ఎటువంటి రోగాలనైనా, బాధలనైనా హరింపజేసే మంత్రము! Mahamrityunjaya Mantram


ఎటువంటి రోగాలనైనా, బాధలనైనా హరింపజేసే మంత్రము!

మన పెద్దలు మనకందించిన అమూల్యమైన సంపద ‘వేదాలు’. రుగ్వేదంలో చెప్పబడిన మహా మృత్యుంజయ మంత్రం, ఎంతో మహిమాన్వితమైనది, పరమ పవిత్రమైనది.

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/ix7_FC9h_Bk ​]

ఇది ఋగ్వేదంలో 7వ మండలం, 59 వ సూత్రంలో, 12 వ మంత్రంగా వస్తుంది. దీనినే ‘త్ర్యంబక మంత్రము’, ‘రుద్ర మంత్రము’, ‘మృత సంజీవనీ మంత్రము’ అని కూడా అంటారు. ఇదే మంత్రం, యజుర్వేదంలో కూడా చెప్పబడింది. ఈ మంత్రాన్ని శైవులు రుద్రాభిషేకంలో, వైష్ణవులు పాంచరాత్ర దీక్షలో, హోమ భస్మధారణ మంత్రంగా చెప్పుకుంటారు. ఇది శివ మంత్రం. క్షీర సాగర మథనంలో జనించిన హాలాహాలాన్ని సేవించి, పరమేశ్వరుడు మృత్యుంజయుడయ్యాడు. ఈ మంత్రం విశిష్ఠత ఏంటి? దీన్ని పఠించడం వలన కలిగే లాబాలేంటి? అనే విషయాలు, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ।

ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్ ।।

ఈ మహా మృత్యుంజయ మంత్రానికి అర్థం, అందరికీ శక్తినిచ్చే ముక్కంటి దేవుడూ, సుగంధ భరితుడైన పరమశివుడిని మేము పూజిస్తున్నాము. ‘పండిన దోసకాయ, తొడిమ నుండి వేరుపడినట్లుగానే, మమ్మల్ని కూడా, అమరత్వం కొరకు మృత్యువు నుండి విడుపించుగాక’ అని అర్ధం.

ఈ మంత్రాన్ని, మృత్యుభయం పోగొట్టుకోవడానికీ, మోక్షం కొరకూ, జపిస్తారు. గాయత్రీ మంత్రంలాగానే, ఇది కూడా హిందూ మతములో, ఒక సుప్రసిద్ధమైన మంత్రం. మానవుడికి ఆయురారోగ్యాన్నీ, సౌభాగ్యాన్నీ, దీర్ఘాయువునూ, శాంతినీ, తృప్తినీ ఇచ్చేదే, ఈ మహా మృత్యుంజయ మంత్రం. ఈ మంత్రం జపించిన వారు, రుద్రుని ఆశీస్సులు పొంది, మృత్యుంజయులవుతారు. దీనిని పఠించడం వలన, ఎటువంటి రోగాలూ, వ్యాధులూ లేకుండా, సుఖ మరణం పొందుతారు. ఇది ఒక విధమైన సంజీవనీ మంత్రమని చెప్పుకోవచ్చు. ఆపదలు కలిగినప్పుడూ, అనూహ్య సమస్యలు ఎదురైనప్పుడు కూడా, దీనిని పఠించవచ్చు. ఈ మంత్రానికి సర్వ రోగాలనూ తగ్గించే శక్తి ఉంది. ఈ మృత్యుంజయ మంత్రాన్ని శ్రద్ధతో పఠిస్తే, అకాలమృత్యువూ, ప్రమాదాల నుంచి రక్షణా లభిస్తుంది. ఈ మంత్రాన్ని సాధారణంగా, మూడు సార్లు గానీ, 9 సార్లు గానీ, లేదా త్రిగుణమైన సంఖ్యలో గానీ, పారాయణం చేయాలి. ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని జపించడం వలన, దైవ ప్రకంపనలు మొదలై, మనలను ఆవరించి ఉన్న దుష్ట శక్తులను తరిమికొడతాయి. ఈ మంత్రాన్ని పఠించిన వారికి, ఓ శక్తివంతమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకూ, దురదృష్టాల నుంచి బయటపడేందుకూ, ఈ మహా మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తుంటారు.

ఈ మంత్రాన్ని త్ర్యంబక మంత్రమనడంలో కూడా, ఎంతో గూఢార్థం దాగి ఉంది. శివతత్వంలో 3 కు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆ స్వామి త్రినేత్రుడూ, త్రిగుణాకారుడూ, త్రి ఆయుధుడూ, త్రిదళాలతో కూడిన బిల్వాలతో పూజింపబడేవాడూ, మూడు అడ్డురేఖలను నామంగా కలిగినవాడూ, త్రిజన్మ పాప సంహారుడూ, త్రిశూలధారుడూ, త్రికాలాధిపతీ, త్రిలోకరక్షకుడు. అందుకే, దీనిని త్ర్యంబక మంత్రం అంటారు. ఈ మహామృత్యుంజయ మంత్రాన్ని, ప్రాత: కాలాన్నే 108 సార్లూ, ప్రదోషకాలంలో 108 సార్లూ పఠిస్తే, ఎటువంటి రోగాలూ దరిచేరవు. చనిపోతామనే భయంతో ఉన్న వారు, ఈ మంత్రాన్ని పారాయణ చేస్తే, అపమృత్యు భయం దూరమవుతుంది. ఈ మంత్రాన్ని ఎన్ని సార్లు పఠించామనే దాని కన్నా, ఎంత భక్తి శ్రద్ధలతో పఠించామన్నదే, ముఖ్యం. పరమ పవిత్రమైన ఈ మంత్రాన్ని, మీ నిత్య శ్లోక పఠనంలో చేర్చి, ఆ శంకరుడి ఆశీర్వాదాన్ని పొందండి.

శుభం భూయాత్!

Link: https://www.youtube.com/post/Ugwzmaqyz7pIwaUz4ER4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes