పూరీ క్షేత్రంలో మాయమైన ఇంద్రనీలమణి విగ్రహ రహస్యం!
మన భారత దేశంలో ఎన్నో ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలున్నాయి. వాటిలో మహాద్భుతమైన క్షేత్రంగా, మర్మక్షేత్రంగా పేరుగడించింది, ఒడిశాలోని పూరీ. సోదరుడైన బలభద్రుడూ, సొదరి సుభద్రతో కలసి, జగన్నాథుడు ఈ క్షేత్రంలో కొలువై ఉన్నాడు.
[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/K2wKhS88jPs ]
ఈ క్షేత్రంలోని స్వామి దారు ప్రతిమలను, దేవశిల్పి విశ్వకర్మ తయారుచేశాడనే విషయం, మనలో చాలా మందికి తెలుసు. ఈ ఆలయంలో ఎన్నో అద్భుత రహస్యాలు దాగి ఉన్నాయి. గాలికి వ్యతిరేకదిశలో ఎగిరే ఆలయ గోపురంపై ఉండే జెండా, పూరీలో ఏ చోట నుండి చూసినా, మన వైపే చూస్తున్నట్లుండే సుదర్శన చక్రం, మిట్ట మధ్యాహ్న వేళ కూడా పడని గోపురం నీడ, గర్భుగుడిలో వినబడని అలల శబ్ధం, ఇలాంటి ఎన్నో అంతుచిక్కని రహస్యాలు, మన పూరీ క్షేత్ర వైభవాన్ని మరింత ఇనుమడిస్తాయనడంలో, ఎటువంటి సందేహం లేదు. అయితే, ఇంద్రద్యుమ్నుడు పూరీ క్షేత్రంలో, దారు ప్రతిమలను ప్రతిష్ఠింపజేయడానికి గల కారణం ఏంటి? పూర్వం అక్కడ వెలసిన, శ్రీహరి ఇంద్రనీల విగ్రహం ఎలా అదృశ్యమయ్యింది? యమధర్మరాజుకీ, ఈ ఆలయంలోని విగ్రహానికీ సంబంధం ఏంటి? అనేటటువంటి విషయాలను, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..
పూరీ క్షేత్రంలో బలభద్ర, సుభద్ర, జగన్నాథ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠింపజేసింది, ఇంద్రద్యుమ్న మహారాజు. ఆయన ఉజ్జయినీ రాజ్యాన్ని ధర్మబద్ధంగా, ప్రజారంజకంగా పరిపాలించాడు. ఆయన రాజ్యాధికారంలో ఉన్న ప్రజలు, యజ్ఞయాగాది క్రతువులను నిరాటంకంగా కొనసాగిస్తూ, సుఖ సంతోషాలతో జీవించేవారు. ఒకనాడు ఇంద్రద్యుమ్న మహారాజుకు, శ్రీ హరిని సేవించాలనీ, ఆయనకొక దివ్యమైన ఆలయాన్ని నిర్మించాలనే తలంపు కలిగింది. అందుకు తగిన స్థలం వెదకడం కోసం, మంత్రులూ, పురోహితులూ, పరివారం, చతురంగబలాలూ, అంత:పుర స్త్రీలూ, వందిమాగదుల్ని వెంటబెట్టుకుని, బయలుదేరాడు. ఇంద్రద్యుమ్నుడు ఎంతో ఆహ్లాదకరమైన దక్షిణ సముద్రతీరానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతం, పుష్ప ఫల వృక్షాలతో, నయనమనోహరంగా గోచరించింది. ఆ సముద్రతీరంలో విడిది చేసిన ఇంద్రద్యుమ్నుడు, అక్కడ కొలువైన పురుషోత్తమ క్షేత్రం లోపలికి ప్రవేశించాడు.
ఆ ప్రాంతంలోనున్న సుందరమైన ప్రదేశాలన్నింటినీ దర్శించాడు. పూరీ క్షేత్ర పరిసరాల్లో, వింధ్య పర్వత శ్రేణులనుండి ఉద్భవించిన, అనేక పుణ్యనదులున్నాయి. వాటిలో గంగతో సమానంగా భావించే, పరమ పుణ్య నది ‘స్విత్రోపల’, దక్షిణ సముద్రంలో సంగమిస్తుంది. ఇంత అద్భుతమైన దివ్య క్షేత్రాన్ని దర్శించిన ఇంద్రద్యుమ్నుడు, సాక్షాత్తూ జగన్నాథుడు కొలువైన మానస క్షేత్రం, మహిమాన్విత క్షేత్రం ఇదేనని, ఆనంద పరవశుడయ్యాడు. అయితే, పూర్వం ఈ ఆలయంలో, ఇంద్రనీలమణి విగ్రహరూపంలో, మర్రి చెట్టు క్రింద కొలువై ఉండగా, ఆ విగ్రహం అకస్మాత్తుగా అదృశ్యమయ్యిందని తెలుసుకున్న ఇంద్రద్యుమ్నుడు, తన కఠోర దీక్షతో, తపస్సుతో, శ్రీ హరిని మెప్పించి, తిరిగి విష్ణుదేవుడి ఆలయాన్ని నిర్మిస్తానని ప్రకటించాడు. ఆ విధంగానే, వెంటనే జ్యోతిష్యులను పిలిపించి, తగిన ముహుర్తం నిర్ణయించి, ఆలయ నిర్మాణానికి తగిన ప్రాంతాన్ని ఎన్నిక చేసి, మంగళ వాయిద్యాల మధ్య, వేదపండితుల ఆధ్వర్యంలో, శంకుస్థాపన చేశాడు. స్వామికి సకలోపచారాలతో పూజచేసి, పూర్ణ కుంభాన్నీ, ఆర్ఘ్యాన్నీ సమర్పించాడు.
ఇంద్రద్యుమ్నుడు శ్రీ మహావిష్ణు ప్రతిమను రూపొందించడానికి, తగిన శిల కోసం చాటింపు వేయించాడు. ఆలయ నిర్మాణానికి ముందుగా, ఇంద్రద్యుమ్న మహారాజు అశ్వమేథయాగాన్ని చేపట్టాడు. యాగానికి విచ్చేసిన ప్రతి ఒక్కరినీ, విలువైన కానుకలతో సత్కరించాడు. యాగాన్ని వైభవంగా, నిర్విఘ్నంగా పరిసమాప్తి చేశాడు. కానీ, ఇంద్రద్యుమ్నుడికి శ్రీ హరి ప్రతిమను ఏ విధంగా చేయాలి? రాయి, కొయ్య, లోహం, మట్టి, ఇలా దేనితో శ్రీ హరి ప్రతిమను చేస్తే స్వామి సంతోషిస్తాడు? ఆ ఇంద్రనీలమణి విగ్రహాన్ని ఎలా తిరిగి రప్పించాలి? అనే ఆలోచనలు చుట్టుముట్టాయి. తన ప్రశ్నలన్నింటికీ వాసుదేవుడే తగిన మార్గం చూపిస్తాడని, ఆయనను ఆర్తితో స్తుతించి, పూజించి, ఆ ప్రాంతంలోనే దర్భపై వస్త్రాన్ని పరుచుకుని, అక్కడే నిద్రించాడు. రాజు ఆర్తికి కరిగిపోయిన వాసుదేవుడు, శంఖ చక్ర గదా ధారుడై, గరుత్మంతుడి మీద ఆసీనుడై, స్వప్నంలో కనిపించాడు. భగవంతుడిని దర్శించి ఆనంద పరవశుడైన మహారాజుతో వాసుదేవుడు, ‘ఇంద్రద్యుమ్నా! ఎందుకు పరితపిస్తున్నావు? నీవు దొరకాలనుకుంటున్న జగన్నాథుడి ప్రతిమ, అత్యంత పురాతనమైనది, జగత్పూజ్యమైనది. దానిని నీవు తిరిగి ప్రతిష్ఠించాలని పరితపిస్తున్నావు. అది సాధ్యం కాదు.
ఈ మర్రి చెట్టు క్రింద వెలశిన మహిమాన్వితమైన నా దివ్య మంగళ రూపాన్ని దర్శించి, మానవులు వారు చేసిన పాపాలను పొగొట్టుకునేవారు. ఒకనాడు యమధర్మరాజు విచ్చేసి, ‘జగన్నాథా! మీ మూర్తి ఇంద్రనీలమణిలా ప్రకాశిస్తూ, జనులందరి పాపాలనూ పటాపంచలు చేస్తోంది. ప్రతీ ఒక్కరూ, పుణ్యాన్ని సంపాదించుకుని, స్వర్గానికి చేరుకుంటున్నారు. పాపులకు అవకాశం లేని చోట, నాకు ఉనికెక్కడిది? దయచేసి నా కర్తవ్యాన్ని నిర్వర్తించేలా, మీ దివ్య రూపాన్ని ఉపసంహరించుకోండి’ అని అడగడంతో, ఆ విగ్రహాన్ని నేనే మాయం చేశాను. అయితే, అంతటి మహిమాన్వితమైన ప్రతిమని ప్రతిష్ఠించే అదృష్టాన్ని, నీకు కలుగచేస్తున్నాను. రేపు సూర్యోదయం కాగానే, గొడ్డలి తీసుకుని బయలుదేరు. ఈ సముద్ర జలాలకు అల్లంత దూరంలో, చెలయలికట్టని ఆనుకుని, ఒక చెట్లగుబురు నీకు కనిపిస్తుంది. దానికి అవతలి గట్టున ఒక చెట్టు, నీళ్ళని తాకుతూ వుంటుంది. అలల తాకిడికి గురైనప్పటికీ, ఆ చెట్టు ఏ మాత్రం కంపించదు. నీవు భయపడకుండా, దివ్యదృష్టితో గమనించి, నీ స్వహస్తాలతో దానిని నరుకు. దివ్యమైన ఆ వృక్షం యొక్క కలపతో, జగన్నాథుడి ప్రతిమను తయారు చేయించు. ఇక వేరే ఏ ఆలోచనా చేయకు’ అని పలికి, వాసుదేవుడు అదృశ్యమయ్యాడు.
సూర్యోదయాన మహారాజు నిద్రలేచి, స్వప్నంలో వాసుదేవుడు చెప్పిన విధంగానే, ఆ దివ్య వృక్షాన్ని గొడ్డలితో రెండు ముక్కలుగా నరికి, తీసుకువచ్చాడు. అంతలో శ్రీహరీ, దేవశిల్పి విశ్వకర్మా, ఇద్దరూ బ్రాహ్మణుల రూపంలో అక్కడికి వచ్చారు. మహారాజుతో, ఇది మహావృక్షం.. దీనిని ఎందుకు నరికారు? ఇక్కడ మీరేం చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అందుకు ఇంద్రద్యుమ్నుడు, ‘వాసుదేవుడి ఆజ్ఞతో, ఈ కలప ద్వారా, శ్రీ మహావిష్ణువు ప్రతిమను చేయించి, పురుషోత్తమ క్షేత్రంలో ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాను’, అని తెలియజేశాడు. పండితుడి రూపంలో ఉన్న శ్రీహరి చిద్విలాసంగా నవ్వుతూ, ‘ఇదిగో ఇతను శిల్పచాతుర్యం కలిగిన వాడు. నీవు కోరిన విధంగా, శ్రీ హరి ప్రతిమను ఇతను తయారుచేస్తాడు’ అని చెప్పాడు. ఇంద్రద్యుమ్ముడు విశ్వకర్మకు ఆ కలపను అప్పగించి, కాసేపు చెట్టు క్రింద విశ్రమించడానికి వెళ్లాడు.
శ్రీ హరి ఆధ్వర్యంలో, ఆయన చెప్పిన విధంగా, విశ్వకర్మ, బలరామమూర్తీ, సుభద్రాదేవీ, జగన్నాథుడి దారు మూర్తులను తయారుచేశాడు. తిరిగి వచ్చిన మహారాజు, ఆ ప్రతిమలను చూసి ఆశ్చర్యపోయి, ‘సామాన్యులు ఇంత తక్కువ సమయంలో, ఇంతటి దివ్యమంగళమూర్తి రూపాన్ని చెక్కడం, అసాధ్యం. దయచేసి మీరెవరో తెలియజేయండి’ అని ప్రార్థించాడు. వెంటనే శ్రీహరి, ఇంద్రద్యుమ్నుడికి సాక్షాత్కరించాడు. ‘నీవు చరితార్థుడవయ్యావు. నీ పేరుతో ఇంద్రద్యుమ్న సరస్సు ఒకటి, ఇక్కడ ఏర్పడుతుంది. ఆ సరస్సులో స్నానమాచరించిన వారికి, ఇంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. ఇక్కడ పిండ ప్రదానం చేసిన వారి ఇరవై తరాల వారు, స్వర్గానికి చేరుకుంటారు’, అని శ్రీ హరి వరమిచ్చి, విశ్వకర్మతో సహా అంతర్థానమయ్యాడు. ఇంద్రద్యుమ్నుడు ఎంతో సంతోషించి, ఆ దారు ప్రతిమలను, ఒక మట్టి రథం మీద ఎక్కించి, వాటిని ఘనంగా ఊరేగించి, పురోహితుల సమక్షంలో, ఘనంగా ఆలయంలో ప్రతిష్ఠించాడు.
ఇంద్రద్యుమ్న మహారాజు దారుమూర్తులను ప్రతిష్ఠించిన ఆ పురుషోత్తమ క్షేత్రమే, ఒడిశాలోని పూరీ క్షేత్రం. నిరాహారంగా, ఒంటికాలి మీద నిలబడి, డెబ్భై వేల సంవత్సరాలు శ్రీ హరిని ధ్యానిస్తూ తపస్సు చేస్తే ఎంత ఫలం లభిస్తుందో, జ్యేష్ఠ శుద్ధ దశమినాడు ఉపవాసం ఉండి, జగనాథుణ్ణి దర్శిస్తే, అంతటి ఫలం ప్రాప్తిస్తుంది. జ్యేష్ఠమాసంలో పంచతీర్థ యాత్రచేసి, శుద్ధ ద్వాదశినాడు జగన్నాథుణ్ణి దర్శించుకునే వారు, శాశ్వత విష్ణులోకం పొందుతారు. ఆలయంలోపలి స్వామిని చూడలేకపోయినా, దూరాన కనబడే ఆలయ శిఖరాన్ని చూసి నమస్కరించినా, మన ఇంట్లోనే ఉంటూ, ఆ జగన్నాథుణ్ణి మనసారా స్మరించినా, ఎంతో పుణ్యం లభిస్తుంది. ఆ జగన్నాథుడి చరిత్రను తెలుసుకోవడం, మన సుకృతం.
సర్వేజనా: సుఖినోభవంతు!
Link: https://www.youtube.com/post/Ugz2w0t_QWNcv-lSs_B4AaABCQ
Post a Comment