యుద్ధభూమిలో ఒక యోధుడు అహింసా వాది అయితే..! Bhagavad Gita


యుద్ధభూమిలో ఒక యోధుడు అహింసా వాది అయితే..!

'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (32 - 37 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో సాంఖ్య యోగంలోని 32 నుండి 37 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..

[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/ZUPx8Eotv9E ]

శ్రీ కృష్ణుడు క్షత్రియ ధర్మం  గురించి, అర్జునుడితో ఈ విధంగా సంభాషిస్తున్నాడు..

యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారమపావృతమ్ ।

సుఖినః క్షత్రియాః పార్థ లభంతే యుద్ధమీదృశమ్ ।। 32 ।।

ఓ పార్థా, ధర్మాన్ని పరిరక్షించే అవకాశం, కోరుకోకుండానే దొరికిన క్షత్రియులు, అదృష్టవంతులు. ఇది వారికి, స్వర్గమునకు తెరిచి ఉన్న ద్వారము వంటిది.

సమాజాన్ని రక్షించే బాధ్యత, క్షత్రియులపైనే ఉంటుంది. వారి వృత్తి ధర్మాన్ని అనుసరించి, వీరులు ధైర్య సహాసాలతో, జీవితాలను అర్పించడానికి సిద్ధపడి ఉంటారు. వైదిక కాలంలో, జంతువులను చంపడం అనేది, సమాజంలోని వారికి నిషేధించబడినా, అరణ్యాలలో యుద్ధ విద్యను అభ్యసించటానికై, జంతువులను వేటాడి చంపడానికి, క్షత్రియ యోధులకు అనుమతించారు. ఇటువంటి సాహసవంతులైన యోధులు, ధర్మాన్ని రక్షించడానికి దొరికే ఏ అవకాశాన్నైనా, చేతులు చాచి స్వాగతిస్తారు. తమ విధిని నిర్వర్తించడం ఒక పవిత్రమైన కార్యంగా, వారు భావిస్తారు. విధిని సక్రమంగా నిర్వర్తించటం అనేది, భగవత్ ప్రాప్తి నొందించే ఆధ్యాత్మిక కార్యం కాదు. అది మంచి భౌతిక ప్రతిఫలం అందించే, పుణ్య కార్యం. నిరాశతో నిండిపోయిన అర్జునుడు, తన కర్తవ్యాన్ని వదిలిపెట్టాలని భావిస్తుండగా, శ్రీ కృష్ణుడు మాత్రం, విధిని నిర్వర్తించమని నచ్చజెబుతున్నాడు. అర్జునుడిలో శ్రీ కృష్ణుడు కోరిన మార్పు, అంతర్గతమైనది, తన అంతఃకరణ లోనిది. అది బాహ్యమైన కర్మ పరిత్యాగము కాదు.

అథ చేత్త్వమిమం ధర్మ్యం సంగ్రామం న కరిష్యసి ।

తతః స్వధర్మం కీర్తిం చ హిత్వా పాపమవాప్స్యసి ।। 33 ।।

కానీ, ఒకవేళ నీవు స్వధర్మాన్నీ, కీర్తినీ విడిచి, ఈ ధర్మ యుద్ధాన్ని చేయడానికి నిరాకరిస్తే, తప్పకుండా పాపాన్ని చేసినవాడవవుతావు.

యుద్ధభూమిలో ఒక యోధుడు అహింసా వాది అయితే, అది కర్తవ్య ఉపేక్ష అవుతుంది. సమస్యాత్మకమైనదిగా, చికాకుగా భావించి, తన కర్తవ్యాన్ని విడిచిపెడితే, అర్జునుడు పాపానికి పాల్పడినట్లే అని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. అన్యాయం, హింస నుండి దేశ ప్రజలను కాపాడటం, క్షత్రియుడి కర్తవ్యం. శాంతి భద్రతల నిర్వహణ కోసం, తగిన సందర్భాల్లో, హింస అవసరం. అందుకే, అతను శత్రు రాజుల సైన్యాన్ని ఓడించి, రాజ్యాన్ని ధర్మ బద్ధంగా పాలించటానికి తోడ్పడాలి. ఆ విధంగానే, శ్రీ కృష్ణుడు అర్జునుడికి బోధిస్తున్నాడు.

అకీర్తిం చాపి భూతాని కథయిష్యంతి తేఽవ్యయామ్ ।

సంభావితస్య చాకీర్తిః మరణాదతిరిచ్యతే ।। 34 ।।

జనులు నిన్ను పిరికివాడూ, పారిపోయిన సైనికుడూ అని అంటారు. గౌరవప్రదమైన వ్యక్తికి, అపకీర్తి అనేది, మరణం కన్నా నీచమైనది.

గౌరవప్రదమైన వ్యక్తులకు, సామాజిక ప్రతిష్ట చాలా ముఖ్యమైనది. క్షత్రియులకు సహజముగా ఉన్న గుణములు, కీర్తి, గౌరవం. అగౌరవం, అపకీర్తి అనేవి, వారికి మరణం కన్నా నీచమైనవి. ఉత్తమ స్థాయి జ్ఞానాన్ని అందుకోకపోయినా, ఈ నిమ్న స్థాయి జ్ఞానము వలన, ప్రేరణను పొందవచ్చని, శ్రీ కృష్ణుడు అర్జునుడికి గుర్తు చేస్తున్నాడు. ప్రపంచంలోని చాలా సమాజాల్లో, యుద్ధ భూమి నుండి, పిరికితనముతో పారిపోయిన సైనికుడిని, సమాజం నుండి వెలివేసే నియమం వుంది. తన కర్తవ్యాన్ని విస్మరిస్తే, ఇంతటి అపకీర్తీ, అగౌరవం, అర్జునుడికి కలుగవచ్చు. అందుకే, శ్రీ కృష్ణుడు హెచ్చరిస్తున్నాడు.

భయాద్రణాదుపరతం మంస్యన్తే త్వాం మహారథాః ।

యేషాం చ త్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవమ్ ।। 35 ।।

ఏ మహారథుల దృష్టిలో నీవు గొప్పవాడివో, వారే, నీవు యుద్ధభూమి నుండి భయముతో పారిపోయావనుకుంటారు. అలా వారికి నీ మీద ఉన్న గౌరవం, పోగొట్టుకుంటావు.

అర్జునుడు ఒక మహా యోధుడు. అంతేకాక, కౌరవ పక్షాన ఉన్న భీష్ముడూ, ద్రోణాచార్యుడూ, కర్ణుడి వంటి అత్యంత సాహసవంతులకి కూడా, గట్టి పోటీ ఇచ్చే ప్ర్యతర్థి. ఎంతో మంది దేవతలతో యుద్ధం చేసి, కీర్తిని సంపాదించుకున్న వ్యక్తి. వేటగాడిలా మారు వేషంలో వచ్చిన శివుడితో పోరాడి, ఆయనను సైతం మెప్పించాడు. అతని సాహసానికీ, నైపుణ్యానికీ మెచ్చి, పాశుపతాస్త్రం అనే దివ్యాస్త్రాన్ని, శివుడు అతనికి బహూకరించాడు. అతని విలు విద్యను మెచ్చి, గురువైన ద్రోణాచార్యుడు కూడా, ఒక ప్రత్యేక అస్త్రం ఇచ్చి, తన దీవెనలు అందజేశాడు. ఇప్పుడు యుద్ధ ప్రారంభానికి ముందు, అర్జునుడు యుద్ధ భూమి నుండి వెళ్ళిపోతే, తన బంధువుల మీద ప్రేమతో ఇలా వెళ్ళిపోయాడని, అక్కడున్న వారు భావించరు. అతనిని పిరికివాడనీ, తమ బల పరాక్రమములకు భయపడి పారిపోయాడనే, వారంతా అనుకుంటారు.

అవాచ్యవాదాంశ్చ బహూన్ వదిష్యన్తి తవాహితాః ।

నిందంతస్తవ సామర్థ్యమ్ తతో దుఃఖతరం ను కిమ్ ।। 36 ।।

నీ శత్రువులు నిన్ను అపకీర్తి పాలు చేసి, క్రూరమైన మాటలతో అవమానిస్తారు. దీనితో, నీ గొప్పతనం చులకనయిపోతుంది. అయ్యో, దీని కంటే ఎక్కువ బాధాకరమైనది ఏమైనా ఉందా?

ఒకవేళ అర్జునుడు యుద్ధ భూమి నుండి పారిపోతే, తోటి వీరుల మధ్య అతని గొప్పతనం తగ్గిపోవడమే కాక, అతను చులకనైపోతాడు. అర్జునుడి శత్రువులైన దుర్యోధనుడి సమూహం, పోరాడడం చేతకాని అర్జునుడు, యుద్ధ భూమి నుండి, కాళ్ళ మధ్యలో తోక ముడుచుకున్న కుక్క లాగా పారిపోతున్నాడని, అనుచితమైన మాటలు మాట్లాడుతారు. ఇలాంటి హేళనను భరించటం, అర్జునుడికి చాలా బాధాకరంగా ఉంటుందని, శ్రీ కృష్ణుడు గుర్తుచేస్తున్నాడు.

హతో వా ప్రాప్స్యసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీమ్ ।

తస్మాదుత్తిష్ఠ కౌంతేయ యుద్ధాయ కృతనిశ్చయః ।। 37 ।।

యుద్ధం చేస్తే, నీవు యుద్ధ రంగంలో వీర మరణం పొంది, స్వర్గానికి వెళతావు. లేదా, విజయుడవై, ఈ రాజ్యమును అనుభవిస్తావు. కావున, కృత నిశ్చయుడవై లెమ్ము. ఓ కుంతీ పుత్రుడా, యుద్ధానికి తయారుకమ్ము.

కురుపాండవుల మధ్య జరిగే యుద్ధంలో, అర్జునుడు విజయుడైతే, భూలోకంలో, సామ్రాజ్యం అతనికోసం ఉంటుంది. రాజ్యాధికారం సొంతమవుతుంది. ఒకవేళ యుద్ధంలో కౌరవుల చేతిలో ఓడిపోయి, కర్తవ్య నిర్వహణలో ప్రాణాలు విడిచి పెట్టవలసి వస్తే, అతను స్వర్గ లోకాలకు వెళ్తాడు. ఏది ఏమైనా, కర్తవ్యాన్ని తప్పక నిర్వర్తించాలనీ, మనస్సును స్థిమిత పరుచుకుని, యుద్ధానికి సిద్ధం కమ్మనీ, శ్రీ కృష్ణుడు ఆదేశిస్తున్నాడు. 

మన తదుపరి వీడియోలో, బుద్ధియోగం గురించి, శ్రీ కృష్ణుడు ఏ విధంగా వివరించబోతున్నాడో తెలుసుకుందాము..

కృష్ణం వందే జగద్గురుం!

Link: https://www.youtube.com/post/UgwrffocLkNgAAtlK7B4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes