ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘ఆడి-బక యుద్ధం’!

 


ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన ‘ఆడి-బక యుద్ధం’!

వశిష్ఠ, విశ్వామిత్రుల మధ్య వైరం.. వ్యాసుడి శిష్యుడైన జైమినీ మహార్షి, తనకు కలిగిన సందేహాలను ధర్మ పక్షుల ద్వారా నివృత్తి చేసుకున్నాడు. ద్రౌపది అయిదుగురిని తన భర్తలుగా అంగీకరించడానికి గల కారణం.. ఉపపాండవుల జనన మరణాల వెనుక దాగిన రహస్యం.. మన గత వీడియోలో ఉపపాండవుల జననానికి, ముఖ్యకారణమైన హరిశ్చంద్రుడి గాధను తెలుసుకున్నాం..

[ ఈ వ్యాసాన్ని వీడియోగా చూడండి: https://youtu.be/t-S3Yyt3x50 ​]

విశ్వామిత్రుడు, ధర్మనిరతుడైన హరిశ్చంద్రుణ్ణి బాధించడం, రాజ్యభ్రష్టుణ్ణి చేయడం, విశ్వేదేవతలను శపించడం వంటి ఘట్టాలను తెలుసుకున్నాము.. ఇక, మహాముని అయినటువంటి విశ్వామిత్రుడు, కనికరం లేకుండా, హరిశ్చంద్రుణ్ణి ఎందుకు హింసించాడు? హరిశ్చంద్రుడి కులగురువైన వశిష్ఠుడు, విశ్వామిత్రుడిని ఎందుకు శపించాడు? రూపాంతరం చెందిన మహర్షులిరువురి మధ్యా జరిగిన భీకర యుద్ధం, ఎటువంటి పరిణామాలకు దారి తీసింది?  ఆనాటి ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి, విధ్వంసం స‌ృష్టించిన ఆడి-బక అంటే, బాతు - కొంగల యుద్ధం గురించి, ఈ రోజుటి మన వీడియోలో తెలుసుకుందాము..

విశ్వామిత్రుడి చేతిలో సర్వస్వం కోల్పోయినా, సంతోషంగా రాజ్యాన్ని విడిచివెళ్ళిన హరిశ్చంద్రుడి సత్యధర్మాచరణకి ఎంతో ఆనందించిన దేవతలు, ఆయనని స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. అయితే, ధర్మ ప్రభువైన హరిశ్చంద్రుడు, తన అయోధ్యా నగరంలోని ప్రజలందరికీ స్వర్గప్రాప్తి కలిగిస్తేనే, తాను స్వర్గానికి వస్తానన్నాడు. అందుకు అంగీకరించిన దేవేంద్రుడు, వారందరికీ సరిపడా విమానాలను రప్పించి, హరిశ్చంద్రుడితో సహా, అయోధ్యానగర వాసులందరినీ స్వర్గానికి చేర్చాడు.

విశ్వామిత్ర మహర్షి, హరిశ్చంద్రుడి రాజ్యాన్నీ, సకలాన్నీ లాక్కుని, నగరం నుండి తరిమివేసినప్పుడు, అతడి కుల గురువైన వశిష్ఠుడు, తపస్సులో నిమగ్నమై ఉన్నాడు. కంఠం వరకూ గంగా నదిలో మునిగి, ఘోర తపస్సు చేసిన వశిష్ఠుడు, 12 సంవత్సరాల తరువాత, మహాతేజస్సుతో బయటకు వచ్చాడు. నగరానికి తిరిగి వచ్చిన వశిష్ఠమహర్షికి, విశ్వామిత్రుడు హరిశ్చంద్రుణ్ణి ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాడు.. ఎన్ని కష్టాలకు గురి చేశాడు.. అన్న విషయాలు తెలిశాయి. మహాధర్మ ప్రభువైన హరిశ్చంద్రుణ్ణి, ఘోరంగా కష్టాలపాలు చేసిన విశ్వామిత్రుడి మీద, ఆయనకు ఆగ్రహం కలిగింది.

అంతకు పూర్వం, వశిష్ఠుడి వందమంది కుమారులను, లోక రక్షణార్థం సంహరించాడు, విశ్వామిత్ర మహర్షి. తన పుత్రులను కొల్పోయినా, లోక శ్రేయస్సుకోసమని తలచి, ఆగ్రహానికి లోనుకాని వశిష్ఠుడు, సత్యధర్మపాలకుడైన హరిశ్చంద్రుణ్ణి రాజ్యభ్రష్ఠుణ్ణి చేసినందుకు, కొపోద్రిక్తుడయ్యాడు. దాంతో, విశ్వామిత్రుడి వద్దకు వెళ్లి, ‘దురాత్ముడా, బ్రహ్మద్వేషి, మూర్ఖుడా, యజ్ఞనాశి అయిన విశ్వామిత్రా, నేటి నుండీ, నీవు 'బక' రూపమును పొందుదువుగాక’ అని శపించాడు. వెంటనే విశ్వామిత్రుడు కూడా, అంతే ఆగ్రహంతో, ‘నీవు 'ఆడి' రూపాన్ని పొందుదువు గాక’ అని ప్రతిశాపం ఇచ్చాడు. అలా మహాతపస్సంపన్నులైన విశ్వామిత్ర, వశిష్ఠులిద్దరూ కొంగ-బాతు జన్మలెత్తారు. వారిద్దరూ, ఆ రూపంలో పరస్పరం, మహాఘోరంగా యుద్ధం చేయడం  ప్రారంభించారు. వారి యుద్ధం చూసి, ప్రజలందరూ భయభ్రాంతులకు గురయ్యారు. 

‘బాతు’ రెండువేల యోజనాల పొడవుంటే, ‘కొంగ’ 3,096 యోజనాల పొడవుంది. మహాభీకరాకారాలతో వున్న వారు పోట్లాడుకుంటుంటే, వాటి రెక్కల ధాటికి, భూమి కంపించిపోయింది. సముద్రాలు ఉప్పొంగిపోయాయి. భూమి పాతాళం వైపుగా ఒరిగిపోయింది. ఈ యుద్ధం ధాటికి, సకల ప్రాణులూ హాహాకారాలు చేస్తూ, మరణించారు. భూమంతా అస్తవ్యస్తమై, వినాశనమైంది. ఈ విలయాన్ని చూసిన బ్రహ్మదేవుడు, హుటాహుటిన దేవతలందర్నీ తీసుకుని వారి దగ్గరకు వచ్చి, నచ్చచెప్పచూశాడు. ‘ఓ విశ్వామిత్ర, వశిష్ఠులారా! మీరిద్దరూ యుద్ధాన్ని చాలించండి. మీ యుద్ధం వలన సకల ప్రాణకోటీ ఎంతో నష్టపోయింది. ఇక ఆపండి’ అని అజ్ఞాపించాడు. అయినా, వారిద్దరూ బ్రహ్మమాటను లెక్కచేయక, తమ యుద్ధాన్ని మరింత తీవ్రతరం చేయసాగారు. అది చూసిన బ్రహ్మదేవుడు, లోక క్షేమం కోసం, వారిద్దరిలో ఉన్న తామసగుణాన్ని హరించివేశాడు.

వెంటనే బాతు-కొంగల రూపంలోనున్న వశిష్ఠ విశ్వామిత్రులు, తమ పూర్వ రూపాలను పొందారు. అప్పుడు బ్రహ్మ వారితో, ‘వశిష్ఠా! విశ్వామిత్రా! మీ ఇద్దరూ తామస ప్రభావంతో యుద్ధం చేస్తున్నారు. ముందు మీ కోపాన్ని తగ్గించుకోండి. ఓ వశిష్ఠా, ఈ విశ్వామిత్ర మహర్షి ఎలాంటి తప్పూ చేయలేదు. హరిశ్చంద్రుడి ధర్మనిరతిని లోకానికి తెలియజేసి, ఆయనకు స్వర్గప్రాప్తి కలిగించాడు. అది తెలుసుకోకుండా, నీవతన్ని శపించావు. ఈ విశ్వమిత్రుడు క్రోధంతో, తిరిగి నిన్ను శపించాడు. మీ ఇద్దరి వల్లా, ఎంతో అనర్ధం జరిగింది. ఇకపై మీరు పరస్పరం ద్వేషించుకోకుండా, ప్రశాంతగా జీవించండి’ అని హితబోధ చేశాడు. దాంతో, నిజం తెలుసుకున్న వశిష్ఠుడు, విశ్వామిత్రుడిని క్షమించమని కోరగా, అందుకు విశ్వామిత్రుడు కూడా, వశిష్ఠుడిని మన్నించమన్నాడు. వారి కలయికను చూసిన బ్రహ్మ ఎంతో సంతోషించి, వారిని ఆశీర్వదించి, దేవతలతో కలసి, తన లోకానికి వెళ్లిపోయాడు.

ఆడి-బక యుద్ధ ఘటాన్ని, జైమిని మహర్షికి వివరించిన ధర్మ పక్షలు, ‘ఎవరైతే హరిశ్చంద్రుడి కథనీ, ఈ ఆడి-బక కథనీ చెబుతారో, లేక వింటారో, వారు చేసిన పాపాలన్నీ నశించిపోతాయి. వారు చేసే పనులన్నీ, నిర్విఘ్నంగా నెరవేరుతాయ’ని ఆశీర్వదించాయి.

Post a Comment

© Copyright Maheedhar's Planet Leaf | Designed by OddThemes