దు:ఖాన్ని తొలగించుకుని, శాంతిని పొందే మార్గాన్ని సూచించిన శ్రీ కృష్ణుడు!
'భగవద్గీత' ద్వితీయోధ్యాయం - సాంఖ్య యోగం (64 - 68 శ్లోకాలు)! భగవద్గీతలో ఉన్న, 18 అధ్యాయాలూ, 18 యోగాలలో, 1 నుండి 6 వరకూ ఉన్న అధ్యాయాలను, కర్మషట్కము అంటారు. దీనిలో రెండవ అధ్యాయం, సాంఖ్య యోగం. ఈ రోజుటి మన వీడియోలో, సాంఖ్య యోగంలోని 64 నుండి 68 వరకూ ఉన్న శ్లోకాలనూ, వాటి తాత్పర్యాలనూ తెలుసుకుందాము..
[ ఈ భాగాన్ని వీడియోగా చూడడానికి CLICK చెయ్యండి = https://youtu.be/6VT92RzBMaA ]
దు:ఖాన్ని తొలగించుకుని, శాంతిని పొందే మార్గాన్ని, శ్రీ కృష్ణుడు ఈ విధంగా వివరిస్తున్నాడు..
రాగద్వేషవియుక్తైస్తు విషయానింద్రియైశ్చరన్ ।
ఆత్మవశ్యైర్విధేయాత్మా ప్రసాదమధిగచ్ఛతి ।। 64 ।।
ఇంద్రియ వస్తువులను వాడేటప్పుడు కూడా, మనస్సుని నియంత్రించినవాడై, మమకార-ద్వేష రహితంగా ఉన్నవాడు, భగవంతుని కృపకు పాత్రుడవుతాడు.
వినాశనానికి దారి తీసే అధోపతనం, ఇంద్రియ వస్తువులలో ఆనందం ఉన్నదని చింతించటంతో, ఆరంభమవుతుంది. దాహం వేయటం, శరీరానికి ఎంత సహజమో, ఆనందం కోసం ఉన్న తపన, ఆత్మకు అంత సహజమైనది. "నేను ఇక ఆనందం కోసం ఎక్కడా చూడను" అనుకోవటం అసంభవం.. ఎందుకంటే, అది ఆత్మకి అసహజము. మరి ఈ సమస్యకు సులభమైన పరిష్కారం ఏమిటంటే, ఆనందాన్ని సరియైన దిశలో, అంటే, భగవంతునిలో అన్వేషించటమే. ఆ భగవంతునిలోనే ఆనందం ఉందనే తలంపును, పదేపదే మననం చేస్తే, మనం ఆ భగవంతునితో అనురక్తీ, మమకారబంధం పెంచుకుంటాము. ప్రాపంచిక అనుబంధంలాగా, ఆ దివ్య అనుబంధం మనస్సుని పతనం చేయదు. పైగా, అది శుద్ధి చేస్తుంది. భగవంతుని కోసం ఎంత తీవ్రమైన కోరిక పెంచుకుంటే, అంతఃకరణం అంత శుద్ధి అవుతుంది.
ప్రసాదే సర్వ దుఃఖానాం హానిరస్యోపజాయతే ।
ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే ।। 65 ।।
భగవత్ కృప ద్వారా, అన్ని దుఃఖాలూ తొలిగిపోయి, పరమ శాంతి లభిస్తుంది. అలా ప్రసన్న చిత్తంతో ఉన్నవాని బుద్ధి, శీఘ్రంగానే భగవంతునియందు స్థిరముగా నిలుస్తుంది.
కృప అనేది, ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లోనికి, వరద లాగా వచ్చే ఒక దివ్యమైన శక్తి లాంటిది. తన కృప ద్వారా, సత్-చిత్-ఆనంద స్వరూపుడైన భగవంతుడు, తన దివ్య జ్ఞానాన్నీ, దివ్య ప్రేమనూ, మరియు దివ్య ఆనందాన్నీ అనుగ్రహిస్తాడు. ఇది బుద్ధిని, భగవంతుని యొక్క ప్రేమ, ఆనందం, మరియు జ్ఞానంలో ముంచి వేస్తుంది. భగవంతుని కృప వలన, మనం ఎప్పుడైతే ఆ దివ్య ఆనందం యొక్క రుచిని ఎరుగుతామో, ఇంద్రియ సుఖముల కోసం ఉన్న తపన, శాంతిస్తుంది. ఎప్పుడైతే ప్రాపంచిక వస్తువులపై యావ తొలగిపోతుందో, ఆ వ్యక్తి, అన్ని దుఃఖాలకూ అతీతుడై, అతని మనస్సు శాంతినొందుతుంది. ఆ యొక్క అంతర్గత తృప్తి స్థితిలో, భగవంతుడు మాత్రమే, ఆనందానికి మూలమనీ, అతడే జీవాత్మ యొక్క అంతిమ లక్ష్యమనీ, బుద్ధి, స్థిర నిశ్చయానికి వస్తుంది.
నాస్తి బుద్ధిరయుక్తస్య న చాయుక్తస్య భావనా ।
న చాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖమ్ ।। 66 ।।
మనస్సునూ, ఇంద్రియములనూ నియంత్రించని, క్రమశిక్షణ లేనివానికి, స్థిరమైన బుద్ధి కానీ, నిలకడైన భగవత్ ధ్యాస కానీ ఉండవు. ఎవడైతే మనస్సుతో, భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో, వానికి శాంతి ఉండదు. మనశ్శాంతి లోపించినవాడు, సంతోషంగా ఎలా ఉండగలడు?
మనస్సునీ, ఇంద్రియములనూ నియంత్రణ చేయటం నేర్చుకోని వాడు, భగవంతుని ధ్యానం చేయలేడు, దివ్యమైన ఆనందాన్ని కూడా, పొందలేడు. ఉన్నతమైన అనుభూతి రుచి చూడకుండా, నిమ్న స్థాయి రుచిని త్యజించటం సాధ్యం కాదు. అలాంటి వ్యక్తి, పుష్పంలోని మకరందాన్ని తేనెటీగ విడిచిపెట్టలేనట్లుగా, ప్రాపంచిక సుఖాల కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు. ఎవరైతే ఇంద్రియములను నిగ్రహించి, భక్తితో ఉండరో, వారిని త్రిగుణాత్మకమైన మాయ బాధిస్తూనే ఉంటుంది. ఆ బాధ కారణంగా, మన జీవితంలో సంతోషం దూరమవుతుంది.
ఇంద్రియాణాం హి చరతాం యన్మనోఽనువిధీయతే ।
తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి ।। 67 ।।
ఎలాగైతే బలమైన గాలి, నీటిలో నావను దాని దిశ నుండి పక్కకు నెట్టివేస్తుందో, ఏ ఒక్క ఇంద్రియము పైన అయినా మనస్సు కేంద్రీకృతమవుతుందో, అది బుద్ధిని హరించి వేస్తుంది.
భగవంతుడు ఐదు ఇంద్రియములను బహిర్ముఖంగా తయారుచేశాడు. కాబట్టి, అవి సంహజంగానే, బాహ్య ప్రపంచ వస్తువులపై ఆకర్షితమవుతాయి. వాటిలో ఏ ఒక్క దాని మీద మనస్సు ఆకర్షితమయినా, దానికి మనస్సుని తప్పు త్రోవ పట్టించే శక్తి ఉంది. జింకలు ‘తీయని’ స్వరములకు ఆకర్షితమవుతాయి. వేటగాడు మధురమైన సంగీతంతో వాటిని ఆకర్షించి, వాటిని సంహరిస్తాడు. అలానే మనం కూడా, బాహ్య వస్తువులపై ప్రేమను పెంచుకుని, నిజమైన సంతోషానికి దూరమవుతున్నాం.
తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ।
ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా ।। 68 ।।
కాబట్టి, ఓ అర్జునా, శక్తివంతమైన బాహువులు కలవాడా, ఇంద్రియములను ఇంద్రియార్ధముల నుండి పూర్తిగా నిగ్రహించిన వ్యక్తి, ఆధ్యాత్మిక జ్ఞానంలో స్థిరముగా ఉంటాడు.
జ్ఞానోదయమైన వారు, బుద్ధిని ఆధ్యాత్మిక విజ్ఞానం ద్వారా నియంత్రణలో ఉంచుకుంటారు. అప్పుడు, పరిశుద్ధమైన బుద్ధితో, మనస్సుని నియంత్రిస్తారు, మరియు, ఆ మనస్సు ద్వారా, ఇంద్రియములకు కళ్ళెం వేస్తారు. కానీ, భౌతికమైన స్థితిలో, దీనికి విరుద్ధంగా అవుతుంది. ఇంద్రియములు మనస్సుని తమ దిశగా లాగుకుంటాయి; మనస్సు బుద్ధిని వశపరచుకుంటుంది; బుద్ధి నిజమైన శ్రేయస్సు దిశ నుండి తప్పిపోతుంది. అందుకే, శ్రీ కృష్ణుడు ఏమంటున్నాడంటే, బుద్ధిని ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారా శుద్ది చేసుకుంటే, ఇంద్రియములు నిగ్రహింపబడతాయి. ఎప్పుడైతే ఇంద్రియములు నియంత్రణలో పెట్టబడ్డాయో, బుద్ధి దివ్య జ్ఞాన పథం నుండి ప్రక్కకి తొలగదు.
ఇక మన తదుపరి వీడియోలో, అహంకార రహితంగా ఉండడం వలన, పరిపూర్ణమైన ప్రశాంతతను ఏ విధంగా పొందగలమో, శ్రీ కృష్ణుడి మాటల్లో తెలుసుకుందాము..
కృష్ణం వందే జగద్గురుం!
Post a Comment