బంధాలూ - బంధనాలు!
స్థిరంగా నిలబడి, ‘ఒక అడుగు నువ్వువేస్తే, ఒక అడుగు నేను వేస్తాను’ అంటే, ఆ బంధం నిలబడదు. బంధాలు పరస్పర అవగాహనా, సహకారాలుంటేనే నిలుస్తాయి. ఏ సంబంధం నిలబడాలన్నా, ఆదాన ప్రదానాలు ముఖ్యం. అది లోపిస్తే, సాంద్రతను కోల్పోతాయి. అసలు జీవితంలో సంబంధాలు ఎందుకు ఏర్పడతాయని, ఎవరూ ఆలోచించరు. ఒకేలాంటి అభిరుచులవల్లనో, ఇరుగు పొరుగువారై ఉండటమో, పిల్లల కారణంగానో, అని అనుకుంటారు. వయసు పెరిగాక, అనుభవం గడించాక అర్థమవుతుంది.. సంబంధాలు యాదృచ్ఛికంగా ఏర్పడవనీ, దానికి ఏదో ఒక కారణం ఉంటుందనీ..
[ జీవితం అంటే..! = https://youtu.be/L6oFrjCLTJM ]
ఒకరి ఎదుగుదలకు మరొకరు సహకరించుకోవడం కోసం, మనుషులు కలుస్తారు. కొన్ని సంబంధాలు అద్భుతంగా ఉంటే, మరికొన్ని అలా ఉన్నట్లు కనిపిస్తాయి. బాధలకు అవే కారణమూ అవుతుంటాయి. ఎదిగేందుకు ప్రతిదీ ఒక పాఠం నేర్పుతుంది. ఒక జీవిగా ఎదగాలంటే, అనుభవం అవసరం. జీవితంలో ఎన్నో దశలు.. ఎందరో తారసపడుతుంటారు.. లక్ష్యం నెరవేరగానే వెళ్ళిపోతారు..
మహాభారతంలో కురుక్షేత్రానికి ముందు, నకులుడు భీష్ముడితో, తప్పించలేని ఈ కురుపాండవ ఘర్షణకు అసలైన కారణమేమిటన్నప్పుడు, ‘అన్యోన్యత లోపిం చడమే.. దాని వల్ల అపార్థాలు పెరుగుతాయి’ అని అన్నాడు భీష్ముడు. 'క్షమాగుణం' బలమైన, స్థిరమైన బంధాలకు తోడ్పడుతుంది. అన్ని సంప్రదాయాలకు చెందిన సాధువులూ పాటించే, నిరంతరం క్షమించే గుణం కలిగి ఉండటమే, ప్రేమ అంటారు. అదే అన్నీ బంధాలకూ మూలం.
పై కప్పును నిలబెట్టేందుకు ఏర్పరచే నాలుగు స్థంభాలు, ఎడం ఎడంగానే ఉండాలి. స్థిరంగా ఉంచడానికి దగ్గరకి చేరిస్తే, కప్పు కూలిపోతుంది. 'స్వేచ్ఛ'లోనే బంధాలు వికసిస్తాయి. 'బంధనం'లో ముడుచుకుపోతాయి. సంబంధం ఎప్పుడూ ఒక ఒడంబడిక కాదు. అవగాహనతో ఏర్పడేది. అవగాహన కోసం వినాలి. అర్థమయ్యేలా తెలియబరచాలి. ఏ బంధంలోనూ, ఆశలన్నీ సంపూర్ణంగా నెరవేరవు.
[ నిజమైన సంపద! = https://youtu.be/sX5tx83D7Ww ]
ఒక సంబంధం తెగిపోయినంత మాత్రాన, మరేం జరగదు. ఇతర సంబంధాల విషయంలో, బాధ్యత మిగిలే ఉంటుంది. ‘మన చేతుల్లో ఏముంది’, ‘మిగిలిందేమిటి’, ‘సంతోషమే లేదు’ అనుకుంటూ, మనిషి తరచూ చలించిపోతుంటాడు. కోల్పోయిన సంబంధాల మీదే దృష్టి నిలిపినప్పుడు, కొనసాగాల్సిన సంబంధాలకు న్యాయం చేయడం కష్టమవుతుంది. నిన్నటి బాధల తలపులతో, విలువైన వర్తమానాన్ని జారవిడుచుకోకూడదు.
బోధించడమైనా, నేర్చుకోవడమైనా, సంబంధాలను బలపరచుకోవడమైనా, ఎందులోనైనా.. శ్రద్ధగా వినేవారే ఇతరులకంటే ముందుంటారు. ఒక మంచి శ్రోత, మాట్లాడే మాటలనే కాదు.. మాటలకందని భావాలనూ గ్రహించగలుగుతాడు.. దానికి ‘మనస్సు’ పెట్టాలి.
ప్రతి పురాణగాథా, సంబంధాలకు దర్పణం పడుతుంది. ఈర్ష్యలూ, అసూయలూ, కోపతాపాలూ, సంబంధాలను ఎలా నాశనం చేస్తాయో వివరిస్తుంది. బంధాలు బలంగా కొనసాగాలంటే, ఇతరులను అర్థం చేసుకుంటే సరిపోదు.. నువ్వు అర్థం చేసుకున్నావనే నమ్మకం, అవతలివారిలో కలగాలి. అది అవతలివారు తెలుసుకోవాలంటే, నువ్వు వారి కోణంలో వ్యక్తపరచగలగాలి. ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పడం ఒకటైతే, ‘నాకు తెలుసు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని’ అనేది మరొక విధం.
ఎవరి దృష్టిలో వారు వ్యక్తపరిస్తే, అవతలివారి మనస్సును గెలుచుకోవచ్చు. ఎదుటివారి కోణంలో తెలియజెప్పినప్పుడు, వారి హృదయాన్నే గెలవవచ్చు.
[ మనిషికుండవలసిన లక్ష్యం! = https://youtu.be/laB5lI-sf2Q ]
🚩 శివాయ విష్ణురూపాయ
శివరూపాయ విష్ణవే
శివస్య హృదయం విష్ణుః విష్ణోశ్చ హృదయం శివః
యథా శివమయో విష్ణుః
ఏవం విష్ణుమయం శివః
యథాంతరం న పశ్యామి
తథా మే స్వస్తిరాయుషి 🙏
Post a Comment