నిజమైన కర్మ యోగిగా ఎలా మారాలో తెలియజేసిన శ్రీ కృష్ణభగవానుడు!
'భగవద్గీత' తృతీయోధ్యాయం - కర్మ యోగం (01 - 05 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో మూడవ అధ్యాయం, కర్మ యోగం. ఈ రోజుటి మన వీడియోలో, కర్మ యోగంలోని 01 నుండి 05 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/55y8nHLfONs ]
కర్మ యోగం మొదటి శ్లోకంలో, అర్జునుడు శ్రీ కృష్ణుడిని ఇలా ప్రశ్నిస్తున్నాడు..
అర్జున ఉవాచ ।
జ్యాయసీ చేత్కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన ।
తత్కిం కర్మణి ఘోరే మాం నియోజయసి కేశవ ।। 1 ।।
వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే ।
తదేకం వద నిశ్చిత్య యేన శ్రేయోఽహమాప్నుయామ్ ।। 2 ।।
అర్జునుడు ఇలా అడుగుతున్నాడు: ఓ జనార్ధనా, జ్ఞానం అనేది కర్మ కంటే శ్రేష్ఠమయినదయితే, మరి నన్ను ఈ ఘోరమైన యుద్ధం ఎందుకు చేయమంటున్నావు? నీ అస్పష్టమైన ఉపదేశంతో, నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో, దయచేసి ఆ ఒక్క మార్గాన్ని, నిశ్చయాత్మకంగా ఉపదేశించుము.
పరమాత్మ మొదటగా, మరణంలేని ఆత్మ యొక్క జ్ఞానాన్ని బోధించాడు. తరువాత అర్జునుడికి, తన క్షత్రియ ధర్మాన్ని గుర్తు చేసి, తన విధిని నిర్వర్తించటం ద్వారా కీర్తినీ, ఉత్తమ లోకాలనూ పొందవచ్చని చెప్పాడు. తన క్షత్రియ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించమని ఆర్జునుడిని ప్రేరేపించిన పిదప, శ్రీ కృష్ణుడు ఒక ఉన్నతమైన తత్వాన్ని తెలియచేశాడు. అదే, కర్మ యోగ శాస్త్రం. అర్జునుడిని కర్మ ఫల త్యాగం చేయమన్నాడు. ఈ పద్ధతిలో, బంధనం సృష్టించే కర్మలు, బంధ నాశనం చేసే కర్మలుగా మారతాయి. కర్మ ఫలాలపై ఆసక్తి లేకుండా పనులను ఆచరించే శాస్త్రాన్ని, 'బుద్ధి యోగము' అని వివరించాడు. అంటే, ప్రాపంచిక దురాకర్షణలకు ప్రభావితం కాకుండా, మనస్సుని స్థిరమైన బుద్ధి చేత నియంత్రించాలి. మరియు, బుద్ధిని అధ్యాత్మిక విజ్ఞానం ద్వారా, అచంచలమైనదిగా తయారు చేసుకోవాలి. కర్మలను త్యజించమని చెప్పలేదు కానీ, ఆ కర్మల నుండి వచ్చే ఫలాలపై ఆసక్తిని, త్యజించమన్నాడు. దానిని సరిగా అర్థం చేసుకోని అర్జునుడు, కర్మ కన్నా జ్ఞానమే ఉత్తమమైనదయినప్పుడు, తను ఈ భయంకరమైన యుద్ధం చేయటమనే కర్తవ్యాన్ని, ఎందుకు చేయాలి? అనుకున్నాడు.
శ్రీ భగవానువాచ ।
లోకేఽస్మిన్ ద్వివిధా నిష్ఠా పురా ప్రోక్తా మయానఘ ।
జ్ఞానయోగేన సాంఖ్యానాం కర్మయోగేన యోగినామ్ ।। 3 ।।
భగవంతుడు ఈ విధంగా ఉపదేశిస్తున్నాడు: ఓ పాపరహితుడా, భగవత్-ప్రాప్తికిగల రెండు మార్గములు, ఇంతకు పూర్వమే చెప్పాను. ధ్యాన నిష్ఠయందు ఆసక్తిగలవారికి, జ్ఞాన మార్గము. పనుల పట్ల ఆసక్తిగలవారికి, కర్మ మార్గము.
శ్రీ కృష్ణుడు ఆధ్యాత్మిక పరిపూర్ణత కొరకు, రెండు మార్గములను ఉపదేశించాడు. మొదటిది, విశ్లేషణాత్మక అధ్యయనం ద్వారా, ఆత్మ యొక్క నిజ స్వభావాన్నీ, మరియూ, అది శరీరము నుండి ఎలా వేరైనదో, తెలుసుకోవటం. ఇది 'సాంఖ్య యోగం'. తత్వ విచారణ దృక్పథం ఉన్నవారూ, మేధో విశ్లేషణ ద్వారా ఆత్మ జ్ఞానాన్ని తెలుసుకునే వారూ, ఈ మార్గం వైపు మొగ్గు చూపుతారు. రెండవది, భగవంతునిపై భక్తి భావనతో పని చేయటం. ఇది, 'బుద్ధి యోగం'. అలా పని చేయటం, అంతఃకరణాన్ని శుద్ధి చేస్తుంది. దాంతో, స్వచ్ఛ మైన మనస్సులో జ్ఞానం సహజంగానే వృద్దినొంది, అది జ్ఞానోదయ స్థితి వైపుకు దారితీస్తుంది.
ఆధ్యాత్మిక పథంలో ఆసక్తి ఉన్నవారిలో, ధ్యానము పట్ల మొగ్గు చూపే వారుంటారు, మరియు, కర్మల పట్ల ఆసక్తి ఉన్నవారు కూడా ఉంటారు. కాబట్టి, ఆత్మకి భగవత్ ప్రాప్తి అభిలాష ఉన్నప్పటినుండీ, ఈ రెండు మార్గాలూ ఉన్నాయి. తన ఉపదేశం, అన్ని రకాల జనులకూ ఉద్దేశించబడింది కాబట్టి, శ్రీ కృష్ణుడు ఈ రెండింటి గురించీ వివరిస్తున్నాడు.
న కర్మణామనారంభాత్ నైష్కర్మ్యం పురుషోఽశ్నుతే ।
న చ సన్న్యసనాదేవ సిద్ధిం సమధిగచ్ఛతి ।। 4 ।।
మనుష్యుడు కర్మలను ఆచరింపకుండా ఉండి, కర్మ బంధముల నుండి విముక్తి పొందలేడు. అలాగే, కేవలం బాహ్య సన్యాసము ద్వారా, జ్ఞాన సిద్ధినీ పొందజాలడు.
కేవలం కర్మలను ఆచరించకుండా ఉన్నంత మాత్రాన, కర్మ ఫలితాల నుండి ముక్తి లభించదు. మనస్సు ప్రాపంచిక లాభాపేక్ష ఆలోచనలు చేస్తూనే ఉంటే, మానసిక పని కూడా కర్మగా పరిగణించబడుతుంది కనుక, భౌతిక కర్మ మాదిరిగానే, అది కూడా కర్మ బంధాలలో కట్టివేస్తుంది. నిజమైన కర్మ యోగి, కర్మ ఫలాలపై మమకార, ఆసక్తులు లేకుండా పనిచేయటం, నేర్చుకోవాలి. దీనికి బుద్ధి యందు జ్ఞానాన్ని పెంపొందించుకోవటం, అవసరం. కాబట్టి, కర్మ యోగములో కూడా, తత్వ జ్ఞానం అవసరం.
ప్రపంచాన్ని త్యజించి, సన్యాసి అయిపోనంత మాత్రాన, సాంఖ్య యోగి, జ్ఞానోదయ స్థితిని పొందలేడు. భౌతిక ఇంద్రియార్ధ వస్తువులను త్యజించినా, మనస్సులో మలినాలు ఉన్నంత కాలం, నిజమైన జ్ఞానం కలుగదు. పూర్వపు చింతలను పదేపదే ఆలోచించటం, మనస్సుకు ఉన్న లక్షణం. అలాంటి పునరాలోచన మనస్సులో ఒక బాటగా తయారయి, కొత్త ఆలోచనలు కూడా అనివార్యముగా, అదే పథంలో ప్రవహిస్తాయి. పాత అలవాటు ప్రకారంగా, ప్రాపంచికముగా మలినమయిన మనస్సు - ఒత్తిడీ, ఆందోళనా, భయమూ, ద్వేషమూ, ఈర్ష్యా, మమకారం వంటి అనేకానేక ప్రాపంచిక భావావేశాలకు, లోనవుతూనే ఉంటుంది. ఈ విధంగా, కేవలం, బాహ్యమైన భౌతిక సన్యాసంతో, సంపూర్ణ జ్ఞానోదయం అనేది, మలిన మనస్సులో ప్రకాశించదు. దానితో పాటుగా, దానికి అనుగుణమైన, అంతఃకరణ శుద్ధి చేసే చర్యలు ఉండాలి. కాబట్టి, సాంఖ్య యోగములో కూడా, కర్మలు అవసరమే. తత్వజ్ఞానం లేకుండా ఉన్న భక్తి, కేవలం మానసిక అభిమానం. అలాగే, భక్తి లేకుండా ఉన్న తత్వజ్ఞానం, మేధస్సుతో చేసే ఊహాగానాలు.
న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ ।
కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతిజైర్గుణైః ।। 5 ।।
ఎవ్వరూ ఒక్క క్షణం కూడా, కర్మను ఆచరించకుండా ఉండలేరు. నిజానికి, అన్ని ప్రాణులూ, తమతమ ప్రకృతి జనితమైన స్వభావాలచే ప్రేరేపితమై, కర్మలు చేయవలసి ఉంటుంది.
కొంత మంది, కర్మ అనగా, వృత్తి ధర్మము మాత్రమే అనుకుంటారు. అంతేకానీ, రోజువారీ పనులైన తినటం, త్రాగటం, నిద్రపోవటం, నడవటం, మరియు, ఆలోచించటం వంటివి కూడా అని అలోచించరు. శరీరంతో, మనస్సుతో, వాక్కుతో చేసే అన్ని పనులనూ, కర్మలుగానే పరిగణించాలి. అందుకే, ఒక్క క్షణమైనా, పూర్తి క్రియా రహితంగా ఉండటం, సాధ్యం కాదు. ఊరికే కూర్చున్నా, అదొక క్రియ.. పడుకుంటే, అది కూడా ఒక క్రియ.. మనం నిద్ర పొతే, మనస్సు స్వప్నాల్లో నిమగ్నమవుతుంది. గాఢ నిద్రలో కూడా, గుండె, మరియు ఇతర శారీరిక అవయవాలు పనిచేస్తూనే ఉంటాయి. కాబట్టి, మనుష్యులకు పూర్తి క్రియా రహిత స్థితి అసాధ్యమని, శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. ఎందుకంటే, ఈ యొక్క శరీరమూ, మనస్సూ, బుద్ధి వ్యవస్థ, తన యొక్క స్వీయ త్రిగుణములైన సత్వ-రజో-తమో గుణముల చేతనే, ఏదో ఒక పని చేయటానికి ప్రేరేపింపబడుతుంది. శ్రీమద్ భాగవతంలో, ఈ విధంగా వివరించబడింది. 'ఎవ్వరూ కూడా, ఏ పనీ చేయకుండా, ఒక్క క్షణమైనా ఉండలేరు. ప్రతివారూ, తమ ప్రకృతి గుణములచే ప్రేరేపింపబడి, అప్రయత్నంగా కర్మలు చేస్తారు.'
ఇక మన తదుపరి వీడియోలో, జ్ఞానేంద్రియములను, మనస్సుతో అదుపు చేయడం ఎలాగో, తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment