బ్రహ్మహత్యాపాతకం బ్రాహ్మణుడికా సర్పానికా! విక్రమార్క - బేతాళ కథలు! Vikram Betal


బ్రహ్మహత్యాపాతకం బ్రాహ్మణుడికా సర్పానికా! విక్రమార్క - బేతాళ కథలు!

విక్రమార్క బేతాళ కథలలో, సుగుణాల సౌందర్యరాశి అయిన త్రిలోక సుందరికి తగిన వరుడెవరు? ఏ అర్హతలను బట్టి, యువరాణికి తగిన భాగస్వామిని విక్రమార్క మహారాజు ఎన్నుకున్నాడు? అనే విషయాలు, గత భాగంలో తెలుసుకున్నాము. ఇక బేతాళుడు చెప్పిన మూడవ కథ, ‘హరిస్వామి కథ’. ఈ కథా, బేతాళుడు వేసిన చిక్కు ప్రశ్నా, దానికి విక్రమార్కుడు చెప్పిన సమాధానం ఏంటో, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/-zYWtXH3tNo ​]

పూర్వం చూడామణి అనే మహారాజు, చూడాపురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తుండేవాడు. ఆయన భార్య పేరు విశాలాక్షి. ఆమె గొప్ప పతివ్రత మాత్రమే కాదు.. విశిష్ఠ దైవ భక్తురాలు. ఈ దంపతులకు, చాలా ఏళ్ల పాటు సంతానం కలుగలేదు. మహారాణి విశాలాక్షి, పుత్రసంతానం కోసం పరమేశ్వరుణ్ణి దీక్షగా ఆరాధిస్తూ, ఎన్నో నోములూ, వ్రతాలూ ఆచరించింది. కొంతకాలానికి శివుడి అనుగ్రహంతో, ఆమెకు అందమైన, రూపవంతుడైన ఒక కుమారుడు జన్మించాడు. లేక లేక కలిగిన ఆ కుమారుడికి, చూడామణీ, విశాలాక్షి దంపతులు, హరిస్వామి అనే పేరు పెట్టారు. సకల సంపదలకీ అధిపతి అయిన హరిస్వామి, ఇంద్రవైభోగంతో జీవించసాగాడు. ఆ సమయంలో, దేవలుడనే ముని ద్వారా శపించబడ్డ ఒక దేవకాంత, మానవ జన్మనెత్తింది. ఆ దేవకాంతకి, రూపలావణ్యిక అనే కుమార్తె జన్మించింది.

క్రమంగా పెరిగి, యుక్త వయస్సుకి వచ్చిన రూపలావణ్యిక అందచందాల గురించి విన్న హరిస్వామి, ఆమెను వివాహం చేసుకున్నాడు. వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా జీవించసాగారు. కానీ, ఒకనాటి అర్థరాత్రి, నుకలుడనే గంధర్వుడు, నిద్రిస్తున్న రూపలావణ్యికను అపహరించుకుపోయాడు. ఉదయం నిద్రలేచేసరికి, హరిస్వామికి తన భార్య కనిపించలేదు. ఆమెకోసం ఎన్నో ప్రాంతాలూ, దేశాలూ వెతికించాడు. ఎక్కడా ఆమెజాడ కనిపించలేదు. ఇక విసిగిపోయి, సంసారం మీద విముఖత పెంచుకుని, సన్యాసిగా మారిపోయాడు హరిస్వామి. తన మనస్సంతా నారాయణుడి మీదే లగ్నం చేసి, తపస్సులో లీనమై పోయాడు. ఎప్పుడైనా ఆకలిగా అనిపించినప్పుడు, భిక్షాటనకి వెళ్లేవాడు. అలా ఒకరోజు హరిస్వామి, ఒక బ్రాహ్మణుడి ఇంటికి బిక్ష కోసం వెళ్లాడు. ఆ ఇంటి యజమాని మంచి మనస్సుతో, భిక్షపాత్ర నిండా పాయసాన్ని పోశాడు.

హరిస్వామి ఆ పాత్రని తీసుకుని, ఒక నదీతీరానికి వెళ్ళి, అక్కడున్న చెట్టుతొర్రలో పాయసపాత్రని ఉంచి, స్నానం కోసం నదిలోకి దిగాడు. అంతలోనే ఒక విషసర్పం చెట్టుతొర్రలోకి ప్రవేశించి, అక్కడున్న పాయసపాత్రలో కొంచెం విషాన్ని చిమ్మింది. ఈ విషయం తెలియని హరిస్వామి, స్నానం చేసివచ్చి, పాయసాన్ని త్రాగాడు. నెమ్మదిగా అతడికి కళ్లు తిరగడం ప్రారంభమైంది. కొద్ది సేపటికి, పాయసంలో విషం కలిసిందన్న విషయం, అతడికి అర్థమైంది. వెంటనే ఓపిక కూడగట్టుకుని, అక్కణ్ణుంచి సరాసరి తనకి పాయసాన్ని ఇచ్చిన పండితుడి ఇంటికి వెళ్లాడు. అతడితో, ‘ఓ బ్రాహ్మణుడా, నీవు నాకిచ్చిన పాయసంలో విషం కలిసింది. మరికొద్ది సేపట్లో నేను మరణించబోతున్నాను. నీకు బహుశా బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందేమో.. దానికి తగిన పరిహారం ఏమైనా చేసుకో’ అని చెప్పి, కొద్ది క్షణాల్లో మరణించాడు హరిస్వామి. శివుడి వరప్రసాదంగా జన్మించిన హరిస్వామి, శివలోకానికి చేరుకున్నాడు.

‘విక్రమార్క మహారాజా... కథ విన్నారు కదా! ఇందులో విషాన్ని చిమ్మిన పాముకి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుందా? లేక పాయసం దానమిచ్చిన బ్రాహ్మణుడికి చుట్టుకుంటుందా? అని ప్రశ్నించాడు, బేతాళుడు. ఈ కథ విన్న విక్రమాదిర్కుడు, ‘పాముకి సహజంగానే విషం వుంటుంది. అది కావాలని విషాన్ని చిమ్మి వుండదు. పాయసం, తినే పదార్థం కనుక, దాంట్లో నోరు పెట్టింది. ఆ ప్రభావంతో, పాయసం విషపూరితమయ్యింది. అది దైవనిర్ణయం కనుక, పాముకి బ్రహ్మ హత్యాదోషం అంటదు. హరిస్వామి ఒక సన్యాసిగా, బ్రాహ్మణుడి ఇంటికి భిక్షకోసం వెళ్ళాడు. అతిథిని సత్కరించడం, గృహస్థు ధర్మం గనుక, ఆ విప్రుడు హరిస్వామికి పాయసాన్ని భిక్షగా ఇచ్చాడు. ఒకవేళ అతడు పాయసంలో విషం కలిపివుంటే, అతడిదే దోషమయ్యేది. అతడలా చేయలేదు కనుక, విప్రుడికి కూడా బ్రహ్మహత్యాదోషం అంటదు. కనుక, ఈ కథలో బ్రహ్మహత్యాపాతకం, ఎవ్వరికీ చుట్టుకోదు. అసలు మనిషి జనన మరణాలు రెండూ, కర్మ ప్రారబ్ధం వల్లే సంభవిస్తుంటాయి. హరిస్వామి ఒక కర్మ కారణంగా జన్మించాడు. ఆయువు తీరింది, మరణించాడు. అంతే..’ అని సమాధానం చెప్పాడు విక్రమాదిత్యుడు.

ఇక మన తదుపరి వీడియోలో, బేతాళుడి నాలుగవ ప్రశ్న, నాలుగవ కథ అయిన ‘గుణాకరుడి కథ’ను గురించి తెలుసుకుందాము..

Link: https://www.youtube.com/post/Ugxu7BzxEEdsuZjFkpV4AaABCQ

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes