మంచి కథ – మూడు జల్లెడల పరీక్ష!
ఒక సారి బ్రాహ్మణోత్తముడైన చాణిక్యుడి దగ్గరకు, పరిచయస్తుడు ఒకడు వచ్చి, 'నీకు తెలుసా? నీ మిత్రుడి గురించి నేను ఒక విషయం విన్నాను' అని ఎంతో ఉత్సాహంగా, ఏదో చెప్పబోతున్న తరుణంలో చాణిక్యుడు వారించి, 'నీవు నా మిత్రుడి గురించి చెప్పబోయే ముందు, ఒక్క నిముషం సావధానంగా, నీవు చెప్పబోయే విషయాన్ని కొద్దిగా జల్లెడ పడదాం.. దీన్ని నేను మూడు జల్లెడల పరీక్ష (Triple Filter Test) అంటాను' అని అడగటం మొదలు పెట్టాడు.
మొదటి జల్లెడ 'నిజం' – 'నీవు నా స్నేహితుడి గురించి చెప్పబోయే విషయం, ఖచ్చితంగా నిజమైనదని నీకు తెలుసా? అని అడిగాడు.
అందుకా పరిచయస్తుడు 'లేదు.. ఎవరో అంటుండగా విన్నాను' అని అన్నాడు.
'అంటే.. నీవు చెప్పబోయే విషయం నిజమా కాదా అని, నీకు తెలీదన్న మాట' అని చాణిక్యుడు అన్నాడు.
సరే.. రెండవ జల్లెడ 'మంచి' – 'నీవు నాకు చెప్పబోయే విషయం, నా మిత్రుని గురించిన మంచి విషయమా?' అని అడిగాడు చాణిక్యుడు..
'కాదు' అన్నాడు చాణిక్యుని పరిచయస్తుడు.
'అంటే, నీవు నా మిత్రుని గురించి చెడు చెప్పాలను కున్నావు. అది కుడా, నీకు ఖచ్చితంగా నిజమని తెలియని విషయం.. సరే, ఇంక మూడవ జల్లెడకు వెళదాం' అన్నాడు చాణిక్యుడు.
మూడవ జల్లెడ, 'ఉపయోగం' – 'నీవు నా మిత్రుని గురించి చెప్పబోయే విషయం, నాకు ఉపయోగకరమైనదా?' అని చాణిక్యుడు అడిగాడు.
'లేదు' అన్నాడు ఆ పరిచయస్తుడు.
'అయితే నీవు చెప్పబోయే విషయం నిజమైనది, మంచిది, ఉపయోగకరమైనది కానపుడు, నాకు చెప్పటం దేనికి?' అని అన్నాడు చాణిక్యుడు
నీతి: మన గురించీ, మన వాళ్ళ గురించీ చెడు వార్తలనూ, విషయాలనూ మోసే వాళ్ళు, చాలా మంది వుంటారు. అలాంటి విషయాలు (చాడీలు) వినేముందు, ఈ మూడు జల్లెడల పద్ధతిని అనుసరిస్తే, మన బంధాలు నిలబడతాయి, మంచి పెంపొందుతుంది, చాడీలు నివారించబడతాయి.
సర్వేజనాః సుఖినోభవంతు!
సమస్త సన్మంగళాని భవంతు!!
గమాతను పూజించండి!
గోమాతను సంరక్షించండి!!
Link: https://www.youtube.com/post/Ugz99y-t-BhnSXKiUDp4AaABCQ
Post a Comment