జన్మ గుర్తులు మనస్సులో బలంగా ముద్రింపబడటం వలన, గత జన్మ స్మృతులు మరుగైపోతాయి. అంతేకాక, జన్మ, మరణ ప్రక్రియలు ఆత్మకి చాలా బాధాకరమైనవి కనుక, అవి పూర్వ జన్మ స్మృతులను చాలా మటుకూ, తుడిచివేస్తాయి. అప్పుడే పుట్టిన శిశువు కూడా, ఎన్నో పూర్వ జన్మలలో, జంతు జన్మలలో, ఆయా తల్లుల స్తనాలూ, పొదుగుల నుండి కూడా చనుబాలు తాగివుంటుంది. కాబట్టి, తల్లి తన స్తనాన్ని శిశువు నోట్లో పెట్టినప్పుడు, ఆ శిశువు స్వతస్సిద్ధంగా, గత అనుభవంతో చనుబాలు తాగటం మొదలుపెడుతుంది. మన సనాతన వైదిక గ్రంధముల ప్రమాణం ఆధారంగా, పునర్జన్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్మక తప్పదు. మనం గత జన్మలలో చేసిన కర్మల ఫలితంగానే, ప్రస్తుత జన్మలో మన స్థితీ, జీవనం అనేది ఆధార పడి ఉంటుందనేది, మన పెద్దల నమ్మకం.

నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః ।

న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుతః ।। 23 ।।

ఈ ఆత్మను, ఆయుధాలు ఛేదింపలేవూ, అగ్ని కాల్చలేదూ, నీరు తడుపలేదూ, గాలి అర్పలేదు.

ఆత్మ యొక్క లక్షణం అయిన చైతన్యమును, భౌతిక పరికరముల ద్వారా గ్రహించవచ్చు కానీ, ఆత్మను మాత్రము, ఏ భౌతిక వస్తువు ద్వారా కూడా, స్పృశించలేము. ఎందుకంటే, ఆత్మ దివ్యమైనది కావున, ప్రాకృతిక వస్తువులకు అతీతమైనది. ఆత్మను ఎటువంటి చర్యల వలనా, నాశనం చేయలేరని, ఆ కృష్ణ భగవానుడు అర్జునుడికి స్పష్టం చేస్తున్నాడు.

అచ్ఛేద్యోఽయమదాహ్యోఽయమ్ అక్లేద్యోఽశోష్య ఏవ చ ।

నిత్యః సర్వగతః స్థాణుః అచలోఽయం సనాతనః ।। 24 ।।

ఆత్మ ఛేదింపబడదు, మరియు దహింపబడదు. అది నీటిచే కడుగబడదు, దానిని ఎండబెట్టుటకు సాధ్యం కాదు. అది నిత్యమూ, సర్వ వ్యాపీ, మార్చలేనిదీ, పరివర్తనలేనిదీ, మరియు సనాతనమైనది.

ఆత్మ యొక్క అమరత్వం, మళ్లీ అర్జునుడికి వివరిస్తున్నాడు వాసుదేవుడు. గురువు గారి పరిపూర్ణ జ్ఞానం, కేవలం చెబితే సరిపోదు. ఆ విజ్ఞానం ఉపయోగపడాలంటే, విద్యార్థి హృదయం లోనికి, అది లోతుగా చేరాలి. కాబట్టి, నైపుణ్యం గల గురువు తరచుగా, చెప్పిన విషయాన్నే పునరావృత్తం చేస్తాడు. ఆత్మను ఎవరూ నాశనం చేయరు. అది నిత్యమైనది. అందువలన ‘భౌతికపరమైన శరీరానికి గాయమైనా, అంతరంగంలోని ఆత్మకు ఎటువంటి అపాయం కాదు’ అనే విషయాన్ని, గట్టిగా అర్జునుడి మదిలో బలపడేలా వివరిస్తున్నాడు శ్రీ కృష్ణుడు.

అవ్యక్తోఽయమచింత్యోఽయమ్ అవికార్యోఽయముచ్యతే ।

తస్మాదేవం విదిత్వైనం నానుశోచితుమర్హసి ।। 25 ।।

ఆత్మ అనేది అవ్యక్తమైనది. అంటే, కనిపించనిది, ఊహాతీతమైనది, మరియు మార్పులేనిది. ఈ విషయాన్ని అర్థం చేసుకుని, నీవు శరీరం కోసం శోకించవద్దు.

భౌతిక శక్తి నుంచి తయారైన మన నేత్రములు, కేవలం భౌతిక వస్తువులను మాత్రమే చూడగలవు. ఆత్మ దివ్యమైనది, భౌతిక శక్తికి అతీతమైనది కాబట్టి, మన కంటికి కనిపించదు. ఆత్మను చూడాలనీ, దానిని బంధించాలనీ, అనేక మంది శాస్త్రవేత్తలు, ఎన్నో ప్రయోగాలు చేశారు. మరణానికి చేరువలో ఉన్న వారిని గాజుపెట్టిలో భద్రపరిచి, శరీరం నుండి ఆత్మ ఏ విధంగా వెళ్ళిపోతుంది? దాని శక్తి ఎలా ఉంటుంది? అని పరిశోధనలు చేశారు. కానీ, క్షణ పాటులో, శరీరం నుండి ఒక శక్తి ప్రకృతిలో మమేకమైపోతుంది.. అని తెలుసుకున్నారు. భౌతిక శక్తి కన్నా, ఆత్మ సూక్ష్మమైనందువల్ల, అది మన మనస్సు యొక్క ఊహకు అందనిది. "ఇంద్రియముల కన్నా, ఇంద్రియ పదార్థములు మించినవి.. ఇంద్రియ పదార్థముల కన్నా, మనస్సు సూక్ష్మమైనది.. మనస్సు కన్నా, బుద్ధి మించినది.. బుద్ది కన్నా సూక్ష్మమైనది ఆత్మ". ప్రాకృతిక మనస్సు, భౌతిక విషయములనే, గ్రహించగలదు. అంతేకానీ, దివ్యమైన ఆత్మను, దాని ఆలోచనా శక్తి ద్వారా, అందుకోలేదు. అందువలన, ఆత్మ జ్ఞానం తెలుసుకోవటానికి, గురువూ, వైదిక గ్రంధాల వంటి బాహ్య మూలాధారములూ, అవసరం.

మన తదుపరి వీడియోలో, అర్జునుడి శోకాన్ని పోగొట్టడానికి, శ్రీ కృష్ణుడు చెప్పిన ‘జనన మరణాల గురించిన సూక్ష్మ జ్ఞాన ప్రబోధం’ గురించి, తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgxkTEZIumguYaxme9F4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes